జాతీయ అవార్డును తిరస్కరించిన వేటూరి సుందరరామ్మూర్తి.. ఎందుకంటే?
on Jan 29, 2026
(జనవరి 29 వేటూరి సుందరరామ్మూర్తి జయంతి సందర్భంగా..)
మన సినిమాల్లో పాటలకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో అందరికీ తెలిసిందే. పాతతరం నుంచి ఇప్పటివరకు ఎందరో రచయితలు అందమైన పాటల్ని అందించారు. వారు అందించిన పాటలు ఆయా సినిమాల విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఒక దశలో శ్రీశ్రీ, ఆత్రేయ, సి.నారాయణరెడ్డి, ఆరుద్ర వంటి రచయితలు తమదైన శైలిలో పాటలు రాస్తూ వున్న సమయంలో ఒక మెరుపులా ఇండస్ట్రీకి వచ్చారు వేటూరి సుందరరామ్మూర్తి. దాదాపు 40 సంవత్సరాలపాలు తెలుగు పాటను పరవళ్లు తొక్కించిన వేటూరి 5,000కి పైగా పాటలు రాశారు. ఆ సమయంలో ఉన్న అందరు రచయితల శైలి తన పాటల్లో కనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నారు వేటూరి. చాలా ఆలస్యంగా పరిశ్రమకు వచ్చిన వేటూరి.. చాలా తక్కువ సమయంలోనే అందర్నీ ఆశ్చర్యపరుస్తూ అగ్రరచయిత అనిపించుకున్నారు. రచయితగా మారడానికి ముందు ఆయన ఎలాంటి సాహిత్యాన్ని చదవలేదు. కేవలం రేడియోలో వస్తున్న పాటల్ని వింటూ పాటల రచనపై ఆసక్తిని పెంచుకున్నారు.
1936 జనవరి 29న కష్ణాజిల్లా పెదకళ్లేపల్లి గ్రామంలో వేటూరి చంద్రశేఖరశాస్త్రి, కమలాంబ దంపతులకు జన్మించారు వేటూరి సుందరరామ్మూర్తి. తండ్రి నేత్ర వైద్యులుగా ఉండేవారు. తల్లి కమలాంబకు సాహిత్యంలోనూ, సంగీతంలోనూ ప్రవేశం ఉంది. వత్తి రీత్యా వీరి కుటుంబం విజయవాడ వచ్చింది. అక్కడ 5వ తరగతి వరకు చదువుకున్నారు వేటూరి. ఆ తర్వాత జగ్గయ్యపేటలో 9వ తరగతి వరకు, గుంటూరు జిల్లాలోని కొల్లూరులో ఎస్ ఎస్ ఎల్ సి వరకు చదువుకున్నారు. మద్రాస్‌లో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. ఆ తర్వాత విజయవాడ వచ్చి బి.ఎ. ఎకనమిక్స్ చేశారు. అటు పిమ్మట లా చేసేందుకు మద్రాస్ వెళ్లారు. చదువుతున్న రోజుల్లోనే రచనల పట్ల ఆసక్తి బాగా పెరిగింది. లా రెండో సంవత్సరంలో ఉండగానే జర్నలిజంలో చేరితే బాగుంటుందని సన్నిహితులు సలహా ఇవ్వడంతో ఆంధ్రప్రభ పత్రికలో విలేకరిగా చేరారు. ఆ తర్వాత ఆంధ్ర సచిత్ర వార పత్రికలో శీర్షికలు రాసేందుకు చేరారు. 1956 నుంచి 16 ఏళ్ళపాటు జర్నలిస్ట్‌గా పనిచేశారు.
ఆంధప్రత్రికలో పనిచేస్తున్న సమయంలోనే వేటూరి రచనలు నటరత్న ఎన్.టి.రామారావును బాగా ఆకట్టుకున్నాయి. సినిమాల్లో పాటలు రాస్తే బాగా రాణిస్తారని ఆనాడే ఎన్టీఆర్ సలహా ఇచ్చారు. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఓ సీత కథ’ చిత్రంలోని ‘భారతనారి చరితము’ అనే హరికథతో చిత్ర రంగ ప్రవేశం చేశారు. 1974లో ఈ చిత్రం విడుదలైంది. అయితే మూడేళ్లు గడిచినా వేటూరికి మరో అవకాశం రాలేదు. ఎన్టీఆర్ దృష్టిలో వేటూరి ఉండడంతో కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో ఆయన చేస్తున్న ‘అడవిరాముడు’ చిత్రంలోని అన్ని పాటలు రాసే అవకాశం ఇచ్చారు. ఈ సినిమా ఘనవిజయం సాధించి చరిత్ర సష్టించింది. మ్యూజికల్‌గా చాలా పెద్ద హిట్ అవ్వడంతో రచయితగా వేటూరి పాపులర్ అయిపోయారు. ఆ క్రమంలోనే పంతులమ్మ, సిరిసిరిమువ్వ చిత్రాల్లోని అన్ని పాటలు రాశారు వేటూరి. సిరిసిరిమువ్వ చిత్రానికి జంధ్యాలతో కలిసి మాటలు కూడా రాశారు.
1979లో పాటల రచయితగా వేటూరి జీవితం ఓ కొత్త మలుపు తిరిగింది. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన శంకరాభరణం చిత్రంలోని అన్ని పాటలు రాసి ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత సాగరసంగమం, సప్తపది, సీతాకోకచిలక, ముద్దమందారం, సితార, అన్వేషణ, స్వాతిముత్యం.. ఇలా ఎన్నో సినిమాల్లో తరాల తరబడి గుర్తుపెట్టుకునే పాటలు రాశారు. సంప్రదాయ కవిత్వం దగ్గర నుండి జానపద గీతాల వరకు అన్నింటిలోనూ తన ప్రతిభను నిరూపించుకున్నారు. పండితుల నుండి పామరుల వరకు అందరిని అలరించిన విశిష్ట శైలి ఈయన సొంతం. శ్రీశ్రీ తర్వాత తెలుగు సినిమా పాటకి జాతీయ ఉత్తమ సినిమా పాటల రచయిత పురస్కారాన్ని అందించారు. ఆయన మాతృదేవోభవ సినిమాకి రాసిన రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే... అనే పాటకి 1994వ సంవత్సరానికి గాను ఈ పురస్కారం వచ్చింది. ఇది తెలుగు పాటకు రెండవ జాతీయ పురస్కారం. అయితే కేంద్ర ప్రభుత్వం తెలుగు భాషకు ప్రాచీన భాషా హోదా ఇవ్వనందుకు నిరసనగా తన పాటకు వచ్చిన జాతీయ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేశారు వేటూరి. ఇది కాక ఆయనకు ఎన్నో నంది అవార్డులు, ఇతర పురస్కారాలు లభించాయి.
ఒక తరహా పాటలు కాకుండా ఎలాంటి పాటనైనా అవలీలగా రాయగల ప్రతిభ కలిగిన వేటూరి రచించిన కొన్ని గీతాల గురించి చెప్పాలంటే.. కృషి వుంటే మనుషులు రుషులౌతారు, మానసవీణా మధుగీతం, అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ, ఝుమ్మంది నాదం.. సై అంది పాదం, కొమ్మ కొమ్మకో సన్నాయి.., శంకరాభరణం చిత్రంలోని అన్ని పాటలు, రాగాల పల్లకిలో కోయిలమ్మా, ఆకాశ దేశాన.. ఆషాఢ మాసానా.., కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి, వెన్నెల్లో గోదారి అందం, ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో, గీతాంజలి చిత్రంలోని అన్ని పాటలు, జగదేకవీరుడు అతిలోక సుందరి చిత్రంలోని అన్ని పాటలు, పావురానికి పంజరానికి, ఎన్నెన్నో అందాలు, ఓ ప్రేమా నా ప్రేమా, జాబిలికీ వెన్నెలకీ పుట్టిన పున్నమిలే, ఆకాశాన సూర్యుడుండడు సంధ్య వేళకు, సఖియా చెలియా.. ఇలా వేటూరి కలం నుండి జాలువారిన మధురగీతాల్లో ఇవి మచ్చు తునకలు మాత్రమే. తెలుగు సినిమాకి వేటూరి లేని లోటు ఎవరూ పూడ్చలేనిది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అల్లు అర్జున్, వి.వి.వినాయక్ కాంబినేషన్‌లో 2011లో వచ్చిన బద్రినాథ్ చిత్రంలో ఓంకారేశ్వరి.. వేటూరి రాసిన చివరి పాట. ఈ సినిమా విడుదల కావడానికి సంవత్సరం ముందు 2010 మే 22న 75 ఏళ్ళ వయసులో గుండెపోటుతో హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు వేటూరి సుందరరామ్మూర్తి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



