TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
తెలంగాణ కథకుల్లో బోయ జంగయ్యది విలక్షణశైలి. కథకు సంబంధించిన ఇతివృత్తాన్ని నిర్ణయించుకోడంలోనూ, కథను నడపడంలోనూ వైవిధ్యంగా కనిపిస్తుంది. జీవితంలోని అగాథాలను వస్తువుగా తీసుకొని ఆ భాషను కథల్లోకి తీసుకరావడంలో వీరిది అందెవేసిన చెయ్యి. అతనే చెప్పుకున్నట్లు అతని జీవిత అనుభవాలే అతని కథలు. ఎక్కడా ఊహలు, వినూత్నమైన వర్ణనలు, వాస్తవికతను దాటిన రాతలు మనకు కనిపించవు. ప్రతి కథ మనకు తెలియని జీవితాన్ని కళ్లకు కడుతుంది. అయితే జీవితాన్ని విస్తరించుకుంటూ, తన పరిధిని పెంచుకునే క్రమంలో బోయ జంగయ్య కథల్లో సామాజిక చైతన్యాన్ని వివరించే వర్గ, కుల దృక్పధాలు కనిపిస్తాయి.
బోయ జంగయ్య సెప్టెంబరు1, 1942... నల్లగొండ జిల్లాలోని లింగారెడ్డి గూడెంలో పుట్టారు. సొంత ఊరు పతంగి. వాళ్ల అమ్మానాన్న దినసరి కూలీలు. అంటరానితనాన్ని, పేదరికాన్ని అనుభవిస్తూ ఊరిలో నాలుగో తరగతి వరకు చదువుకొన్నారు. తర్వాత హైదరాబాదులోని ప్రభుత్వ వసతి గృహంలో చేరి బి.ఏ. పూర్తి చేశారు. తల్లిడంద్రులకు సాయంగా సెలవల్లో కూలిపనులకు వెళ్లేవారు. పేదరికంలో తిండిలేక ముంజెలు, సితాఫలాలు, తాటిపండ్లు తినేవారు. కానీ స్వాతంత్ర్యం వచ్చాక ఎదిగిన తొలితరం దళితుల్లో బోయజంగయ్య ఒకరు. ట్రెజరీ శాఖలో అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసురుగా పదవీ విరమణ పొందారు. అటు గ్రామీణ నేపథ్యాన్ని, ఇటు మారుతున్న నగర జీవినశైలిని అవగాహన చేసుకుని... కథలకు ఇతివృత్తాన్ని సిద్ధం చేసుకునే వారు. అందుకే వీరి కథలు సజీవాలు. సుమారు 50 ఏళ్ల సామాజిక జీవితానికి నకళ్లు.
జంగయ్య సుమారు 20 రచనలు వరకు ప్రకటించారు. 125కు పైగా కథలు రాశారు. రెండు నవలలు వెలువరించారు. పిల్లలకోసం పుస్తకాలు రాశారు. అలానే అంబెద్కర్, కె.ఆర్. నారాయణ్, జాషువా లాంటి సామాజిక వేత్తల జీవిత చరిత్రలను సొంతగా రాశారు. వచన కవితా సంపుటాలు ప్రకటించారు. వీరి రచనలు ప్రముఖుల మన్ననలు పొందాయి. వర్గస్పృహ, కుల స్పృహ, చైతన్యం, స్త్రీ వాద దృక్కోణం... అన్నిటి సమాహారమే ఈ కథలు. వీరి కథలులో గొర్రెలు, దున్న, చీమలు, ఎచ్చరిక, రంగులు, తెలంగాణ వెతలు, బోజ కథలు వంటి సంపుటాలుగా వచ్చాయి. ముఖ్యంగా దొంగలు, చీమలు, మరుగుమందు, అడ్డం, కరెంటు కథ, బొమ్మలు, తుపాకులు, నాపేరు రాయొద్దు.... వంటి ఎన్నో కథలు ప్రాముఖ్యం పొందాయి.
'దొంగలు' కథలో రాజకీయ నాయకులకు, కార్యకర్తలకు మధ్య ఉన్న భేదాన్ని చెప్తారు. ఎన్నికల తర్వాత నాయకులు కలిసినా, కార్యకర్తలు కక్షలతోనే జీవిస్తుంటారు అనే సత్యాన్ని ఆవిష్కరించారు. అలానే 'నాపేరు రాయొద్దు' కథలో పెళ్లి కాకుండా తల్లి అయిన ఓ స్త్రీ పిల్లలను పాఠశాలలో చేర్పించేటప్పుడు ఎదుర్కొనే సమస్యను చిత్రించారు. 'దున్న' కథలో పల్లెలో గ్రామ పెత్తనంలో వచ్చిన మార్పుల వల్ల ప్రజలకు జరిగే మంచిని వివరించారు. 'మరుగుమందు' కథలో సామాన్య ప్రజల్లోని మూఢనమ్మకాలు వారి మానవీయ సంబంధాలను ఎలా నాశనం చేస్తాయో చెప్పారు. 'సాలిని' కథ నగరంలో సేవ చేయాలని భావించే స్త్రీని అక్కడి ప్రజలు ఎలా మానసికంగా హింసిస్తారో చెప్తుంది, చివరకు ఆమెకు శీలంలేని స్త్రీగా ముద్రపడేలా చేస్తారు. 'రంగులు' కథలో స్వాతంత్ర్యం వచ్చాక అన్ని సమస్యలు తీరుతాయి అని భావించిన పోరాటయోధుడు చివరకు బిచ్చగాడిగా మారిన వైనాన్ని మనకు చూపుతుంది. 'మరమరాలు' కథ స్త్రీ పురుషులు చనువుగా మాట్లాడుకుంటుంటే... పుట్టించే పుకార్లు ఎలా అక్రమసంబంధాలుగా చెలామణి అవుతాయో వివరిస్తుంది. ఇలా బోయ జంగయ్య రాసిన ప్రతి కథ ఓ నీతిని చూపడమే కాదు, సమాజంలోని కుల్లును కడిగేయాలని చెప్తుంది. నిబద్ధతగా జీవించాలని, అప్పుడే జీవితం, రాజ్యం రెండూ బాగుంటాయని సమస్యలను, అందుకు కారకులైన వారిని ఎండగడుతుంది.
వీరి కథల్లో శిల్పం సహజంగా, సుందరంగా ఉంటుంది. కానీ పాఠకులను మెప్పించే చాతుర్యం కనిపిస్తుంది. కథలో ఎక్కడా రచయిత ప్రవేశించరు. అలాగే వర్ణనలు చేయరు. ఒక సన్నివేశాన్ని చెప్పి... దానిలోనే తను చెప్పదలచుకున్న విషయాన్ని పాఠకులకు అందేలా చేస్తారు. అంటే కెమెరాతో తీసినట్లు కథ మనకు దృశ్యాన్ని, సన్నివేశాన్ని, సంఘటనను పలుకోణాల్లో చూపుతుంది. కథల ముగింపు కూడా చమత్కారంగా, పరిష్కారాన్ని చూపుతుంది. ఎక్కువగా ఒక్క సన్నివేశ కథల్నే రాశారు బోయ జంగయ్య. ఉత్తమ పురుషలో రాయరు. కేవలం సర్వసాక్షి దృక్కోణంలోనే రాశారు. వీరి 'తెలంగాణ వెతలు' కథలు తెలంగాణ సామాజిక, సాంస్కృతిక జీవితానికి చారిత్రక వాస్తవాలు. వీరి శిల్ప చాతుర్యానికి కుండబద్దలు కొడత కథను ఓ ఉదాహరణగా చెప్పొచ్చు. కథలో మానభంగం జరిగిన తీరు పై పంచాయితీ జరుగుతుంది. కానీ చివరి వరకు దోషులు ఎవరన్నది చెప్పరు రచయిత. చివరకు దోషులపై ప్రజల్లో ఉప్పొంగుతున్న ఆవేశాన్ని చెప్పి, తర్వాత దోషులు ఎవరన్నది... బయటపెడతారు. ఇదో అద్భుతమైన టెక్నిక్. కథలోని పాత్రలకే కాదు, పాఠకులకు ఉత్కంఠకలిగిస్తుంది.
వీరి కథల గురించి ఆవత్స సోమసుందర్ చెప్పిన మాటలు అక్షసర సత్యాలు - 'బోజ కథారచనలో అనవసర విస్సాటాలు, తెచ్చికోలు గొప్పలు, షోకిల్లా మెరుగులు, గోసాయి చిట్కాలు ఎక్కడ వెతికినా కనిపించవు. మంచి నీళ్ళంత స్వచ్ఛసుందరంగా అతని కథలు తళతళ లాడుతాయి. ఈ దేశ వాసుల బాధా సహస్రాలే ఇతని గాధా సప్తశతులుగా పలకరిస్తాయి.'
- డా. ఎ.రవీంద్రబాబు