Facebook Twitter
కొండచిలువ

            కొండచిలువ

 

సి. భవానీ

 



    రాత్రి పదవుతోంది. మెగాసిటీ మెల్లగా నిద్రలోకి జారుకునే ప్రయత్నంలో వుంది.

    మంచంమీద వాలిందేగానీ పరిమళకు నిద్రపట్టడంలేదు. మనసంతా ఇవాళెందుకో అలజడిగా, అల్లకల్లోలంగా వుంది. ఈ పుట్టినరోజు పార్టీవల్ల ఆనందం కలగడం లేదు. ఏదో పోగొట్టుకున్న వెలితి స్పష్టంగా కన్పిస్తోంది.

    రోజూ ఆఫీసులో ఎన్నో ఫైల్సు చూస్తూ ఎంతగా శ్రమించి పనిచేసినా ఎంత లేటుగా ఇంటికి వచ్చినా ఇంత హైరానాగా అన్పించలేదు. అసలు పుట్టినరోజును జ్ఞాపకం చేసుకోవడమే తనకిష్టం వుండదు. రోజురోజుకూ వయసుమీద పడుతుంటే తెలియని గిల్టీగా వుంటుంది.

    గిల్టీనెస్ అనవసరం అన్పించినా మనసును సమాధానపర్చుకోవడం కష్టంగానే వుంటుంది. ఫ్రెండ్స్ బలవంతం మీదే ఈ డిన్నర్ ఏర్పాటు చేసింది.

    ఆలోచనల్లోంచి తేరుకోకుండానే లేచి వెళ్ళి చీర మార్చుకుని తేలిగ్గా వుండే తెల్లని నైటీ ధరించింది. ఆ నైటీ మీద ప్రింటుచేసిన గులీబీపూలు చూస్తుంటే మనసుకు హాయిగా అన్పించింది.మెళ్ళో వున్న ఒంటిపేట ముత్యాల దండ, గాజులు, వాచీ తీసేసింది. జుట్టుకు పెట్టుకున్న క్లిప్పు తొలగించింది. చల్లని మేఘాల్లా మృదువైన జుట్టు మెడ క్రింద భాగమంతా స్వేచ్చగా పర్చుకుంది.

    మొదటిసారిగా చూస్తున్నట్టు పరీక్షగా మొహాన్ని అద్దంలో పరిశీలించుకుంది పరిమళ. డ్రెస్సింగ్ టేబుల్ అద్దం ఆమె నిలువెత్తు రూపాన్ని నిస్సంకోచంగా ప్రకటిస్తోంది.

    ఒక్కసారిగా ఉలిక్కిపడిందామె.

    విరబోసుకున్న కురులు స్వేచ్చగా ఫ్యాన్ గాలికి ఎగురుతుంటే అంతకంటే స్వేచ్చగా ఎగురుతూ విహరిస్తోందో వెండితీగ. ఆ వెండి వెంట్రుకను చేత్తోలాగి తడిమిచూసింది.

    అప్రయత్నంగా గుండెల్లోంచి ఓ నిట్టూర్పు వెలువడింది.

    లైటార్పి పడుకుందేగానీ నిద్రపట్టడంలేదు.

    వివిధభారతి ట్యూన్ చేసింది.

    "యే మేరా ప్రేమ్ పత్ర్ పఢ్ కర్.." రఫీ గొంతు ప్రేమార్ధంగా.

    "ప్రేమ!" అంటే ఏమిటో?

    కవులు, గాయకులు, రచయితలు ఈ రెండక్షరాల ప్రేమ గురించి ఎన్ని పాటలు. కథలు, కవిత్వం... అంతా ట్రాష్.

    పక్కకి ఒత్తిగిల్లి పడుకుంది. రేడియో మోగుతూనేవుంది. 

    ఇన్ని పరిచయాలున్నా తన హృదయాన్ని కదిలించే వ్యక్తి ఇంతవరకూ తారసపడలేదెందుకో! అసలు తన మనసు తలుపులు తెరిచివుంటే కదూ.

    అమ్మానాన్నల ప్రేమ, అన్నయ్య ఆత్మీయత మధ్య ఆటల్లో పాటల్లో చదువులో ఫస్ట్ రావాలని పట్టుదల, తపనలతో అల్మారా నిండా బారులు తీరిన బహుమతులు, మెమెంటోలు, కప్పులు, మెడల్సే లోకంగా పెరిగింది.

    అందరు ఆడపిల్లల్లా వంటింటి పన్లంటే పరమ బోర్. ఆ భావనలే ఆమెనొక ఐ.ఏ.ఎస్. ఆఫీసర్ గా ఎదిగేలా చేశాయి. తగిన వరుడికోసం తల్లిదండ్రులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

    కాలం తెచ్చిన మార్పును ఆమె తల్లిదండ్రులు అంగీకరించలేకపోయారు. పెళ్ళి చేసుకోనన్న పరిమళ నిర్ణయానికి నిరసన ప్రకటిస్తూ అమెరికాలో సెటిలయిన కొడుకు దగ్గరికి వెళ్ళిపోయారు. రోజంతా ఫైళ్ళలో మునిగి తేలుతూ కాలం కరిగి పోతున్నా రాత్రిళ్ళు మాత్రం కొండచిలువలా చుట్టుకునే ఒంటరితనానికి పరిమళ మనసు తల్లడిల్లిపోతున్నది. ఈ మధ్య అమ్మ దగ్గర్నుంచి ఉత్తరాలు రావడం కూడా తగ్గిపోయింది.

    పెళ్ళంటే రాజీ. అది తనవల్ల కానిపని. ఒక మగవాడికి జీవితమంతా దాసోహం అవటాన్ని తన వ్యక్తిత్వం అసలు అంగీకరించదు.

    ఈ సంగతి స్పష్టంగా తెలిశాక అమ్మ నుంచి ఉత్తరాలు లేవు. ఆమె ఆఖరి కోరిక తన పెళ్ళి! బహుశః అది తీరని కోరికై ఆమె మృదు హృదయాన్ని గాయపరిచిందని అర్ధం చేసుకుంది పరిమళ.

    తల్లి జ్ఞాపకాలతో నిట్టూరుస్తూ రేడియో ఆఫ్ చేయబోతుండగా 'ముఖ్య ప్రకటన' అనౌన్సుమెంటు విని ఆగిపోయిందామె.

    బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గురించిన హెచ్చరిక అది.


            * * *


    తుఫాన్ వార్తలు అందరినీ కలవరపరుస్తున్నాయి. తుఫాన్ ప్రాంతంలో పునరావాస కార్యక్రమాలకు స్పెషల్ ఆఫీసరుగా పరిమళను నియమించడం వల్ల ఆ ప్రాంతాలకు బయలుదేరి వెళ్ళిందామె. ఇప్పుడామె మనసులో ఎలాంటి కలవరమూ లేదు. విధినిర్వహణా ఏకాగ్రతే వుంది.

    తుఫాన్ సృష్టించిన బీభత్సాన్ని కళ్ళారా చూస్తుంటే విపరీతమైన ఆవేదన కలిగింది. పిల్లలను కోల్పోయిన తల్లులు, తల్లుల ఒడిలోనే విగతజీవులైన పిల్లలు, ఆసరా కోల్పోయిన వృద్ధులు... అంతా భయానక స్మశాన వాతావరణం.

    స్వచ్చంద సంస్థలు అనాథ శవ దహన సంస్కారాలు నిర్వహిస్తూ భూమిమీద ఇంకా మానవత్వం మిగిలివుందని నిరూపిస్తున్నాయి.

    కలరా వాక్సినేషన్లూ... మందులు... గాయాలు... ఏడుపులు... ఊపిరాడని పని... ఉక్కిరిబిక్కిరయ్యే పని... ఒంటరితనం మాటే గుర్తులేదు పరిమళకి.

    ఫస్ట్ క్లాస్ కంపార్ట్ మెంటులో సామాన్లు సర్దుతున్న అటెండరు బెర్తు కిందికి చూసి ఉలిక్కిపడ్డాడు.

    "బయటికి రా!" కసిరినట్టుగా అన్నాడు.

    బిక్కుబిక్కుమంటూ నాలుగేళ్ళ పాప బయటకు వచ్చింది.

    చేతిలో టెడ్డీబేర్ బొమ్మ వుంది. గులాబీ రంగు ఫ్రాక్ దుమ్ము కొట్టుకొని బురద మరకలతో నిండి వుంది. బాబ్డ్ కటింగ్. బొమ్మని గుండెలకి హత్తుకున్న తీరుచూస్తే ఆ బొమ్మ పాపకెంత ప్రియమైనదో తెలుస్తోంది.

    కసురుతూ చేయిపట్టి ఆ పాపని బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నాడు అటెండరు.

    అతడిని వారించి పాపని దగ్గరికి పిలిచింది పరిమళ.

    "నీ పేరేంటి పాపా!" లాలనగా అడిగింది. పరిమళ అంత మెత్తగా మాట్లాడడం అటెండరుకే కాదు ఆమెకీ కొత్తగానే వుంది.

    పాప ఏడ్వడం మొదలుపెట్టింది. సముదాయించడానికి ప్రయత్నించింది పరిమళ. కొంతసేపటికి పాప ఏడుపు తగ్గింది.

    అమ్మానాన్నల గురించిన ప్రశ్నకు "అమ్మా!" అని మళ్ళీ ఏడ్చింది పాప.

    "అమ్మ...లేదు...చచ్చిపోయిందిట...ఆంటీ! నాకు అమ్మ లేదు... నాన్నని నేను అసలు చూడలేదు..." పాప వెక్కిళ్ళు పరిమళను నిలువునా ద్రవింపజేశాయి.

    పాప మనతో వస్తుంది.." అటెండరు పరిమళ మాటలకు ఆశ్చర్యపోయినా పైకి కన్పించనీయలేదు.

    హైదరాబాద్ వచ్చాక పాప బంధువుల గురించి ఆరా తీయడం.. టీ.వి, రేడియో ప్రకటనలు.. పేపర్లో ప్రకటించడం.. ఏం చేసినా ఫలితం లేకపోయింది.

    ఈ పదిహేను రోజుల్లో పాప పరిమళకు బాగా దగ్గరైంది.

    పరిమళ ఆఫీసు నుంచి ఇంటికి రాగానే పరుగెత్తుకుంటూ వికసించిన ముఖంతో ఎదురొస్తుంది పాప. ఇల్లంతా ఇప్పుడు నవ్వులతో కళకళలాడుతోంది... కానీ ఎన్నాళ్ళిలా?...

    పాపను అనాథ శరణాలయంలో చేర్చాలి...పాప అనాథ. ఎవరూ లేనిది. తనకి మాత్రం ఎవరున్నారు? తను అనాథ కాదా? రకరకాల ఆలోచనలు పరిమళను చుట్టుముట్టేస్తుంటే అలాగే మరో పది రోజులు గడిచాయి.


            * * *


    ఆరోజు ఎలాగైనా పాపను అనాథ శరణాలయంలో చేర్చాలన్న ఆలోచనతో ఇంటికి వచ్చింది పరిమళ. ఎక్కడా అలికిడి లేదు. రోజులా పాప ఎదురు రాలేదు. గదిలో జ్వరంతో మూలుగుతూ పడుకుని వున్న పాపని చూస్తే పరిమళకి కాళ్ళూ చేతులాడలేదు.

    డాక్టర్ కి ఫోన్ చేసింది. డాక్టర్ వచ్చి చెకప్ చేసి ప్రిస్కిప్షన్ వ్రాసిచ్చాడు.

    వారం రోజులు సెలవు పెట్టి రాత్రింబవళ్ళు పాపకి సేవచేస్తున్న పరిమళను చూసి పనివాళ్ళంతా ఆశ్చర్యపోయారు.

    "ఆంటీ.. నేను చచ్చిపోతే అమ్మ దగ్గరికి పోతానా! నాకిక్కడ ఎవరూ లేరు కదా!"

    "తప్పు పాపా! అలా అనకూడదు. నీకు మేమంతా లేమూ!" పాప తల నిమురుతూ ఎన్నోసార్లు ధైర్యం చెప్పింది పరిమళ.

    పాపని అనాథ శరణాలయంలో చేర్చే ఆలోచన మరో పదిరోజులు వాయిదా పడింది.

    పాపకి జ్వరం పూర్తిగా తగ్గింది. మునుపటిలా ఇల్లంతా కలియ తిరుగుతోంది. ఆరోజు సాయంత్రం పాపను తయారుగా వుంచమని పని మనిషికి చెప్పి ఆఫీసుకు వెళ్ళింది పరిమళ.

    సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చేసరికి పాప ఎదురు రాలేదు. పనిమనిషిని పాప గురించి అడిగింది.

    "ఇప్పటిదాకా ఇక్కడే ఆడుకుందమ్మా! చూసొస్తానుండండి" అంటూ పనిమనిషి పాపను పిలుస్తూ తోటలోకి వెళ్ళింది.

    "పాపా! పాపా!" ఇల్లంతా వెదికినా పాప జాడలేదు. చివరికి పాప ఎక్కడుందో... పరిమళే పసిగట్టింది.

    అల్మారా వెనక నుంచి చేయి పట్టుకుని పాపని బయటికి లాగింది పరిమళ.

    పాప ముఖం చూస్తే నవ్వాగడంలేదు. దట్టంగా పౌడరు పులుముకుంది. బుగ్గల నిండా ఎఱ్ఱని లిప్ స్టిక్. సర్కస్ లో జోకర్ లా వుంది. పరిమళకేసి బెదురు చూపులు చూస్తోంది. ఒక్కసారిగా రెండు చేతులు పరిమళ మెళ్ళో దండలాగా వేసి పెనవేసుకుపోయింది పాప.

    "ఆంటీ! నన్ను ఇక్కడినుంచి పంపిస్ తావా! నేను నీదగ్గరే వుంటాను. నాకు అమ్మ లేదు" ఏడుస్తూ కౌగిలించుకున్న పాపను అప్రయత్నంగా రెండు చేతులతో గుండెలకు హత్తుకుంది పరిమళ. 

    పరిమళ కళ్ళనిండా నీళ్ళు.

    పాప వచ్చాక తనతో ఇంతకాలం సహజీవనం చేస్తున్న ఒంటరితనం తనకి తెలియకుండానే పారిపోయింది. ఈ చిన్న ప్రాణంతో అనుకోకుండా అందమైన అనుబంధం ఏర్పడింది.

    'ఆంటీ! నన్ను పంపించేత్తావా!' పరిమళ గడ్డం పట్టుకుని పాప అడుగుతోంది మళ్ళీ.

    పరిమళ మనసును చుట్టుకున్న కొండచిలువ పూర్తిగా వదిలేసి మాయమయిందిప్పుడు.

    పాపను గట్టిగా హృదయానికి హత్తుకుని ముద్దుల వర్షం కురిపించింది. ఆ చిట్టి చేతుల్లో తన మొహం దాచుకుని తెలియని ఆనందం అనుభవించింది.

    "లేదమ్మా! నిన్నెక్కడికీ పంపను. నాకు నువ్వు.. నీకు నేను.. సరేనా! నువ్వింక నా దగ్గరే వుంటావు"

    "థ్యాంక్యూ ఆంటీ" సున్నితంగా పరిమళ బుగ్గపై ముద్దు పెట్టింది పాప.

    పరిమళకిప్పుడు తన జీవితంలో నిజంగా పరిమళం నిండినట్లనిపిస్తున్నది. తోటలోని పూలన్నీ పాప నవ్వుతో శ్రుతి కలుపుతున్నాయి.