బాహుబలి మరో 'ఐ' అవుతుందా?
on Jun 1, 2015
ఓ సినిమాకి ప్రధాన మైన శత్రువు 'పెరిగిన అంచనాలు'. భారీ అంచనాలతో విడుదలైన ఏ సినిమా కూడా కాస్త అటూ ఇటూ అయితే ఫలితం చాలా దారుణంగా ఉంటుంది. శంకర్ సినిమా 'ఐ' గుర్తొందిగా. ఈ సినిమాపై దాదాపుగా రూ.160 కోట్లు పెట్టుబడి పెట్టారు. ప్రచార చిత్రాలతో, అందులో ఉన్న గెటప్పులతో ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలోకి వెళ్లిపోయాయి. రెండేళ్లు ఎదురు చేయించీ చేయించి... 'ఐ'ని వదిలాడు శంకర్. అప్పటికే 'ఐ' సినిమాపై భారీ అంచనాలు ఏర్పడిపోయాయి. వాటిని అందుకోవడంలో 'ఐ' దారుణంగా విఫలమయ్యింది. దాదాపు రూ.200 కోట్ల వరకూ బిజినెస్ చేస్తుందనుకొన్న ఈ సినిమా మొత్తంగా రూ.70 కోట్లు కూడా సాధించలేకపోయింది. నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ దారునంగా నష్టపోయాడు. ఇప్పుడు 'బాహుబలి'కీ ఇంతే హైప్ క్రియేట్ చేస్తున్నాడు రాజమౌళి.
ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేశాయి. 'మాకు కావల్సినదానికంటే ఎక్కువ హైప్ వచ్చేసింది. ఇక మాకు అక్కర్లెద్దు' అని రాజమౌళినే చెబుతున్నాడు.కానీ.. అంచనాలు మాత్రం తనకు తానే పెంచుకొంటూ వెళ్తున్నాడు. రెండేళ్ల పాటు ప్రభాస్‌ని అభిమానులకు దూరం చేసి... నిరీక్షణ పెంచేశాడు. రోజుకో ప్రచార చిత్రం విడుదల చేసి అంచనాలు రెట్టింపు చేశాడు. ఆడియో వేడుక గ్రాండ్ గా, 30 వేల మంది సమక్షంలో నభూతే నభవిష్యతే అనే రీతిలో విడుదల చేద్దామనుకొన్నాడు జక్కన్న. ఆ కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. 5 సెకన్ల టీజరంటూ మరో ప్రయోగం చేశాడు. అందులో ప్రభాస్ కంటే ఎక్కువగా రాణాపై ఫోకస్ పెట్టడంతో ప్రభాస్ అభిమానులు ఉసూరుమన్నారు.
ఇప్పుడు ట్రైలర్ విడుదల చేస్తున్నాడు. దాన్నేదో డైరెక్టుగా యూ ట్యూబ్‌లో విడుదల చేయొచ్చు కదా. థియేటర్లలో ఫ్రీగా చూపిస్తానంటున్నాడు. కావాలంటే థియేటర్లకు రండి.. అంటున్నాడు రాజమౌళి. ఇది కూడా అంచనాలు పెంచే కార్యక్రమమే. ఏ సినిమాకైనా పబ్లిసిటీ చాలా కీలకం. దాన్ని రాజమౌళి వినూత్నంగా చేస్తున్నాడన్నది వాస్తవం. అయితే బాహుబలి సినిమాకి మరీఇంత హైప్ క్రియేట్ చేయడం అవసరం లేదు. ఎందుకంటే.. జనాలు ఎక్కువ అంచనాలతో సినిమా చూస్తారు. బాగుంటే ఫర్వాలేదు. సూపర్ హిట్ అయి వందల కోట్లు వస్తాయి.కానీ ఏమాత్రం తేడా చేసినా.. 'ఐ' ఫలితమే పునరావృతమయ్యే ప్రమాదం ఉంది. రాజమౌళి... తస్మాత్ జాగ్రత్త.