ఒక సినిమా థియేటర్‌లో రిలీజ్ అయింది అంటే దాని భవిష్యత్తు ఏమిటి, ఎన్నిరోజులు ఆడే ఛాన్స్ ఉంది.. అనేది క్షణాల్లో ప్రపంచానికి తెలిసిపోతోంది. ఇటీవలికాలంలో పెరిగిపోయిన మీడియా, సోషల్ మీడియా వల్ల ఇది సాధ్యపడుతోంది. సినిమాలను సమీక్షించడం అనే పద్ధతి ఇప్పటిది కాదు. సినిమా పుట్టిన నాటి నుంచే ఉంది. అయితే అప్పట్లో ప్రింట్ మీడియా మాత్రమే ఉండేది కాబట్టి పత్రిక వచ్చే వరకు పాఠకులు ఎదురుచూసేవారు. సరిగ్గా పాతిక సంవత్సరాల క్రితం కూడా ఇదే పద్ధతి ఉంది అంటే మీరు నమ్ముతారా? కానీ, ఇది నిజం. సినిమా రిలీజ్ అయిన నాలుగు రోజుల తర్వాత ఒక దినపత్రికలో దానికి సంబంధించిన రివ్యూ వచ్చేది. కొంతమంది ఆ రివ్యూ చూసిన తర్వాతే సినిమాకి వెళ్లేవారు. అప్పట్లో వెబ్‌సైట్లు, ఛానల్స్ అంత ప్రభావవంతంగా పనిచేయకపోవడం వల్ల ఆ దినపత్రికలోని రివ్యూనే ప్రామాణికంగా తీసుకునేవారు.
65 సంవత్సరాల వెనక్కి వెళితే.. ఒక సినిమాకి సంబంధించిన సమీక్షను ఒకే పత్రికలో రెండు సార్లు ప్రింట్ చెయ్యాల్సి వచ్చింది. ఒకసారి నెగెటివ్‌గా, ఒకసారి పాజిటివ్‌గా ప్రింట్ అయింది. ఎవరైనా సినిమా బాగుండకపోతే నెగెటివ్ రివ్యూ రాస్తారు, బాగుంటే పాజిటివ్ రివ్యూ ఇస్తారు. అలా కాకుండా రెండు రకాల రివ్యూలు ఒకే పత్రికలో ప్రింట్ అవ్వడానికి రీజన్ ఏమిటి? ఇంతకీ అది సినిమా అనేది తెలుసుకుందాం.
ఎన్.టి.రామారావు, సావిత్రి, జమున, జగ్గయ్య ప్రధాన పాత్రల్లో ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వంలో నాగిరెడ్డి, చక్రపాణి నిర్మించిన చిత్రం ‘అప్ప్పుచేసి పప్ప్పుకూడు’. 1959 జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. మొదటి నాలుగు వారాలు కలెక్షన్స్ బాగానే ఉన్నప్పటికీ ఎబౌ ఏవరేజ్ సినిమా అనిపించుకుంది. అయితే రీరిలీజ్‌లో ఈ సినిమా మంచి లాభాలు తెచ్చిపెట్టింది. తెలుగు సినిమా చరిత్రలో ఒక క్లాసిక్‌గా ఈ చిత్రం నిలిచింది.
ఈ సినిమా విడుదలైన తర్వాత వివిధ పత్రికల్లో సినిమాకి అనుకూలంగా సమీక్షలు వచ్చాయి. అందులో ఆంధ్రప్రతికలో మాత్రం నెగెటివ్ రివ్యూ వచ్చింది. సినిమాలో దొర్లిన పొరపాట్లు, కథ, కథనాల్లో ఉన్న లొసుగుల్ని ప్రస్తావిస్తూ ఆ సమీక్ష సాగింది. దీన్ని ప్రముఖ రచయిత ముళ్ళపూడి వెంకటరమణ రాశారు. సినిమా అంతా గందరగోళంగా ఉందని, కథ ప్రేక్షకుల్ని కన్‌ఫ్యూజ్ చేసే విధంగా ఉందని తన రివ్యూలో పేర్కొన్నారు. ఈ రివ్యూ చదివిన నిర్మాత చక్రపాణి ఆశ్చర్యపోయారు. అందరూ సినిమా బాగుందని రాస్తే, ఆ పత్రికలో ఎందుకలా వచ్చింది అనే విషయం తెలుసుకోవాలనుకున్నారు. అప్పట్లో ఆంధ్రపత్రికకు ఎడిటర్‌గా పనిచేస్తున్న శంభుప్రసాద్ దగ్గర ఈ ప్రస్తావన తీసుకొచ్చారు చక్రపాణి.
సినిమా గురించి రమణగారు తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు తప్ప నెగెటివ్‌గా రాయాలనే ఉద్దేశంతో అలా చేయలేదు అని చక్రపాణికి చెప్పారు శంభుప్రసాద్. సినిమా గురించి పాజిటివ్ రివ్యూ కావాలంటే మీరే ఎవరితోనైనా రాయించి పంపండి. దాన్ని కూడా ప్రింట్ చేస్తాం అని చెప్పారు శంభుప్రసాద్. అప్ప్పుడు ఈ విషయాన్ని చందమామ మ్యాగజైన్‌కి ఎడిటర్‌గా ఉన్న కొడవటిగంటి కుటుంబరావు దగ్గరకు తీసుకెళ్లారు. ఆయన అంతకుముందు ఆంధ్రపత్రిక వారపత్రికకు ఎడిటర్‌గా కూడా పనిచేశారు. ‘అప్ప్పుచేసి పప్ప్పుకూడు’ రిలీజ్ అయ్యే టైమ్‌కి ఆయన విజయ కాంపౌండ్‌లోనే ఉండడంతో ఆయన్ని అప్రోచ్ అయ్యారు చక్రపాణి.
మన సినిమా గురించి ఎలా రాస్తే జనంలోకి వెళ్తుందో అలా రివ్యూ రాయమని కుటుంబరావును కోరారు చక్రపాణి. ఆయన చెప్పినట్టుగానే సినిమాలోని లొసుగుల్ని తడమకుండా పాజిటివ్‌గా రివ్యూ రాసి ఇచ్చారు. దాన్ని శంభుప్రసాద్‌కి పంపారు చక్రపాణి. ఆ రివ్యూను యధాతథంగా ఆంధ్రపత్రికలో ప్రింట్ చేశారు. అలా ఈ సినిమా గురించి ఒక పాజిటివ్ రివ్యూ, ఒక నెగెటివ్ రివ్యూ ఒకే పత్రికలో రావడం అనేది విశేషంగా చెప్ప్పుకోవచ్చు.






