
తెలుగు సినిమా చరిత్రలో ఒక క్లాసిక్ మూవీగా నిలిచిన ‘పాతాళభైరవి’(Pathala Bhairavi) చిత్రం ఈ ఏడాది మార్చి 15కి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. తెలుగు, తమిళ భాషల్లో నిర్మాణం జరుపుకున్న ఈ సినిమా ఘనవిజయం సాధించి విజయ సంస్థకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ఆరోజుల్లో హీరోలతో సహా నటీనటులంతా నెల జీతానికి సినిమాలు చేసేవారు. ‘పాతాళభైరవి’ సూపర్‌హిట్ కావడంతో విజయ సంస్థలో పనిచేస్తున్న వారందరికీ మూడు నెలల జీతం బోనస్‌గా ప్రకటించారు.
ఈ సినిమా 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎన్.టి.రామారావుకు 5 తులాల బంగారు గొలుసును బహూకరించారు విజయ అధినేతలు. అలాగే ఎస్.వి.రంగారావుకు 5 వేల రూపాయలు ఖరీదు చేసే మోటార్ సైకిల్‌ను అందించారు. ఈ సినిమా వల్ల వచ్చిన లాభాలతోనే విజయ సంస్థను మరింత విస్తరించారు నాగిరెడ్డి, చక్రపాణి.






