నయా పైసా ప్రజల సొమ్ము వాడుకోని ఒకే ఒక్క నాయకుడు ఎన్.టి.రామారావుగారు!
on Mar 22, 2025
‘కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు.. మహాపురుషులవుతారు..’ అంటూ నటరత్న నందమూరి తారకరామారావు ఇచ్చిన సందేశం ఎందరికో తలమానికం. ఆయన్ని నటుడిగా, రాజకీయ వేత్తగా కంటే ఒక మహోన్నత వ్యక్తిగా, తమ దైవంగా భావించే వారు ఎంతో మంది ఉన్నారు. 76 సంవత్సరాల క్రితం సినీరంగంలో ప్రవేశించిన ఎన్టీఆర్.. నిజంగానే దైవాంశ సంభూతుడు అని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. పురాణాల్లోని దైవ స్వరూపాలైన రాముడు, కృష్ణుడు ఎలా ఉంటారో ఎవరికీ తెలీదు. ఆ దైవాలను ప్రజలకు పరిచయం చేసిన వ్యక్తి ఎన్.టి.రామారావు. తెలుగు వారికి రాముడైనా, కృష్ణుడైనా ఆయనే. వెండితెరపై నవరసాలను అలవోకగా పలికించగల విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ‘అన్న’ ఎన్టీఆర్. సినీ జీవితం నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించి తెలుగు ప్రజల నీరాజనాలు అందుకున్న మహానేత ఎన్టీఆర్. ఆయన గురించి ఎవరు ఏం చెప్పినా అవి మనసు పొరల్లోంచి వచ్చే భావాలే తప్ప ఒక నటుడిగానో, రాజకీయ వేత్తగానో ఆయన్ని పొగిడేందుకు చేసే ప్రయత్నం కాదు. ఎన్టీఆర్ తమ జీవితాల్లో ఎలా భాగస్వామి అయ్యారు, ఆయన జీవితం తమను ఎలా ప్రభావితం చేసింది, ఆయన కనిపిస్తే చాలు ఎలా పరవశించిపోయాము అనే విషయాలను ఇప్పటివరకు ఎంతోమంది ప్రముఖులు ప్రస్తావించారు. ‘బలగం’ చిత్రంతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మురళీధర్ గౌడ్ ఆ తర్వాత పలు చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పోషిస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంటున్నారు. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో ఎన్.టి.రామారావుపై తనకు వున్న ఆరాధనా భావాన్ని తెలిపారు.
‘సిద్ధిపేటలో పశుపతినాథ్ అనే వ్యక్తికి మెడికల్ షాప్ ఉంది. ఆయన అక్కినేని నాగేశ్వరరావుగారికి వీరాభిమాని. ఆయనకు సంబంధించిన పూర్తి సమాచారం పశుపతినాథ్ దగ్గర ఉండేది. ఒకసారి అక్కినేనిగారిని ఆయన సిద్ధిపేటకు తీసుకొచ్చారు. అలా మా కాలేజీకి కూడా వచ్చారు. మాకు చాలా బాధ కలిగింది. ఎందుకంటే ఆయన నాగేశ్వరరావుగారిని తీసుకొచ్చారు. మేం ఎన్.టి.రామారావుగారిని తీసుకురాలేకపోతున్నాం అనే బాధ. ఎలాగైనా అన్నగారిని సిద్ధిపేట తీసుకురావాలి అని నిర్ణయించుకున్నాం. అయితే మాకు ఎలాంటి సోర్స్ లేదు. సిద్ధిపేటలో ఉన్న బాలాజీ టాకీస్ ఓనర్స్‌లో ఒకరైన కన్యాలాల్‌ని మేం ఎంతో గౌరవించేవాళ్ళం. మాకు హనుమాన్ వ్యాయామశాల ఉండేది. దానికి ఆయన్ని గౌరవ అధ్యక్షుడిగా చేశాం. రామారావుగారిని సిద్ధిపేట తీసుకు రావాలంటే థియేటర్ ఓనర్ కాబట్టి కన్యాలాల్‌గారి వల్లే అవుతుంది అనిపించింది. అదే విషయాన్ని ఆయనకు చెప్పాం. దానికి ఆయన కూడా ఒప్పుకున్నారు. ఎలా చేశారో తెలీదుగానీ, రామారావుగారిని సిద్ధిపేటకు తీసుకొచ్చారు. మేం 8 మంది ఫ్రెండ్స్. మేమంతా ఆయన వచ్చిన సందర్భంగా చాలా హంగామా చేశాం. ఆయన కారులో నుంచి దిగగానే ఓపెన్ టాప్ జీప్‌లో సిద్ధిపేట మొత్తం తిరిగి ప్రజలకు అభివాదం చేశారు. బయల్దేరిన దగ్గర నుంచి తిరిగి కాలేజీకి వచ్చే రూట్ మొత్తం మేమే చూపించాం.
ఆ సందర్భంగా రామారావుగారు మనస్ఫూర్తిగా చెప్పిన మాట ఏమిటంటే.. ‘సిద్ధిపేటలో నాకు ఇంత ఘనస్వాగతం లభిస్తుందని అనుకోలేదు’ అన్నారు. నిజానికి ఆరోజు ఎక్కడికెక్కడి నుంచో ఇసుక వేస్తే రాలనంతగా కొన్ని వేల మంది జనం అక్కడికి వచ్చారు. ఆరోజుల్లో రామారావుగారికి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అప్పుడే కాదు, ఇప్పటికైనా రామారావుగారు అంటే ఒక అద్వితీయమైన వ్యక్తి. ఆయన నటుడిగా, రాజకీయ వేత్తగా, వ్యక్తిగా నభూతో నభవిష్యత్. అలాంటి మహానుభావులు ఇంతకుముందు లేరు, ఇకపై రారు కూడా. ఈరోజు వరకు ప్రజలకు సంబంధించిన ఒక్క పైసా కూడా వాడుకోకుండా సేవ చేసిన ఒకే ఒక్క రాజకీయ నాయకుడు రామారావుగారు. ఇప్పుడు అలాంటి వారిని ఒక్కర్ని చూపించండి. అయితే ప్రధానమంత్రి మోది, యోగి వంటి ఐదారుగురు వ్యక్తులు ఉన్నారు. కానీ, సొంత డబ్బు ఖర్చుపెట్టి ప్రజలకు సేవ చేసిన మహానుభావుడు ఎన్.టి.రామారావుగారు. ఫ్లైట్‌లో వెళ్లాలంటే సొంతంగా టికెట్ వేసుకొని వెళ్లేవారు. గవర్నమెంట్ కారులో ఇంటికి వెళితే మళ్ళీ దాన్ని ఆఫీస్‌కి పంపించేవారు తప్ప సొంతంగా వాడుకునేవారు కాదు. అలా ఎవరు చేయగలరు? ఒక మనిషి మనిషిగా జీవించాలన్నా.. జీవితంలో ఎదగాలన్నా రామారావుగారి జీవిత చరిత్ర తప్పకుండా తెలుసుకోవాలి’ అంటూ ఎన్.టి.రామారావుపై తనకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు మురళీధర్‌గౌడ్.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
