Facebook Twitter
అరికాళ్ల కింద మంటలు

  అరికాళ్ల కింద మంటలు
                                                                                                                                      - శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి

 



           తెలుగు నుడికారాన్ని, మధ్యతరగతి బ్రహ్మణ జీవితాల్లోని హంగులు, ఆర్బాటాలని, సంప్రదాయ ఛాదస్తాలను తన కథల్లో అద్భుతంగా చిత్రించిన కథకుడు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. స్త్రీల జీవితాల్లోని కష్టాలను, బయట ప్రపంచానికి తెలియని వారి మానసిక క్షోభను తన కథల ద్వారా చెప్పాడు శ్రీపాద. కథా నిర్మాణంలో కూడా అందెవేసిన చేయి అయిన శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి అరికాళ్ల కింద మంటలు కథను గొప్పగా రాశారు. 1910లలో భర్త చనిపోయిన బ్రాహ్మణ స్త్రీ పుట్టిట్లో పడే బాధను చెప్పారు.
           ఈ కథను చెప్పడంలో శ్రీపాద కొత్త టెక్నిన్ ను పాటించాడు. ఈ కథ 8 భాగాలుగా ఉంటుంది. మొదటి 7 భాగాలు కేవలం సంభాషణాత్మకంగా సాగుతాయి. ఆ సంభాణల వల్లే ఏ ఏ పాత్రలు మాట్లాడుకుంటున్నాయి, వాటి స్థితిగతులు ఏమిటి, వాటి మధ్య సంబంధాలు ఏమిటి... అన్న విషయాలు పాఠకులకు తెలుస్తుంది. ఇలా కథను నడిపి, పాఠకుల మదికి కథా వస్తువు అందించిన శ్రీపాద కథా మాంత్రికుడనే చెప్పాలి.
        రుక్ముణి పదహారేళ్లకే పెళ్లయి, 17 సంవత్సరాలకే భర్త చనిపోవడం చేత పుట్టిట్లోనే ఉంటుంది. ఇంట్లో అందరూ ఆమెను చులకనగా చూస్తూ, పనులు చేయించుకుంటూ ఉంటారు. ఆమె మంచితనాన్ని పట్టించుకోక పోగా దెప్పిపొడుపు మాటలు అంటూ ఉంటారు. తిడుతూఉంటారు. కథను శ్రీపాద ప్రారంభిస్తూనే.. దిమ్మచెక్కలాగ అలా కూచోకపోతే కాస్త గంధం తియ్యరాదుషే... రోజూ పురమాయించాలా... అంటుంది వాళ్ల అమ్మమ్మ. ఏ మాత్రం ఎదురు చెప్పకపోయినా మాటల మధ్య నీ మొగం యీడ్చా, నీ సిగ్గు చిమడా, దరిద్రం వోడుకుంటూ పుట్టకువచ్చావు,  జాణవయ్యావూ కుంకపీనుగా... అని తిడుతుంది. తర్వాత రుక్మిణి అక్క రైక కుట్టి పెట్టమంటుంది... 'నాకు పెద్దక్క తన కూతురు జుబ్బా కుట్టమని ఇచ్చింది. అదీ కుట్టాలి' అన్నా... చిన్నక్క వినదు. పైగా 'అదంటే... నీకు ప్రేమ ఎక్కువ' అని ఆడిపోసుకుంటుంది. 'నిన్ను నాతో పాటు మా యింటికి తీసుకెళ్తాను. అక్కడ ఇంటిపని చేస్తే చాలు. నీక్కావలసిని తిండి పెడ్తాను' అని లేనిపోని కబుర్లు చెప్తుంది.                    అంతలో పెద్దక్క వస్తుంది. 'తన కూతురు జుబ్బా కుట్టలేదని, చిన్నక్క అంటేనే ఇష్టమని' తూలనాడుతుంది. తనకు 'చాలా పనులున్నాయన్నా' వినదు. 'దాని మాటలు నమ్మకు మీ బావకు చెప్పి, నేనే నిన్ను మా ఇంటికి తీసుకెళ్తాను' అంటుంది. 'మాకు పదెకరాల పొలం ఉంది' అని ధీమా పోతుంది. చెల్లెలు వచ్చి 'బువ్వాలాట ఆడుకోవాలి డబ్బు, బెల్లం ముక్క' కావాలంటుంది. ఇవ్వక పోయేసరికి గంధం గిన్నె దొర్లించి వెళ్తుంది. రుక్మిణి  వాళ్ల అమ్మ వచ్చి 'అమ్మమ్మ కందులు బాగుచేసేసరికి అలసి పోయిందట వంట చేయి' అంటుంది. 'వంటే కదా సుఖంగా చేయొచ్చు' అంటూనే ఆయిదారు రకాలు చేయమంటుంది. తమ్ముడు వచ్చి 'అన్నం పెట్టు సినిమాకు వెళ్లాలం'టాడు. 'ఇంకా ఎసరులో కూడా వేయలేదు' అంటే... 'నే వచ్చిందాకా మేలుకుని ఉండు...' అని పురమాయించి వెళ్తాడు. నాన్న వచ్చి 'ఇవ్వాళ నువ్వు వంట చేస్తున్నావేంది' అని అడుగుతాడు. వాళ్ల అమ్మమ్మ కూడా వస్తుంది. ఇద్దరి మధ్య రుక్మిణి గురించి చర్చ సాగుతుంది. వాళ్ల అమ్మమ్మ 'రుక్మిణి తల అంటుకోవడం, దువ్వకోవడం ఎందుకు... ఆ దిక్కుమాలిన జుట్టు ఎందుకు... ఆచారం ప్రకారం గుండు చేయిద్దాం' అంటుంది. అది విన్న రుక్మిణి పనులు తత్తరబిత్తరగా చేస్తూ కంగారు పడుతుంది. 'వీరేశలింగం వెధవలకు పెళ్లి చేస్తున్నాడు. ముండలని తోటలోవాళ్లు వెతుకుతున్నారు. సమయాలు, ముహూర్తాలు చూసుకోవడం లేదు. తర్వాత ఏమన్నా జరిగితే కొరివితో తల గోక్కోవడం అతుందని' అమ్మమ్మ తండ్రికి చెప్తుంది.
             ఆ రోజు రాత్రి రుక్మిణికి నిద్రపట్టదు. అన్నివిధాలా ఆలోచిస్తుంది. చివరకు ఒంటరిగా ఇల్లువిడిచి వెళ్తుంది. ఓ జడ్కావాని సహాయంతో వీరేశలింగం వివాహాలు చేసే స్థలానికి వెళ్లాలని నిర్ణయించుకుని, జడ్కా ఎక్కుతుంది. ఆ శుభవార్తను చెప్తూ మేఘాల మీద యెగిరిపోయింది జడ్కా. మలుపు కూడా తిరిగింది. అని ఆమె జీవితంలో మంచిరోజులు రాబోతున్నాయని సూచిస్తాడు శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి.
          బ్రాహ్మణ ఇల్లల్లో ఆడవాళ్లు మాట్లాడుకునే భాష ఈ కథకు అదనపు అలంకరణ. వీరేశలింగం పంతులు చేసే విధవ వివాహాలను కథలో సందర్భానుసారంగా జోడించి పాత్రను చెప్పడం శ్రీపాద కథకు చారిత్రక వాస్తవికత వచ్చినట్లైంది. ఈ కథంతా ఉదయం లేసినప్పటి నుంచి రుక్మిణి జీవితంలో జరిగిన సన్నివేశాలు అల్లిక. ఒక రోజును కథా నేపథ్యంగా ఎన్నుకోవడం కూడా శ్రీ పాద ఘనతే. రుక్మిణికి జీవితంపై కలిగే విసుగును, విరక్తిని ఆమె మాటలు ద్వారానే వ్యక్తపరిచాడు కథకుడు.- నేనేమీ వొళ్లు దాచుకేలేదు ( పనులు చేస్తూనే ఉన్నాను) నా బతుక్కి రోషం కూడాను. ఎన్నెళ్లేపని చెబితే అది పుచ్చుకోవాలి గానీ,.. రామయ్యతండ్రీ, నా బతుకిలా వెళ్లిపోవలసిందేనా మహాప్రభూ... ఇవి ఆడవాళ్ల మాటలు...  శ్రీపాద రచనల్లోని మాటల విన్యాసానికి ఉదాహరణలు.
          ఈ కథ ఒకప్పటి బ్రాహ్మణ కుటుంబాల్లోని స్త్రీల జీవితాలకు వాస్తవిక అద్దం. చరిత్రకు సాక్ష్యం. అందుకే ప్రతి ఒక్కరూ చదవదగిన కథ అరికాళ్ల కింద మంటలు.              
                                              

    - డా. ఎ. రవీంద్రబాబు