అలనాటి ముచ్చట.. జయబాధురిని ఇంటర్వ్యూ చేసిన చంద్రకళ!
on Feb 21, 2022

ఒక ప్రాంత ప్రముఖతార, మరో ప్రాంత ప్రముఖ నటిని కలుసుకొని, ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుంది? అలాంటి సందర్భాలు చాలా అరుదుగా సంభవిస్తుంటాయి. అలా తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల పముఖ నటి చంద్రకళ, హిందీ సినిమాల పాపులర్ నటి జయబాధురి (జయా బచ్చన్) మీటింగ్ జరిగింది. హిందీ సినిమా 'గాయ్ ఔర్ గౌరీ' షూటింగ్ నిమిత్తం అందులో హీరో హీరోయిన్లుగా నటించిన శత్రుఘ్న సిన్హా, జయబాధురి మద్రాస్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఒక తెలుగు సినీ పత్రిక జయబాధురి, చంద్రకళ మీటింగ్‌ను ఏర్పాటుచేసింది. పరిచయాలు అయిన కొద్దిసేపటికే ఆ ఇద్దరు తారలు ఒకరికొకరు బాగా సన్నిహితమయ్యారు. సినిమాలు, అభిమానులు, విమర్శలు, చిత్రపరిశ్రమ.. ఇలా అన్ని విషయాలను గురించీ ఆ ఇద్దరూ మనసువిప్పి మాట్లాడుకున్నారు.
"జయాజీ.. నేను మీ అభిమానిని.. మీ మొదటి చిత్రం 'గుడ్డీ'తోనే నేను మీ ఫ్యాన్‌గా మారిపోయాను" అని చంద్రకళ చెప్పారు. ఆ తర్వాత ఆమె అడిగిన పలు ప్రశ్నలకు జయబాధురి సమాధానాలిచ్చారు. బెంగాలీ తన మాతృభాష అనీ, సత్యజిత్ రే తీసిన బెంగాలీ సినిమా 'మహానగర్'లో నటించడం ద్వారా నటిగా మారాననీ ఆమె వెల్లడించారు. ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో యాక్టింగ్ కోర్సులో చేరి, ట్రైనింగ్ పూర్తి కాకుండానే 'గుడ్డీ' సినిమాలో హీరోయిన్‌గా డైరెక్టర్ హృషికేష్ ముఖర్జీ తొలి అవకాశం ఇచ్చారనీ ఆమె చెప్పారు. Also read: చెల్లెలు చనిపోయిందని తెలీక ఒళ్లో కూర్చోపెట్టుకొని పాలుపట్టిన హీరోయిన్!
తనకు 'ఉపహార్‌లో' మీ నటన మిగతా అన్ని సినిమాల్లో నటన కంటే తనకు బాగా నచ్చిందని చంద్రకళ అంటే, 'ఉపహార్'లో కంటే 'గుడ్డీ'లోనే తాను బాగా చేశానని అనుకుంటానని జయబాధురి చెప్పారు. ఆ తర్వాత ఆమె చంద్రకళ వివరాలు చెప్పమని అడిగారు. అప్పుడు తాను 'జేనుగూడు', 'ఒందే బల్లియ హొగలు' అనే కన్నడ చిత్రాల్లో నటించడం ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చినట్లు చంద్రకళ వెల్లడించారు. 'ఒందే బల్లియ హొగలు' సినిమా 'ఆడపడుచు' పేరుతో తెలుగులో రీమేక్ అయితే, అందులో నటించడం ద్వారా తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టినట్లు తెలిపారు. Also read: ప్రభాస్ 'ఆదిపురుష్' డైరెక్టర్ ఓం రౌత్ గురించి మీకెంత తెలుసు?

మేకప్ అంటే తనకు చాలా ఇబ్బందిగా ఉంటుందనీ, మేకప్ లేకుండా వాస్తవ ప్రపంచంలోనే ఉన్నట్లు నటించడమే సరైన పద్ధతి అనుకుంటానని జయబాధురి అంటే, పాత్ర స్వభావాన్ని బట్టి మేకప్ విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోవాలని చంద్రకళ అభిప్రాయపడ్డారు. అంతే కాదు, 'జవానీ దీవానీ' సినిమాలో కొన్ని సన్నివేశాల్లో మీ మేకప్ సరిగాలేదని నిర్మొహమాటంగా చెప్పేశారు కూడా.
ఈ ఇద్దరు తారల మధ్య సమావేశం జరిగే నాటికి జయబాధురి పెళ్లి కాలేదు. అయితే ఆ తర్వాత ఐదు నెలలకే 1973 జూన్ 3న అప్పటి యాంగ్రీ యంగ్ మ్యాన్ అమితాబ్ బచ్చన్‌తో జయ వివాహం జరిగి ఆమె జయా బచ్చన్‌గా మారిపోయారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



