ENGLISH | TELUGU  

తాతకు తగ్గ మనవడు.. కొన్ని తరాలు గుర్తుంచుకునే నటుడు!

on May 20, 2025

 

ప్రేక్షకులు జూనియర్‌ ఎన్టీఆర్‌ అంటారు. అభిమానులు యంగ్‌ టైగర్‌ అని ముద్దుగా పిలుచుకుంటారు. సన్నిహితులు తారక్‌ అంటారు. నందమూరి తారక రామారావు నట వారసుడిగా నందమూరి బాలకృష్ణ టాలీవుడ్‌లో తన నట విశ్వరూపాన్ని చూపిస్తున్న విషయం తెలిసిందే. ఆ తర్వాతి తరంలో నందమూరి వంశం నుంచి ఎందరో హీరోలు వచ్చినప్పటికీ యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఒక్కరే మాస్‌ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ టాలీవుడ్‌లో స్టార్‌ హీరో రేంజ్‌కి వెళ్లిపోయారు. చిన్నతనంలోనే శాస్త్రీయ నృత్యం నేర్చుకోవడం వల్ల డాన్సుల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను క్రియేట్‌ చేసుకున్నారు ఎన్టీఆర్‌. ఎన్‌.టి.రామారావు స్వయంగా తారక్‌ పేరును నందమూరి తారక రామారావుగా మార్చారు. ఆయన పేరును నిలబెడుతూ తాతకు తగ్గ మనవడు అనిపించుకుంటున్నారు ఎన్టీఆర్‌. తండ్రి హరికృష్ణ పౌరుషాన్ని నింపుకొని అభిమానుల మదిలో యంగ్‌ టైగర్‌గా నిలిచారు. ఇప్పుడు టాలీవుడ్‌లో ఉన్న హీరోల్లో ఎన్టీఆర్‌కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. 8 ఏళ్ల వయసులోనే తాతగారి దర్శకత్వంలో వచ్చిన ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ చిత్రంలో బాల భరతుడిగా నటించారు. ఆ తర్వాత ‘రామాయణం’లో రాముడిగా అందర్నీ అలరించారు. పురాణ పాత్రలు పోషించాలంటే అది నందమూరి వంశానికే సాధ్యం అనే విషయం అందరికీ తెలిసిందే. దాన్ని యంగ్‌ టైగర్‌ మరోసారి ప్రూవ్‌ చేశారు. 1991లో తన కెరీర్‌ ప్రారంభించిన ఎన్టీఆర్‌.. నటుడిగా దాదాపు 35 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఆయన సినీ ప్రయాణం ఎలా ప్రారంభమైంది, బాల నటుడి నుంచి స్టార్‌ హీరోగా ఎలా ఎదిగారు వంటి విశేషాలు తెలుసుకుందాం.

 

1983 మే 20న హైదరాబాద్‌లో నందమూరి హరికృష్ణ, షాలిని దంపతులకు జన్మించారు తారక్‌. ఎనిమిదేళ్ళ వయసులో తారక్‌ని ఎన్‌.టి.రామారావు దగ్గరికి తీసుకెళ్లారు హరికృష్ణ. తన పోలికలతోనే ఉన్న తారక్‌ని చూసి అతనికి నందమూరి తారకరామారావుగా నామకరణం చేశారు. అదే సమయంలో తను డైరెక్ట్‌ చేస్తున్న ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ చిత్రంతో తెరంగేట్రం చేయించారు. బ్రహ్మర్షి విశ్వామిత్ర, రామాయణం చిత్రాల తర్వాత నిన్ను చూడాలని చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా ఆశించిన విజయం సాధించకపోయినా నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో చేసిన ‘స్టూడెంట్‌ నెం.1’ చిత్రంతో ఘనవిజయాన్ని అందుకున్నారు. ఈ సినిమాలోని ‘కూచిపూడికైనా.. కుంగ్‌ఫూలకైనా.. క్యాట్‌ వాక్‌కైనా.. దేనికైనా రెడీ..’ పాటతో భవిష్యత్తులో తను ఎలాంటి హీరో అవ్వబోతున్నాడు అనేది స్పష్టం చేశారు ఎన్టీఆర్‌. 2002లో వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో వచ్చిన ‘ఆది’ చిత్రంతో తిరుగులేని విజయాన్ని అందుకొని మాస్‌ యాక్షన్‌ హీరోగా స్థిరపడిపోయారు. 

 

 

‘ఆది’ తర్వాత ఎన్టీఆర్‌ చేసిన ‘అల్లరి రాముడు’, ‘నాగ’ చిత్రాలు నిరాశపరిచినా రాజమౌళి కాంబినేషన్‌లో చేసిన రెండో సినిమా ‘సింహాద్రి’ బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని అందుకొని కలెక్షన్లలో చరిత్ర సృష్టించింది. ఈ చిత్రం తర్వాత రిలీజ్‌ అయిన 5 సినిమాలు హిట్‌, ఏవరేజ్‌, బిలో ఏవరేజ్‌ అనిపించుకున్నప్పటికీ ఎన్టీఆర్‌ క్రేజ్‌ ఏ మాత్రం తగ్గలేదు. ఆ తర్వాత వచ్చిన ‘రాఖి’ ఎన్టీఆర్‌ కెరీర్‌లో ఓ ప్రత్యేకమైన సినిమాగా చెప్పొచ్చు. ఈ సినిమాలోని తన నటనతో అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకొని పరిపూర్ణ నటుడు అనిపించుకున్నారు. ఈ సినిమా వరకు బొద్దుగా కనిపించిన ఎన్టీఆర్‌ ఆ తర్వాత రాజమౌళి కాంబినేషన్‌లో చేయబోయే ‘యమదొంగ’ చిత్రం కోసం తన ఫిజిక్‌ని పూర్తిగా మార్చుకొని కొత్త లుక్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో యాక్షన్‌, డాన్స్‌, కామెడీ, సెంటిమెంట్‌.. ఇలా అన్ని అంశాల్లోనూ మంచి మార్కులు సంపాదించుకున్నారు ఎన్టీఆర్‌. ఈ సినిమా అతని కెరీర్‌లో మరో హిట్‌ సినిమాగా నిలిచింది. ఈ సినిమా తర్వాత చేసిన ‘కంత్రి’ నిరాశపరిచినప్పటికీ ఆ వెంటనే వినాయక్‌ కాంబినేషన్‌లో చేసిన ‘అదుర్స్‌’తో మరోసారి తన నటవిశ్వరూపాన్ని చూపించారు ఎన్టీఆర్‌. ఈ సినిమాలో అతను చేసిన పంతులు వేషం అందర్నీ ఆకట్టుకొని నవ్వులు పూయించింది. ఆ తర్వాత చేసిన ‘బృందావనం’ కూడా హిట్‌ చిత్రంగా నిలిచింది. ఈ సినిమా తర్వాత చేసిన సినిమాలు నిరాశపరిచినా ‘బాద్‌షా’తో మరో హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నారు ఎన్టీఆర్‌. ఒక హిట్‌ తర్వాత రెండు మూడు నిరాశపరిచే సినిమాలు రావడం అనేది హీరోల కెరీర్‌లో సర్వసాధారణమే. అలాగే బాద్‌షా తర్వాత వచ్చిన రెండు సినిమాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయాయి. ఆ సమయంలో పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో చేసిన ‘టెంపర్‌’ చిత్రం ఎన్టీఆర్‌ కెరీర్‌లో చెప్పుకోదగ్గ సినిమాగా నిలిచింది. ఈ సినిమాలోని ఎన్టీఆర్‌ పెర్‌ఫార్మెన్స్‌కి అందరూ ముగ్ధులైపోయారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లోని కోర్టు సీన్‌లో చెప్పే డైలాగ్స్‌కి ఆడియన్స్‌ మెస్మరైజ్‌ అయిపోయి క్లాప్స్‌, విజిల్స్‌తో ఎన్టీఆర్‌ను అభినందించారు. 

 

 

‘టెంపర్‌’ తర్వాత ‘నాన్నకు ప్రేమతో’, ‘జనతా గ్యారేజ్‌’, ‘జై లవకుశ’, ‘అరవింద సమేత’ చిత్రాలు కథ, కథనాల విషయంలో దేనికదే ప్రత్యేకం అనే విధంగా ఉంటాయి. ఈ సినిమాలతో నటుడిగా మరో మెట్టు ఎక్కారు ఎన్టీఆర్‌. ఇక రాజమౌళి కాంబినేషన్‌లో చేసిన నాలుగో సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఎన్టీఆర్‌ కెరీర్‌లోనే ప్రతిష్ఠాత్మక సినిమాగా చెప్పొచ్చు. మల్టీస్టారర్స్‌ ఎక్కువగా రాని ఈరోజుల్లో టాలీవుడ్‌లోని ఇద్దరు టాప్‌ స్టార్స్‌ కలిసి నటిస్తున్న సినిమా అంటే సహజంగానే మంచి క్రేజ్‌ ఏర్పడుతుంది. ఈ సినిమా కూడా అలాంటి క్రేజ్‌నే సొంతం చేసుకుంది. అందులోనూ బాహుబలి వంటి బ్లాక్‌బస్టర్‌ సిరీస్‌ చేసిన రాజమౌళి సినిమా అంటే ఆ క్రేజ్‌ ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతమైన ఎక్స్‌పెక్టేషన్స్‌ ఏర్పడ్డాయి. దానికి తగ్గట్టుగానే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలోని ఎన్టీఆర్‌ డాన్స్‌కి, పెర్‌ఫార్మెన్స్‌కి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అంతేకాదు, రామ్‌చరణ్‌తో కలిసి చేసిన ‘నాటు నాటు..’ పాటకు ఆస్కార్‌ అవార్డు దక్కడం మరో విశేషం. 

 

రెండు సంవత్సరాల తర్వాత కొరటాల శివ కాంబినేషన్‌లో చేసిన పూర్తి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘దేవర’తో మరో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ని అందుకున్నారు ఎన్టీఆర్‌. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘దేవర2’ కూడా రాబోతోంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న ఎన్టీఆర్‌ ‘వార్‌2’ చిత్రంతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. హృతిక్‌రోషన్‌తో కలిసి చేస్తున్న ఈ సినిమా పూర్తి యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఉండబోతోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో హై ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉన్నాయి. ఈ సినిమాతో డెఫినెట్‌గా బాలీవుడ్‌లో కూడా ఎన్టీఆర్‌ క్రేజ్‌ పెరుగుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఆగస్ట్‌ 14న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. మరో పక్క ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో చేస్తున్న ‘డ్రాగన్‌’ చిత్రం రెండు షెడ్యూల్స్‌ పూర్తి చేసుకుంది. ఇవి కాక భారతీయ సినిమా పితామహుడు దాదా సాహెబ్‌ ఫాల్కే బయోపిక్‌గా రూపొందనున్న ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’ చిత్రంలో ఎన్టీఆర్‌ నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. రాజమౌళి సమర్పణలో వరుణ్‌ గుప్తా, ఎస్‌.ఎస్‌.కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి బాలీవుడ్‌ డైరెక్టర్‌ నితిన్‌ కక్కర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ నటించే విషయం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

 

(మే 20 యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా..)

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.