Facebook Twitter
దైవం గురు రూపేణ

దైవం గురు రూపేణ

 ఒక చిన్న కథ. ఓ వ్యాపారవేత్త పనిమీద బయల్దేరతాడు. కారులో రోడ్డు మీద ప్రయాణం. మధ్యలో  భోజనానికని ఓ ఊరిలో ఆగుతాడు. అక్కడ ఓ చిన్న హోటల్ కనిపిస్తే అక్కడకి వెళ్తాడు.  కావల్సినవి ఆర్డర్ చేసి ఎదురుచూస్తుండగా, సడన్‌గా వెయిటర్స్, హోటల్ యజమాని అందరూ బయటకి పరిగెత్తడం చూస్తాడు. ఏమయ్యింది, ఎందుకిలా పరిగెడుతున్నారు అనుకుంటాడు. కాసేపటికి వాళ్ళంతా ముందు నడుస్తూ వెనక ఎవర్నో గౌరవంగా తీసుకురావడం చూస్తాడు. ఆ వెనక ఎవరు వస్తున్నారు? ఎందుకు వీళ్ళంతా ఇంత కంగారుగా పరిగెట్టారు? అంత వినయంగా ఎందుకు చేతులు కట్టుకుని నిల్చున్నారు... ఇలాంటి బోలెడన్ని సందేహాలతో ఆ వచ్చే వాళ్ళెవరో తెలుసుకోవాలనే ఆతృతతో లేచి నించుని తలుపు వైపు చూస్తాడు అతను.

అతనికి అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యం వేసింది. కారణం అక్కడ ఓ వృద్ధురాలు మెల్లగా నడుస్తూ వస్తోంది. ఆమె బ్యాగు, శాలువా లాంటివి పట్టుకుని ఆ హోటలు యజమాని ఆమె  పక్కనే నడుస్తున్నాడు. ఆమెని గౌరవంగా తీసుకొచ్చి ఓ టేబుల్ దగ్గర కూర్చోబెట్టాడు. ఆమెకి కావలసినవి అడిగి స్వయంగా తేవడానికి కిచెన్‌లోకి వెళ్ళాడు. పక్కనుండి వడ్డించాడు. ఆమె తింటున్నంతసేపూ ఆమెతో కబుర్లు చెబుతూ పక్కనే  చేతులు కట్టుకుని నిల్చున్నాడు. ఇదంతా చూస్తున్న వ్యాపారవేత్తకి ఆవిడ ఎవరో ఏమిటో తెలుసుకోవాలన్న తాపత్రయం కలిగింది. ఓ వెయిటర్‌ని పిలిచి ఆవిడ ఎవరు? ఎందుకు అందరూ అంత గౌరవిస్తున్నారు అని అడుగుతాడు. ఆ వెయిటర్ ఓ పదినిమిషాలు ఆగండి - ఆమెని పంపించి వచ్చి చెబుతాను అంటాడు.

ఆ తర్వాత ఆమెని కారుదాకా వెళ్ళి సాగనంపి వచ్చిన ఆ హోటల్ యజమాని వ్యాపారవేత్త దగ్గరకి వచ్చి, ఆమె ఎవరు.. ఎందుకంత గౌరవిస్తున్నామని అడిగారట కదా.. ఆమె మా టీచరు అంటాడు. అందుకు ఆ వ్యాపారవేత్త ‘‘ఓస్ టీచరా‌?’’ ఇంకెవరో అనుకున్నా అంటాడు. అదేంటి అలా తీసిపారేశారు? ఆమే లేకపోతే నేనీరోజు ఇలా వుండేవాడిని కాదు. నేనేకాదు ఎన్నోవేలమంది ఈరోజు జీవితంలో సుఖంగా, సంతోషంగా ఉన్నారంటే కారణం ఆవిడే అంటూ ఆమె గురించి చెబుతాడు.

మేం స్కూల్ ఫైనల్లో వుండగా వచ్చారీ టీచరు. మా స్కూలుకి, మా క్లాస్‌లో వుండే బ్యాచ్‌కి అల్లరి పిల్లలని, మొండి ఘటాలని పేరు. ఏ టీచర్ వచ్చి ఏం చెబుతున్నా మాకు లెక్కే లేదు. మా గోల మాది. టీచర్లంతా తెగ కొట్టేవారు, తిట్టేవారు. ఇంట్లోనూ అంతే. ఛీ, ఛాలకి అలవాటు పడిపోయాం. అలాంటిది ఈ టీచరు వచ్చిన ఓ నెల తర్వాత మమ్మల్ని ఒక్కొక్కళ్ళని పిలిచి ఒక పేపరు ఇచ్చారు. ఏంటని తీసి చూస్తే అందులో నా పట్టుదలని, హాస్య ప్రియత్వాన్నీ మెచ్చుకుంటూ రాశారు.  అలా ఎవరెవరిలో ఏవి బెస్ట్ క్వాలిటీస్ అనుకుంటున్నారో అవి రాశారు. మమ్మల్ని ఎవరైనా మెచ్చుకోవడం అన్నది అదే మొదటిసారి. మాలో మాకే తెలియని లక్షణాలని ఆ టీచరు గుర్తించారు. ఇలా ప్రతి నెలా ఓ పేపర్ మీద మాలోని మార్పులు, మాలోని మంచి గుణాలు రాసి ఇచ్చేవారు. రానురాను ఆమె రాసిచ్చే ఆ కాగితాల కోసం మేమంతా ఎదురుచూసేవాళ్ళం. మనల్ని ఎవరైనా మెచ్చుకుంటే మనకి తెలియకుండానే మని ఇంకా మెప్పుని పొందాలని ప్రయత్నిస్తాం. అదే జరిగింది మా విషయంలో కూడా.

ఇలా ఓ సంవత్సరం అయ్యేసరికి మా బ్యాచ్ అందరికీ స్కులులో మంచి పేరు వచ్చింది. మంచి మార్కులు వచ్చాయి. ఇన్ని సంవత్సరాలు అంతమంది తిట్టి, కొట్టి సాధించలేనిదాన్ని ఒక్క మెచ్చుకోలుతో ఈ టీచరు సాధించారు. మేం బయటకి వచ్చేసేరోజు మా అందరికీ ఓ బైండ్ బుక్ ఇచ్చారు. అందులో ఆ సంవత్సరంపాటు టీచర్ మాలోని లక్షణాలని మెచ్చుకుంటూ మాకిచ్చిన కాగితాలు బైండ్ చేసి వున్నాయి. ఎప్పుడూ మామీద మాకు అపనమ్మకం కలిగినా మాలోని బెస్ట్ క్వాలిటీలు ఏంటో గుర్తు చేస్తుంది ఈ పుస్తక... అంటూ టీచరు ఆరోజు మాకు చెప్పిన ఆ మాటలే, ఆ నమ్మకమే, ఆ మెచ్చుకోలే ఈరోజు మమ్మల్నందర్నీ మంచి పొజీషన్‌లో వుంచింది. ఇప్పుడు చెప్పండి.. ఆమె అంతటి గౌరవానికి అర్హురాలా.. కాదా?

నిజమే ఈరోజు మనం ఎవ్వరం ఎక్కడున్నా, ఏ స్థాయిలోవున్నా నిస్సందేహంగా దానికి కారణం మనకి విద్య నేర్పించిన ఆ గురువులే! వారి ఒక చిన్నమాట మనలో ధైర్యాన్ని, ఆశని, ఆకాంక్షని నింపి మన కలల వెంట మనం పరుగులు పెట్టేలా చేసింది. అందుకే వారికి కృతజ్ఞతలు చెప్పాల్సిన ఈ రోజున ఒక్కసారి వారందరినీ మనసారా స్మరించుకుందాం.

గురుపూజోత్సవ శుభాకాంక్షలు.

 
 
- రమ ఇరగవరపు