73 ఏళ్ళ క్రితం సంచలన విజయం సాధించిన ‘దాసి’ చిత్రంలోని విశేషాలివే!
on Nov 3, 2025
చిత్ర పరిశ్రమలో నటీనటులైనా, సాంకేతిక నిపుణులైనా సాధించిన విజయాల వల్ల కొందరి పేర్లు మారు మోగిపోతూ ఉంటాయి. అయితే కొందరు చిత్ర పరిశ్రమ అభివృధ్దికి ఎంతో కష్టపడినప్పటికీ వారు పేర్లు మరుగున పడిపోతూ ఉంటాయి. వారి గురించి ఎవరూ మాట్లాడరు, వారి పేరు చర్చకు రాదు. అలాంటి ఓ దర్శకనిర్మాత సి.వి.రంగనాథదాస్. తను చేసిన సినిమాల వల్ల ఆయన ఎక్కువగా లాభపడకపోయినా ఎంతోమందికి లాభం చేకూరింది. 1950 దశకంలో ఎన్నో అద్భుతమైన సినిమాలకు ఆయన రూపకల్పన చేశారు. ఆ సినిమాల ద్వారా ఎంతో మంది నటీనటులు, దర్శకనిర్మాతలు విజయాలు సాధించారు. అలాంటి రంగనాథదాస్ మొదట ‘దాసి’ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేశారు. తనే దర్శకత్వం వహిస్తూ ఆ చిత్రాన్ని ప్రారంభించారు. కానీ, కొంత షూటింగ్ పార్ట్ పూర్తయిన తర్వాత ఆర్థిక కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. దాంతో దాన్ని పక్కన పెట్టేసి ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వంలో ఎన్టీఆర్, ఎఎన్నార్‌లతో సంసారం చిత్రాన్ని నిర్మించారు. మొదట ఈ సినిమాలో సావిత్రిని కథానాయికగా తీసుకొచ్చారు రంగనాథదాస్. కానీ, ఎల్.వి.ప్రసాద్‌కి ఆమె నచ్చలేదు. లక్ష్మీరాజ్యంను కథానాయికగా ఎంపిక చేశారు. ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇదే చిత్రాన్ని తమిళ్‌లో సంసారం పేరుతోనే జెమిని వాసన్ రీమేక్ చేశారు. అక్కడ కూడా పెద్ద హిట్ అవ్వడంతో అప్పటివరకు అప్పుల్లో వాసన్ ఈ సినిమాతో గట్టెక్కారు.
ఆ సమయంలో తను మొదట దర్శకత్వం వహిస్తూ నిర్మించాలనుకున్న ‘దాసి’ చిత్రాన్ని మళ్ళీ ప్రారంభించారు రంగనాథదాస్. అయితే అంతకుముందు తీసిన సినిమాని పక్కన పెట్టి మళ్ళీ కొత్తగా ప్రారంభించారు. ఈ చిత్రానికి నిర్మాతగా నటి లక్ష్మీరాజ్యం వ్యవహరించారు. ఎల్.వి.ప్రసాద్ పర్యవేక్షణలో రంగనాథదాస్ ఈ చిత్రాన్ని రూపొందించారు. 1952 నవంబర్ 26న విడుదలైన ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయి సంచలనం సృష్టించింది. ఈ సినిమా మంచి లాభాలు తెచ్చిపెట్టడంతో లక్ష్మీరాజ్యం, ఆమె భర్త శ్రీధరరావు వెలైకరి మగళ్ పేరుతో తమిళ్‌లో నిర్మించారు. అయితే అక్కడ ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. 1950వ దశకంలోనే సంచలన విజయం సాధించిన ‘దాసి’ చిత్ర కథ ఏమిటి, ఈ సినిమా అంతటి ఘనవిజయం అందుకోవడం వెనుక కారణాలు ఏమిటి అనేది పరిశీలిద్దాం.
రామయ్య(ఎన్టీఆర్) జట్కా తోలుతుంటాడు. భార్య లక్ష్మీ(లక్ష్మీరాజ్యం) బద్రినాథ్(ఎస్వీఆర్) అనే సంపన్నుడి ఇంట్లో పాచిపని చేస్తుంటుంది. వారికి సుబ్బడు(చలం) అనే కొడుకు ఉంటాడు. బద్రినాథ్, పార్వతమ్మ(శాంతకుమారి) దంపతులకు నడి వయసు వచ్చినా సంతానం ఉండదు. సంతానం కోసం మరో పెళ్లి చేసుకోమని బంధువులు ప్రోత్సహిస్తారు. పార్వతమ్మ అన్న రామారావు (శ్రీవత్స) చెల్లెల్ని చూడటానికి వచ్చి జరిగిన కథ అంతా విని, బద్రీనాథ్ బంధువులు ఆయన ఆస్తి కోసం ఈ పన్నాగం పన్నారని తెలుసుకొని ఎత్తుకు పై ఎత్తు వేస్తాడు.
పార్వతమ్మ దాసి లక్ష్మి గర్భవతిగా ఉంటుంది. పార్వతమ్మ అన్న రామారావు పార్వతమ్మను, తను గర్భవతిగా ఉన్నట్లు నటించి దాసి లక్ష్మికి పుట్టబోయే బిడ్డను రహస్యంగా పెంచుకోమని సలహా ఇస్తాడు. కానీ సమయం వచ్చేవరకు ఈ సంగతి లక్ష్మికి తెలియనీయవద్దని చెబుతాడు. పార్వతికి మరోదారి లేక దానికి అంగీకరిస్తుంది. పెద్ద దాసి నర్సమ్మకు ఈ విషయమంతా చెప్పి తగినట్లు ప్రవర్తించమంటారు. రామారావు, తరళ అనే లేడీడాక్టరుకు లంచమిచ్చి పార్వతి గర్భవతిగా ఉన్నదని బద్రీనాథ్కు చెప్పిస్తాడు. దానితో బద్రీనాథ్ రెండో పెళ్ళి ప్రయత్నం మానుకొంటాడు.
లక్ష్మికి కలగబోయే బిడ్డనే తాను పెంచుకోదలచినందువల్ల పార్వతి లక్ష్మికి ప్రతిరోజూ పాలు, ఫలహారాలు ఇచ్చి ఎంతో ఆదరంగా చూస్తూ ఉంటుంది. పార్వతి లక్ష్మిపై చూపిస్తున్న ఆదరాభిమానాలను చూసి లక్ష్మి భర్త రామయ్య భార్యను అనుమానిస్తాడు.
లక్ష్మికి నవమాసాలు నిండుతాయి. ఒకనాడు పార్వతమ్మ పెద్దదాసి నర్సమ్మ, రామారావు లక్ష్మి ఇంటికి వచ్చి లక్ష్మితో తామొక రహస్యం చెబుతామని, ఆ రహస్యం తన భర్తకు కూడా చెప్పకూడదని,ఒక్కగానొక్క కొడుకు మీద ఒట్టువేసుకొమ్మని అడుగుతారు. లక్ష్మి ఒట్టువేసుకొంటుంది. పార్వతి గర్భవతి కాదని, లక్ష్మికి పుట్టబోయే బిడ్డను పార్వతికిచ్చి పార్వతి మానప్రాణాలను కాపాడమని రామారావు లక్ష్మి చేతులు పట్టుకొని బ్రతిమాలతాడు. అదే సమయానికి వచ్చిన రామయ్య తన భార్య చేతులు రామారావు పట్టుకొని ఉండడాన్ని చూస్తాడు. రామారావు ఎందుకు వచ్చాడో చెప్పమని భార్యను అడుగుతాడు. కొడుకు మీద ఒట్టు వేసినందున లక్ష్మి భర్తకు నిజం చెప్పలేకపోతుంది. రామయ్య లక్ష్మిని ఇంట్లో నుండి వెళ్లగొడతాడు. లక్ష్మి ఏడుస్తూ పోయి పార్వతమ్మ కాళ్లమీదపడుతుంది. తన భర్తకు నిజం చెప్పి తన కాపురం నిలబెట్టమని ప్రార్థిస్తుంది. ఆ సమయంలో నిజం చెబితా రామయ్య ఉద్రేకంలో ప్రపంచమంతా చాటుతాడని తర్వాత నెమ్మదిగా రామయ్యకు నిజం చెప్తానని పార్వతమ్మ లక్ష్మిని సముదాయించి తన బంగళాలోనే ఉంచుతుంది.
లక్ష్మికి పురిటి సమయం వస్తుంది. లేడీడాక్టరు తరళను పిలవడానికి పార్వతమ్మ అన్న రామారావు వెళతాడు. ఆ సమయంలో బద్రీనాథ్ మేనల్లుడు నారాయణరావు తరళ ఇంట్లో ఉంటాడు. నారాయణరావును ఆరాత్రి పార్వతమ్మ బంగళాకు రానీయకుండా చేయమని రామారావు తరళని బ్రతిమాలుతాడు. తరళ నారాయణరావును ఇంట్లో ఉంచి తాళం వేసి రామారావుతో పార్వ్తతమ్మ బంగళాకు వస్తుంది.
పార్వతమ్మ పెద్దదాసి నిజంగా నొప్పులు పడుతున్న లక్ష్మిని నోరెత్తి అరవనీయదు. నొప్పులు లేని పార్వతమ్మను బిగ్గరగా అరవమంటుంది. లక్ష్మికి ఆడపిల్ల కలుగుతుంది. ఆ పిల్లను తెచ్చి పార్వతమ్మ ప్రక్కలో పడుకోబెట్టి బద్రీనాథ్కు కూతురు పుట్టిందని చెబుతారు. అతడు సంతోషంతా ఉప్పొంగిపోతాడు. బిడ్డకు కమల అనే పేరు పెడతాడు.
పార్వతమ్మ ప్రక్కనున్న పిల్ల ఏడుస్తున్నా గమనించదు. బిడ్డ ఏడ్చినప్పుడెల్లా లక్ష్మి వచ్చి బిడ్డను తీసికొంటుంది. లక్ష్మి మాతృప్రేమ వల్ల ఎక్కడ అసలు రహస్యం బయట పడుతుందోనని పార్వతమ్మ తన ఒంట్లో బాగాలేదని, చికిత్స కోసం మద్రాసు వెళ్తానని భర్తతో చెప్పి లక్ష్మికి తెలియకుండా ఒకరాత్రి మద్రాసుకు వెళ్లిపోతుంది. తెల్లవారగానే లక్ష్మి పార్వతమ్మ ఇంటికి వచ్చి కమల కనబడకపోవడంతో కంగారుపడుతుంది. పెద్దదాసి నర్సమ్మ లక్ష్మిని తిట్టి ఇంటినుండి వెళ్ళగొడుతుంది.
లక్ష్మి ఏడుస్తూ భర్తదగ్గరకు వస్తుంది. భర్త రామయ్య ఆ సమయంలో దుర్గి (కనకం) అనే ఆమెను పెళ్ళి చేసుకోవడం చూస్తుంది. భర్త కాళ్లమీదపడి రక్షించమని బ్రతిమాలుతుంది. రామయ్య లక్ష్మి జుట్టు పట్టుకొని యీడ్చి యింటి నుండి వెళ్లగొడతాడు. ఇక తనకు చావే శరణ్యమనుకొని లక్ష్మి అక్కడి నుండి వెళ్లిపోతుంది.
సవతి కొడుకు సుబ్బడిని చూస్తే గిట్టని దుర్గ వాడిని నీళ్లలో తోసి వాడే నీళ్లలో పడ్డాడని గోలపెడుతుంది. రామయ్య కొడుకు కోసం ఏటిలో దూకి వెదుకుతాడు కానీ కొడుకు దొరకలేదు. అదే సమయంలో జీవితం మీద విరక్తి చెంది లక్ష్మి ఇంకో ఒడ్డు నుండి ఏటిలో దూకుతుంది. ఆమెకు ప్రవాహంలో కొట్టుకొస్తూ కొన వూపిరిలో ఉన్న కొడుకు సుబ్బడు కనిపిస్తాడు. ఆమె వాడిని కాపాడి ఒడ్డుకు వచ్చి డాక్టరు దయాకర్ (డాక్టర్ దామోదరం) వద్దకు తీసుకువస్తుంది. దయాకర్ సుబ్బడిని బ్రతికిస్తాడు. లక్ష్మి దయాకర్ ఇంట్లో దాసిగా పనిచేస్తుంది. సుబ్బడు దయాకర్ పిల్లల్తో కలిసి చదువుకుంటాడు.
రామయ్య రెండోభార్య దుర్గకి నాటకాలు, సినిమాలు అంటే పిచ్చి. భర్తకు తెలియకుండా ఒక నటుడితో స్నేహంచేసి ఇంట్లోనుండి లేచిపోతుంది. మద్రాసులో పార్వతమ్మ కూతురు ఏడేండ్ల బిడ్డ అవుతుంది. ఇంటివద్ద బద్రీనాథ్ చనిపోతాడు. కమల (వసంత) దాసి లక్ష్మి కూతురు అని తెలిసి బద్రీనాథ్ బంధువులు ఆస్తికోసం దావా వేస్తారు. దేశం అంతా ఈ విషయం తెలిసిపోతుంది. లక్ష్మి నిర్దోషి అని రామయ్య తెలుసుకుంటాడు. తాను చేసిన పనికి పశ్చాత్తాపపడి సన్యాసులలో కలిసిపోతాడు. డాక్టర్ దయాకర్ బద్రీనాథ్ ఆస్తి గురించిన దావావిషయాలు పేపర్లో చదివి భార్యతో చెప్తుంటే లక్ష్మి విని మద్రాసుకు బయలుదేరుతుంది. కోర్టులో కమల పార్వతమ్మ కూతురే కాని నా కూతురు కాదని లక్ష్మి సాక్ష్యం ఇస్తుంది. దానికి ఆధారంగా డాక్టర్ తరళ ఇచ్చిన కాగితాలను చూపుతుంది. దానితో కోర్టు కేసును కొట్టివేస్తుంది. తన ఆస్తిని కాపాడినందుకు పార్వతమ్మ లక్ష్మిని కౌగిలించుకొని తప్పును క్షమించమని కోరుతుంది. పార్వతమ్మ లక్ష్మిని మద్రాసులోనే వుండమని బ్రతిమాలుతుంది. లక్ష్మి అంగీకరిస్తుంది. దయాకర్తో చెప్పి లక్ష్మి మద్రాసు చేరుతుంది. సుబ్బడు దయాకర్ పిల్లలతోనే చదువుకుంటూ ఉంటాడు.
పది సంవత్సరాలు గడిచాయి. సుబ్బడు సుబ్బారావుగా మారి ప్లీడరు పాసై మద్రాసులో ప్రాక్టీసు పెడతాడు. కమల యుక్తవయస్కురాలు అవుతుంది. కాని లక్ష్మిని దాసిగానే భావిస్తుంటుంది. కమల రామారావు కొడుకు ప్రేమనాథ్ను (జనార్ధనం) ప్రేమిస్తుంది. రామారావు భార్య దేవకి దాసిపిల్ల అయిన కమలను తన కొడుకుకు చేసుకోవడానికి ఇష్టపడదు.
భిక్షాటన చేస్తూ సన్యాసి వేషంలో ఉన్న రామయ్య తన రెండవ భార్య దుర్గిని చూసి అసహ్యించుకొంటాడు. రాత్రి ఆమెను హతమార్చాలని అనుకొంటాడు. కానీ ఈ లోపుగానే దుర్గి ప్రియుడే ఆమెను హత్యచేసి పారిపోతాడు. రామయ్య మీదకు ఆ కేసు వస్తుంది. రామయ్యను సుబ్బారావు కేసునుండి తప్పిస్తాడా? లక్ష్మి తన కన్నతల్లి అని కమల తెలుసుకొంటుందా? రామారావు భార్య తన కొడుకు ప్రేమనాథ్ దాసి కూతురు కమలను వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తుందా? అనేవి మిగిలిన కథ.
చిట్టితల్లి నవ్వవే చిన్నారి పాపవే కన్నతల్లి చూడవే కన్నీరు మానవే - పి.లీల
జోర్సే చేలో నా రాజ ఘోడా హవాకే ఘోడా జల్దీ చలో - పిఠాపురం నాగేశ్వరరావు
కలకలలాడే పండుగ నేడే బిరబిర రారండి మా పాపను చూడండి - జిక్కి బృందం
మారాజుల చాకిరిచేసి దొరసాని వచ్చావే ఈ పూటకు బువ్వేమైన - పిఠాపురం, పి.లీల (తెరపై ఎన్ టి ఆర్, లక్ష్మీ రాజ్యం)
టైటిల్ పాత్రను లక్ష్మీ రాజ్యం పోషించారు. పాతాళ భైరవి లో అందాల తోట రాముడిగా , ప్రజల నాయకుడిగా పల్లెటూరులో నటించిన ఎన్ టి ఆర్ , అంతగా ప్రాముఖ్యం లేని దాసి సినిమాలో నటించడం కొంత ఆశ్చర్యమే. సినిమాలో చాలా పాత్రలు కొంత సినిమా తర్వాత నడి వయసుకు చేరుకుంటాయి. ఎన్ టి ఆర్ కూడా నడి వయసులో కనిపిస్తారు. అయినా చక్కగా కనిపిస్తారు ఎన్ టి ఆర్. ప్రేమనాధ్ గా వేసిన జనార్ధనం తరవాత ఎన్ ఏ టి వారికి మేనేజర్గా పని చేసారు. ఎన్ టి ఆర్ కొడుకుగా వేసిన చలానికి ఇది మొదటి సినిమా.
ఈ సినిమా తెలుగు, తమిళాలలో పూర్తిగా గాని, పాటలు కానీ యూ ట్యూబ్ లో దొరకడం లేదు. అంత చిన్న వయసులో ఎన్ టి ఆర్ నడి వయసు పాత్ర ఎలా వేసారో చూడాలి. ముఖ పుస్తక మిత్రులెవరిదగ్గరైనా వీడియో ఉంటే కామెంట్లలో పంచుకోగలరు. ఎన్ టి ఆర్ కు పిఠాపురం పాడటం ఒక విశేషం.
ఈ చిత్రానికి నిర్మాత: సి.లక్ష్మీరాజ్యం, దర్శకుడు: సి.వి.రంగనాథదాస్, పర్యవేక్షణ: ఎల్వీ ప్రసాద్, కథ, మాటలు: వెంపటి సదాశివబ్రహ్మం, పాటలు: ఆచార్య ఆత్రేయ, ఛాయాగ్రహణం : ఎం.ఎ.రహమాన్, ఎన్.సి.బాలకృష్ణన్, మారి, శబ్దగ్రహణం: రంగస్వామి, ఎడిటర్: మాణిక్యం, కళ: టి.వి.ఎస్.శర్మ, సంగీతం: సి.ఆర్.సుబ్బురామన్, సుసర్ల దక్షిణామూర్తి, నేపథ్యగానం: పి.లీల, జిక్కి, పిఠాపురం నాగేశ్వరరావు, సంగీతం : సి.ఆర్. సుబ్బరామన్, సుసర్ల దక్షిణామూర్తి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



