సినిమా చూడాలంటే బ్రహ్మానందం ఇప్పటికీ వణికిపోతారు.. ఎందుకో తెలుసా?
on Jan 31, 2026
(ఫిబ్రవరి 1 బ్రహ్మానందం పుట్టినరోజు సందర్భంగా..)
- తను చేసిన 1250 సినిమాల్లో బ్రహ్మానందం చూసినవి 20 మాత్రమే
- చిరంజీవిని చూస్తే బ్రహ్మానందం భయపడతారు.. ఎందుకంటే?
- చిన్నతనంలో బ్రహ్మానందంని తండ్రి ఎందుకు కొట్టేవారు?
నీ ఎంకమ్మా..
తీస్కో.. పండగ చేసుకో..
రకరకాలుగా ఉంది మాస్టారూ..
ఖాన్‌తో గేమ్స్ ఆడొద్దు.. శాల్తీలు లేచిపోతాయ్..
జఫ్ఫా..
ఇరుకుపాలెం వాళ్లంటే ఎకసెక్కాలుగా ఉందా?..
నా పెర్‌ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే ఎస్.ఎం.ఎస్. చేయండి..
నన్ను ఇన్‌వాల్వ్ చేయకండి రావుగారు..
ఈ పాపులర్ డైలాగులు వింటే చాలు.. అవి చెప్పి మనల్ని నవ్వించిన కమెడియన్ ఎవరో గుర్తొస్తారు. నాలుగు దశాబ్దాలపాటు తిరుగులేని, తీరికలేని కమెడియన్‌గా పేరు తెచ్చుకున్నారు బ్రహ్మానందం. తెలుగు సినిమా చరిత్రలో ఎంతో మంది హాస్యనటులు వచ్చారు. తమ నటనతో ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించారు. పాతతరంలో రేలంగి, రమణారెడ్డి, అల్లు రామలింగయ్య, పద్మనాభం, రాజబాబు వంటి హాస్యనటులు కొన్ని దశాబ్దాలు హాస్యనట చక్రవర్తులుగా ఇండస్ట్రీని ఏలారు.
ఆ తర్వాత వచ్చిన బ్రహ్మానందం తనదైన మార్క్ కామెడీతో, డైలాగులతో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందర్నీ ఎంటర్‌టైన్ చేశారు. 1980వ దశకంలో ఇండస్ట్రీకి వచ్చిన బ్రహానందం.. కొన్ని దశాబ్దాలపాటు తన హాస్యంతో ప్రేక్షకుల్ని అలరించారు. ఒక దశలో బ్రహ్మానందం లేని సినిమా ఉండేది కాదు. డిస్ట్రిబ్యూటర్లు కూడా బ్రహ్మానందం సినిమాలో ఉన్నాడంటే మినిమం గ్యారెంటీగా భావించేవారు. ఒకప్ప్పుడు రాజబాబు, రమాప్రభ కాంబినేషన్‌కి ఈ క్రేజ్ ఉండేది.
నలభై ఏళ్ళ తన సినీ కెరీర్‌లో 1250కి పైగా సినిమాల్లో హాస్యనటుడిగా కనిపించిన బ్రహ్మానందంకి సినిమాలంటే ఎంతో భయమట. అందుకే తను చేసిన వందల సినిమాల్లో కేవలం 20 మాత్రమే చూశారు. సినిమా నటుడై ఉండి, తన నటనతో ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించే బ్రహ్మానందంకి సినిమాలంటే ఎందుకు విరక్తి కలిగింది? సినిమాల విషయంలో అతన్ని భయపెట్టింది ఎవరు? అనే విషయాల గురించి తెలుసుకుందాం.
1956 ఫిబ్రవరి 1న గుంటూరు జిల్లా ముప్పాళ్ళ మండలం, చాగంటివారిపాలెంలో కన్నెగంటి నాగలింగాచారి, లక్ష్మీనరసమ్మ దంపతులకు ఎనిమిది మంది సంతానంలో ఒకరుగా జన్మించారు కన్నెగంటి బ్రహ్మానందం. సత్తెనపల్లి శరభయ్య హైస్కూలులో టెన్త్ వరకు చదువుకున్నారు. పై చదువులకు వెళ్లేందుకు ఆర్థిక స్తోమత లేకపోవడంతో తండ్రికి సన్నిహితుడైన సున్నం ఆంజనేయులు సహకారంతో భీమవరం డి.ఎన్.ఆర్. కాలేజీలో ఇం{ర్మీడియట్, డిగ్రీ పూర్తి చేశారు. గుంటూరు పీజీ సెంటర్‌లో తెలుగు సాహిత్యంలో ఎం.ఎ. చేశారు. ఆ తర్వాత 9 సంవత్సరాలపాటు అత్తిలిలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు బ్రహ్మానందం.
చిన్నతనంలో సినిమాలు చూడాలని ఎంతో ఆసక్తిగా ఉండేది. కానీ, తండ్రి సినిమాలకు పంపేవారు కాదు. సంవత్సరానికి ఒక సినిమా చూస్తే గగనం అన్నట్టుగా ఉండేది. అయితే తండ్రికి తెలియకుండా సోదరులతో కలిసి సెకండ్ షోలకు వెళ్లేవారు. అలా వెళ్లినప్ప్పుడల్లా తండ్రి వారిని చితకబాదేవారు. తన్నులు తిన్నా సినిమాలు చూడడం మానేవారు కాదు. ఆ తర్వాతి కాలంలో సినిమా చూడాలంటే తండ్రి కొట్టిన దెబ్బలే గుర్తొచ్చేవి.
ఇక సినిమాల్లోకి వచ్చి గ్రేట్ కమెడియన్ అనిపించుకున్న తర్వాత కూడా సినిమాలంటే భయం పోలేదు. సినిమాల విషయంలో తండ్రి అతన్ని శిక్షించిన తీరు అలా ఉండేది. తను చేసే సినిమాల ద్వారా ప్రేక్షకుల్ని నవ్విస్తున్నప్పటికీ తను మాత్రం సినిమాలకు దూరంగానే ఉంటారు. అందుకే ఆయన చూసిన సినిమాలు చాలా తక్కువ. సినిమా అనగానే ఇప్పటికీ చిన్నతనంలో తండ్రి కొట్టిన దెబ్బలే గుర్తొస్తాయని అంటారు. అలాగే చిరంజీవిని చూసినా బ్రహ్మానందం భయపడతారు. దానికి కారణం.. తను సినిమాల్లోకి రాకముందు చిరంజీవి వంటి స్టార్ హీరోని కలిసినపుడు మాట్లాడేందుకు ఎంత భయపడ్డారో ఇప్ప్పుడు కూడా ఆయన కలిసినపుడు పైకి బాగానే మాట్లాడినా మనసులో మాత్రం వణుకు పుడుతుందంటారు బ్రహ్మానందం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



