Facebook Twitter
జూదం

జూదం

 


                              
         

సింగమనేని నారాయణ


         
రాయలసీమ భాషకు, జీవితాలకు తెలుగు కథా సాహిత్యంలో పెద్దపీట వేసిన వారిలో సింగమేని నారాయణ ఒకరు. వారి కథల నిండా ఇంతవరకూ సాహిత్యంలోకి అడుగుపెట్టని పాత్రలు, వారి జీవితాలు కనిపిస్తాయి. సామాన్య ప్రజల కష్టనష్టాలను యదావిధిగా మనకళ్లకు కడతాయి ఆ కథలు. ఎక్కడా ఊహలు, అతిశయోక్తులు కనపడని సరళసుందరమైన కథలు వారివి. ప్రజల బ్రతుకుల్ని అక్షరాల్లో ముంచి వెన్నెల్లో ఆరేసి, మన గుండెల్లో నిక్షిప్తం చేస్తాడు. ఇలాంటిదే జూదం కథ. రాయలసీమలో వ్యవసాయం చేస్తున్న రైతుల దుస్తితిని, దైన్యాన్ని వివరిస్తుంది ఈ కథ. మన హృదయంలో కన్నీళ్లను పూయిస్తుంది.
            జూదం కథ నారప్ప అనే రైతు చుట్టూ తిరుగుతుంది. అతని వ్యవసాయ జీవితాన్ని, సాదకబాధల్ని, వాటి లోతుపాతుల్ని మనకు చూపుతుంది. తండ్రి ఆస్తి భాగాలు పంచుకోగా నారప్పకు పది ఎకరాలు వస్తుంది. దాని సాగుచేసుకుంటూ ఉంటాడు. అనేక అప్పులు చేసి పండించిన పంట... రాగులు, జొన్నలు ఇంటికి వచ్చి ఉంటాయి. కానీ రేటు మరీ తక్కువుగా ఉండటంతో అప్పులకు కట్టడానికీ చాలవని అమ్మకుండా ఇంట్లోనే పెట్టి ఉంటాడు. బుద్ది వచ్చినప్పట్నుంచీ కష్టపడుతూనే వున్నాడు. పంటలు పండిస్తూనే వున్నాడు. అయినా యిదేం విచిత్రమో ఓమైన అప్పు పెరుగుతూనేవుంది. ఇదంతా తల్చుకొని ఏం సేద్యమో ఏం పాడో గడియ తీరిక లేదు, దమ్మడీ ఆదాయం లేదు అని బాధపడుతూ ఉంటాడు.  పొలానాకి బయల్దేరిన నారప్పకు బట్టల దుకాణం శేషయ్య ఎదురొచ్చి ఇవ్వాల్సిన అప్పు అడుగతాడు. తోటలో పుల్లలు ఏరుకోడానికొచ్చిన ఎల్లమ్మ చేసిన అప్పుకోసం తన కొడుకును  మున్నూటికే జీతగాడికి ఉంచాను అని నారప్పతో చెప్పి తన బాధను ఎల్లబోసుకుంటుంది. కూరగాయల పాదుకు నీళ్లు పెడదామని పోతే కరెంటు ఉండదు. దాంతో కరెంటు బిల్లు టంచెనుగా కట్టాలి. కరెంటు మాత్రం పల్లెలకు ఇవ్వరు అని విసుక్కుంటాడు. అంతలో బాంకువాళ్లకు కట్టాల్సిన అప్పుగుర్తుకొస్తుంది. దాంతో తను కట్టాల్సిన అప్పులు మొత్తం మనసులో లెక్కవేసుకుంటాడు. రామశేషయ్యకు ఎంతలేదన్నా యిన్నారు... గానుగచెక్క బాకీ నూరు... కిరాణా సరుకులు తెచ్చిన  ఎంగటేసులశెట్టి అంగిట్లో మున్నూరు... మూడునెల్లు కరెంటు బిల్లుకు శివయ్యతో తెచ్చింది నూటయైభే... యీ నెలకట్టే బిల్లు యూభై... ఇలా లెక్కించుకుంటూ మొత్తం ఒక్క వెయ్యీ నూరు అని తేల్చుకున్నాడు. ఇవి తక్షణం అవసరాలు. తీర్చకపోతే మర్యాద దక్కదు.
         ఇలా ఆలోచనలో ఉండగానే తొమ్మదేళ్ల కొడుకు పరుగుపరుగున వచ్చి బ్యాంకువాళ్లు వచ్చారు అని చెప్తాడు. నారప్ప గాబరా గాబరాగా ఇంటికెళ్తాడు. వాళ్లకు ఎంత నచ్చజెప్పినా ఫలితం ఉండదు. చివరకు వాళ్లలో ఒకాయన మీలాంటి మర్యాదస్తుల యిండ్లకాడ జప్తుగిప్తు అంటే ఏమన్నా బాగుంటుందా అని చివరి అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. దాంతో నారప్ప చేసేది ఏమీలేక ఊర్లో గింజలు కొనే శివయ్యకు జొన్నలు, రాగులు అమ్మడానికి సిద్ధపడతాడు. కానీ శివయ్య అదే అదునుగా తక్కువరేటుకు కొంటాడు. పైగా నువ్వు గుయ్ గుయ్ అంటే బాగుండదు- మూటకు రెండున్నర బండి బాడుగా, రూపాయి వాణిజ్యం పన్నూ తీసివేసే ధర కడతా అని చెప్తాడు.
           బ్యాంకు వాళ్ల అప్పుతీర్చగా నారప్పకు 750 రూపాయలు మిగులుతాయి. శివయ్య అవి కూడా మొత్తం ఒకసారి ఇవ్వకుండా ఐదునూర్లు ఇచ్చి మిగిలినవి రెండు మూడు రోజుల్లో ఇస్తానంటాడు. ముందు సంవత్సరం ధర ఉంటే 2000 అన్నా వచ్చేది అని బాధపడుతూనే ఊర్లో ఉన్న అప్పులు కొన్ని తీరుస్తూ పోగా చివరకు నలభైఐదు రూపాయలు మిగులుతాయి నారప్పకు. యూరియా, కరెండు బిల్లు, పండగకు కొత్తబట్టలు... అన్నీ మల్లా అప్పు చేయ్యాలా... అని ఆలోచనతో ఇంటికి వస్తూ ఉంటాడు. రాగనే ఇంటిదగ్గర కరెంటు బిల్లుకోసం అనంతపురం నుంచి వచ్చిన రామ్మూర్తి వెంటనే బాకీ ఇవ్వాలి అని అడుగుతాడు.    
               కథలో రైతు జీవితాన్ని క్రమ పద్దతిలో చెప్పి అద్బుతమైన శిల్పాన్ని పో షించాడు సింగమనేని నారాయణ. కథ మొదట అప్పు... పంటచేతికొచ్చినా అప్పు తీరలేదని చివరలో మరో అప్పు ప్రస్థావన. ఇలా ప్రారంభ, ముగింపుల అనుసంధానం చేశారు రచయిత. మధ్యలో వ్యాపారి శేషయ్య, శివయ్యలు ఆర్థికంగా రైతు వల్ల ఎదుగుతున్నా రైతు జీవితం మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నదని చెప్పాడు. అదే విధంగా ఎల్లమ్మ పాత్ర ద్వారా కూలీల జీవితాన్ని చెప్పే ప్రయత్నం చేశాడు. మొత్తం మీద ఈ కథ శిల్పంలో వదిగిపోయిన సీమ రైతు జీవితచిత్రం. ముగింపు కొసమెరుపులా ఉండాలన్న కథా నియమావళికి ... ఈ కథలో కరెండు బిల్లు రామ్మూర్తి రావడాన్ని ఉదాహరణగా చెప్పొచ్చు.
          ఇక భాష విషయానికి వస్తే రాయలసీమ భాషను నారాయణ అద్భుతంగా కథలో వాడారు. నీ బాకీ నిలపల్లని వుందా, కటినికట్టుగా అడుగుతున్నాను, పాతికో పరకో వాళ్ళ దగ్గరే చేబదుళ్లు, మెడకేస్తే కాలికి, కాలికేస్తే మెడకి, జమలు ఇవ్వాల్సిన డబ్బు ... ఇలాంటివి ఎన్నో కనిపిస్తాయి కథలో. శివయ్య ఇంటికి వెళ్లిన నారప్పకు గోడమీద వేలాడుతున్న వెంకటేశ్వర స్వామి ఫొటో సంవత్సరానికి సంవత్సరానికి పెద్దదవుతుందోమో అనే అనుమానం కలుగుతుంది. దీని ద్వారా అతను ఎలా సంపాదిస్తూన్నాడో పాఠకులకు అర్థం అయ్యేలా చేశాడు రచయిత. ఇక చివరిగా కథా శీర్షిక గురించి చెప్పుకుంటే- సింగమనేని నారాయణ వ్యవసాయం జూదంలా తయారైందని చెప్పడానికి ప్రతీకాత్మకంగా ఈ పేరు పెట్టి ఉంటాడు. ఇలా ఈ కథ వాస్తవ రైతు జీవన వరిస్థితులకు దర్పణం....     

                                                     డా. ఎ.రవీంద్రబాబు