Facebook Twitter
ముళ్లపూడి వెంకటరమణ

ముళ్లపూడి వెంకటరమణ
       

- డా.ఎ.రవీంద్రబాబు

 

       

  తెలుగు కథకు హాస్యాన్ని జోడించారు. సున్నితమైన వ్యంగ్యాన్ని అలంకరించారు. సరికొత్త పదాలను తెలుగు భాషకు అరువిచ్చారు. మన వాకిళ్లలో తిరిగే ఎన్నో పాత్రలను మనకోసం నూతనంగా సృష్టించారు. జీవితంలో ఎన్నో లోతులను చూసి ఆ బాధలను నవ్వులతో ప్రేక్షకుల మదిలో పూయించారు. బాపు బొమ్మకు తన రాతతో వెండితెర ఎక్కించారు. బాపు, రమణల స్నేహం అజరామరం అని స్నేహానికి చిరునామాగా మారారు. అతనే తెలుగువారి ప్రియ కథకుడు, సినిమా రచయిత ముళ్లపూడి వెంకటరమణ.
        ముళ్లపూడి వెంకరమణ జూన్ 28, 1931లో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరున్న ధవళేశ్వరంలో జన్మించారు. వీరి అసలు పేరు ముళ్లపూడి వెంకటరావు. చిన్నతనంలోనే తండ్రి చనిపోయారు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల మద్రాసులో 5,6 తరగతులు... 7, 8 తరగతులు రామండ్రిలో చదువుకున్నారు. ఎస్సెల్సీ పూర్తికాాగానే అనేక చిన్నాచితక ఉద్యోగాలు చేశారు. తర్వాత ఆంధ్రపత్రికలో సబ్ ఎడిటర్ గా చేరారు. పత్రికలో సినిమా రిపోర్టరుగా ఉన్న సమయంలోనే సినీ రచయితగా అవకాశం వస్తే వెండితెరవైపు అడుగులు వేశారు. ఆపై ఎన్నో సినిమాలకు కథ, మాటలు అందించారు. నిర్మాతగా కూడా చిత్రాలు నిర్మించారు. ఎక్కువ సినిమాలకు బాపుతో కలిసి పనిచేశారు.
        అసలు స్కూల్లో చదివే రోజుల్లోనే రమణ వ్యాసరచన, వక్తృత్వం లాంటి పోటీలలో పాల్గొనేవారు. నాటకాలు కూడా వేసేవారు. 1945లోనే వీరి మొదటి కథ అమ్మమాట వినకపోతే బాలపత్రికలో అచ్చయ్యింది. సొంతగా ఉదయభాను పత్రికను కొంతకాలం నడిపారు. వీరు ఆంధ్రపత్రికలో పనిచేస్తున్న రోజుల్లోనే బుడుగు పాత్రన సృష్టించారు. ఇది తెలుగు సాహిత్యంలో ఓ మైలురాయిగా నిలిచిపోయింది. ఇప్పటికీ బాలసాహిత్యంలో బుడుగు ప్రముఖ స్థానం వహిస్తున్నాడు. వీరి రచనలు-
        ముళ్లపూడి వెంకటరమణ కథలు - 6 (1964)
        వేట కథలు - 4 (1966)
        రాజకీయ భేతాళ పంచవింశతి - 25 (1977)
        విక్రమార్క సింహాసనం కథలు - 25 (1978)
        జనతా ఎక్స్ ప్రెస్ - 5 (1979)
        రాధాగోపాలం కథలు - 5 (1980)
        ఋణానందలహరి - 23 (1981)
        భగ్నవీణలూ భాష్పకణాలు - 7 (1981)
        సీతాకళ్యాణం - 10 (1982)
        వీరి తర్వాతి రచనలను కలిపి విశాలాంధ్ర వారు 8 సంపుటాలుగా ముద్రించారు.
        కోతికొమ్మచ్చి పేరుతో స్వాతి వారపత్రికలో జీవిత చరిత్రను రాశారు.
        ముఖ్యంగా 1950-60ల నాటి నగరాల్లోని జీవితాలే వీరి కథల్లో కనిపిస్తాయి. రాజకీయాలు, అప్పులు, ఆకలి, నిరుద్యోగం, ఫలించని ఆశలు, కొత్తజంటల మధ్య వచ్చే తగాదాలు, కుటుంబాల గోలలు... ఇలాంటివే వీరి కథా వస్తువులు. స్వయంగా రమణ అనుభవించిన పేదరికం, ఆకలి ఆకలీ - ఆనందరావు కథలో, నిరుద్యోగం యువరాజు - మహారాజు కథలో ప్రతిబింబిస్తాయి. మధ్యతరగతి జీవితాలు, ఇరుకు గదులు వీరి జనతా ఎక్స్ ప్రెస్ కథలో, సినీ అనుభవాలు విక్రమార్కుని మార్కు సింహాసనం కథల్లో ఉన్నాయి. వీరి కథల్లో హాస్యం, వ్యంగ్యం తొణికిసలాడుతూ ఉంటుంది. వైవిధ్యం, వైరుధ్యుంతో కూడిన తెలుగు పదాలు, పలుకుబడులు, పాత్రలు సృష్టించడం ముళ్లపూడి వెంకటరమణకు చేతనైనంతగా మరొకరికి చేతకాదేమో... అందుకే వీరి హాస్యం పన్నీరు చిలికినట్లు ఉంటుంది అంటారు విమర్శకులు. అసలు వీరి హాస్య కథలు దుఃఖానికి నకళ్లు.
          బుడుగు విషయానికి వస్తే మాత్రం అదో అద్భుత సృష్టి. ఈ బొమ్మ నేను, నా పేరు బుడుగు. ఇంకోపేరుంది పిడుగు... ఇంకో అస్సలు పేరుంది. ఇప్పుడు చెప్పడానికి టైము లేదు. కావలిస్తే మా నాన్నని అడుగు... అని తన గురించి తను పరిచయం చేసుకుంటూ తెలుగు సాహిత్యం లోకి బుడుగు వచ్చాడు. ఈ చిచ్చర పిడుగు బుడుగుతో పాటు లావుపాటి పిన్నిగారు, సీనాగ పెసూనాంబ, రాధ, గోపాళం, రెండు జడల సీత, పక్కింటి పిన్నిగారి మొగుడు, అప్పారావు, గుర్నాధం ... ఇలా ఎంతో మంది రమణ గారి కలం నుంచి వచ్చేశారు.    
      రమణ పత్రికల్లో ఉన్నప్పుడే బాపుగారితో పరిచయం ఏర్పడింది. తర్వాత ఆ పరిచయం స్నేహంగా మారి వెండితెరను వెలిగించింది. ఎన్నో అపూర్వమైన చిత్రాలను మనకు అందించింది. రమణ మాట, బాపు గీత అనేలా పేరొచ్చింది వారిద్దరికి. రమణ రక్తసంబంధం చిత్రం ద్వారా తెలుగు సినిమాకు పరిచయం అయ్యారు. దాగుడు మూతలు చిత్రానికి కథను అదించారు. 1967లో సాక్షి సినిమాను నిర్మించారు. తర్వాత పంచదార చిలుక, ముత్యాల ముగ్గు, గోరంతదీపం, మనవూరి పాండవులు, రాజాధిరాజు, పెళ్లిపుస్తకం, మిస్టర్ పెళ్లాం, రాధాగోపాళం,  శ్రీరామ రాజ్యం లాంటి ఎన్నో చిత్రాలకు పని చేశారు. మొత్తం మీద 60 సినిమాలకు మాటలు, 25 సినిమాలకు కథలు అందించారు.
       ఎన్ని చిత్రాలకు పనిచేసినా... రమణ డైలాగు సెటైరై పేలింది. తెలుగు ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించింది. అవసరమైన చోట పదనుగా మారింది. కన్నీరు వొలికించింది. భక్తకన్నప్ప చిత్రంలో- మూడో కన్నంటే వెలుగు, మనలోపలి చీకట్లో వెలిగే చిన్నదీపం. నీ తప్పు నువ్వు తెలుసుకో- ఎదుటి వాడి గొప్పని ఒప్పుకో. అప్పుడే చీకటి చెదిరి పోతుంది... అప్పుడు నువ్వే శివుడివి. ఆ చూపే మూడో కన్ను. అన్న సంభాషణ ప్రతి మనిషికీ వర్తిస్తుంది. ఇదే విధంగా ముత్యాలముగ్గు చిత్రంలో రావుగోపాలరావు పలికే డైలాగు ఎప్పటికీ తెలుగు ప్రేక్షకులు మర్చిపోరు. అలో... అలో... లో... ఆకాశంలో మర్డరు జరిగినట్టు లేదూ... సూర్యుడు కందగడ్డలా లేడూ అన్న మాట చాలు రమణ కలం గొప్పతనం తెలియడానికి. ఆ సినిమాలోనే ఎప్పుడూ ఎదవ బిగినెస్సేనా... మడిసన్నాక కుసంత కళాపోసనుండాలి. తిని తొంగుంటే గొడ్డుకూ మనిసికి తేడా ఏముంటాది. అన్న మాటలు నేటికీ ప్రజల నోళ్లలో నానుతూనే ఉన్నాయి. వీరు రాసిన సీతాకళ్యాణం లండన్ ఫిల్మ్ ఇనిస్ట్యూట్ లో పాఠ్యగ్రంథంగా ఉంది. మిస్టర్ పెళ్లాం చిత్రానికి సంభాషణా రచయితగా నంది అవార్డు కూడా వచ్చింది.
             తిరుప్పావై, శ్రీ కృష్ణలీలలు... ఇలా ఏది రాసినా పాఠకులను ఆకట్టుకున్నారు ముళ్లపూడి వెంకటరమణ. గిరీశం లెక్చర్లు అని సినిమాలపై సెటైర్లు కూడా రాశారు. సినీ రచయితగా అనేక అవార్డులు అందుకున్న రమణకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు సీతాకళ్యాణం కథా సంపుటికి వచ్చింది. బాలల అకాడమీ నుండి బాలబంధు, 1992లో తెలుగు విశ్వవిద్యాలయం, తర్వాత శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్లు వీరిని వరించాయి. ఇవే కాక ఎన్నో ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు వీరిని గౌరవించాయి. 1987లో రఘుపతి వెంకయ్య అవార్డు కూడా వీరికి వచ్చింది.
            వీరిని గురించి ప్రముఖ రచయిత ఆరుద్ర తన కూనలమ్మ పదాల్లో-
            హాస్యమందున అఋుణ
            అందెవేసిన కరుణ
            బుడుగు వెంకటరమణ
            ఓ... కూనలమ్మా అన్నారు
            తెలుగు పాఠకులకు పదహారణాల తెలుగు పలుకులను పంచిన రమణ ఫిబ్రవరి 23, 2011న తన ప్రాణమిత్రుడు బాపును, తన అభిమాన పాఠకులను వదిలి వెళ్లిపోయారు.
           అప్పుడు స్వాతి వార పత్రికలో ఆయన అభిమానులు-
           రమణగారి పెన్ను
           తెలుగు భాషకి వెన్ను

           నిలబెట్టెను నిన్ను నన్ను
           ఓ... గోదారమ్మ అనీ...
          
           కోతికొమ్మచ్చి
           తెలుగు వాకిళ్లకిచ్చి
           చదుంకొమ్మన్నారు గిచ్చి
            ఓ... గోదారమ్మా... అని ఆయన అక్షరాలను తలపోసుకున్నారు. నేటికీ ఆ అక్షరాల జ్ఞాపకాల్లో జీవిస్తూనే ఉన్నారు. వాటిని మననం చేసుకుంటూనే ఉన్నారు.