బాలయ్య...చిరుని నెత్తికెక్కించుకొన్నావా??
on Apr 23, 2016
నందమూరి బాలకృష్ణ ది కూసింత వెరైటీ మనస్తత్వమే అని చెప్పుకోవాలి. ఎప్పుడు ఏం మాట్లాడతారో, ఎప్పుడు ఎలా స్పందిస్తారో, ఎప్పుడు ఎవర్ని దూరం పెడతారో, ఎప్పుడు ఎవర్ని చంకెక్కించుకొంటారో చెప్పలేం. ఇప్పుడు చిరంజీవి వ్యవహారంలోనూ ఆయన అదే మనస్తత్వం మరోసారి రిపీట్ చేశారు. లేపాక్షి ఉత్సవాల సమయంలో బాలయ్య ఏం మాట్లాడారో గుర్తుంది కదా? ఈ ఉత్సవాలకు చిరంజీవిని ఎందుకు పిలవలేదు బాలయ్యా.. అని అడిగితే.. `నాకు ఎవర్ని పిలవాలో ఎవరిని పిలవకూడదో తెలుసు. నా నెత్తిన ఎక్కేవాళ్లను పిలవను. సినిమా గ్లామర్ నాకు అవసరం లేదు` అన్నారు. ఆ తరవాత చిరు, బాలయ్య మధ్య చిన్నపాటి మాటల యుద్దమే జరిగింది. `బాలయ్య ది చిన్నపిల్లాడి మనస్తత్వం` అని చిరు.. `ఆయన మాటలు చాలా నేర్చుకొన్నాడు లెండి.... ఇప్పుడు దిల్లీలో మంత్రి పదవి కోసం కాకా పడుతున్నాడు` అని బాలయ్య.. మాటలు ఇచ్చిపుచ్చుకొన్నారు. ఆ ఎసిసోడ్‌ని చిరు అభిమానులు, బాలయ్య ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోరు.
అయితే.. తాజాగా గౌతమి పుత్ర ఓపెనింగ్‌ని చిరు హాజరుకావడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. చిరుని బాలయ్య స్వయంగా కలుసుకొని ఆహ్వాన పత్రిక అందించాడట. అదేంటి?? అప్పుడు లేపాక్షి వ్యవహారంలో చిరు అవసరం లేదా? గ్లామర్ వద్దా? ఇప్పుడు సొంత పని పడేసరికి చిరు కావాలా?? ఇప్పుడు చిరు వచ్చి నెత్తినెక్కినా ఫర్వాలేదా? లేపాక్షి ఉత్సవం అంటే.. ఒక్కరి వ్యవహారం కాదు. సొంత పండగ అసలే కాదు. ఆ సమయంలో కులం, రాజకీయాలు బాలకృష్ణని ప్రభావితం చేశాయన్నమాట. ప్రభుత్వ కార్యక్రమానికి.. సాటి మిత్రుడ్ని పిలవలేకపోయిన బాలయ్య.. సొంత పోగ్రాం అనేసరికి మాత్రం వాటన్నింటినీ పక్కన పెట్టాడా?? అంటే ఇక్కడ అందరికీ వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యం అనే కదా అర్థం. బాలయ్య కూడా అందుకు మినహాయింపు కాదని... ఈ ఎపిసోడ్‌ని బట్టి అర్థమైపోయిందని సినీ, రాజకీయ ప్రముఖులు గుసగుసలాడుకొంటున్నారు.