అభిమన్యు ఏంటి... నారాయణ ఏంటి... తల పట్టుకున్న చిరు...!
on Jun 27, 2017
మెగాస్టార్ చిరంజీవి ఇంత క్రేజీ హీరో అవ్వడానికిగల ప్రధాన కారణం తెలుగు సినీ అభిమానులకి, ప్రత్యేకంగా మాస్ ప్రేక్షకులకి నచ్చే విధంగా సినిమాలు చేయడమే. తన 150 వ సినిమా ఎంతో ప్రత్యేకంగా ఉంటుందనుకున్న వారందరికీ షాకిస్తూ ఒక రెగ్యులర్ సినిమా చేసి హిట్ కొట్టాడు. కానీ, తాను నమ్మిన సిద్ధాంతం తన కొడుకు రామ్ చరణ్ ఫాలో అవకపోవడం చిరంజీవికి ఒకింత ఇబ్బంది కలిగిస్తుందట. తన తోటి వాళ్ళందరూ వరుస హిట్లు కొడుతుంటే, చరణ్ మాత్రం అతి ప్రయోగాలు చేస్తూ తనని తాను వెనక్కి నెట్టుకుంటున్నాడనేది చిరు అభిప్రాయం గా చెప్పుకుంటున్నారు.
చరణ్ ప్రస్తుత చిత్రం రంగస్థలం 1985 లో ఒక కళాకారుడి పాత్ర వేయడం... ఆ సినిమా కోసం మీసాలు, గెడ్డాలు పెంచి మరీ పల్లెటూరి కుర్రాడిలా తయారవ్వడం చిరంజీవికి అస్సలు నచ్చలేదట. పైగా రంగస్థలం 1985 అనే టైటిలే పెద్ద మైనస్ అని భావిస్తున్నాడట. ఇవన్నీ ఒకెత్తయితే సినిమాలో చరణ్ పేరు చిరుకి ఇంకా చికాకు తెప్పిస్తోందట. ఇంతకీ రంగస్థలం 1985 లో చరణ్ పేరేంటో తెలుసా... అభిమన్యు నారాయణ. ఇదెక్కడి పేరు అని చిరు తల పట్టుకున్నాడట. అయితే, చిరు టైటిల్ ఇంకా ఇతర విషయాల్లో మార్పులు చెప్పినపుడు చరణ్ చూద్దాంలే అంటున్నాడట కానీ... చివరికి సుకుమార్ చెప్పిందే ఫైనల్ అని అంటున్నాడట.
కథ మీద చరణ్ కి ఉన్న నమ్మకం అలాంటిది అంటున్నారు ఆయనకి దగ్గరివాళ్ళు. తనని తాను ఒక నటుడిగా రుజువు చేసుకునే మంచి అవకాశంగా భావిస్తున్నాడట. అంతా ఓకే కానీ, చరణ్ కి ఇప్పుడు కావాల్సింది మంచి నటుడనే పేరు, గుర్తింపు కాదని... సరైన హిట్టని చిరు అభిప్రాయపడుతున్నాడట. వాస్తవానికి, ఇలాంటి సినిమాలు మాస్ జనాలకి ఎక్కుతాయా అని సగటు సినీ ప్రేక్షకుడు కూడా భావిస్తున్నాడు. అయినా, సినిమాలో విషయం ఎంతుందో... అది ఎవరికీ నచ్చుతుందో తెలియాలంటే మాత్రం విడులయ్యే వరకు వేచి చూడాల్సిందే!