'జాతిరత్నాలు' దర్శకుడితో చిరంజీవి.. ఇదెక్కడి కాంబోరా మావ!
on Mar 13, 2024
ఈ మధ్య మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) యువ దర్శకులతో కలిసి పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం కేవలం ఒక్క సినిమా అనుభవమున్న మల్లిడి వశిష్ట దర్శకత్వంలో 'విశ్వంభర' అనే భారీ సోషియో ఫాంటసీ ఫిల్మ్ చేస్తున్నారు చిరంజీవి. అలాగే మరికొన్ని ప్రాజెక్ట్ లు చర్చల దశలో ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా మెగాస్టార్ దృష్టి 'జాతిరత్నాలు' డైరెక్టర్ కె.వి. అనుదీప్(Anudeep KV) పై పడినట్లు తెలుస్తోంది.
'పిట్టగోడ' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన అనుదీప్.. 'జాతిరత్నాలు' సినిమాతో ఒక్కసారిగా తన పేరు మారుమోగిపోయేలా చేసుకున్నాడు. "నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్" అంటూ నవ్వించడమే లక్ష్యంగా రూపొందిన 'జాతిరత్నాలు' చిత్రం ఘన విజయం సాధించి.. అనుదీప్ కి ఎంతో పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత అనుదీప్ డైరెక్షన్ లో వచ్చిన 'ప్రిన్స్' నిరాశపరిచినప్పటికీ.. ఆయన క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. తన తదుపరి సినిమాని మాస్ మహారాజా రవితేజ(Ravi Teja)తో చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. అయితే ఏవో కారణాల ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం ఆలస్యమవుతూ వస్తోంది. ఈ క్రమంలో తాజాగా అనుదీప్.. చిరంజీవిని కలిశాడనే వార్త ఆసక్తికరంగా మారింది.
రీసెంట్ గా చిరంజీవి, అనుదీప్ భేటీ అయ్యారట. వీరి మధ్య కథకి సంబంధించిన చర్చలు జరిగినట్లు వినికిడి. అనుదీప్ చెప్పిన స్టోరీ లైన్ నచ్చి, చిరంజీవి డెవలప్ చేయమని చెప్పారట. అన్నీ అనుకున్నట్టు జరిగితే.. వచ్చే ఏడాది వీరి కలయికలో సినిమా మొదలయ్యే అవకాశముందని టాక్. ఒకవేళ నిజంగానే ఈ కాంబినేషన్ సెట్ అయితే మాత్రం.. క్రేజీగా ఉంటుంది అనడంలో సందేహం లేదు. చిరంజీవి కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఆయన కామెడీ టైమింగ్ కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. గతేడాది 'వాల్తేరు వీరయ్య'లో కూడా తనదైన కామెడీ టైమింగ్ తో బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించారు. అలాంటి చిరంజీవికి అనుదీప్ లాంటి దర్శకుడు తోడైతే కామెడీ ఓ రేంజ్ లో ఉంటుంది అనడంలో డౌటే లేదు.