TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
లచ్చి
- గూడూరి సీతారం
చిన్నచిన్న కథల్లో హృదయం పట్టనంత భావాన్ని చెప్పిన రచయిత గూడూరి సీతారం. తెలంగాణలో తొలితరం కథకుల్లో సీతారాంది ప్రత్యేకమైన శైలి. మాండలిక పదాల్ని అందంగా కథల్లో ప్రయోగించారు. పల్లెటూరి జీవితాలను, వారి బతుకుల్లోని కఠిన వాస్తవాలను తన రచనల్లో చిత్రీకరించారు. వీరి కథలు నేల విడిచి సాము చేయవు. ప్రతీకాత్మకంగా సాగి మనసుల్లోని మాలిన్యాన్ని బయట పెడతాయి. సీతారాం రాసిన "లచ్చి" కథ బిచ్చగాళ్ల జీవితాల్లోని మానవీయ సంబంధాల లోతుల్ని ఆవిష్కరింస్తుంది. కథలోకి వెళ్తే-
బిచ్చగాళ్లలో ఒక ఆచారం ఉంది. కొడుక్కు పెళ్లి కాగానే వేరే కాపురం పెట్టిస్తారు. వాళ్లకు కావాల్సింది వాళ్లు సంపాదించుకొని తినమంటారు. లచ్చి, రంగడు భార్యా భర్తలు. ఆచారం ప్రకారం పెద్ద వాళ్లనుంచి విడిపోయి ఓ గుడిసెలో వేరుకాపురం పెడతారు. లచ్చి వాళ్లలో ఎవ్వరూ చెయ్యలేనంత పనిచేస్తుంది. పైగా అందంగా ఉంటుంది. భాగాలు పంచుకుంటే రంగనికి రెండు పాతకుండలు, ఒక కమ్మకోత కత్తి, రెండు అంబలి పోసుకునే బుర్రలు, రెండు బిచ్చమెత్తుకునే కమ్మజోలెలు వస్తాయి. రంగడు ఈత కమ్మకోసుకొస్తాడు. మధ్యాహ్నం నుంచి ఎంట్రకాయలో, చేపలో పట్టుకొచ్చి అమ్ముతాడు. మందుచెట్ల ఏళ్లు తవ్వకొచ్చి అమ్ముతుంటాడు.మధ్యాహ్నానికి తన పాలిటి గంజి అడక్కొచ్చుకుంటాడు. అప్పుడప్పుడు కల్లు తాగి, బుద్ధి పుడితే భార్యకు కూడా తెస్తాడు. భార్య లచ్చి రంగడు తెచ్చిన కమ్మతో చాపలు అల్లి అమ్ముకొస్తుంది. అలానే రాత్రికి ఇద్దరికి కావల్సినంత గంజి అడ్కకొస్తుంది. ఇలా వాళ్ల కాపురం ఎటువంటి గొడవలు లేకుండా అన్యోన్యంగా హాయిగా సాగిపోతూ ఉంటుంది.
సహజంగా బిచ్చగాళ్లు సంచారంచేస్తూ జీవిస్తుంటారు. వానాకాలం దగ్గరపడడంతో రంగడి తండ్రి, బంధువులు వేరే ఊళ్లకు వెళ్లిపోతారు. రంగడికి ఓ కాపు దగ్గర కూలి దొరకడంతో భార్యతో కలిసి ఆ ఊళ్లోనే ఉండిపోతాడు. కానీ ఒకరోజు రంగడిని పోలీసులు పట్టుకెళ్తారు. లచ్చికి పోలీసులు ఎక్కడ ఉంటారో, ఎందుకు భర్తను పట్టుకెళ్లారో తెలియదు. అయినవాళ్లు ఎవ్వరూ లేరు. దాంతో ఒక్కతే కుమిలి కుమిలి ఏడుస్తుంది. నాలుగురోజుల తర్వత రంగడు ఇంటికి తిరిగి వస్తాడు. లచ్చికి వెయ్యేనుగుల బలం వస్తుంది. నూకల గంజికాసి పెడుతుంది. రంగడి మీద అనుమానంతో పోలీసులు పట్టుకెళ్లారు. వళ్లు సున్నం అయ్యేలా కొట్టారు. కానీ ఊళ్లో రంగడు తలెత్తుకుని తిరగలేక పోతాడు. అందరూ దొంగలా చూస్తుంటారు. పని ఇచ్చిన కాపుకూడా మాటలు అనడంతో రంగడు, లచ్చితో కలిసి పట్ఠణం వలసపోతాడు.
పట్టణంలో బిచ్చమెత్తుకొని జీవించడం కష్టంగా ఉంటుంది. ఆహారపు అలవాట్లు కూడా మారతాయి. బిచ్చమెత్తుకుని కూడబెట్టుకున్న డబ్బుతో పాటు, కొంత అప్పుచేసి రంగడు రిక్షా కొంటాడు. రంగడు పనిలో పడి ఇంటికి రావడం తగ్గిస్తాడు. రిక్షాకు తెచ్చిన అప్పు కట్టాలని రూపాయి రూపాయి కూడబెడతాడు. కానీ ఒకరోజు పోలీసులు దీపం లేకుండా రిక్షా నడుపుతున్నాడని రంగడ్ని పట్టుకుంటారు. చివరకు యాభై రూపాయలు లంచం ఇవ్వాల్సి వస్తుంది. కూడబెట్టిన డబ్బు అంతా ఖర్చైపోతుంది. క్రమంగా రంగడికి రిక్షా మిత్రులు ఎక్కువై పోతారు. సిగరెట్లు, పాన్ లు, ఛాయ్ లు అలవాటవుతాయి. లచ్చి చెప్పినప్పుడు తలూపి, బయట మళ్లీ తాగుతూనే ఉంటాడు. రిక్షా వాళ్లు కాపురం ఉండే మురికిపేటలో రంగడూ ఓ ఇల్లు అద్దెకు తీసుకుంటాడు. అలానే లచ్చి అడుక్కోవడం మానేసి నాలుగు ఇల్లళ్లో పాచిపని చూసుకుంటుంది. అయినా ఇంట్లోకి కావాల్సినవి అన్నీ కొనడం వల్ల... సంపాదన చాలదు.
ఒక రోజు రంగడు చాలా పొద్దుపోయినా ఇంటికి రాడు. లచ్చి ఎదురుచూస్తూ ఉంటుంది. చివరకు రంగడు తాగి ఇంటికి వస్తాడు. వాంతి చేసుకుంటాడు. ఆ వాసన కల్లుకాదని అర్థం చేసుకున్న లచ్చి, భర్త చెడిపోతున్నాడని బాధపడుతుంది. అతని కాళ్లకు, చేతులకు తగిలిన దెబ్బలకు సున్నం పెడుతుంది. తెల్లారి రంగడు ఇంకెప్పుడు అలా చేయనని మాట ఇస్తాడు. రోజూ ఇంటి అద్దెవాళ్లు, రిక్షాకు కట్టాల్సిన బాకీ వాళ్లు వస్తుంటారు. వాళ్లు వచ్చినప్పుడు రంగడు ఇంట్లో ఉండడు. ఒకప్పుటిలా సంపాదించింన డబ్బు రంగడు లచ్చికి ఇవ్వకుండా తనదగ్గరే ఉంచుకుంటుంటాడు. లచ్చి బాకీవాళ్ల గురించి రంగడికి ఎంత చెప్పినా వినిపించుకోడు. సేటు రాత్రి వరకు ఎదురు చూసి డబ్బులు ఇవ్వకపోతే ఊరుకోను అని బెదిరించి వెళ్లి పోతాడు. అలా సేటు వెళ్లగానే ఇటు ఇంటికి వచ్చిన రంగడు లచ్చిమీద అనుమానంతో బూతులు తిడుతూ, చెడిపోయావని కొడతాడు. లచ్చికి మాత్రం అలా ఎందుకు అంటున్నాడో, కొడుతున్నాడో అర్థంకాదు.
ఆ రోజునుంచి రంగడు ఇంటికి రావడం పూర్తిగా మానేస్తాడు. లచ్చికి తిండి కూడా కష్టమై పస్తులు ఉండాల్సి వస్తుంది. అటు అప్పుల వాళ్లతో, ఇటు భర్తపెట్టే కష్టాలతో, తిండి లేక లచ్చి పరిస్థితి కనాకష్టమైపోతుంది. ఒక రోజు రంగడు పెందలాడే ఇంటికి వస్తాడు. వస్తూ... వస్తూ... తన ఇంటి మలపులో ఎవరో కనిపిస్తారు. అంతే అగ్గిమీద గుగ్గిలమై భార్యను చావదన్ని బయటకు వస్తాడు. భార్యమీద పట్టరానంత కోపం, కసి. అంతే... రిక్షా తొక్కుతూ ఉంటే యాక్సిడెంట్ అవుతుంది. ఆసుపత్రిలో పాలవుతాడు. భార్య వచ్చినా చూడడు. లచ్చికి కూడా తనతో అంత ఇష్టంగా కాపురం చేసిన రంగడు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో అర్థం కాదు. రంగడికి సాయంత్రానికి పూర్తి తెలివి వస్తుంది. తను ఇన్ని కష్టాలు పెడుతున్నా, కొట్టిన దెబ్బలతోనే తన దగ్గరికి వచ్చిన భార్యను చూస్తాడు. ఆలోచనలో మునిగి పోతాడు. ఏదో తళుక్కుమన్న భావన కలిగి... ఆ ఇంటి నుంచి బయటకు వస్తూ కనిపించింది, తను అప్పు తీసుకున్న సేటు అని, అప్పు అడగడానికే వెళ్లాడని, ఆ మాట లచ్చి పదేపదే చెప్తున్నదని జ్ఞప్తికి తెచ్చుకుంటాడు. "లచ్చీ...! నన్ను క్షమించు" అని ప్రాదేయపడతాడు. లచ్చి కళ్లలో ఆనందభాష్పాలు పూస్తాయి.
ఇలా కథను ఎక్కడా బిగి సడలకుండా చెప్పాడు సీతారం. భార్యభర్తల అన్యోన్యం, అనుమానం, మబ్బులు తొలిగిన చంద్రుడిలా అవి విడిపోవడం....కథ చదువుతుంటే.. ఆద్యంతం ఓ చిత్రాన్ని చూస్తున అనుభూతి కలుగుతుంది. అంతేకాదు బిచ్చగాళ్ల జీవితాలతో వచ్చిన కథల్లో ఈ కథ మణి వంటిది.
- డా. ఎ.రవీంద్రబాబు