Facebook Twitter
తెలుగువారి తక్షణ కర్తవ్యం


తెలుగువారి తక్షణ కర్తవ్యం

 

“ఒకానొక సమయంబున, వైకుంఠవాసుని నాభి కమలోద్భవుండు, వాగ్దేవి వల్లభుండు, సృష్టికర్త యైన బ్రహ్మదేవుని మనంబున నొక చింత పొడసూపె. అదేమన --'అహం' అనే దేహాభిమానంబుగల మోహము, భోగేఛ్ఛలు, క్రోధము, తామిస్రము, చిత్త విభ్రమంబను అవిద్యాపంచక మిశ్రమముగా దాను సర్వభూతంబుల సృష్టించిన  పాపకార్యంబు వలన, పశ్చాత్తాప మానసుండై చింతా క్రాంతుడయ్యె . ఆపాప నివృత్తికై చిర కాలంబు మహా తపంబున మునింగి పవిత్ర మానసుండై ఉండ, నా సమయంబున నల్గురు మానస పుత్రులుదయించ, వారు ధీర జనోత్త ములు, పవిత్ర మానసులు, ఊర్ధ్వరేతస్కులు, పరమ పవిత్రులు, సత్వగుణ బద్ధులైన- సనక, సనందన, సనత్కుమార, సనత్సు జాత మహర్షులు.

వారు జనించగనే పితృదేవుండైన బ్రహ్మకు నమస్క రించ, బ్రహ్మవారితో "కుమారులారా! మీరు నల్గురునూ మీ అంశలచే సృష్టి కార్యము జేసి నాకు సహకరింపగలరు" అన, దానికి వారు "పితృదేవా ! మాకు సృష్టి కార్యంబుతో బనిలేదు. అది నీ విధి. నీవు నిరంతర భగవత్ ధ్యానంబున మునింగి ఆధ్యానామృతంబు నుండీ మమ్ము సృష్టించితివి. మేము మోక్ష ధర్ము లము, భగవత్ ధ్యానమే మా విధి విధాయకముగావున మేము జనలోకంబుల కేగి, కామరూపులమై , సర్వ లోకంబులందిరుగుచూ, హరిధ్యాన తత్పరులమై ఉందుము. మమ్ము తలంచి నంతనే నీ చెంతకు రాగలము." అని సెలవు గొని జనిరి.----“ అంటూ పురాణం చదివి ---

   ‘ ఓంకృష్ణాయన్నమః, సర్వం శ్రీకృష్ణపాదార్పణమస్తు, హరిః ఓం శాంతి శాంతి శాంతిః" అని పురాణ పారాయణం ముగించి హరికి నమస్కరించింది నాగాంబ బామ్మ. శ్రోతలంతా నాగాంబ బామ్మకు నమస్కరించి "నాగాంబ గారూ! మీ ఋణం తీర్చుకోలేనిదండీ! ఇలాంటి తెలుగు భాష విని ఎంత కాలమైందండీ ! స్వఛ్ఛమైన  భాష . గొప్ప గ్రంథాన్ని సంపాదించి మాకు చదివి వినిపించి నందుకు మీకు ధన్యవాదాలు." అని ఒక శ్రోత శ్రావణి అనగా, "ఈ భాష నాకసలు అర్ధమే కాందే! ఇంత కఠినమైన భాషలో గ్రంథాలు రాస్తే ఎవరు చదువుతారు?" అని మరో శ్రోత  అమల అంది .

"కష్టమనుకుంటూ తెలుగుభాష లోని 56 అక్షరాలను కుదించి కుదించి , ప్రస్తుతం వాడుకలో 12 అచ్చులు,  31 హల్లులు, మొత్తం 43 అక్షరాలున్నాయంటారు, కానీ వీటిలోనూ, తెలుగు మాతృభాషగా వున్న ఒక్కరు కూడా స, శ, ష అక్షరాలను సరిగా వాడరు, మూడింటినీ ఒక్క అక్షరంతోనే సరిపెడతారు- ‘షారద [శారద], షర్వాణి [శర్వాణి], షరస్వతి [సరస్వతి], షాలిని [శాలిని], సన్ముక [ఖ] ఇలా వాడుతున్నారు. క్ష-అసలు పలకటం రాదు, క్షమ కు షమ, ణ నోరు తిరగదు, గణపతికి- గనపతి, పెళ్ళికి- పెల్లి, ధ, థ లకు భేదం తెలీదు, ‘భేధం’ అంటారు. భర్త, అని ఒక్కరూ పలకలేరు బర్త. అని తప్ప. వత్తులు పలకను నోరు తిరగదు. ఇహ భాష  ఏమాత్రం బ్రతుకుతుంది చెప్పండీ!

పలకడం చేతకాదని తగ్గించుకుంటూ వెళ్ళి తెలుగు భాషనే చంపేస్తున్నాం. అందు కే ఇలాంటి స్వఛ్ఛ తెలుగు భాషాగ్రంథాలు చదువుతూ వింటూ ఉంటేనన్నా కాస్తంత తెలుగును బ్రతికించుకున్నవారమవుతాం. ఆంగ్లభాష మనందరికీ ఎలా వచ్చిందీ? అభ్యసిస్తేనే కదా! దానిమీద ఉన్న ఆసక్తి స్వంత భాషమీద లేక పోడమే దీనికి కారణం. మీరు రోజూ చదవండి, మేము ఆ ముగింపులేని  టీ.వీ సీరియల్స్ బారిన పడకుండా ఇలా సత్కాలక్షేపమైనా చేస్తాం. నాగాంబ గారూ!" అని అనసూయమ్మ సుదీర్ఘంగా తన అభిప్రాయం వెలిబుచ్చింది.  

తమిళనాడు [చెన్నై]లో ముఖ్యభాష తమిళం. ఇద్దరు తమిళులు చేరితే చక్కగా వారి భాషలోనే మాట్లాడుకుంటారు అందరి ముందూనూ. అదే భాషాభిమానం.”
“నిజంమరి. మన తెలుగువారు పదిమంది చేరి ఆంగ్లంలో మాట్లాడుకోడం మనం చూస్తాం మాతృభాషలో మాట్లాడటం తలవంపు."

"కాదు కాదు భాష రాదు. చిన్నతనం నుండీ కాన్వెంట్లలో  చదువుతూ మాతృభాష మరచిపోయి మాట్లాడితే తప్పులు దొర్లుతాయని ఆంగ్లంలోనే మాట్లాడుతున్నారు. చదవక ముందు ‘పెసల’న్నవాడు చదివాక ‘పిసల’న్నట్లు’ ఉంటుందనివారి భయం."


"తెలుగులో మాట్లాడారని ఆంగ్లం నేర్పుతామనే కాన్వెంట్స్‌లో పిల్లల్ని విచక్షణారహితంగా శిక్షించడం పత్రికల్లో, వార్తల్లోచూస్తున్నాం కదా!  ఈ రోజుల్లో ఆంగ్ల భాషా ప్రాధాన్యత ఎక్కువే ఐనా మాతృభాషను చంపేంతగా మనం రుద్దుకోడం మంచిదంటారా!".

" విద్య, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించినంత వరకూ నేర్చుకోవలసిందే. ఒక్కవిషయం గమనించండి. ఆంగ్లభాషకు 26 అక్షరాలున్నాయి, మన తెలుగుతో పోల్చుకుంటే పూర్వం మనకున్న 56తో మనకు 30 అక్షరాలు ఎక్కువ! ఆంగ్లంలోని 26లో ఒక్క అక్షరం తగ్గించకపోగా ఆంగ్ల నిఘంటువులు రోజు రోజుకూ పెరిగి పోతున్నై. తెలుగు నిఘంటువు కోసం  మేము పుస్తకాల షాపులన్నీ గాలించాం . దొరకడమే లేదు. తగ్గి పోతున్నై. నేడు గ్రంథాలయాల్లోనూ నిఘంటువుల కొరత ఉంది . కాదంటారా!"

"అసలు తెలుగు బళ్ళలో సైతం ఒక్క శతకం కూడా చెప్పట్లేదు, ఐదు క్లాసులు చదివినా ఒక్క పది తెలుగు పద్యాలు కంఠతా రావు కదా!".

 “అంతెందుకండీ! పదో తరగతి విద్యార్థిని తప్పుల్లేకుండా ఒక్క తెలుగు పద్య వ్రాయమనండి చూద్దాం. రామాయణమంటే తెలీదు. భారతమంటే తెలీదు. ఏవో సినిమాలు చూసిన వారు కాస్త పేర్లు మాత్రం తెల్సుకుంటున్నారు."


"అసలు  తెలుగు బళ్ళేవండీ!"                                                            

 " మేము గత సంవత్సరం అమెరికా మా పిల్లవాడి దగ్గర కెళ్ళినపుడు ‘టార్గెట్‘కెళ్తే అక్కడ తెలుగు మాట్లాడుతున్నవారిని చూస్తే విని ప్రాణం లేచొచ్చిందంటే నమ్మండి. మనస్సుల్లో ఉన్న భాషాభిమానాన్నీ, ప్రేమనూ, దాన్ని  బ్రతికించడంలో మన వంతు కృషి చేయకపోడం మన బలహీనత కాదంటారా?"

 “విదేశాల్లోని తెలుగు వారు తమ మాతృభాషకు సేవ చేయటం చూస్తుంటే సిగ్గేయటం లేదూ! తెలుగు బళ్ళు పెట్టి పిల్లలకు తెలుగు నేర్పి స్తున్నారు. తెలుగు వెబ్ పత్రికలు నడుపుతున్నారు. ఉగాది పండుగ ఘనంగా చేసుకుంటున్నారు, ‘పాడుతా తీయగా’  అనే బాలసుబ్రహ్మణ్యం గారి  ప్రోగ్రాంకు ఎందరు తెలుగువారు వచ్చి, తెలుగు పాటలు పాడారో చూస్తున్నాం కదా! మనం మాత్రం ఆంగ్లం మాత్రమే మట్లాడమని మన పిల్లల్ని బలవంతపెడుతున్నాం”

"చక్కగా చెప్పారు. అంతెందుకండీ! మొన్నమా బాబాయ్ గారింటి కెళ్తేవాళ్ళ మనవలకి తెలుగులోమాట్లాడితే అర్ధంకాలేదు. ఏమం టారు?" 
          
   " ఇది కాస్మోపాలిటన్ సిటీ కదండీ! ఆంగ్లం తప్పని సరి."                                                           
"నిజమే కానీ మాతృభాష కొంతైనా రాకపోతే ఎలా గండీ! ‘మీ నాన్నగారున్నారా ‘ఇంట్లో? అనే మాట కూడా తెలీకపోతే ఎలాగండీ! "     

 "మన తెలుగు దేశంలో-- పార్టీ కాదండీ బాబూ ! ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమంది మంచి తెలుగు మాట్లాడుతున్నారో చెప్పండి!”

"సరి సరి , ఇహ మన కర్తవ్యం గురించీ మాట్లాడండి."                                                              
 "మనం మన ఇళ్ళలో ఆంగ్లంలో కాకుండా తెలుగులో మాట్లాడటం ముందుగా అలవరచుకోవాలి.."


“అందరి ఇళ్ళలో మూల పడేసి ఉన్న తెలుగు పుస్తకాలు పూర్వకాలపు చందమామ బాలమిత్ర, బొమ్మరిల్లు వంటి బాలల పుస్తకాలు, పురాణ గ్రంథాలు కూడా సేకరించి ఒక గ్రంథాలయం ఏర్పరుద్దాం."          


" మా ఇంట్లో నా ఈ పెద్ద గది ఖాళీనే, మీకంతా ఇష్టమైతే ఇక్కడే ఆ గ్రంథాలయం ఏర్పర్చవచ్చు. "అంది నాగమ్మ.

 "ఇలా గ్రంధపఠనాలు, సత్కాలక్షేపాలు, సత్సంగాలు అచ్చతెలుగులో జరగాలండీ! మన కాలనీ అంతాతిరిగి అందర్నీపోగేద్దాం. ఉగాదికి తెలుగు శతక పద్యాలు, భాగవత పద్యాలు,నీతి పద్యాల పోటీలు పెడదాం.ఉచిత తెలుగు తరగతులు అమెరికా సిలికానాంధ్రలో లాగా నిర్వహిద్దాం. మంచి బహుమతులు ఏర్పరుద్దాం,ఉడతాభక్తిగా మాతృభాష సేవచేద్దాం. మంచి తెలుగు వక్తలను పిలిపిద్దాం. తెలుగు గురించిన అవగాహన, అవసరం తెలియ పరుద్దాం. విశ్రాంత కాలంలో మన మాతృభాషకు కొంతైనా సేవ చేసి తరిద్దాం. మాతృ భాషఇంకి పోకుండా చూడ్డం మన బాధ్యతగా, కర్తవ్యంగా భావిద్దాం. మాతృమూర్తిని, మాతృభాషను, మాతృ దేశాన్నీ మరచిన వాడికి నరకం తప్పదని చాటి చెపుదాం." ఆవేశంగా అంటున్న ఆనందరావును కరతాళధ్వనులతో అంతా అభినందించారు.
 
అంతా గట్టి నిర్ణయం తీసుకుని కర్తవ్యోన్ముఖులై ఇళ్ళదారి పట్టారు .   
 

-ఆదూరి హైమవతి