ఏఎన్నార్ 'కీలుగుర్రం'ను కలర్‌లో చేద్దామనుకున్న ఎన్టీఆర్!
on Jan 19, 2022

నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు పూర్తిస్థాయి జానపద హీరోగా నటించిన తొలి చిత్రం 'కీలుగుర్రం'. శోభనాచల పిక్చర్స్ బ్యానర్‌పై స్వీయ దర్శకత్వంలో మీర్జాపురం రాజా నిర్మించిన ఈ చిత్రం 1949 ఫిబ్రవరి 19న విడుదలై ప్రేక్షకాదరణతో అఖండ విజయం సాధించింది. ఈ సినిమాతో అక్కినేని ఆనాటి యువతులకు డ్రీమ్ బాయ్‌గా అవతరించారు. ఈ సినిమాకు అయిన బడ్జెట్ రూ. 5 లక్షల నుంచి 6 లక్షలు కాగా, అక్కినేని అందుకున్న పారితోషికం 23 లక్షల రూపాయలు. హీరోయిన్‌గా సూర్యశ్రీ నటించగా, భువనసుందరి అనే రాక్షసి పాత్రను అంజలీదేవి చేశారు.
'కీలుగుర్రం'కు కథతో పాటు మాటలు, పాటలు రాసింది తాపీ ధర్మారావు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే తమిళంలో దీన్ని నిర్మించడానికి లంక సత్యం హక్కులు తీసుకున్నారు. ఎంజీ రామచంద్రన్, జానకి హీరో హీరోయిన్లుగా 'మాయామోహిని' పేరుతో తమిళంలో నిర్మాణమైన ఈ సినిమా తెలుగు 'కీలుగుర్రం' కంటే ముందుగా విడుదలవడం గమనార్హం. అయితే బాక్సాఫీస్ దగ్గర ఆ సినిమా ఫెయిలయింది. దాన్ని తెలుగులో డబ్‌చేసి రిలీజ్ చేస్తే, మనవాళ్లు కూడా ఆదరించలేదు.
దాని తర్వాత 'కీలుగుర్రం' విడుదలై ఘనవిజయం సాధించడంతో, తమిళంలో 'మాయక్కుదిరై' పేరుతో డబ్ చేసి రిలీజ్ చేశారు. అది సూపర్ హిట్టయింది. విశేషమేమంటే తమిళంలో అనువాదమైన తొలి తెలుగు సినిమా 'కీలుగుర్రం'. అక్కినేని నాగేశ్వరరావుకు ఆదినారాయణ అనే తమిళ నటుడు డబ్బింగ్ చెప్పారు. శ్రీలంకలోని జాఫ్నాలో విడుదలైన 'మాయక్కుదిరై'ని అక్కడివాళ్లు కూడా బాగా ఆదరించారు.
Also read: పెళ్లి తర్వాత నటనకు దూరమైన జయమాలిని.. భర్త ఆమెపై ఆంక్షలు పెట్టారా?
తర్వాత కాలంలో కలర్‌లో ఈ సినిమాని విశ్వవిఖ్యాత ఎన్టీ రామారావుతో చేయాలని నిర్మాతలు అడిగితే, ఆయన సంతోషంగా అంగీకరించారు. ఆయనను ఈ సినిమా చేయాల్సిందిగా అడగటానికి మీర్జాపురం రాజా భార్య, అలనాటి మేటి నటీమణి సి. కృష్ణవేణి స్వయంగా రామారావు దగ్గరకు వెళ్లారు. ఆ సమయంలో ఆయన దగ్గర ఓ జర్నలిస్టు కూడా ఉన్నారు. ఆయనతో "నేను త్వరలో కలర్‌లో 'కీలుగుర్రం' చేస్తున్నాను" అని చెప్పారు ఎన్టీఆర్. అలా ఆ వార్త పత్రికల్లో వచ్చింది కూడా.
Also read: "సగం దోసె తింటారా.. సిగ్గు లేదూ మీకు?" ఎన్టీఆర్ మాటలకు స్టన్నయిన లక్ష్మి!
'కీలుగుర్రం'కు సంబంధించిన కొంత డిస్ట్రిబ్యూషన్ హక్కుల్ని విజయవాడకు చెందిన లక్ష్మీనారాయణ అనే ఆయన కొన్నారు. ఆయన ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లి, "మీరు మళ్లీ ఈ సినిమా చేస్తే నా డిస్ట్రిబ్యూషన్ దెబ్బతింటుంది" అని వేడుకున్నారు. దాంతో కృష్ణవేణికి ఫోన్ చేశారు ఎన్టీఆర్. విషయం వివరించి, "ఎవరికీ ఇబ్బంది లేకుండా కొంత గ్యాప్ తర్వాత సినిమా చేద్దాం" అని చెప్పారు. ఆ గ్యాప్ అలాగే ఉండిపోయింది. ఈ విషయాన్ని కృష్ణవేణి స్వయంగా వెల్లడించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



