Facebook Twitter
సినిమా తీయడం ఎలా


సినిమా తీయడం ఎలా?

-- మధు అద్దంకి

సూపర్ ఢమాల్ ఆఫీస్లో ప్రొడ్యూసర్ చెంగేశ్వర రావు ఇంక దర్శకుడు బోడి భాస్ (భాస్కర రావు పేరుని అలా పెట్టుకున్నాడు చిన్నగా) తాము తీయబోయే కొత్త సినిమా గురించి డిస్కస్ చేసుకుంటున్నారు..

"మన సినిమా సూపర్ డూపర్ ఢమాల్ అవ్వాలి సార్..దానికి అటువంటి స్క్రిప్ట్ ని తయారు చేస్తా... రొమాంటిక్ స్టోరీ తీద్దామా లేక ,క్రయిం స్టోరీ నా?" అనడిగాడు బోడి భాస్

"ఈ మధ్య అందరు లవ్ స్టోరీల మీద పడ్డారు కదా మనం కూడ అదే తీద్దాం దానికో మంచి స్టోరీ రెడీ చెయ్యి" అన్నాడు చెంగు( అతన్ని అందరు ముద్దుగా చెంగు అని పిలుస్తారు)

"దానికి సూపర్ కాన్సెప్ట్ రెడీ ఉంది సార్.. కుక్క జంట...ఒక కుక్క లవ్ స్టోరీ"..అన్నాడు బోడి భాస్ ..

"ఛీ అదేం పేరు? ..కుక్కల లవ్ స్టోరీ ఏంటి?" అనడిగాడు విసుక్కుంటూ చెంగు..

"ఆగండాగండి తొందర పడకండి సార్..హీరోయిన్ కి ఒక కుక్క పిల్ల ఉంటుంది అది హీరో గారి కుక్కతో ప్రేమలో పడుతుంది..కాని వారిద్దరు వేరే జాతులకి చెందిన వారవ్వటం వల్ల వారి యజమానులు ఒప్పుకోరు. యజమానులు వాటిని వాకింగ్ కి తీసుకెళ్ళినప్పుడు అవి దొంగతనంగా చెట్ల చాటున కలుసుకుంటాయి...అలా కలిసి ఒకళ్ళనొకళ్ళు నాక్కున్నప్పుడు మనం ఒక డ్యూయట్ పెడదాం....అలా నాలుగైదు సార్లు జరిగినప్పుడు మనం నాలుగైదు పాటలు పెట్టచ్చు..ముందు కుక్కలు గెంతుతుంటే వాటీ వెనక ఫారిన్ కుక్కలు చిందులేస్తుంటారు..ఇందులో రెండు మూడు పాటల్ని విదేశాలలో మాంచి లొకేషన్స్ లో తీద్దాం.

ఇకపోతే కుక్కల్ని వాకింగ్ చేసేది హీరో హీరోయిన్లు..వాళ్ళకి అసలు పడదు..కుక్కలు లవర్స్ అయితే వీళ్ళు యమ ఎనిమీస్.. అలా కొంత కాలం జరుగుతుంది.. ఒక రెండు రోజులు హీరో కి వాకింగ్ తీసుకెళ్ళడానికి అసలు కుదరదు..కుక్కని ఇంటిదగ్గరే తిప్పేసి తన ఫ్రెండ్స్ తో బయటకి వెళ్ళిపోతాడు...రెండు రోజుల తర్వాత గమనిస్తాడు కుక్క అన్నం తినడం లేదని ఏడుస్తోందని..  ఎందుకని అన్నం తినడం లేదు ఎందుకు బాధపడుతోంది అని ఆలోచిస్తాడు..అసలే బోల్డు జాలి దయా ఉన్న హీరో కాబట్టి కుక్క బాధ చూడలేకపోయాడు..ఎలాగైన సరే తన కుక్కతో అన్నం తినిపించి దాని మనసులో బాధ తుడిచెయ్యాలని డిసయిడ్ అయ్యాడు..

తరువాతి రోజు వాకింగ్ తీసుకెళ్ళాడు...తిరిగి వచ్చింతర్వాత తోకాడించుకుంటూ అన్నమంతా తినేసింది కుక్క..పైగా ఆనందంతో చిందులేసింది..పార్కులో  ఏమి జరిగిందబ్బా అనుకుని ఈ రహస్యం ఛేదించాలని డిసయిడ్ అయ్యాడు.మర్నాడు పార్క్ కి వెళ్ళినప్పుడు కుక్కని వదిలేసి రహస్యంగా దానిని ఫాలో చేస్తాడు...ఒక చెట్టు చాటున తన కుక్క లవర్తో దాని భాషలో మాట్లాడుతుంటుంది కుక్క... ఇదన్న మాట విషయం అనుకుంటాడు..ఇంటికొచ్చాక కుక్కతో చెప్తాడు నీ రహస్యం నాకు తెలిసిపోయింది అని..కుక్క భయపడుతుంది..వద్దు మీ డాడీ తో చెప్పకు అని హీరో కాలి చుట్టూ తిరుగుతుంది..నా లవర్తో నన్ను కలుపు అని ఏడుస్తుంది..అసలే బోల్డంత మానవత్వం  ఉన్న హీరో కాబట్టి సరే నిన్ను నా ప్రాణాలొడ్దయినా సరే నీ లవర్తో కులుపుతాను అని శపధం చేస్తాడు..ఒక ప్లాన్ ఆలొచిస్తాడు..మరుసటి రోజు పార్క్ కి వెళ్ళినప్పుడు హీరోయిన్ కి తెలియకుండా వాళ్ళ కుక్కని కిడ్నాప్ చేసి రెండు కుక్కల్ని తీసుకెళ్ళి ఫార్మ్ హవుస్ లో వదిలిపెడతాడు..కొన్నాళ్ళు మీకిక్కడ సేఫ్ గా ఉంటుంది అని..

కుక్క మిస్ అయ్యాక హీరోయిన్ హీరో తో అంటుంది మా కుక్క కనిపించట్లేదు అని..అప్పుడు హీరో అంటాడు మా కుక్క కూడ కనిపించట్లేదు ..ఇద్దరు కలిసి కుక్కల్ని వెతకటం మొదలెడతారు..వెతుకున్నప్పుడు వాళ్ళ మధ్య ప్రేమ పుడుతుంది.వెంటనే వాళ్లు ఒక డ్యూయట్ పాడసుకుంటారు స్విస్స్ లో..

ఒక రోజు మాటల్లో హీరోయింకి తెలుస్తుంది కుక్కని హీరో దాచిపెట్టాడని..హీరోని బాగ తిట్టి తన కుక్కని తీసుకుని వెళ్ళిపోతుంది..హీరో కుక్క ఇద్దరు డల్...అప్పుడు ఒక అయిటం సాంగ్ ఉంటుంది హీరో కల్లు తాగి చిందులేస్తాడు..తన బాధని అలా కొద్ది సేపైనా మరచిపోగలుగుతాడు..

తర్వాత కుక్కని ఇంటికి తీసుకెళ్ళాక హీరోయిన్ తన కుక్క బాధ చూడలేకపోతుంది...వాళ్ళని కలపడానికే హీరో కిడ్నాప్ చేశాడని తెలుసుకుని తన కుక్కని తీసుకుని హీరో దగ్గరికి తీసుకొస్తుంది..
నిజం తెలుసుకున్నందుకు సంతోషిస్తాడు హీరో..వాళ్ళిద్దరు అపోహలు తొలగి కలిసిపోతారు..ఆ టయింలో ఇంకో సాంగ్ ఉంటుంది...డబల్స్ సాంగ్ అంటే ముందు కుక్కలు డాన్స్ వేస్తుంటే వెనక హీరో హీరోయిన్లు డాన్స్ వేస్తుంటారు..

ఈ లోపల ఈ రెండు జంటల విషయం పెద్దవాళ్ళకి తెలుస్తుంది..ససేమిరా అంటారు..రెండు జంటలు పారిపోతారు..ఈ లోపల పెద్దవాళ్ళు పంపిన గూండాలు వెంట పడతారు ..వారిని తప్పించుకుంటూ ఫయిట్ చెస్తూ మొత్తానికి ఒక రైల్వే  ట్రాక్ దగ్గరకొచ్చి వెళుతున్న ట్రెయిన్ ని హీరో తన కుక్కతో సహా ఎక్కేస్తాడు..హీరోయిన్ పరిగెత్తుకుంటూ వస్తుంది చంకలో తన కుక్కపిల్లతో .వెనకాతల గూండాలు వస్తుంటారు పట్టుకోడానికి..అలా పరిగెత్తుకోతున్న హీరోయిన్ కి హీరో వంగి తన చేతిని చాస్తాడు..ఆమె అది పట్టుకుని రైల్ ఎక్కేస్తుంది కుక్కతో సహా...రైల్ స్పీడ్ అందుకుంటుంది..అలానే వారి జీవితం కూడా...

ఇది సార్ కధ"...అని చెప్పాడు బోడి భాస్

"చాల బావుందయ్యా భాస్ "అని  వీపు మీద ఒక్కటి చరుస్తాడు చెంగు..

వీపు రుద్దుకుంటూ "థాంక్స్ సార్ "అంటాడు భాస్..

"సరే కధ రెడీ...స్క్రీన్ ప్లే నువ్వెలాగూ రాస్తావు..సంగీతానికి ఢమన్ ని పెట్టుకుండాం..వాడి సంగీత హోరులో ఏ పాటైనా ఒక్క లాగే ఉంటుంది కనుక ఎక్కువ రోజులు సంగీతానికి పట్టదు..మాంచి బూతు పాటలు రాసి ఆ హోరులో పాడిస్తే ఎవ్వరికీ అర్ధం కావు లిరిక్స్..ఇకపోతే స్టార్  కాస్ట్ ఏం చేద్దాం?ఎవరిని తీసుకుందాం?"అనడిగాడు చెంగు

"ఫలాన హీరో గారబ్బాయి అయితే రేట్ చాల ఎక్కువ,ఫలాన ప్రొడ్యూసర్ కొడుకయితే ఈ సినిమాకి సూట్ కాడు..కాస్త జంతు లక్షణాలున్న వాడయితే మన సినిమా స్టోరీ కి సూట్ అవుతాడు..

ఫిలిం డిస్ట్రిబ్యూషన్లో మాంచి గ్రిప్పున్నా మన భల్లు బలవింద్ గారి చిన్నబాయి భల్లు భీమేశ్ ని తీసుకుందాం సార్.తన కొడుకు సినిమా కాబట్టి థియేటర్ వాళ్ళని బెదిరించి 100 రోజులు ఆడించి సూపర్ హిట్ చేయిస్తాడు.."అన్నాడు బోడి భాస్

"కాని ఆ అబ్బాయి నోరు వంకర ,ముక్కు వంకర,వెనక డిప్ప పొడుచుకొచ్చినట్టుంది కదా.".అన్నాడు చెంగు

"పర్లేదు సార్ ప్లాస్టిక్ సర్గెరీ తో వెనక డిప్ప చెక్కేసి వంకర్లు సరిచేద్దాం..ఇన్ని చేసినా కూడ వాడు బాగుండకుంటే ఎడిటింగ్లో సర్దేద్దాం కామెరాతో.".అని ఓ బోడి సలహా ఇచ్చాడు బోడి భాస్..

ఇలా ఒక నిర్ణయానికి వచ్చి భల్లు భీమేశ్ ని పెట్టి కుక్క కధ..ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ తీస్తాడు చెంగు..సినిమా ఎప్పుడు వచ్చింది వెళ్ళింది కూడ ఎవ్వరికీ తెలియదు.  కాని సినిమా సూపర్ హిట్ అని ప్రచారం చేయిస్తాడు....ఏదో కొడుకు సినిమాని బల్వింద్ ఆదుకుంటాడు అన్న ఊహ తప్పయ్యింది అని తెల్సుకుంటాడు..థియేటర్లని అయితే ఇప్పించగలిగాడు కాని ప్రేక్షకులని థియేటర్కి  రప్పించలేకపోయాడు బల్వింద్..ఇలా బలవంతంగా తన కొడుకుల్ని ప్రేక్షకుల మీద రుద్దుతున్నాడు బల్వింద్..

సినిమా ఫ్లాప్ అయినా సరే మళ్ళా భల్లు వారబ్బాయితొనే రెండో సినిమా ప్లాన్ చేసి షూటింగ్ మొదలెడతాడు చెంగు..ఫస్ట్ సీన్ షూట్ చేస్తుండగానే ఆనిమల్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్ నుండి ఆఫీసర్స్ వచ్చి చెంగుతో అంటారు..మీరు మీ సినిమాల్లో జంతువులని హింసపెడుతున్నారు దానికి మేమొప్పుకోం..మీరు వెంటనే మీ షూటింగ్ ఆపాలి అని..మా మొదటి సినిమాలో కుకక్లున్నాయి గాని ఈ సినిమాలో లేవు అని చెప్పాడు చెంగు..మరి ఈ జంతువేంటి అని అడుగుతాడు ఆఫీసర్ భీమేశ్ ని చూపించి.. జూ లో ఉండాల్సిన ఈ జంతువుని మీరు మీ సినిమాలో నటింపచేయడానికి వీల్లేదు..దీనిని వెంటనే జూ కి పంపిస్తాం అనంగానే భీమేశ్ కీచుగా అరుస్తాడు నేను జంతువుని కాదు అని..ఆఫీసర్ చెబుతాడు చూశారా మీ సినిమా టార్చర్ భరించలేక తన కీచుగొంతుతో ఎలా అరుస్తోందో..ముందు మీరు పాకప్ అని భీమేశ్ ని తమ వాన్లోకి ఎక్కించి జూలో చింపాంజీ ల మధ్య వదిలిపెడతారు..

తన సినిమా ప్రహసనం ఇంత దారుణంగా ఉందని అర్ధమయ్యాక నిజంగానే నెత్తిన చెంగేసుకున్నాడు చెంగు.!!