కుర్రకారును ఉర్రూతలూగించిన జ్యోతిలక్ష్మీ చివరి రోజులు ఎలా గడిచాయి?
on Nov 2, 2025

ఒకప్పుడు నాట్య తారలకు మన సినిమాల్లో చాలా ఇంపార్టెన్స్ ఉండేది. జ్యోతిలక్ష్మీ, జయమాలిని, సిల్క్ స్మిత, అనూరాధ వంటి నాట్యతారలు కొన్ని దశాబ్దాలపాటు తమ డాన్సులతో కుర్రకారును ఉర్రూతలూగించారు. వీరిలో జ్యోతిలక్ష్మీ అందరి కంటే సీనియర్. వెయ్యికిపైగా సినిమాల్లో ప్రత్యేక గీతాల్లో నటించారు. అలాగే 300 సినిమాల్లో పలు పాత్రలు పోషించారు. ఆ తర్వాత జ్యోతిలక్ష్మీ చెల్లెలు జయమాలిని రంగ ప్రవేశం చేసి ఆమె కూడా డాన్సర్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. (Jyothi Lakshmi)
1948 నవంబర్ 2న తమిళ అయ్యంగార్ల కుటుంబంలో జన్మించారు జ్యోతిలక్ష్మీ. తండ్రిపేరు టి.కె.రాజరామన్, తల్లి శాంతవి. వీరికి ఎనిమిది మంది సంతానం. ఐదుగురు ఆడపిల్లలు, ముగ్గురు మగపిల్లలు. వారిలో జ్యోతిక్ష్మీ అందరికంటే పెద్దది కాగా, జయమాలిని అందరికంటే చిన్నది. రాజరామన్ సోదరి అయిన ఎస్.పి.ఎల్.ధనలక్ష్మీ తమిళ్‌లో ప్రముఖ నటి. ఆమెకు పిల్లలు లేని కారణంగా జ్యోతిలక్ష్మీని దత్తత తీసుకున్నారు. అలా చిన్నతనం నుంచీ ధనలక్ష్మీ దగ్గరే పెరిగారు జ్యోతిలక్ష్మీ.

జ్యోతిలక్ష్మీ ఐదేళ్ళ వయసులో ఉన్నప్పుడు దర్శక నిర్మాత టి.ఆర్.రామన్.. ఎం.జీ.ఆర్ నటించిన ఓ సినిమాలో ఆమెచే నాట్యం చేయించారు. ఎనిమిదేళ్ళ వయసులో శివాజీ గణేశన్ చిత్రం 'కార్తవరాయన్ కథ'లో డ్యాన్స్ చేశారు జ్యోతిలక్ష్మీ. ఆ తరువాత పెద్దయ్యాక 1963లో విడుదలైన ఎం.జీ.ఆర్ చిత్రం 'పెరియ ఇడత్తు పెణ్'తో సినీ రంగంలోకి ప్రవేశించారు. ఈ చిత్రంలో నగేష్ సరసన వల్లి అనే హాస్యపాత్రలో నటించారు. జ్యోతిలక్ష్మీ చిన్నతనంలో రామయ్య పిళ్ళై వద్ద భరతనాట్యం నేర్చుకున్నారు. ఈ నాట్యశిక్షణ సినిమాలలో నాట్యాలు చేయటానికి సహకరించింది.
తెలుగులో జ్యోతిలక్ష్మీ తొలి చిత్రం 1967లో విడుదలైన 'పెద్దక్కయ్య'. 1973లో శోభన్ బాబు హీరోగా వచ్చిన 'ఇదాలోకం' సినిమాలో 'గుడి ఎనక నా సామి గుర్రమెక్కి కూకున్నాడు' అన్న పాటతో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన జ్యోతిలక్ష్మీ.. తిరిగి అదే పాటకు 'కుబేరులు' సినిమాలో నర్తించారు.
ఇండస్ట్రీలో ఓ నయా ట్రెండ్ కు తెరలేపారు జ్యోతిలక్ష్మీ. 80, 90 లలో తన డ్యాన్సులతో కుర్రకారు మతిపోగొట్టారు. ఎంత పెద్ద హీరో సినిమా అయినా అందులో జ్యోతిలక్ష్మీ ఐటమ్ సాంగ్ ఉందంటే జనం క్యూ కట్టేవారు. జ్యోతిలక్ష్మీ డ్యాన్స్ చూసేందుకే సినిమాలకు వచ్చేవారు. ఆమె పాట అయిపోగానే థియేటర్ నుండి బయటకు వెళ్ళిపోయేవారు. అంటే కేవలం జ్యోతిలక్ష్మీ పాట ఉండటం వల్లే.. ఆ సినిమాలకు టికెట్లు తెగేవి అన్నమాట. అందుకే నిర్మాతలు తమ సినిమాలో జ్యోతిలక్ష్మీ సాంగ్ ఉండేలా చూసుకునేవారు. డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఆమె నర్తించిన సినిమాలు కొనడానికి ఆసక్తి చూపేవారు.

సినీ జీవితంలో ఓ వెలుగు వెలిగిన జ్యోతిలక్ష్మీ.. నిజ జీవితంలో మాత్రం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జ్యోతిలక్ష్మీ వివాహం వాసుదేవన్ అనే వ్యక్తితో జరిగింది. ఆయనకు అంతకుముందే పెళ్ళయింది. మొదటి భార్య నుంచి విడాకులు తీసుకోకపోవడం వల్ల వీరి పెళ్ళిని రహస్యంగా ఉంచి సహజీవనం సాగించారు. ఎనిమిదేళ్ళు ఇద్దరూ కాపురం చేశారు. వారికి మీనాక్షి అనే పాప పుట్టింది. అయితే ఈ ఎనిమిదేళ్ళ కాలంలో జ్యోతిలక్ష్మీని ఎంతో టార్చర్ పెట్టేవాడు వాసుదేవన్. తన నిర్మాతలతో అతను ప్రవర్తించే తీరు వల్ల సినిమా అవకాశాలు కూడా బాగా తగ్గాయి.
1980లో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘సరదారాముడు’ చిత్రం షూటింగ్‌లో జ్యోతిలక్ష్మీ పాల్గొనాల్సి ఉండగా, సడన్‌గా ఆమె మాయమైంది. ఎక్కడికి వెళ్లిందో ఎవరికీ తెలియలేదు. దాంతో నిర్మాతలు చాలా ఇబ్బంది పడ్డారు. చివరి క్షణంలో విజయలలితను తీసుకున్నారు. వాసుదేవన్ భార్య నుంచి తప్పించుకునేందుకే జ్యోతిలక్ష్మీ బొంబాయి వెళ్లిపోయి కొన్ని రోజుల తర్వాత తిరిగొచ్చారు. వాసుదేవన్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించి సినిమాటోగ్రాఫర్ సాయిప్రసాద్‌ను వివాహం చేసుకున్నారు జ్యోతిలక్ష్మీ. ఆమె కూతురు మీనాక్షి పేరును జ్యోతిమీనా అని మార్చారు. ఆమె కూడా కొన్ని సినిమాల్లో నటించారు. కానీ, తల్లికి వచ్చినంత పేరు ఆమెకు రాలేదు. ఆ తర్వాత సినిమాలకు స్వస్తి పలికి వివాహం చేసుకొని చెన్నయ్‌లో స్థిరపడ్డారు జ్యోతి మీనా.
జ్యోతిలక్ష్మీ డబ్బు విషయంలో జాగ్రత్త లేకపోవడం వల్ల ఆర్థికంగా ఎంతో నష్టపోయారు. ఆ సమయంలో జయమాలిని బిజీ నృత్యతారగా వెలుగొందుతోన్నారు. ఒకప్పుడు జ్యోతిలక్ష్మీ అనుభవించిన స్థానాన్ని జయమాలిని కైవసం చేసుకున్నారు. దీనికి తోడు జ్యోతిలక్ష్మీ బ్లడ్ క్యాన్సర్ బారిన పడ్డారు. ఆర్థికంగా నష్టపోయి, అనారోగ్యంపాలై చివరి రోజుల్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న జ్యోతిలక్ష్మీ.. చివరికి 2016 ఆగస్ట్ 9న తుదిశ్వాస విడిచారు.
(నవంబర్ 2 జ్యోతిలక్ష్మీ జయంతి సందర్భంగా)
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



