రావుగోపాలరావు గొంతు సినిమాలకు పనికిరాదన్నారు.. ఎందుకో తెలుసా?
on Jan 14, 2025
(జనవరి 14 రావు గోపాలరావు జయంతి సందర్భంగా..)
ఏ సినిమాలోనైనా హీరోకి ఎక్కువ ప్రాధాన్యం ఎక్కువ ఉంటుంది. అయితే కథలో విలన్ ఉంటేనే హీరో ఎలివేట్ అవుతాడు. తెలుగు సినిమా మొదలైన నాటి నుంచి ఇప్పటివరకు హీరోల వేషధారణ, భాష, నటన వంటి విషయాలు ఎలా మారుతూ వచ్చాయో విలన్స్ కూడా ఎన్నో రకాలుగా రూపాంతరం చెందారు. మొదట్లో విలన్ అంటే వేషధారణ, డైలాగుల్ని బిగ్గరగా చెప్పడం, వికృతంగా నవ్వడం వంటి వాటితో తమ విలనిజాన్ని ప్రదర్శించేవారు. ఈ విషయంలో రాజనాల పేరును ప్రస్తావించవచ్చు. విలన్స్ అనగానే హీరోతో తన్నులు తినడమే కార్యక్రమంగా పెట్టుకునేవారు. ఆ తరహా విలన్స్ చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్న రోజుల్లో.. నాగభూషణం.. కామెడీ, డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్‌ని మిక్స్ చేయడం ద్వారా, డైలాగ్ మాడ్యులేషన్ ద్వారా విలనిజానికి కొత్తదనాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.
ఆ తర్వాత రావు గోపాలరావు విలనిజానికి మరో అర్థాన్ని చెప్పారు. తాను సీరియస్ విలన్‌గా కనిపిస్తూ పక్కనే ఓ కమెడియన్‌తో కామెడీ చేయిస్తూ కొత్తపంథాను అనుసరించారు. అలాంటి సినిమాలు సూపర్‌హిట్ కావడం, రావుగోపాలరావు విలనిజానికి మంచి పేరు రావడంతో దర్శకనిర్మాతలు కూడా దాన్నే కొనసాగించారు. పాతరోజుల్లో విలన్‌లా హీరో చేత తన్నులు తినే సందర్భాలు రావుగోపాలరావు కెరీర్‌లో ఎక్కువ రాలేదు. ఏ సందర్భంలో ఎలా డైలాగులు చెప్పాలి, ఆడియన్స్‌ని ఎలా ఎంటర్‌టైన్ చెయ్యాలి అనేది రావు గోపాలరావుకు బాగా తెలుసు. ఎందుకంటే నాటక రంగం నుంచి రావడంతో సులువుగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోగలిగారు. ఓసారి కాకినాడలో నాటకం వేస్తున్నప్పుడు ఎస్.వి.రంగారావు కూడా అక్కడ ఉన్నారు. రావుగోపాలరావు నటన నచ్చి మద్రాస్ వచ్చి తనను కలవమని చెప్పారు. మద్రాస్ వెళ్ళిన రావు గోపాలరావుకు దర్శకుడు గుత్తా రామినీడును పరిచయం చేశారు. ఆయన దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేస్తూనే చిన్న చిన్న క్యారెక్టర్లు వేయడం మొదలుపెట్టారు.
నాటకరంగంలో తన డైలాగ్స్‌తో ప్రేక్షకుల్ని విపరీతంగా మెప్పించిన రావు గోపాలరావుకు ఓ విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. సినిమాలకు తన గొంతు పనికిరాదని డైరెక్టర్లు చెప్పడం ఆయన్ని ఎంతో బాధించింది. కొన్ని సినిమాల్లో తన పాత్రకు వేరే వారితో డబ్బింగ్ చెప్పించడం ఆయన్ని మరింత కుంగదీసింది. అయితే ఆ సమయంలోనే ఓ విచిత్రం జరిగింది. అందరూ పనికిరాదంటున్న రావు గోపాలరావు గొంతు.. బాపు, రమణలను ఆకర్షించింది. అతనికి తగిన పాత్రను ఇవ్వడమే కాకుండా, ఆయన గొంతును ఎలివేట్ చేసే డైలాగులు రాశారు రమణ. అది రావు గోపాలరావుకు ఎంతో మంచి పేరు తెచ్చింది. అదే ముత్యాల ముగ్గు చిత్రం. కాంట్రాక్టరు పాత్రలో రావుగోపాలరావు చూపించిన విలనిజం, చెప్పిన డైలాగులు ఇప్పటికీ ప్రాచుర్యంలో ఉన్నాయి. ముత్యాల ముగ్గు చిత్రంలో రావుగోపాలరావు చెప్పిన డైలాగులు గ్రామఫోన్ రికార్డుల రూపంలో రిలీజ్ అయ్యాయి. ఆరోజుల్లోనే అత్యధిక స్థాయిలో ఈ రికార్డులు అమ్ముడుపోయాయి. ఆ తర్వాత భక్తకన్నప్ప చిత్రంలో కైలాసనాథ శాస్త్రి పాత్రను కూడా బాపు, రమణలే ఇచ్చారు. ఈ రెండు పాత్రలతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు రావుగోపాలరావు. అవకాశాలు వెల్లువలా వచ్చాయి. ఆ తర్వాత యమగోల, వేటగాడు, గోరంత దీపం, మనవూరి పాండవులు, కలియుగ రావణాసురుడు, త్యాగయ్య చిత్రాల్లోని డైలాగ్స్ గుర్తుండిపోతాయి. అలాంటి డైలాగ్స్‌ని, నటనని మగధీరుడు, కొండవీటి సింహం, కొండవీటి రాజా, కిరాయి రౌడీలు, ఖైదీ, కటకటాల రుద్రయ్య, జస్టిస్ చౌదరి, గోపాలరావుగారి అమ్మాయి, ఘరానా మొగుడు, దేవాలయం, చండశాసనుడు, బొబ్బిలిపులి, బొబ్బిలి బ్రహ్మన్న, అనుగ్రహం, అల్లరి ప్రియుడు, అభిలాష, ఆ ఒక్కటీ అడక్కు తదితర చిత్రాల్లోనూ ప్రదర్శించారు. రావు గోపాలరావు తర్వాత ఎంతో విలన్స్ వచ్చినా, కొందరు విలనీ కామెడీ చేసినా ఆయన స్థానాన్ని మాత్రం ఎవరూ భర్తీ చెయ్యలేకపోయారు.
Also Read