100 రోజుల ఫంక్షన్‌కి డైరెక్టర్‌ని రావొద్దన్న నిర్మాత.. ఫంక్షన్ క్యాన్సిల్ చేసిన మహేష్‌బాబు!
on Mar 22, 2025
1979లో నాలుగేళ్ళ వయసులో ‘నీడ’ చిత్రంతో బాలనటుడిగా కెరీర్ ప్రారంభించిన మహేష్‌బాబు 11 ఏళ్ళ పాటు 8 సినిమాల్లో నటించారు. ఆ తర్వాత 9 సంవత్సరాలు గ్యాప్ తీసుకొని ‘రాజకుమారుడు’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఘనవిజయం సాధించి మహేష్‌కు హీరోగా మంచి ప్రారంభాన్నిచ్చింది. అయితే ఆ తర్వాత చేసిన యువరాజు, వంశీ చిత్రాలు ఫ్లాప్ అవ్వడంతో మహేష్ కెరీర్ ఏమైపోతుందోనని సూపర్‌స్టార్ కృష్ణ ఆందోళనకు గురయ్యారు. ఆ తర్వాత చేసే సినిమా కథ, దర్శకుడి విషయంలో ఎంతో కేర్ తీసుకోవాలని భావించారు. అంతకుముందు కృష్ణతో ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలను నిర్మించిన నందిగం రామలింగేశ్వరరావు ఆ బాధ్యతను తీసుకున్నారు. ఆయన స్వతహాగా కృష్ణ అభిమాని కావడంతో మహేష్ కెరీర్‌లో గుర్తుండిపోయే హిట్ సినిమా నిర్మించాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు కృష్ణవంశీని డైరెక్టర్‌గా సెలక్ట్ చేసుకున్నారు. అతనితో సినిమా చేయడం అంటే ఖర్చుతో కూడుకున్న పని అని అందరూ నిర్మాతను భయపెట్టారు. అయితే సినిమా రిచ్‌గా ఉంటుందని కూడా వారే అన్నారు. అయినా రామలింగేశ్వరరావు వెనుకడుగు వేయకుండా ఎంత ఖర్చయినా మంచి సినిమా చెయ్యాలనుకున్నారు.
కృష్ణవంశీ మొదట శ్రీఆంజనేయం, చక్రం కథలు చెప్పారు. కానీ, అవి రామలింగేశ్వరరావుకు నచ్చలేదు. కథలు సెలెక్ట్ చేసే బాధ్యతను సోదరుడు ఆదిశేషగిరిరావు, కుమార్తె మంజుల, మహేష్, రామలింగేశ్వరరావులకు అప్పగించారు కృష్ణ. కథ ముగ్గురికి నచ్చినా ఓకే చెయ్యమని చెప్పారు. అప్పుడు మురారి కథ చెప్పారు కృష్ణవంశీ. ఆ కథ అందరికీ నచ్చింది. ఇక ఆర్టిస్టులు, టెక్నీషియన్ల ఎంపిక మొదలైంది. కమల్‌హాసన్ దర్శకత్వంలో వచ్చిన హేరామ్ చిత్రంలో నటించిన వసుంధరాదాస్‌ను హీరోయిన్‌గా తీసుకోవాలని కృష్ణవంశీ అనుకున్నారు. కానీ, ఆమె రామలింగేశ్వరరావుకు నచ్చలేదు. తన కుమార్తె సూచించిన సోనాలి బింద్రేను ఎంపిక చేశారు. అలాగే సినిమాటోగ్రాఫర్‌గా భూపతిని ఎంపిక చేశారు కృష్ణవంశీ. కానీ, సి.రాంప్రసాద్‌ని తీసుకొచ్చారు నిర్మాత. కృష్ణ పర్సనల్ మేకప్‌మేన్ సి.మాధవరావు అంటే రామలింగేశ్వరరావుకు ఎంతో అభిమానం అందుకే రాంప్రసాద్‌ను ఎంపిక చేశారు. ఇలా అన్ని విషయాల్లోనూ దర్శకనిర్మాతల మధ్య అభిప్రాయ భేదాలు వస్తూ వుండేవి.
‘మురారి’ చిత్రం రెగ్యులర్ షూటింగ్ తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురంలో ప్రారంభించారు. దాదాపు 45 రోజులపాటు చిత్రంలోని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఆలయ సన్నివేశాలను శంషాబాద్ టెంపుల్‌లో తీశారు. షూటింగ్ జరుగుతున్న సమయంలో కృష్ణవంశీతో గొడవలు ఎక్కువ కావడంతో విసిగిపోయిన రామలింగేశ్వరరావు షూటింగ్ బాధ్యతను తన బావమరిది బుల్లి సుబ్బారావుకి అప్పగించి ఆయన మద్రాస్ వెళ్లిపోయారు. ఇవేవీ పట్టించుకోకుండా కృష్ణవంశీ మాత్రం షూటింగ్‌పైనే కాన్‌సన్‌ట్రేట్ చేశారు. మహేష్ నుంచి అద్భుతమైన పెర్‌ఫార్మెన్స్‌ను రాబట్టుకోవడంలో పూర్తిగా సక్సెస్ అయ్యారు. ఆరోజుల్లోనే ఈ సినిమాకి రూ.8 కోట్ల బడ్జెట్ అయ్యింది. సినిమా నిర్మాణంలో ఎక్కడా రాజీ పడని రామలింగేశ్వరరావు రిలీజ్‌కి ముందు చేసే పబ్లిసిటీ విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వలేదు.
2021 ఫిబ్రవరి 17న ‘మురారి’ చిత్రం విడుదలైంది. పరీక్షల ముందు సినిమా రిలీజ్ అవ్వడంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు రాలేదు. దాంతో మొదటి రెండు వారాలు కలెక్షన్లు డల్‌గానే ఉన్నాయి. యూనిట్ మొత్తం సినిమాపై ఎంతో కాన్ఫిడెన్స్‌తో ఉంది. ఆ సమయంలోనే రామలింగేశ్వరరావు పబ్లిసిటీ పెంచారు. పరీక్షలు పూర్తి కాగానే ‘మురారి’ సినిమా తప్పకుండా చూడాలి అనేంతగా తన పబ్లిసిటీతో ప్రేక్షకుల్ని ప్రభావవంతం చేశారు. ఆయన అనుకున్నట్టుగానే మూడో వారం నుంచి కలెక్షన్లు పుంజుకున్నాయి. ఫైనల్‌గా సినిమా సూపర్‌హిట్ టాక్ తెచ్చుకుంది. సూపర్‌స్టార్ కృష్ణ, విజయనిర్మల సినిమా చూసి మహేష్ పెర్‌ఫార్మెన్స్‌ని మెచ్చుకున్నారు. తన అభిమాన హీరో కుమారుడికి సూపర్‌హిట్ ఇవ్వాలని ఎక్కడా రాజీ పడకుండా చిత్రాన్ని నిర్మించిన రామలింగేశ్వరరావు తన కోరిక నెరవేర్చుకున్నారు. ఎన్నో కేంద్రాల్లో మురారి 100 రోజులు పూర్తి చేసుకుంది.
సినిమా నిర్మాణానికి అయ్యే బడ్జెట్ విషయంలోగానీ, పబ్లిసిటీకి అయ్యే ఖర్చు విషయంలోగానీ ఎక్కడా రాజీపడని రామలింగేశ్వరరావు మురారి 100 రోజుల ఫంక్షన్ మాత్రం చేయలేకపోయారు. సినిమా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న సమయంలోనే వంద రోజుల ఫంక్షన్‌ను హైదరాబాద్, విజయవాడలలో నిర్వహిస్తామని చెప్పారు. దానికి వీలుగా హైదరాబాద్‌లో ఫంక్షన్ పూర్తవ్వగానే చార్టెట్ ఫ్లయిట్‌లో ఆర్టిస్టులను, టెక్నీషియన్స్‌ను విజయవాడకు తీసుకెళ్తానని చెప్పారు రామలింగేశ్వరరావు. అయితే దానికి ఒక కండిషన్ పెట్టారు. వంద రోజుల ఫంక్షన్‌కి కృష్ణవంశీ రాకూడదని కృష్ణకు చెప్పారు నిర్మాత. నిజానికి కృష్ణకు, మహేష్‌కు దర్శకులంటే ఎంతో గౌరవం. అలాంటిది ఫంక్షన్‌కు డైరెక్టర్ రావడానికి వీల్లేదని నిర్మాత చెప్పడం వారికి బాధ కలిగించింది. డైరెక్టర్ లేకుండా ఫంక్షన్ చేయడం కరెక్ట్ కాదని భావించిన మహేష్ ‘మురారి’ 100 రోజుల ఫంక్షన్‌ను క్యాన్సిల్ చేశారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
