Facebook Twitter
“చరిత్రలో ప్రబంధపరమేశ్వరుడు” 11 వ భాగం

 

“చరిత్రలో ప్రబంధపరమేశ్వరుడు” 11 వ భాగం



   "తాతగారూ!"
   మరునాడు నన్నయగారి భారత రచనామృతాన్ని ఆస్వాదించడానికి తమ తమ ఆసనాలను అలంకరించాక పిలిచాడు ఎర్రన.
   "ఏమి ఎర్రనా?" ఎర్రపోతన గొంతులో ఝంకారం ఏమాత్రం తగ్గలేదు. కానీ గొంతు కొంచెంగా జీర పోయినట్లు అనిపించింది.
   "మీకు మాట్లాడుటకు ఇబ్బంది కరంగా లేదు కదా! పోనీ రేపు కూర్చుందాం." గాభరాగా అడిగాడు. దగ్గరగా పరికిస్తే మొహం కాస్త వడలినట్లు అనిపించింది. ముడుతలు బాగా కనిపిస్తున్నాయి. కన్నులలో కాంతి కూడా కాస్త తగ్గింది.
   "అబ్బెబ్బే.. మంచిపనులను వాయిదా వెయ్యకూడదు, చెడ్డపనులను వెనువెంటనే చెయ్యకూడదు.. రావణుడు అంత్యకాలంలో లక్ష్మణునకు చెప్పిన నీతి పాఠాలలో మొదటిది ఇది. ఎప్పుడేం జరుగుతుందో ఎవరు చెప్పగలరు?"
   ఎర్రన లేవబోయాడు.. వైద్యుని తీసుకుని వద్దామని..
   ఎర్రపోతన చెయ్యి అడ్డంగా పెట్టి వారించాడు.
   "కూర్చో తాతా. నాకేం అవదు. వయసు వలన వచ్చిన చికాకే కానీ మరేమీ కాదు. వైద్యుని అవసరము లేదు. ఇంతకుమునుపు ఎందుకో పిలిచావు.. సందిగ్ధం వద్దు. ఏ సందేహమైననూ వెనువెంటనే తీర్చేసుకో."
   "నాకు సందేహమే కాదు.. కుతూహలం కూడా.." ఎర్రన తటపటాయించాడు.
   ధైర్యం చెప్తున్నట్లుగా తల పైకి ఎగరేశాడు తాతగారు.. చిరునవ్వుతో.
   "నన్నయగారి తదుపరి భారతం వ్రాసిన తిక్కనగారు, అరణ్యపర్వం సగ భాగం ఎందుకు వదిలేసి ఉంటారు? అది నేను ప్రయత్నిద్దామనుకుంటున్నా.. మీ సలహా అడిగి. నాకు అది అసంపూర్ణంగా ఉండిపోవడం నచ్చలేదు."
   "నేను నీ చేత నకలు ప్రతి తయారు చేయించడంలో ముఖ్యోద్దేశం అదే కన్నా! నువ్వు అరణ్యపర్వం అర్ధబాగాన్ని వ్రాసి, భారతాన్ని సంపూర్ణం చెయ్యాలని.
   ఇంక తిక్కనగారు ఎందుకు వ్రాసి ఉండరో నాకు తోచింది చెప్తాను.. తన ధారలో, తన ధోరణిలో సాగిపోవడం సదుపాయం ఎవరికైనా. తిక్కనగారి శైలి వేరు.. నన్నయగారి పద్ధతి వేరు. పదిహేను పర్వాలూ పూర్తి అయ్యాక వ్రాయవచ్చని అనుకున్నారేమో! మరి ఏ కారణం చేతనో వదిలి వేశారు.
   అది నువ్వు పూరించాలని ఆ గీర్వాణి సంకల్పం అనుకుంటాను. నేను ఇదివరకే నీకు చెప్పినట్లు.. ఇరువురు మహా కవుల మధ్య వారధి కట్టాలి.. అది రెండు సంద్రాలని కలిపే ప్రయత్నం కన్ననూ క్లిష్టతరం."
   "అదే నేనూ అడుగుదామనుకున్నాను తాతగారూ. నన్నయగారి భారత భాగము కనుక వారి పద్ధతిలోనే.. నా స్వంత శైలి కలిపి పూర్తి చేస్తాను."
   "చిన్ననాటనే జటిల సమాస కల్పనలతో కవిత్వం చెప్పిన నీకు ఇది నల్లేరు మీద నడకే. పూర్తి చేస్తాను.. అన్నావు చూడు.. ఆ ధృడ సంకల్పం ఉంటే ఏ పనికైననూ ఎదురుండదు."
   ఎర్రన మోము ఆనంద తరంగాలతో ఎర్రవడింది.

   "ఈ రోజు మనం నన్నయ భట్టారకుని సముచిత, సందర్భోచిత చిత్రాలను తెలుసుకుందాం. వ్యాస భారతంలో కూడనూ ఇటువంటివి కోకొల్లలు. అవ్విధంగా సూచనా పరంగా సన్నివేశాలను చిత్రీకరించడంలోనే కవి ప్రతిభ కనపరచేది."
   శ్రద్ధగా సర్దుకుని కూర్చున్నాడు ఎర్రన.
   చిరు చలిగా ఉందేమో, తాతగారు కొద్దిగా వణికారు. ఎర్రన చటుక్కున లేచే లోగా.. ఎక్కడనుంచి గమనించిందో, పేరమ్మ..
   ఉన్ని శాలువా తెచ్చి భుజాలచుట్టూ కప్పింది. ఎర్రపోతన భార్యని ప్రేమగా వీక్షించి ప్రసన్న వదనంతో తల పంకించారు, కృతజ్ఞతా పూర్వంగా.
   పేరమ్మ ఒక బోసినవ్వు విసిరి వెనక్కి మళ్ళింది.
   ఆ వయో వృద్ధుల పరస్పర ప్రేమకి ఎర్రన కన్నులు చెమర్చాయి ఉద్వేగంతో.
   ముదిమి వయసైన నేమి ముచ్చటగ
   హృదిని మూటకట్టి సమర్పించుటకు
   ఆ దివి నున్న దేవతలెల్లరు మెచ్చి
   మదిని దీవెన లందియ్యరే ముదమారగ.
   ఆ ఆది దంపతులకి మనసారా నమస్కరించి గంటం అందుకున్నాడు ఎర్రన, తాతగారి వజ్రపు వాక్కులకై ఎదురు చూస్తూ.
   "కుమార అస్త్రవిద్యా ప్రదర్శన జరుగుతోంది. ధర్మరాజు బల్లెం విసరడంలో తన ప్రజ్ఞా పాటవాలని ప్రదర్శించాడు. భీముడు తన కండలని ప్రదర్శించి, గదని తిప్పడంలో రకరకాల విన్యాసాలని చూపించాడు. అర్జునుడి విలు విద్యా ప్రదర్శన అయ్యాక, కర్ణుడు తన విద్యని కనబర్చాలని అడుగులు ముందుకు వేశాడు.
   అప్పుడు భీముడు, కర్ణుడిని కులం తక్కువ వాడని దూషిస్తాడు.
   నిస్సహాయుడైన కర్ణుడు విషణ్ణ వదనంతో "ఆకాశంబున నున్న ఆదిత్యుం జూచుచు మిన్నకుండె.." అంటారు నన్నయ.
   తన తండ్రి ఎవరో తెలియని కర్ణుడు, ఆదిత్యుడిని చూస్తూ ఊరుకున్నాడు అని చెప్పడంలో.. కర్ణుడి జన్మ రహస్యం తెలిసిన పాఠకులకు సానుభూతి కలుగక మానదు." అడుగుల చప్పుడు విని ఆపాడు ఎర్రపోతన.
   ఈ మారు పోతమాంబ..
   తళతళ మెరిసే రెండు రజత పాత్రల నిండుగా గోరువెచ్చని పాలలో, కొద్దిగా మిరియం పొడి, బెల్లం కలిపి తీసుకొని వచ్చి, తాతా మనవళ్లకి అందించింది.
   కొద్ది కొద్దిగా చలి అధికమవుతున్న సమయంలో.. ఆ క్షీరం అమృత సమాన మయింది. పాలు త్రావిన వెంటనే నూతన తేజోల్లాసములు కలిగాయి వక్త, శ్రోతలిరువురికీ.
   అటువంటి సుహృద్ వాతావరణం ఉంటే ఏ పని చేయుటకైననూ ఎదురేముంది.
   "కావ్యాలలో వీలైనంత వరకూ ఉపదేశాలు, నీతి బోధలు చొప్పించాలి. కాలక్షేపానికి చదివి నట్లు మాత్రమే కాక.. చదువరికి లోక జ్ఞానం, విషయ పరిజ్ఞానం కలగాలి. సందేశాత్మకంగా ఉండాలి. నన్నయగారి కావ్యంలో ఇవన్నీ పుష్కలంగా ఉన్నాయి.
   పరీక్షిత్తునకు శాపం ఇచ్చాక కుమారుడి తొందరపాటు తనానికి, ముని ఐన శృంగి తండ్రి బాధపడి కొడుకునకు నీతి బోధ చేస్తాడు.
   ’క్రోధం వలన తపఃఫలము పోతుంది. క్రోధము వలన అణిమాది సిద్ధులూ పోతాయి.
   క్రోధము ధర్మవిధులకు అడ్డు వస్తుంది. తపస్వికి క్రోధము తగదు.’
   ఇటువంటి బోధలు వ్యాస భారతంలో లేవు. నన్నయగారు కల్పించినవే. ఇవి ఏ కాలంలోనైననూ.. ఎవరికైననూ వర్తించేవే..
   ప్రాణానికి ముప్పు వచ్చినప్పుడు, సర్వ ధనాపహరణ అవుతున్నప్పుడు, వివాహములందు అనృత మాడవచ్చునని కూడ ఒక సందర్భంలో చెప్పారు.
   ’చను బొంకగ బ్రాణాత్యయ
   మున సర్వ ధనాపహరణమున వధగావ
   చ్చిన విప్రార్ధమున వధూ
   జనసంగమమున వివాహ సమయములందున్.’
   ఆ నాటి ఆచార వ్యవహారాలను అనేకం కథలో జొప్పించి తెలియ జేశారు.
   నన్నయగారి కావ్యంలో శబ్దాలంకారాలు కూడా మనసును రంజింప చేస్తాయి. అర్ధాలంకారాలు ఆలోచనామృతాలైతే, శబ్దాలంకారాలు వీనులకింపైన కెంపులు.
   ’ధ్యేయుడవు సకలలోక
   స్థేయుడవు, నమ్రులకు విధేయుడవు..’
   ఇటువంటి ప్రయోగాలు కొల్లలుగా కనిపిస్తాయి.
   ఒకే పదాన్ని ప్రక్క ప్రక్కలను వాడి చిత్ర కవితను విచిత్రంగా మలచడం నన్నయగారి ప్రత్యేకత. ఈ క్రింది వాక్యంలో వ్రాసినట్లుగా..
   ’కురు వృద్ధుల్ గురువృద్ధ బాంధవులనేకుల్ చూచుచు నుండగన్’
   ’భారత భారతి’ అనే ప్రయోగం కూడా తరచు కనిపిస్తుంది.
   క్షుణ్ణంగా విశ్లేషించుకుంటూ.. వాక్యాలలోని అంతరార్ధాలను ఆకళింపు చేసుకుంటూ, మరల మరల మననం చేస్తూ.. చదివిందే చదువుతూ, ఔపోసన పట్టాలి.. అగస్త్యముని సముద్రాన్ని పట్టినట్లుగా. అప్పుడే నీవు అనుకున్నది సాధించ గలుగుతావు."
   ఆయాస పడుతూ ఆగారు ఎర్రపోతసూరి.. మనుమనికి చెప్పవలసింది చెప్పేశానన్నట్లు సౌంజ్ఞ చేస్తూ.
   "నన్నయగారి భాగము, తిక్కన గారి భారతము కూడా మీరు చెప్పిన విధంగా పరిశీలిస్తాను తాతగారూ! ఎన్ని సంవత్సరములు పట్టినా బాగుగా పట్టు సాధించిన పిదపే అరణ్య పర్వాన్ని పూరిస్తాను. అంతియే కాదు.. అది నన్నయగారే వ్రాసినట్లు చెప్పి, రాజరాజునకే అంకిత మిస్తాను. అరణ్యపర్వం వ్రాసిన పిదపనే, నన్నయ తిక్కనల ఆశీస్సులతో  మిగిలిన కావ్యాలను రచిస్తాను."
   ఎర్రన వాగ్దానమును విని తృప్తిగా కన్ను మూశారు ఎర్రపోతసూరి.

8 వ అధ్యాయం

   ఢిల్లీ కోట..
   దక్షిణ దేశ దిగ్విజయ యాత్ర ముగిసి, అంబరాన్నంటే సంబరాల తరువాత..
   అర్ధరాత్రి.. గస్తీ తిరిగే సైనికుల కాగడాల వెలుతురు తప్ప, ప్రాంగణమంతా చిమ్మ చీకటి.
   పరమ కిరాతకుడైన మాలిక్ కాఫర్ తన మందిరంలో పచార్లు చేస్తున్నాడు. మొహంలో ఇసుమంత శాంతం.. కొంచెం ప్రసన్నత.. కొంచెం జాలి.. కొంచెం అభిమానం.. అవి అతనిలో చాలా అరుదుగా కనపడే లక్షణములు. కనుబొమలు ముడిచి దీర్ఘంగా ఆలోచిస్తూ తిరుగుతున్నాడు.
   నూనూగు మీసాల హసన్ ఒక మూలగా నిటారుగా నిలబడి చూస్తున్నాడు. కొద్దిగా వంచిన తల మాత్రం అతని వినయాన్ని సూచిస్తోంది. అతని కన్నులలో ఏ భావమూ లేదు. 
   మాలిక్ కాఫర్ అడుగుల శబ్దం వినగానే కోటలో ప్రతీ ఒక్కరూ, భయాందోళనలతో వణికి పోయి ప్రక్కకి తప్పుకుంటారు.. ఒక్క హసన్ తప్ప.
   ఆ విశాల మందిరంలో వారిద్దరే..


   పచార్లు ఆపి, పాదరక్షలు ఒక మూలకు విసిరేసి, తన పానుపు మీద విశ్రాంతిగా మెత్తలనానుకుని కూర్చుని, హసన్‍ను దగ్గరగా రమ్మని సైగ చేశాడు మాలిక్.
   హసన్ నెమ్మదిగా, ఠీవిగా వచ్చి మాలిక్‍కి చేతికందే దూరంలో నిలిచాడు.. ఒక మర బొమ్మ లాగ.
   పైనుంచి కిందికి పరిశీలిస్తున్నట్లు పరికించాడు మాలిక్ కాఫర్.
   పచ్చని చందమామ వంటి మోము.. విశాల నేత్రాలు. కోటేరేసినట్లున్న ముక్కు. గడ్డం మీది వచ్చీరాని వెంట్రుకలు అడ్డదిడ్డంగా పరచుకుని, చంద్రుడి మీద మచ్చల్లాగ వింత అందాన్నిచ్చాయి. ఆజానుబాహువైనా, ఇంచుక నాజూకుతనం కూడా కనిపిస్తోంది. అది లేత వయసు సూచిక.
   మాలిక్ కన్నులు చెమర్చాయి కొద్దిగా..
   బండరాయిలో నీటి ఊట లాగ.
   హసన్ మొహంలో ఇంచుక ఆశ్చర్యం. అతను ఏవేవో ఊహించుకుని, మానసికంగా సిద్ధపడి వచ్చాడు.
   "ఎలా ఉన్నావు? ఇక్కడ బాగుందా?"
   హసన్ పెదవులను కొద్దిగా ఒక పక్కకు తిప్పి నవ్వాడు. ఆ నవ్వులో అంతులేని భావం. అది విషాదమా.. విరక్తా.. పగా.. క్రోధమా.. కోపమా.. లేక అన్నీ కలగలిపిన మాటల కందని ఉక్రోషమా!

   మాలిక్ కాఫర్, హసన్‍లో తనని తాను చూసుకుంటున్నాడు.
   అల్లావుద్దీన్ ఖిల్జీకి, గుజరాత్ దండయాత్రలో దొరికి జంతువులుగా మారిన.. మార్చబడిన మనుషులు వారిరువురూ.
   సోమనాధ దేవాలయమును విధ్వంసము చేసి, శివలింగమును ముక్కలు చేశాక, కంబయత్ పై చేసిన దాడిలో, నాజూకైన.. అందమైన హిందూ బానిస దొరికాడు. సుల్తాను ముచ్చటపడి అతనిని వేయి దీనారాలకు కొన్నాడు. అందుకని అతనిని ’హజార్ దీనార్ కాఫర్’ అని పిలిచేవారు.
   అతని మీద మనసు పడ్డ సుల్తాన్.. మతము మార్చి మాలిక్ కాఫర్ అని పేరు పెట్టి, స్త్రీలతో సంబంధం పెట్టుకోలేకుండా నపుంసకుడిని చేసి, తన ప్రేమికుడిగా ఉంచుకుంటాడు. తన కొలువులో పెద్ద పదవులిచ్చాడు. సుల్తాను ప్రాపకంతో కొలువులో పలుకుబడి పెంచుకుని నయీబ్ (సర్వసేనాని) పదవిని పొందాడు మాలిక్.
   అనేక దండయాత్రలు చేసి, ఖిల్జీ రాజ్యాన్ని విస్తరించాడు.. ఇంకా విస్తరిస్తున్నాడు.
   తనకు జరిగిన అన్యాయానికి, అందరి మీదా కోపం పెంచుకుని రాక్షసుడయ్యాడు మాలిక్ కాఫర్. అతనికి మతం మారక పూర్వం ఉన్న పేరు, పుట్టు పూర్వోత్తరాలు ఎవరికీ తెలియవు.
   అదే రకమైనది హసన్ చరిత్ర కూడా!
   ఇంకా హీనమయినది.
   హసన్ అసలు పేరు కూడా ఎవరికీ తెలియదు.
   ఒకానొక గుజరాత్ దండయాత్రలో..
   అల్లావుద్దీన్ ఖిల్జీ తన దండనాయకులు, ఉల్లూఖాన్, నుస్రత్ ఖాన్‍లను గుజరాత్ మీదికి పంపాడు. వాళ్ళు పటాన్ రాజు, కరన్‍ను ఓడించి, సోమనాథ్ మీదికి పడ్డారు. మొదటగా ఎవరు అడ్డు రాలేదు.. కానీ ’లథి’ రాజు హమీర్జి గోహిల్, అతని అనుయాయుడు వగేడ భిల్లునితో కలిసి ఎదిరించాడు.
   కానీ.. ముష్కరుల ధాటికి సోమనాథ ఆలయం వద్ద తట్టుకోలేక పోయారు. వగేడ భిల్లుడు చనిపోతూ, హసన్‍ని పిలిచి తప్పించుకోమంటాడు. ఎప్పటికైనా అల్లావుద్దీన్ ఖిల్జీ మీద పగ తీర్చుకోమంటాడు. అప్పటికి హసన్ తప్పించుకుంటాడు.. అయితే మళ్ళీ కొద్ది రోజులలోనే పట్టుబడతాడు.
   పదకొండు పన్నెండేళ్ల పాలబుగ్గల పసివాడు. పచ్చని పసిమిఛాయతో, అమాయకమైన చూపులతో.. అందమైన కుర్రవాడు.. అతని కులం ఎవరికీ తెలియదు. పరియా జాతికి చెందిన వాడని అంటారు.
   సుల్తాను పరివారం దృష్టిలో పడ్డాడు.
   మతం మార్చేసి "హసన్" అని పేరుపెట్టారు. అందాల హసన్‍ను అనుభవించని, లైంగికపరంగా హింసించని మగవారు లేరు సుల్తాన్ కొలువులో. స్వలింగ సంపర్కం సర్వ సాధారణం అక్కడ.
   అప్పుడప్పుడే విచ్చుకుంటున్న మల్లెమొగ్గని చిదిమి చిద్రం చేసి పారేశారు. అతి కర్కశంగా నలిపేశారు. శరీరం, మనసు కూడా బండరాయిలా మారిపోయాయి. ఏ అనుభూతికీ స్పందించని శిలగా మారిపోయాడు చిన్నారి హసన్.
   చివరికి అల్లావుద్దీన్ కొడుకు "ముబారిక్ షా ఖిల్జీ” కి ప్రేమికుడిగా స్థిర పడిపోయాడు.
   ఆ తరువాత అతని జోలికి వెళ్ళడం మానేశారు అందరూ.. కానీ కొలువులో పెద్ద పెద్ద సేనానులకీ, దండ నాయకులకీ చాలా ఇష్టుడు. అందరికీ కావలసిన వాడు.
   ఇప్పుడు ఈ పిలుపుకి కారణమేమిటి? మాలిక్ కాఫర్‍కి ఏం కావాలి?
   "హసన్! ఇలా నా ప్రక్కన వచ్చి కూర్చో.."
   "హా.. అదేనా!" మనసులో నిర్వికారంగా అనుకుంటూ యాంత్రికంగా తన శిరస్త్రాణాన్ని తీసి ప్రక్కన పెట్టి, కూర్చున్నాడు." ఒక్క కాఫర్ మాత్రమే
 సుల్తాన్ కొడుకైన ముబారక్‍కి భయపడడు..
   కానీ అతను అనుకున్న కారణం కాదని వెంటనే తెలిసిపోయింది.
 
   "సుల్తాన్ ఆరోగ్యం బాగులేదు.." కాఫర్ మొదలు పెట్టాడు గోజ్రీ భాషలో.. హసన్‍కి మాత్రమే వినిపించేలాగ.
   హసన్ కనుబొమ్మలు పైకి లేచాయి.. ఒక్క క్షణం.
   మాలిక్ కాఫర్ ఒకేసారి కనురెప్పలు ఆర్పి తెరిచాడు.
   సుల్తాన్ పైకి చూడడానికి బాగానే ఉన్నాడే.. కోటలో ఎవరికీ తెలియదు..
   "ఆయనకి జలోదరం.. శరీరమంతా నీరు పట్టేసింది. వైద్యులు ఒక నెల కంటే బ్రతకడంటున్నారు. నాకైతే ఇవేళో రేపో అనిపిస్తోంది. ఇంక కోటలో రాజకీయ సంక్షోభం తప్పదు. మనం దేనికైనా సిద్ధపడాలి. రాకుమారుడు అంత సమర్ధుడు కాదు.. నీకు కూడ తెలుసు కదా!"
   హసన్ తల ఊపాడు.
   "ఇక్కడ సింహాసనం కొంచెం కదిలిందంటే దేశమంతా కదులుతుంది. ముఖ్యంగా దక్షిణ దేశాలలో.. హిందూ రాజులందరూ వేచి చూస్తున్నారు, ఎప్పుడెప్పుడు స్వతంత్రం ప్రకటించుకుందామా అని. ఓరుగల్లు రాజు ప్రతాపరుద్రుని విషయంలో చాలా జాగరూకత వహించాలి. అతను మహాయోధుడు. అక్కడి అంతర్యుద్ధాల వలన మనం ఓరుగల్లు రాజుని జయించ గలిగాం.
   మనం మన సామ్రాజ్యాన్ని పఠిష్టంగా ఉంచాలి. నీ ధ్యేయం, నా ధ్యేయం ఒక్కటే.. ఢిల్లీ సింహాసనం చెక్కు చెదరకూడదు. ఆ ప్రయత్నంలో మనం ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడి ఉండాలి. సుల్తాన్ అల్లాని చేరాక.. జరుగ బోయే దాంట్లో నీ సహాయం కావాలి నాకు. చేస్తావా?"
   హసన్ మాట్లాడలేదు. కళ్ళార్పకుండా చూస్తూ ఉండి పోయాడు.
   మాలిక్, హసన్ భుజం మీద తట్టాడు, స్నేహ పూర్వకంగా..
   ఒక గోడని కొట్టినట్లనిపించింది.. మాలిక్ ‍చటుక్కున చేతిని వెనక్కి తీసుకున్నాడు.
   తన లాగనే ఉక్కు శరీరం.. వీడి సంకల్పం కూడా ఇంత గట్టిదేనా!
   ఆ విషయం మాలిక్ కాఫర్ త్వరలోనే తెలుసుకుంటాడు.

   సరిగ్గా రెండే రోజుల తరువాత..
   "సుల్తాన్.. అల్లావుద్దీన్ ఖిల్జీ మరణించాడు. రెండవ అలగ్జాండర్‍గా పేరు పొందిన ఢిల్లీ సుల్తాన్ మనకిక లేరు." రాజ వైద్యులు ప్రకటించారు.
   వెంటనే.. సింహాసనం మీద కొత్త సుల్తాన్‍ని కూర్చోపెట్టాలి.. ఖాళీగా ఉంచ కూడదు.
   సుల్తాన్ పోయిన రెండవరోజు..
   ఒక ప్రక్కన సుల్తాన్ ఖననానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
   ఇంకొక ప్రక్కన.. వారసుడైన పెద్దకొడుకు ఖిజర్ ఖాన్ పట్టాభిషేకానికి తయారవుతున్నాడు.
   కానీ అల్లా ఉద్దేశ్యం వేరుగా ఉంది.
   రాజ సభ కొలువు తీరింది. సుల్తాన్ అనుయాయులు, మంత్రులు, సేనానులు, దండ నాధులు.. అందరూ తమతమ ఆసనాలలో కూర్చున్నారు. రాజభటులు ఒరలోనున్న కత్తుల మీద చెయ్యివేసి, తయారుగా నిల్చుని ఉన్నారు. దూరంగా.. కొద్ది మంది ప్రజలు కూడా వచ్చారు.. కుతూహలంగా చూస్తూ.
   ఎవరి మొహంలోనూ సుల్తాన్ పోయాడన్న విచారం లేదు.. ఏమవుతుందో నన్న ఆతృత తప్ప.
   అక్కడున్న వారిలో మూడు వంతుల మంది బలవంతంగా మతం మార్చుకున్నవారే. దండయాత్రలలో బంధువులనీ, స్నేహితులనీ పోగొట్టుకున్నవారే. ఏ నిముషములో ఏమి జరుగుతుందోనని భయంతో బ్రతుకుతున్నవారే..
   సుఖ దుఃఖాలకి అతీతంగా అయిపోయారు.
   సభలో గుసగుసలన్నీ సద్దుమణిగిపోయాయి ఒక్కసారిగా..


                         
   మాలిక్ కాఫర్ ఆరు సంవత్సరాల షిహాబుద్దీన్ ఉమర్‍ ని.. అల్లావుద్దీన్ ఆఖరి కొడుకుని, సుల్తాన్ లాగ అలంకరించి, చెయ్యి పట్టుకుని, సున్నితంగా నడిపించి తీసుకొస్తున్నాడు.
   అతని ముఖం అభావంగా, గంభీరంగా ఉంది.
   అప్రయత్నంగా సభలోని వారంతా లేచి నిలుచున్నారు.
   ఖిజ్రీ ఖాన్ ఏమయ్యాడు?

(చిత్రాలు- గూగుల్ సౌజన్యంతో)

……… ( ఇంకా వుంది) ………..

 

 

 .... మంథా భానుమతి