ENGLISH | TELUGU  

వరసగా వచ్చిన నందులు ఆయన కడుపు నింపలేదు.. ఆ ఒక్క పాట సిరివెన్నెల జీవితాన్నే మార్చేసింది!

on May 20, 2025

 

నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకని.. సుఖాన మనలేని వికాసమెందుకని.. అంటూ నేటి వ్యవస్థని ప్రశ్నించినా, జామురాతిరి జాబిలమ్మా, ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది.. అంటూ ప్రేమ భావాలు పలికించినా, బోటనీ పాఠముంది.. మ్యాటనీ ఆట ఉంది, భద్రం బీ కేర్‌ఫుల్‌ బ్రదరూ.. అంటూ యువతను మేల్కొలిపినా అది సిరివెన్నెల సీతారామశాస్త్రి కలానికే చెల్లింది. తన పాటలోని భావాల ద్వారా శ్రోతలను ఆలోచింప జేయడం లేదా ఆస్వాదించేలా చేయడం అనేది సిరివెన్నెలకు వెన్నతో పెట్టిన విద్య. సినిమాలో ఆయన రాసిన పాట ఉందీ అంటే అది ఎంతో కొంత విజ్ఞానాన్ని పంచేది, సామాజిక స్పృహను కలిగించేది, ఆహ్లాదాన్ని పంచేది అయి ఉంటుంది అనేది ప్రతి ఒక్కరికీ తెలుసు. 1986లో సినీ గేయరచయితగా కెరీర్‌ను ప్రారంభించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి ఎంతో మంది యువ రచయితలకు స్ఫూర్తిగా నిలిచారు. ఆయనలా పాటలు రాసి మంచి పేరు తెచ్చుకోవాలని ఎంతోమంది ఇండస్ట్రీకి వచ్చారు. శ్రీశ్రీ, వేటూరి, ఆత్రేయ వంటి రచయితల శైలి వేరు, సిరివెన్నెల దారి వేరు అన్నట్టుగా ఉండే ఆయన పాటలంటే ఇష్టపడని వారుండరు. 

 

కాకినాడలో ఎం.ఎ. చేస్తున్న చేంబోలు సీతారామశాస్త్రికి ఒకరోజు దర్శకుడు కె.విశ్వనాథ్‌ నుంచి పిలుపు వచ్చింది. ‘సిరివెన్నెల’ చిత్రంలోని అన్ని పాటలూ రాసే అవకాశం ఇచ్చారు. అయితే అంతకు రెండేళ్ళ ముందే నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందిన ‘జననీ జన్మభూమి’ చిత్రంలో సీతారామశాస్త్రి రచించిన గంగావతరణం గీతాన్ని తీసుకున్నారు విశ్వనాథ్‌. అది ఆయనకు బాగా నచ్చడంతో ‘సిరివెన్నెల’ చిత్రంలోని పాటలు రాయగల ప్రతిభ సీతారామశాస్త్రిలో ఉందని గుర్తించి అన్ని పాటలూ ఆయనకే ఇచ్చారు. చిత్రంలో 9 పాటలు ఉండగా, ప్రతి పాటనూ ఓ ఆణిముత్యంలా మలిచారు సీతారామశాస్త్రి. పాటలకు విపరీతమైన ఆదరణ లభించింది. అలా సిరివెన్నెల ఆయన ఇంటిపేరుగా మారిపోయింది. మొదటి మూడు సంవత్సరాలు ఉత్తమ గేయ రచయితగా నంది అవార్డులు అందుకున్నప్పటికీ ఆర్థికంగా ఆ సినిమాలు ఆయనకు ఉపయోగపడలేదు. తనపై ఆధారపడిన తమ్ముళ్లు, చెల్లెళ్లతో సహా దాదాపు 15 మందిని పోషించాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. దాంతో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడ్డారు సిరివెన్నెల. 

 

ఉత్తమ పాటల రచయితగా 1986 నుంచి మూడేళ్లపాటు వరుసగా నంది అవార్డులు అందుకున్న సిరివెన్నెల సీతారామశాస్త్రిని ఆర్థికంగా మాత్రం సినీ రంగం మొదట్లో ఆదుకోలేకపోయింది. అవార్డు చిత్రాల పాటల రచయితగా ముద్ర పడిపోయిన ఆయన మద్రాసులో కుటుంబాన్ని పోషించలేక మళ్లీ కాకినాడకు వెళ్లిపోయి ఉద్యోగం చేసుకోవాలని అనుకున్నారు. వరసగా సంగీతపరమైన చిత్రాలకు పాటలు రాసే అవకాశాలే వస్తుండటంతో ఆయన మీద క్లాసికల్‌ రైటర్‌గా ముద్రపడిపోయింది. ఆ రోజుల్లో ద్వంద్వార్థాల పాటలకు క్రేజ్‌ ఉండడం, అలాంటి పాటలు రాయకూడదని సిరివెన్నెల నిర్ణయించుకోవడంతో ఆయనకు కమర్షియల్‌ చిత్రాలలో పాటలు రాసే అవకాశాలు రాలేదు. అయితే ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది ఓ పాట. ఆ పాటతో సినీ పరిశ్రమలో ఆయన విజయ యాత్ర మొదలైంది. డబ్బుకు డబ్బు పేరుకు పేరు తెచ్చిపెట్టింది. 

 

తను డైరెక్ట్‌ చేస్తున్న సినిమాకి ఒక పాట రాయమని బి.గోపాల్‌ అడిగారు. మొదట కొంచెం సంకోచించారు సిరివెన్నెల. ఎక్కడ డబుల్‌ మీనింగ్‌ పాట రాయమంటారోనని టెన్షన్‌ పడ్డారు. కానీ, దానికి భిన్నంగా బి.గోపాల్‌ ఆ పాట ఎలా ఉండాలో చెప్పారు. సాధారణ ప్రేక్షకులకు సైతం ఎంతో సులువుగా అర్థమయ్యే చిన్న చిన్న పదాలతో ఒక మంచి పాట రాయమని ఆయన చెప్పడం, దానికి ఇళయారాజా అద్భుతమైన ట్యూన్‌ ఇవ్వడంతో మొదటిసారి ఒక కమర్షియల్‌ సినిమాకు పాట రాశారు. అందరూ ఎంతో ఈజీగా పాడుకునే పాట ఆయన కలం నుంచి జాలువారింది. అదే.. ‘బలపం పట్టి భామ బళ్ళో అఆ ఇఈ నేర్చుకుంటా..’ పాట. 1990 సెప్టెంబర్‌ 24న విడుదలైన ‘బొబ్బిలిరాజా’ సూపర్‌హిట్‌ కావడం, సిరివెన్నెల రాసిన ఆ పాటకు జనం బ్రహ్మరథం పట్టడంతో సిరివెన్నెల సినీ జీవితం ఒక్కసారిగా మలుపు తిరిగింది. అక్కడి నుంచి సిరివెన్నెల పాటల ప్రభంజనం మొదలైంది. దాదాపు 35 సంవత్సరాలపాటు ఆయన పాటల ప్రయాణం నిర్విరామంగా కొనసాగింది. ఈ మూడు దశాబ్దాలలో సిరివెన్నెల చేసిన ప్రయోగాలు అసామాన్యమైనవి. ఇదీ అదీ అని కాకుండా అన్ని తరహా పాటలు రాసి అందర్నీ మెప్పించారు. నమ్మకు నమ్మకు ఈ రేయినీ.., లలిత ప్రియ కమలం విరిసినదీ.., ఆకాశంలో ఆశల హరివిల్లూ.., తెలవారదేమో స్వామి.., చక్రవర్తికి వీధి బిచ్చగత్తెకీ.., చిలకా ఏ తోడు లేక ఎటేప్పమ్మ ఒంటరి నడక.., కన్నుల్లో నీ రూపమే.., కళ్ళలొకి కళ్ళు పెట్టి చూడవెందుకు.., ఆకాశం దిగి వచ్చి వెయ్యాలి మన పందిరి.., సీతమ్మ అందాలూ గోత్రాలు.. ఇలా తన కెరీర్‌లో కొన్ని వేల పాటలు రాసి ప్రేక్షకులను, శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. ప్రతి పాటలోనూ ప్రత్యేకతను చూపిస్తూనే తన కెరీర్‌లో ఏనాడూ వెకిలి పాటలు, డబుల్‌ మీనింగ్‌ పాటలు రాయకుండా నిబద్ధతతో ఉన్న సిరివెన్నెల సీతారామశాస్త్రి ఎంతో మంది యువ రచయితలకు ఆదర్శంగా నిలిచారు.

 

(మే 20 సిరివెన్నెల సీతారామశాస్త్రి జయంతి సందర్భంగా..)

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.