యన్.టి.ఆర్.89 జయంతి
on May 28, 2012
తెలుగు వారందరికీ శ్రీ రాముడన్నా, శ్రీకృష్ణుడన్నా కళ్ళముందు కనపడే దివ్యమంగళ విగ్రహం విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, నటరత్న, పద్మశ్రీ, డాక్టర్ నందమూరి తారకరామారావు గారు. ఒక నటుడి పర్సనాలిటీ, ముఖ వర్చస్సు కొన్ని పాత్రలకే పరిమితమవుతాయి. అన్ని పాత్రలకూ అందరూ సరిపోరు. కానీ రాజు నుండి పేద వరకూ, కృష్ణుడి నుండి దుర్యోధనుడి వరకూ, రాముడి నుండి రావణాసురుడి వరకూ, రైతు బిడ్డగా, రాజుగా ఇలా ఒకటనేమిటి...అన్ని పాత్ర్రలకూ రామారావు గారి ముఖం కానీ, పర్సనాలిటీ కానీ ఆయన వాచకం కానీ చక్కగా అతికినట్టు సరిపోతాయి. అది ఒక్క యన్.టి.ఆర్.కే సాధ్యమైంది.
ఆయన తొలి చిత్రం "మనదేశం" నుండి ఒక్కో చిత్రంలో ఒక్కో పాత్రలో తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. ఆయన నటించిన పాత్రల గురించి చెప్పాలంటే ఆయన నటించిన అన్ని చిత్రాల గురించీ చెప్పాలి. అది కష్టం కనుక ఆయన నటించిన అజరామరమైన కొన్ని పాత్రల గురించి తెలియజేస్తాను. పాతాళ భైరవి, లవకుశ, మయాబజార్, కన్యాశుల్కం, మల్లీశ్వరి, జయసింహ, భూకైలాస్, సారంగధర, రాజమకుటం, భట్టి విక్రమార్క, శ్రీ వేంకటేశ్వర మహత్యం, గుండమ్మ కథ, రాముడు-భీముడు, గుడిగంటలు, ఉమ్మడి కుటుంబం, చిరంజీవులు, బడిపంతులు, సర్దార్ పాపారాయుడు, బొబ్బిలి పులి, జస్టిస్ చౌదరి, కొండవీటి సింహం, పల్లెటూరి పిల్ల, పాండురంగమహత్యం, రాజు-పేద, భీష్మ, నర్తనశాల, పాండవ వనవాసం, శ్రీ కృష్ణ పాండవీయం, శ్రీ కృష్ణార్జున యుద్ధం, దానవీరశూరకర్ణ, దీపావళి, వేటగాడు, అడవి రాముడు, చండశాసనుడు, మేజర్ చంద్రకాంత్ వంటి చిత్రాల్లో ఆయన నటన ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది.
చలన చిత్రాల్లో మహారాజుగా వెలుగుతూండగానే ఆయన రాజకీయాల్లోకి రావటం జరిగింది. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారన్న నినాదంతో, తెలుగు దేశం పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే వంద సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు తారకరామారావు గారు. ఇది మరెవరికీ సాధ్యం కాని చరిత్ర...! ఒక్క నందమూరి తారక రాముడికి మాత్రమే సాధ్యమైన చరిత్ర. అధికారంలోకి రాగానే పేదలకు కేవలం రెండు రూపాయలకే కిలో బియ్యం అందించారు. స్త్రీలకు ఆస్తిలో పురుషులతో పాటూ సమానంగా హక్కు కల్పించారు.మద్యానికి బానిసలైన పురుషుల వల్ల తెలుగింటి ఆడపడుచులు బాధ పడుతున్నారని తెలిసి, సంపూర్ణ మద్యపాన నిషేధం విధించారు. తెలుగు ప్రజలకు ఇటువంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ఆయన చిత్తశుద్ధితో అమలుపరిచారు...!
ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించినా, తన అసామాన్యమైన పట్టుదలతో, కృషితో, దీక్షతో చలనచిత్ర రంగంలో ఎదురులేని కథానాయకుడిగా, ప్రజాసంక్షేమం కోరే ఒక ముఖ్యమంత్రిగా ఆయన చేసిన సేవలు ఆచంద్రతారార్కం నిలిచే ఉంటాయి. తెలుగువారికి ఆయన గుర్తుకొచ్చినప్పుడల్లా ఛాతీ నాలుగంగుళాలు విస్తీర్ణం పెరుగుతుంది. ఆ మహామహుని, ఆ మహనీయుని 89 వ జయంతి సందర్భంగా తెలుగువన్ ఆయనకు సమర్పిస్తున్న నివాళి...!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



