ఒకే సంవత్సరం 5 బ్లాక్‌బస్టర్స్‌తో చరిత్ర సృష్టించిన శోభన్‌బాబు!
on Jan 14, 2025
(జనవరి 14 శోభన్‌బాబు జయంతి సందర్భంగా..)
1959లోనే నటుడుగా చిత్ర పరిశ్రమలో ప్రవేశించిన శోభన్‌బాబు చిన్న చిన్న పాత్రలు చేస్తూ కొన్నేళ్ళపాటు తన కెరీర్‌ను కొనసాగించారు. హీరోగా మారిన తర్వాత ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించారు. 1970వ దశకం వచ్చేసరికి రంగుల చిత్రాలకు ప్రాధాన్యం పెరిగింది. ఆ దశలో తను కలర్ సినిమాల్లో మాత్రమే నటిస్తానని నిర్మాతలకు చెప్పేవారు శోభన్‌బాబు. తనతో సినిమా చెయ్యాలని వచ్చే నిర్మాతలను ముందుగా కథ గురించి, దర్శకుడి గురించి అడక్కుండా కలర్‌లో తీస్తారా, బ్లాక్ అండ్ వైట్‌లో తీస్తారా అని అడిగేవారు. బ్లాక్ అండ్ వైట్ అని చెబితే నిర్మొహమాటంగా చెయ్యను అని చెప్పేవారు. ఆ నిర్ణయం వల్ల ఎన్నో సినిమాలు శోభన్‌బాబు వదులుకున్నారు. అలా ఆ తర్వాతికాలంలో శోభన్‌బాబు చేసిన సినిమాలన్నీ కలర్‌లోనే రూపొందాయి. ముఖ్యంగా 1975 సంవత్సరం శోభన్‌బాబు కెరీర్‌లో ఓ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆ సంవత్సరం ఆయన నటించిన 8 సినిమాలు విడుదలయ్యాయి. అన్నీ కలర్ సినిమాలే కావడం విశేషం. ఇందులో 5 సినిమాలు సూపర్‌హిట్ అయి ఆరోజుల్లో సంచలనం సృష్టించాయి.
దేవుడు చేసిన పెళ్లి, అందరూ మంచి వారే, బాబు, జీవనజ్యోతి, బలిపీఠం, జేబుదొంగ, గుణవంతుడు, సోగ్గాడు.. ఈ 8 సినిమాలు 1975లో విడుదలయ్యాయి. వీటిలో ఐదు సినిమాలు బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. ముఖ్యంగా బలిపీఠం, జీవనజ్యోతి, సోగ్గాడు సాధించిన సంచలన విజయాలు శోభన్‌బాబును స్టార్ హీరోగా నిలబెట్టాయి. ఆ ఏడాది మొదట విడుదలైన దేవుడు చేసిన పెళ్లి చిత్రంలో శోభన్‌బాబు సరసన శారద నటించారు. ఈ సినిమాలో శారద ద్విపాత్రాభినయం చేయడం విశేషం. చక్కని సెంటిమెంట్‌తో ఈ సినిమా రూపొందడంతో మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. తెలుగు సినిమా చరిత్రలోనే తొలిసారి ఈ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లలో ఒకరోజు ఉదయం ఆటను పూర్తిగా మహిళలకు కేటాయించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా పెద్ద హీరోల సినిమాలకు మంచి పోటీనిచ్చి ఘనవిజయం సాధించింది. 17 కేంద్రాల్లో 50 రోజులు, 3 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శించారు.
శోభన్‌బాబు, మంజుల జంటగా నటించిన సూపర్‌హిట్ సినిమా మంచి మనుషులు తర్వాత మరోసారి ఈ ఇద్దరూ కలిసి నటించిన సినిమా అందరూ మంచివారే. అయితే ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేదు. ఆ తర్వాత శోభన్‌బాబు, వాణిశ్రీ జంటగా నటించిన బాబు చిత్రం విడుదలైంది. కె.రాఘవేంద్రరావు తొలిసారి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి ఆయన తండ్రి కె.ఎస్.ప్రకాశరావు కథను అందించారు. ఈ సినిమా మొదటివారం 16 లక్షలు కలెక్ట్ చేసినప్పటికీ రెండు నెలల తర్వాత ఇదే జంటతో కె.విశ్వనాథ్ రూపొందించిన జీవనజ్యోతి విడుదల కావడంతో బాబు చిత్రం కలెక్షన్లు బాగా తగ్గాయి. దీంతో ఆశించిన విజయం లభించలేదు. జీవనజ్యోతి సంచలన విజయం సాధించడమే కాకుండా శోభన్‌బాబుకి ఉత్తమనటుడిగా నంది అవార్డును తెచ్చిపెట్టింది. శోభన్‌బాబు ఉత్తమనటుడుగా అవార్డు అందుకున్న ప్రతి సినిమాకీ కె.విశ్వనాథే దర్శకుడు కావడం విశేషంగా చెప్పుకోవాలి. అదే సంవత్సరం దాసరి నారాయణరావు దర్శకత్వంలో శోభన్‌బాబు, శారద జంటగా నటించిన బలిపీఠం చిత్రం ఘనవిజయం సాధించింది.
ఆ తర్వాత వి.మధుసూదనరావు దర్శకత్వంలో శోభన్‌బాబు నటించిన చిత్రం జేబుదొంగ. ఈ సినిమాలో మంజుల హీరోయిన్‌గా నటించారు. అప్పటివరకు క్లాస్ హీరోగా పేరు తెచ్చుకున్న శోభన్‌బాబు దొంగ అనే పేరుతో ఉన్న సినిమాలో నటించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. డెఫినెట్‌గా సినిమా ఫ్లాప్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ, ఈ సినిమా సూపర్‌హిట్ అయింది. 7 కేంద్రాల్లో 100 రోజులు, 30 కేంద్రాల్లో 50 రోజులు ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ సినిమా విడుదలైన 3 నెలలకు శోభన్‌బాబు, మంజుల జంటగా ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో గుణవంతుడు సినిమా రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా విజయం సాధించలేదు. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించిన చివరి సినిమా ఇదే. ఈ సినిమా తర్వాత కె.బాపయ్య దర్శకత్వంలో డి.రామానాయుడు నిర్మించిన సోగ్గాడు విడుదలైంది. అంతకుముందు ఇదే బేనర్‌లో ద్రోహి అనే ఫ్లాప్ సినిమా తీసిన బాపయ్యకు మళ్ళీ రెండో అవకాశం ఇచ్చారు రామానాయుడు. దాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నారు బాపయ్య. ఈ సినిమా జరుగుతున్న సమయంలోనే ఎన్టీఆర్, వాణిశ్రీ జంటగా ఎదురులేని మనిషి ప్రారంభమైంది. ఈ సినిమాకి కూడా బాపయ్యే దర్శకుడు. ఈ రెండు సినిమాలూ వారం గ్యాప్‌తో రిలీజ్ అయి ఘనవిజయం సాధించాయి. అలా 1975లో శోభన్‌బాబు 5 బ్లాక్‌బస్టర్స్ ఇచ్చి రికార్డు క్రియేట్ చేశారు.
Also Read