ENGLISH | TELUGU  
Home  » 

తెలుగు పాటల పల్లకి శ్రీమతి యస్.జానకి

on Apr 23, 2011

ఆ నటరాజు అనుగ్రహం, అలాగే వాగ్దేవి కరుణ మనపై ఉంటేనే కానీ మనలో కాళాకారులకు కావలసిన కనీస అర్హత ఉండదు. ఆ తర్వాత ఆ కళలో మనం రాణించాలన్నా కూడా వారి అనుగ్రహం ఉండితీరాలి. లేకపోతే ఏ వ్యక్తీ కళాకారులవ్వటం అసాధ్యం. కొంతమందికి కళాకారులవ్వటంలో ఆ భగవంతుడి కరుణాకటాక్ష వీక్షణాలు పరిపూర్ణంగా వారిపై ప్రసరిస్తూ ఉంటుంది. అలాంటి వారిలో తెలుగింటి పాటల పల్లకి, తేనెలూరే గాత్ర మాధురి, ఆరు నుంచి అరవై యేళ్ళ వయసు వారి వరకూ భావాలను తన గాత్రంలో పలికించగలిగే నేర్పరి ప్రముఖ సినీ నేపథ్య గాయని శ్రీమతి యస్.జానకి.

 

1938లో ఏప్రెల్ 23 వ తేదీన, గుంటూరు జిల్లా, రేపల్లె తాలూకాలోని పల్లపట్ల గ్రామంలో జానకి జన్మించారు. పైడిస్వామి అనే నాదస్వర విద్వాంసుడి వద్ద సంగీతంలో ఓనమాలు నేర్చుకున్నారు. విధియిన్ విలయాట్టు అనే తమిళ చిత్రంలో టి.చలపతిరావు గారి సంగీత సారథ్యంలో ఎ.వి.యమ్.స్టుడియోలో ఆమె తొలి పాట పాడారు. 1956 "యమ్.యల్.ఎ." చిత్రంలో "నీ ఆశ అడియాశ" అనే పాటతో తెలుగు సినీ రంగంలోకి నేపథ్య గాయనిగా ప్రవేరశించారు యస్.జానకి. అప్పటి నుండి తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ, హిందీ, ఒరియా,సింహళి, తుళు, బెంగాలీ, సంస్కృతం, సౌరాష్ట్ర, కొంకణి, బడుగ, జపనీస్, జెర్మని వంటి మొత్తం 17 భాషల్లో శ్రీమతి యస్.జానకి గారు కొన్ని వేల పాటలు పాడారు.

ఆమె గురించి ఇళయరాజా ఒక తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో "జానకమ్మకి తేనె ఖర్చు ఎక్కువ. ఆమె దినామూ కొన్ని లీటర్ల తెనె తాగుతుంటాది. లేకపోతే ఆమె గాత్రంలో అంత మాధుర్యం ఎట్టా వచ్చునప్పా"అని ఆమె గాత్ర మాధుర్యం గురించి చమత్కరించారు. ఆమె పాడిన పాటల గురించి చెప్పాలంటే ఏకంగా ఒక గ్రంధమే వ్రాయాలి. ఒకటా....? రెండా.....? కొన్ని వేల పాటల్లో ఆమె పాడిన కొన్ని పాటల గురించే చెప్పాలంటే ఎలా....? "మురిపించే మువ్వలు" చిత్రంలో "నీలీల పాడెద దేవా" పాట వింటే అద్భుతమైన నాదస్వరం కూడా భయపడే స్థాయిలో గమకాలను పలికించగల గాత్రం జానకి గారిదేనంటే అతిశయోక్తి కాదుకదా...?.

 

"బావామరదళ్ళు" చిత్రంలో "నీలి మేఘాలలో గాలి కెరటాలలో" అనే పాట వింటే గాలిలో తేలిపోని మనసుంటుందా...? "పూజాఫలం" చిత్రంలోని "పగలే వెన్నెల జగమే ఊయల" పాట వింటూంటే పగలే వెన్నెల కనపడదా...? జగమే ఊయల కాదా....? "నర్తనశాల" చిత్రంలో "జననీ శివకామినీ" పాటలో ఆ శివకామి మనకు దర్శనమీయదా...? అదే చిత్రంలోని "ఓ నరవరా ఓ కురువరా" అనే పాట వింటే తన్మయంలో తేలని తనువుంటుందా...? "పదహారేళ్ళ వయసు" చిత్రంలో "సిరిమల్లె పూవా" పాటలోని కమ్మదనం, "పంట చేలో పాలకంకి నవ్విందీ" పాట చివర్లో ఓ డబ్భై యేళ్ళ ముసలమ్మ నవ్వినట్లు నవ్వటం జానకమ్మకు తప్ప వెరెవ్వరికి సాధ్యం. "సప్తపది" చిత్రంలోని "గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన" పాటలో పద్నాలుగేళ్ళ కుర్రాడికీ, నాలుగేళ్ళ పసిపాపడికీ కలిపి పాడిన జానకమ్మ గాత్రం శ్రోతలను ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది. అదే చిత్రంలో "నెమలికి నేర్పిన నడకలివే" పాటలో ఆమె గాత్రంలో పలికిన స్వర మాధుర్య గమకాలు మరవగలమా....?

 

జంధ్యాల గారి "శ్రీవారికి ప్రేమ లేఖ" చిత్రంలోని "తొలి సారి మిమ్మల్ని చూసింది మొదలు" పాటలో కన్నె పడుచులోని కలల కమ్మదనాన్ని ఎంత మధురంగానో పలికించారు జానకమ్మ. "రాక్షసుడు" చిత్రంలో దేవులపల్లి వారు వ్రాసిన అద్భుత దేశభక్తి గీతం "జయ జయ జయ ప్రియభారత జనయిత్రి దివ్య ధాత్రి- జయ జయ జయ శత సహస్ర నరనారీ హృదయ నేత్రి" అనే పాట వింటే మన దేశం మీద దేశభక్తి పొంగిపొర్లుతుంది. ఇక "ప్రతిఘటన" చిత్రంలో "ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో" అనే పాట గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఈ పాటలోని "మర్మం స్థానం కాదది నీ జన్మస్థానం మానవతకు మోక్షమిచ్చు పుణ్యక్షేత్రం" పదాన్ని జానకమ్మ పలికిన తీరు విన్నవారెవరైనా స్త్రీని గౌరవించకుండా ఉండగలరా.....?

 

ఇక్కడ అప్రస్తుతమైనా వేటూరి వారి కలం ఆ పాటను మనసున్న ప్రతి మనిషికీ ఆపాదమస్తకం కంపించేలా వ్రాయగా, జానకమ్మ అంత కంటే అద్భుతంగా ఆ బ్ఘావాన్ని తన గాత్రంలో పలికించారు. "సాగర సంగమం" చిత్రంలో "మౌనమేలనోయీ ఈ మరపురాని రేయి" పాటకానీ, "ఓం నమఃశివాయ చంద్ర కళాధర సహృదయా" అనే పాటలో జానకమ్మ గాత్రం మరింతగా తెలెలూరుతుంది. "ఓం నమఃశివాయ చంద్ర కళాధర సహృదయా" పాటకు ఒక ప్రత్యేకతుంది. అదేమిటంటే ఆ పాటలో నర్తించింది మరొక చక్కని ప్రముఖ సినీ నేపథ్య గాయని శ్రీమతి శైలజ. "జ్యోతి" చిత్రంలోని "సిరిమల్లెపూవల్లె నవ్వు- చిన్నారి పాపల్లె నవ్వూ" అనే పాటలో ఆమె స్వరంలో నవ్వటం అంటే ఏమిటో ఆ పాటలో పలికిస్తుంది మహా గాయని శ్రీ మతి యస్.జానకి.

 

ఇక్కడ ఇళయరాజా, యస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఇద్దరి గురించి ఒక మాట చెప్పాలి. ఇళయరాజా, యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, జానకమ్మల కాంబినేషన్ లో వచ్చిన పాటలు శ్రోతలను విపరీతంగా ఆకర్షించాయి, ఆనందడోలికల్లో తెలేలా చేశాయి. జానకమ్మ గురించి బాలు స్వయంగా ఎ.వి.యమ్.స్టుడియో తన సన్నిహితుల వద్ద అన్నమాట ఇది "జానకి గారి గురించి ఏం చెపుతామయ్యా....ఆవిడ గాత్రం స్వరం మీద నవ్వుతుంది...స్వరం మీద ఏడుస్తుంది....స్వరం మీద నాట్యం చేస్తుంది. ఆవిడ గాత్రంగురించీ, ఆ గాత్రం లోని మధురిమ గురించి పొగిడేందుకు వేయి పడగలున్నఆ ఆదిశేషుడి తరం కూడా కాదయ్యా" అని అన్నారు. ఇంతకంటే అవార్డు ఇంకేం కావాలండీ. ఇంతకంటే రివార్డులేముంటాయి. అటువంటి జానకమ్మ నాలుగుసార్లు జాతీయ ఉత్తమ గాయనిగా ఎన్నికయ్యారు. ఇక తమిళనాడు ప్రభుత్వం ఇచ్చిన "కళైమామణి" అవార్డులవంటివి అనేకం జానకమ్మను వరించి ధన్యత చెందాయి.

 

అయితే చాలా బాధాకరమైన సంగతి ఏమిటంటే ఈ రోజుల్లో అర్హతలేని చాలా మంది వెధవలకు "పద్మశ్రీ" అవార్డులనిచ్చే మన భారత ప్రభుత్వం అద్భుతమైన గాయని, భారత దేశం యావత్తూ గర్వించదగిన, విశేష ప్రతిభ కలిగిన మధుర గాయని యస్.జానకి గారికి మాత్రం "పద్మశ్రీ" బిరుదు ఇంకా ఇవ్వలేదు. ఇవ్వకపోవటమే మంచిది. అనవసరంగా ఆ బిరుదిచ్చి అడ్డమైన వెధవల సరసకు ఆమె పేరుని కూడా చేర్చి జానకమ్మను అవమానించటమే అవుతుంది. అందుకు భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు. అపురూపమైన స్వర నర్తకి జానకమ్మ జన్మదినం సందర్భంగా ఆమె కలకాలం ఇలాగే తన గాత్ర మాధుర్యాన్ని తెలుగు శ్రోతలకు అందించాలని ఆశిస్తూ తెలుగు వన్ ఆమెకివే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.