పెళ్లి తర్వాత నటనకు దూరమైన జయమాలిని.. భర్త ఆమెపై ఆంక్షలు పెట్టారా?
on Dec 21, 2021

ఒకప్పుడు జయమాలిని అంటే జనానికి పిచ్చ క్రేజ్. సినిమాలో ఆమె పాట వస్తోందంటే ఊగిపోవడానికి సిద్ధమయ్యేవాళ్లు ఎందరో! తెరపై ఆమె డాన్స్ వేస్తుంటే, తెర ముందు కేరింతలు కొడుతూ డాన్సులు వేసేవారు! ఆ రోజులే వేరు!! జయమాలిని డాన్స్ అంటే అదీ. వ్యాంప్ ఆర్టిస్టుల్లో ఆమెలాంటి అందగత్తెలు అరుదు. చాలామంది హీరోయిన్లకు కూడా ఆమె అందం ఉండదు. కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా చేసినా, డాన్సర్‌గానే స్థిరపడ్డారు జయమాలిని. చాలామందికి తెలీని విషయం.. బాలకృష్ణ హీరోగా నటించిన తొలి సినిమాలో ఆయన సరసన హీరోయిన్ జయమాలిని! ఆ సినిమా 'అన్నదమ్ముల అనుబంధం'.
సినిమాల్లో జనాల్ని కవ్వించి, మైమరపించి, వాళ్లను మరో లోకంలోకి తీసుకుపోయే జయమాలిని నిజ జీవితంలో అందుకు పూర్తి భిన్నం. కెమెరా ముందుకు వచ్చినప్పుడు మాత్రమే ఆమె వంపుసొంపుల ప్రదర్శన. ఒకసారి షాట్ అయ్యిందంటే, మళ్లీ ఒంటిని నిండుగా కప్పేసుకునేవారు. చాలా చాలా డీసెంట్‌గా వ్యవహరించేవారు. అందుకే ఎవరూ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించేవారు కాదు. డాన్సర్‌గా ఒకటిన్నర దశాబ్దానికి పైగా ఆమె ప్రేక్షకుల్ని రంజింపజేశారు. 1994లో ఆమె పార్తీపన్ అనే పోలీస్ ఇన్‌స్పెక్టర్‌ను వివాహం చేసుకొని, ఆ తర్వాత పూర్తిగా సంసారానికే పరిమితమయ్యారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. ఎవరినీ సినీ రంగంలోకి ఆమె తీసుకురాలేదు.
నిజానికి ఆమె అందచందాలకు ఎంతోమంది మోహితులైనవాళ్లే. సినీ రంగంలో ఎవరూ ఆమెతో ప్రేమలో పడలేదా? లేక ఆమె ఎవరినీ ప్రేమించలేదా? చెప్పాలంటే సినిమాల్లో నటించినంత కాలం ఒక ప్రొఫెషనల్‌గానే ఆమె వ్యవహరిస్తూ వచ్చారు. తన పని చూసుకోవడం, ప్యాకప్ చెప్పగానే క్షణం ఆలస్యం చెయ్యకుండా ఇంటికి బయలుదేరి వెళ్లిపోవడం.. ఇంతే ఆమెకు తెలుసు. అందుకే ఆమె ఎవరితోనూ ప్రేమలో పడలేదు.
"కొంతమంది నన్ను ప్రేమిస్తున్నానని చెప్పారు. కానీ నాకు కుటుంబ బాధ్యత ఉంది. అందుకే నేను ఆ ప్రేమల్ని యాక్సెప్ట్ చెయ్యలేదు. నేను పెళ్లి చేసుకుందామని అనుకున్నప్పుడు సినిమా వాళ్లెవరూ 'నేను పెళ్లి చేసుకుంటాను' అని నా దగ్గరకు రాలేదు. డిస్కో శాంతిని శ్రీహరి చేసుకున్నట్లు 'నీ బరువు బాధ్యతల్ని నేను తీసుకుంటాను' అని ఎవరైనా వచ్చినట్లయితే మా అమ్మ నన్ను కచ్చితంగా వారికిచ్చి పెళ్లి చేసేదే. కానీ అలా ఎవరూ రాలేదు." అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు జయమాలిని.
ఆమె పెళ్లిచేసుకున్న పార్తీపన్ వాళ్ల ఫ్యామిలీ ఫ్రెండే. జయమాలిని తల్లి వాళ్లను అడిగారు. వాళ్లు ఆలోచించుకొని ఓకే చెప్పారు. అలా తల్లి చూసిన ఆ సంబంధం చేసుకున్నారు జయమాలిని. పెళ్లి తర్వాత కూడా భర్త ఆమెపై ఎలాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టలేదు. నటించవద్దని చెప్పలేదు. అయినప్పటికీ కుటుంబ జీవితమే ముఖ్యమనుకొని ఆమె తిరిగి సినిమాల్లోకి రాలేదు. నటించినంత కాలం నటనను, డాన్స్‌ను ఎంజాయ్ చేసిన జయమాలిని, పెళ్లయి పిల్లలు పుట్టగానే వారి ఆలనా పాలనా చూసుకోవడం, భర్తకు అవసరమైనవి సమకూర్చడంలోనే ఆనందం పొందుతూ వచ్చారు. ఇప్పుడు తన వయసుకు తగ్గ మంచి పాత్రలు వస్తే చేయడానికి రెడీగా ఉన్నానని ఆమె చెప్తున్నారు.
(డిసెంబర్ 22 జయమాలిని జన్మదినం సందర్భంగా...)
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



