పవన్ ఎక్కడండీ బాబూ..?!
on Dec 1, 2014
మేము సైతం కార్యక్రమానికి తారాలోకం అంతా కదిలివచ్చింది. ఆఖరికి జ్వరంతో బాధపడుతున్న ఎన్టీఆర్ కూడా చుట్టపు చూపుకింద వచ్చి పలకరించి వెళ్లిపోయాడు. మహేష్ బాబు ఇంటర్వ్యూలో మెరిశాడు. ప్రభాస్ వంటల పోగ్రాం చేశాడు. మరి పవన్ కల్యాణ్ ఎక్కడ?? ఆయన రాలేదేం..?? పరిశ్రమ అంతా తలో చేయి వేసి నడిపించిన ఈ కార్యక్రమంలో తమ అభిమాన హీరో ఎక్కడ?? అని పవన్ కల్యాణ్ అభిమానులు ఆశగా ఎదురుచూశారు. త్రివిక్రమ్ తో కలసి ఓ స్కిట్ చేశాడని, అది టీవీలో చూపిస్తారని... కోట్లాది ఫ్యాన్స్ ఆశ పడ్డారు. కానీ వాళ్లందరినీ నిరాశలో ముంచెత్తాడు పవన్ కల్యాణ్. హుద్ హుద్ విలయం సంభవించినప్పుడు రూ.50 లక్షల విరాళం ప్రకటించి అందరికీ ఆదర్శ ప్రాయంగా నిలిచాడు పవన్! మరి ఇప్పుడెందుకు రాలేదు, ఆయనకు ఆహ్వానం అందిందా, లేదా? పవన్ స్కిట్ ఏమైంది?? అనే ప్రశ్నలు అభిమానుల్లో తలెత్తున్నాయి. పోనీ పవన్ షూటింగుల్లో బిజీగా ఉన్నాడా అంటే అదీ లేదు. గోపాల గోపాల షూట్ కూడా పూర్తయిపోయింది. దానికితోడు తను హైదరాబాద్‌లోనే ఉన్నాడు. మరెందుకు రాలేదు....??? మొత్తానికి పవన్ మిస్ అవ్వడం సర్వత్రా చర్చను లేవనెత్తిస్తోంది. పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమానికి రాకపోయినా, తన చిత్త శుద్దిని, ప్రేక్షకులపై ఉన్న అభిమానాన్ని శంకించే పనిలేదని కొంతమంది చెప్తున్నారు. మరికొంత మందైతే... పవన్ ఏమీ అతీతుడు కాదుకదా, దిగ్గజాలే వచ్చి తెరపై కనిపించినప్పుడు పవన్‌కి ఏమైంది?? అంటూ హేళన చేస్తున్నారు.