ప్రతాపరుద్రుడు.. అంతా హుళక్కేనా?
on Oct 6, 2015
రుద్రమదేవికి సీక్వెల్‌గా ప్రతాపరుద్రుడు తీస్తానని అప్పట్లో గుణశేఖర్ ప్రకటించాడు. ప్రతాప రుద్రుడు పాత్ర కోసం మహేష్‌బాబు, చరణ్, ఎన్టీఆర్ లాంటి హేమాహేమీలంతా సిద్ధంగా ఉన్నారని టంకు కొట్టాడు. అయితే అదంతా హుళక్కే అని తేలింది. కేవలం రుద్రమదేవికి హైప్ తీసుకొచ్చేందుకే గుణశేఖర్ ప్రతాపరుద్రుడి మేటర్‌ని బయటకు తీసుకొచ్చాడని ఇండ్రస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
దానికి తోడు గుణశేఖర్ కూడా `ఏదో సీక్వెల్ తీద్దామని చూచాయిగా అనుకొంటున్నానంతే. స్ర్కిప్టు కూడా రెడీ కాలేదు. రుద్రమదేవికి వచ్చిన రెస్పాన్స్ చూసి, అప్పుడు ప్రతాపరుద్రుడి గురించి ఆలోచిస్తా. ఇప్పుడే ఆ సినిమా గురించి చెప్పడం.. తొందరపాటు అవుతుంది` అని తేల్చేశాడు. కేవలం రుద్రమదేవి సినిమాని అమ్ముకోవడానికి గుణ ప్లే చేసిన ట్రిక్ ఇదని ఈ మాటలని బట్టే అర్థమవుతోంది.
దాదాపు రూ.60 కోట్లు పోసి రుద్రమదేవిని తెరకెక్కించాడు గుణ. చారిత్రక నేపథ్యంలో సినిమా తీస్తున్నప్పుడు ఎన్ని కష్టాలు పడాల్సివస్తుందో అవన్నీ అనుభవించాడు. మళ్లీ అలాంటి సాహసం చేస్తాడనుకోవడం పొరపాటే. కాబట్టి.. ప్రతాప రుద్రుడు ప్రాజెక్ట్ ఉండకపోవచ్చు.