ENGLISH | TELUGU  

ప్ర‌భాస్ 'ఆదిపురుష్' డైరెక్ట‌ర్ ఓం రౌత్ గురించి మీకెంత తెలుసు?

on Nov 19, 2021

 

ప్రేక్షకుల ముందుకు 2022 ఆగ‌స్ట్ 11న‌ 'ఆదిపురుష్'గా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రానున్నాడు. బాలీవుడ్ డైరెక్ట‌ర్‌ ఓం రౌత్‌ దర్శకత్వంలో ప్రముఖ మ్యూజిక్ లేబుల్ టీ సిరీస్ నిర్మాణంలో, టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ నిర్మాతగా మన బాహుబలి ఈ సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ను ఇటీవ‌లే కంప్లీట్ చేశారు. రెట్రోఫిల్స్ నిర్మాణ భాగ‌స్వామి. భూష‌ణ్ కుమార్‌, క్రిష‌న్ కుమార్‌, ఓం రౌత్‌, ప్ర‌సాద్ సుతార్‌, రాజేశ్ నాయ‌ర్ నిర్మాత‌లు. 

'ఆదిపురుష్' ప్ర‌భాస్ నేరుగా బాలీవుడ్‌లో న‌టిస్తోన్న ఫ‌స్ట్ ఫిల్మ్‌. ఈ సినిమా ఎనౌన్స్‌మెంట్ టైమ్‌లోనే చెడుపై మంచి సాధించిన విజయాన్ని సెలబ్రేట్ చేసుకుందామని అత‌ను చెప్పాడు. రామ‌య‌ణ గాథ‌తో త‌యార‌వుతున్న 'ఆదిపురుష్‌'లో శ్రీ‌రామునిగా ప్ర‌భాస్‌, జాన‌కి (సీత‌)గా కృతి స‌న‌న్ న‌టిస్తుండ‌గా, లంకేశు (రావ‌ణుడు)నిగా సైఫ్ అలీఖాన్‌, ల‌క్ష్మ‌ణునిగా స‌న్నీ సింగ్ క‌నిపించ‌నున్నారు. తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం భాషల్లో సినిమా రూపొందుతున్న ఈ సినిమాని వివిధ ప్ర‌పంచ భాష‌ల్ల‌నోనూ రిలీజ్ చేస్తార‌ని తెలుస్తోంది. జపాన్‌లో ప్రభాస్ ఫాలోయింగ్ బాగానే ఉంది. అలాగే మరికొన్ని దేశాల్లోనూ ఆయ‌న భారీ సంఖ్య‌లో అభిమానులు ఉన్నారు. అందుకనే వ‌ర‌ల్డ్ వైడ్‌గా భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

'ఆదిపురుష్' డైరెక్ట‌ర్ ఓం రౌత్ అదివ‌ర‌కు తీసింది రెండంటే రెండు సినిమాలే. 2020 సంక్రాంతి సీజ‌న్‌లో విడుద‌లై బ్లాక్‌బ‌స్ట‌ర్ అయిన‌ 'తానాజీ' రెండో సినిమా కాగా, దానికి ఐదేళ్ల ముందు 2015లో 'లోక్‌మాన్య‌: ఏక్ యుగ్‌పురుష్' అనే మ‌రాఠీ సినిమాతో డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌య‌మ‌య్యాడు. అది జాతీయ‌, అంత‌ర్జాతీయ స్థాయిలో ప‌లు అవార్డుల‌ను పొందింది. స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు, సంఘ సంస్క‌ర్త లోక‌మాన్య బాల‌గంగాధ‌ర్ తిల‌క్ బ‌యోపిక్‌గా దాన్ని తీశాడు రౌత్‌. దాని త‌ర్వాత ఐదేళ్ల‌కు ఛ‌త్ర‌ప‌తి శివాజీ సైన్యాధిప‌తి తానాజీ జీవితం ఆధారంగా బ‌యోగ్రాఫిక‌ల్ పీరియ‌డ్ యాక్ష‌న్ ఫిల్మ్ 'తానాజీ: ది అన్‌సింగ్ వారియ‌ర్‌'ను తీశాడు.

ఈ రెండు సినిమాల‌ను బ‌ట్టి రౌత్ జాతీయ భావాలు పుష్క‌లంగా ఉన్న వ్య‌క్తిగా, మ‌న భార‌తీయ సంస్కృతీ సంప్ర‌దాయాల‌పై అమిత గౌర‌వాభిమానాలు ఉన్న వ్య‌క్తిగా మ‌నం అర్థం చేసుకోవ‌చ్చు. ఇప్పుడు ప్ర‌భాస్‌తో అత‌ను 'ఆదిపురుష్‌'ను తెర‌కెక్కిస్తున్నాడు. ఇది రామాయ‌ణం క‌థ‌. అంటే త‌న భావ‌జాలానికి త‌గ్గ క‌థాంశాల‌తోనే అత‌ను సినిమాలు తీయ‌డాన్ని కొన‌సాగిస్తున్నాడు. ప్ర‌భాస్‌ను తెర‌పై రౌత్ ఎలా ప్రెజెంట్ చేస్తున్నాడ‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.

డైరెక్ట‌ర్ కాక‌ముందు రౌత్ ప్రొడ్యూస‌ర్‌. 2010లో మ‌హేశ్ మంజ్రేక‌ర్ డైరెక్ష‌న్‌లో 'సిటీ ఆఫ్ గోల్డ్‌', 2011లో విక్ర‌మ్ భ‌ట్ డైరెక్ష‌న్‌లో 'హాంటెడ్ 3డి' ఫిల్మ్‌ను అత‌ను ప్రొడ్యూస్ చేశాడు. అయితే అత‌ని పేరు అంద‌రి నోళ్ల‌లో నానింది మాత్రం అజ‌య్ దేవ్‌గ‌ణ్‌ను టైటిల్ రోల్‌లో చూపిస్తూ రూపొందించిన 'తానాజీ' మూవీతోటే. ఇప్పుడు అత‌ని డైరెక్షన్‌లో టి సిరీస్ భూష‌ణ్ కుమార్ భారీ బ‌డ్జెట్‌తో ఏక కాలంలో హిందీ, తెలుగు భాష‌ల్లో 3డి ఫార్మ‌ట్‌లో 'ఆదిపురుష్‌'ను నిర్మిస్తున్నారు. 'బాహుబ‌లి'గా ప్ర‌పంచ‌వ్యాప్తంగా అభిమానుల‌ను అల‌రించిన ప్ర‌భాస్ 'ఆదిపురుష్‌'గా ఏ స్థాయిలో అల‌రిస్తాడో వెయిట్ అండ్ సీ.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.