Facebook Twitter
బిందూ ఆంటీ

            బిందూ ఆంటీ

 - శారద అశోకవర్ధన్

 


    "ఒరేయ్ మురళీ...టైము ఎనిమిదవుతోంది. నువ్విలాగే ఇంకా ముస్తాబవుతూ కూర్చో- ఫ్లైట్ ఒచ్చేస్తుంది. తొందరగా తెములు." బామ్మ మురళిని తొందరపెడుతోంది. గబగబా షూ వేసుకుని క్రాఫుని ఒకసారి మళ్ళీ సరిచేసుకుని, ఒక్కసారి అద్దంలో చూసుకుని బయలుదేరాడు మురళి. "ఎంత షోకురా నాయనా!" నవ్వుతూనే అంది బామ్మ.

    "కువైట్ నుంచి  మా అక్కగారు  శ్రీమతి నిఖిల, బావగారు శ్రీశ్రీశ్రీ మాధవ్ గారు వొస్తూవుంటే  ఎయిర్ పోర్ట్ కి నన్ను దేభ్యం మొహం వేసుకుని వెళ్ళమంటావా?" మారుతీ కారు తాళాలకోసం  ఒక్కక్షణం  జేబులన్నీ వెతికి చివరికి పాంటు వెనక  జేబులో తాళాలు తగలగానే తీసి, నవ్వుతూ  బయలుదేరాడు మురళి.

    "అమ్మా! ఎయిర్ పోర్ట్ టైము గురించే మీరు కంగారుపడుతున్నారుగానీ, పెళ్ళికూతుర్ని చెయ్యడానికి ముహూర్తం  దాటిపోతోందని  ఆలోచించడంలేదు." అరిచాడు పురోహితుడు.

    "వొచ్చేస్తున్నా" అని బామ్మ  అంటూనే- "కూతురు రాగానే కాఫీ అడుగుతుంది. దానికి ఫిల్టర్ కాఫీ అంటేనే ఇష్టం. ఫ్లైట్ లో ఇచ్చే ఆ కాఫీలు దానికి నచ్చవు" అంటూ  కాఫీ డికాషన్ తయారు చెయ్యడంలో నిమగ్నమయింది కామాక్షమ్మ, రూబీ కాళ్ళకి  పారాణి  పెడతానని చెప్పి  వెళ్ళిన విషయం మర్చిపోయి! అరగంట దాటినా  ఎవరూ పారాణి గురించి గానీ, పెళ్ళికూతురి ముస్తాబు గురించిగానీ మాట్లాడకపోవడం బాధనిపించింది రూబీకి. రూబీ స్నేహితులు యశస్విని, భ్రమర మాత్రం జడ అల్లడం, కాటుక దిద్దడం వంటి పన్లు  చేస్తున్నారు. అంతలో  ఆదరాబాదరాగా పరుగెత్తుకుంటూ  వొచ్చిన  బిందూ ఆంటీని చూడగానే  రూబీ మొహం చాటంతయింది.

    "ఆంటీ!....ఇంత లేటుగానా రావడం?" బుంగమూతి పెట్టింది రూబీ.

    "ఏం చెయ్యను రూబీ! ఒక్క ఆటో కూడా దొరకలేదు. గంట సేపటి నుంచి బయట నుంచున్నా తయారయి. ఇవ్వాళ ఆటో స్ట్రైక్ అటగా? ఎవరో చెప్పారు. అప్పుడిక  లాభంలేదని రిక్షా ఎక్కొచ్చాను"  అంది. రూబీ పాదాల వంక చూసి. "ఇంకా పారాణి పెట్టలేదా?" అంటూ గబగబా వెళ్ళి పసుపూ కుంకం అన్నీ పట్టుకుని  కాళ్ళకి పసుపు రాస్తూ.

    బిందూ ఆంటీ వొచ్చే వరకూ ఇవాళ  రూబీని  పెళ్ళి కూతుర్ని  చేస్తున్న హడావుడి కనిపించలేదు. నిఖిలా మాధవ్ లు కువైట్ నుంచి ఒచ్చే హడావుడి తప్ప! క్షణంలో  పారాణి పెట్టేసింది. కళ్యాణ కళ మొహంలో ఉట్టిపడుతోందని ముద్దులతో  ముంచెత్తి  బుగ్గ చుక్క పెట్టింది. నుదుటన ఎర్రటి తిలకంతో  జ్యోతిలా  బొట్టుని  తీర్చిదిద్దింది. చిలకపచ్చ  కంచి చీరకి తోపుకుంకం రంగు అంచు కంచి చీర కట్టి, నడుంకి  వొడ్డాణం పెడుతూ, 'ఎంత అందంగా ఉన్నావే' అంటూ మాటిమాటికీ మెల్లగా నుదుటిపైన ముద్దు పెట్టుకుంది. ఆమె ఆప్యాయతకీ అనురాగానికీ రూబీ గుండె  కరిగిపోతోంది. కళ్ళల్లో  నీళ్ళు నిండితే  కాటుక చెదిరిపోతుందేమోనన్న భయంతో  రుమాలుతో  కళ్ళు తుడుచుకుని బిందూ పాదాలకి  నమస్కరించింది. బిందూ కళ్ళల్లోనూ  నీళ్ళు నిండాయి.

    "రూబీ!....ఏమిటిది? నిన్నటి దాకా  అల్లరిచేస్తూ గొడవ గొడవగా తిరిగే నువ్వు, ఇవ్వాళ  పెద్ద ఆరిందాలా ఈ నమస్కారాలేమిటి?" భుజం పట్టుకుని  లేవనెత్తి చెంపలు  నిమిరింది.

    "బిందూ ఆంటీ! ఒక్క మాట చెప్పనా?"

    బిందూ చెప్పమన్నట్టు  చూసింది.

    "నాకు మళ్ళీ జన్మంటూ వుంటే నీ కడుపునా పుట్టాలని వుంది. అదే భగవంతుణ్ణి కోరుకుంటాను" అంది కళ్ళల్లోని  నీటి పొరను రుమాలుతో తుడుచుకుంటూ  బిందూ షాక్ తిన్నదానిలా రూబీ వంక చూసి, గుండెలకి హత్తుకుంది. యశస్విని నాలుగు కప్పుల్లో  కాఫీ పోసి  పట్టుకొచ్చి  బిందూ  ఆంటీకి, రూబీకి, భ్రమరకీ ఇచి తనూ తీసుకుంది. ఇక్కడ ఈ నలుగురి హడావుడే తప్ప మిగిలిన వాళ్ళ కళ్ళూ చెవులూ  గూడా  గేటువైపే వున్నాయి. ఏ కారు చప్పుడైనా  నిఖిల వొచ్చిందేమో  అంటూ పరుగెడుతున్నారు. రూబీ తమ్ముడు బబ్లూ అయోమయంగా  అటూ ఇటూ తిరుగుతున్నాడు.

    "అక్కా! పెళ్ళయితే  నువ్వెళ్ళి పోతావా? అప్పుడు నేనొక్కణ్ణే వుంటాను ఇంట్లో. బామ్మ తాతగారూ వాళ్ళ గొడవలు వాళ్ళవి. నాకు బోర్ కొడుతుంది. నేను బిందూ ఆంటీ వాళ్ళ ఇంటికెళ్ళి  వుండిపోతాను. బిందూ ఆంటీ కథలు చెబుతుంది నాకూ టింకూకీ" అన్నాడు జాలిగా మొహం పెట్టి. వాడి మాటలకి గుండె  కరిగిపోయింది బిందూకి. రూబీకి  ఏడుపొస్తోంది అది చూసి.

    "ఒరేయ్ బబ్లూ! నువ్వు కూడా మీ అమ్మా నాన్నతో  ఈసారి  కువైట్ వెళ్ళిపో" అంది భ్రమర.

    "కరెక్ట్" అంది యశస్విని వాడి బుగ్గలు  ముద్దుగా  గిల్లుతూ.

    "అక్కా! అమ్మ ఎలా వుంటుంది. అచ్చు ఫోటోలో లాగేనా?" అడుగాడు రూబీని.

    ఈసారి బిందూ  ఆపుకోలేకపోయింది. వాణ్ణి  ఎత్తుకుని  గట్టిగా గుండెలకి  హత్తుకుంది.

    బయట మంగళవాద్యాల జోరు. వీళ్ళ గుండెల్లో  ఆప్యాయతల హోరు! బంధువులు ఒక్కొక్కరే దిగుతున్నారు. రూబీవాళ్ళ పెద్దమామయ్యా అత్తయ్యా అందర్నీ రిసీవ్ చేసుకుంటున్నారు. కామాక్షమ్మగారి కళ్ళు మాత్రం గేటువైపే! అంతలో ఫోను మోగింది. కామాక్షమ్మ పరుగెత్తుకెళ్ళి  ఫోను తీసింది.

    "అబ్బ....గంటన్నర  లేటా! అక్కడే వుండు. మళ్ళీ ఒచ్చి ఏం వెళతావ్? అదీగాక ఒక్కోసారి ఫ్లైట్ లేటని చెప్పినా ముందే రావొచ్చు" అంది మురళికి ఫోన్ లోనే ఆదేశాలిస్తూ.

    రూబీ కళ్ళనిండా నీళ్ళు నిండుకున్నాయి. అవి చెంపల మీదుగా జారకుండా  జాగ్రత్తగా  వెంటనే తుడిచేసింది బిందూ ఆంటీ. యశస్వినీ, భ్రమరా రూబీకి చెరోవైపు నుంచుని  భుజం తట్టారు ఊరడిస్తున్నట్టు. బబ్లూ బిందూ ఆంటీ కొంగుచ్చుకుని నుంచున్నాడు టింకూ పక్కనే.

    "రండమ్మా ....ముహూర్తం వొచ్చేసింది. అమ్మాయిని పీటలమీద కూర్చో పెట్టండి" అరిచాడు పురోహితుడు.

    కామాక్షమ్మ ఈ లోకంలో లేదు. లేటయిన ఫ్లైటుని తిట్టుకుంటూ  అసలు ఇండియన్ ఎయిర్ లైన్స్ వారి నందరినీ నిందించేసింది తనే సహజ ధోరణిలో. రమణయ్యగారు ఎవరితోనో పొగాకు వ్యాపారం గురించి మాట్లాడుతున్నారు. అయినా ఆయనకి ఈ మూహూర్తాలూ గిహుర్తాలూ వాటిమీద నమ్మకం లేదు. పెద్దమామయ్య నాగార్జున సినిమాల గురించి మాట్లాడుతున్నాడు. అత్తయ్య కీర్తన ఆడబిడ్డ తేబోయే లగేజి గురించి, వస్తువుల గురించి మాట్లాడుతోంది ఎవరితోనో. పురోహితుడు మళ్ళీ కేక పెట్టాడు. దాంతో.ఈ లోకంలో పడ్డారు కామాక్షమ్మా కీర్తనా. రూబీ చెయ్యి పట్టి నడిపించుకు తీసుకొస్తున్న బిందూ వెనకాలే వాళ్లూ నడిచారు. ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు  వాళ్ళ పని వాళ్ళు చేసేశారు. వింత వింత అనుభూతులతో, కొత్తకొత్త ఊహలతో తూగిపోతూ పీటలమీద కూర్చుంది రూబీ. యశస్వినీ, భ్రమరా ఏవేవో జోకులు చెవిలో చెబుతూంటే  చిన్నగా నవ్వుకుంది రూబీ. టింకూ  బాబ్లూలు రూబీని కొత్త మనిషిని చూస్తున్నట్టు చూస్తున్నారు. పురోహితుడు తన పని తను చేస్తున్నాడు. ఎవరికీ అర్ధంకాని శ్లోకాలేవో చదువుతూ.

    "అక్కా! బావగారొచ్చారు" అరిచాడు బబ్లూ.

    అందరి కళ్లూ అటు తిరిగాయి. నేవీ బ్లూ సూట్ లో, బంగారంలా నిగనిగ మెరిసే మేనుతో, సోగకళ్ళ సోయగంతో అచ్చం రాకుమారుడిలా వున్నాడు  ఇంద్రతేజ. అతని వెనకే వాళ్ళమ్మగారు అనసూయమ్మ, చెల్లెలు మహీజ, మామగారూ, మిగిలిన బంధువులూ - పూలూ, పళ్ళూ చీరా సారెలతో దిగేరు.

    అందరూ  వారికి స్వాగతం పలకడంలో నిమగ్నులయ్యారు.

    "ఇంకా నిఖిలా మాధవ్ లు రాలేదా?" అడిగింది అనసూయమ్మ.

    "ఫ్లైటు గంటన్నర లేటుట!" సమాధానం చెప్పింది కామాక్షమ్మ.

    "అయినా నాకు తెలీకడుగుతా! నాలుగు రోజులు ముందొస్తే ఏం పోయిందట! కూతురి పెళ్ళికి కూడా సెలవు పెట్టక అంత ముహూర్తం సమయానికి దిగాలా, మరీ విడ్డూరం!" సాగదీసింది. అందరిలోకీ పెద్దావిడా, పెళ్ళికొడుకు తరపు మనిషి. ఆ మాటలు రూబీ మనసుకి గుండుసూదుల్లా తగిలాయి. ఒక్కసారి  మనసు ఎటో వెళ్ళిపోయింది ఎగిరే పిట్టలా.


        *    *    *


    అది తను రెండో క్లాసు చదువుతున్న రోజులు. మొదటిసారిగా  తనకి బుద్ధి తెలిశాక అమ్మని చూడడం. తను ఆరు నెలల పాపగా  వున్నప్పుడే అమ్మా నాన్నా ఇద్దరూ తనని బామ్మ దగ్గర ఒదిలిపెట్టి  కువైట్ వెళ్ళిపోయారు. ఇద్దరూ డాక్టర్లే కావడం, నాలుగు చేతులా సంపాదనే! ఆ వెళ్ళడం, వెళ్ళడం, ఏడాది బబ్లూని పట్టుకుని ఇండియాలో బామ్మ దగ్గర ఒదిలి వెళ్ళడానికి ఇండియా కొచ్చారు.

    ఆ రోజు తన పుట్టిన రోజు. ఫ్రెండ్సందరినీ కేక్ కట్ చేస్తున్నానని రమ్మని ఆహ్వానించింది సాయంత్రం అయిదింటికి. అయితే, ఆ రోజే నిఖిలా మాధవ్ లు వెళ్ళిపోవలసిన రోజు. సెలవు ఎక్స్ టెండ్ చెయ్యడానికి వీల్లేదట. ఫ్లైట్ అయిదు గంటలకే! అందుకే మూడింటికే కేక్ కట్ చెయ్యమన్నారు. ఫ్రెండ్సు రాందే కట్ చెయ్యనంది తను. తన మొండితనానికి బామ్మ ఎంతో తిట్టింది చివరికి రెండు తగిలించింది. దాంతో తను ఏడుపు లంకించుకుంది. అంతే! కేకు సంగతి అందరూ  మర్చిపోయారు. నాలుగింటికల్లా ఏర్ పోర్ట్ కి బయలుదేరారు. తనూ ఎయిర్ పోర్ట్ కి వెళ్ళింది. ఇలాగే ఫ్లైటు గంటన్నర లేటు. తన మనసంతా ఫ్రెండ్సు మీదే! వాళ్ళు ఒచ్చి వెళ్ళిపోయారేమోనన్న బెంగ ఒక పక్కా, అమ్మానాన్నా వెళ్ళిపోతున్నారన్న  బాధ మరో వంకా, ఊపిరాడని ఉక్కిరిబిక్కిరి ఆలోచనలతో సతమతమయిపోయింది. తనకి ఊహ తెలిశాక అమ్మని చూడడం అదే మొదటిసారి. ఆమె వెళ్ళిపోతూ వుంటే ఎందుకో ఏడుపు పొంగుకొచ్చింది.  

    "అమ్మా....నేనూ ఒస్తా." ఏడ్చింది. "నువ్వు బామ్మ దగ్గరే వుండాలి. బాగా చదువుకోవాలి. నీకు బోలెడు ఫ్రాకులూ, బొమ్మలూ అన్నీ తెస్తాను. సరేనా?" నచ్చచెప్పింది అమ్మ.

    అంతలోనే ఫ్లయిటు డిపార్చర్ అనౌన్స్ చేశారు. అమ్మ తనని అమ్మమ్మ కిచ్చేసి వెళ్ళిపోయింది. ఒక్కసారిగా  ఏదో నీరసం, ఏదో బాధ అందరూ ఇల్లు చేరుకున్నారు. కేకు ఎదురుగా వెక్కిరిస్తున్నట్టు కనిపించింది. ఫ్రెండ్సంతా ఒచ్చి వెళ్ళిపోయారు. ఆ రోజు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా పండుకుంది తను. అంతే! ఆ తరువాత ఎన్నో పుట్టిన రోజులు దొర్లిపోయాయి అమ్మ లేకుండానే! చదువులో ఫస్టొచ్చినా, ఆటల్లో గెలిచినా, నాటకాలు వేసినా  ఎవ్వరూ మెచ్చుకునే వాళ్ళులేరు, టీచర్లూ ఫ్రెండ్సూ తప్ప. బిందూ ఆంటీ వాళ్ళు ఒకప్పుడు, బామ్మ గారింట్లో  అవుట్ హౌస్ లో అద్దెకుండేవాళ్ళు. అస్తమానం తనని ఎత్తుకుని  ముద్దు పెట్టుకునేది. తనకీ బబ్లూకీ టింకూతోపాటు  చాక్లెటిచ్చేది. టిఫిన్ పెట్టేది. కథలు చెప్పేది. తను వేసే నాటకాలకి, స్కూల్ డేకీ రమ్మని పిలిస్తే బామ్మకి పనుందని ఒచ్చేదికాదు. తాతయ్యకి ఇంట్రెస్టులేదు. కానీ బిందూ ఆంటీ తప్పకుండా  వొచ్చేది. తననెంతో  మెచ్చుకునేది. గంటలతరబడి బిందూ ఆంటీతో మాట్లాడుతూ గడిపేది తను ఎంత తియ్యటి అనుభూతి!

    ఒక్కసారిగా కారు హారన్ జోరుగా  మోగేసరికి ఈ లోకంలో కొచ్చి పడింది రూబీ. అందరూ అటు పరుగెత్తేరు. కారు పోర్టికోలో ఆగింది. వంకాయ రంగు చీరకి పచ్చి పసుపురంగు అంచు కట్టి పట్టుచీరా ,మెడలో రవ్వల నెక్లెసూ, చేతికి రవ్వల గాజులూ, రవ్వల దుద్దులూ, బాబ్ డ్ హెయిరూ, ఖరీదైన హ్యాండు బ్యాగూ- అధునాతనంగా, అందంగా అనిపించింది అమ్మ రూబీ కళ్ళకి. సూటూబూటూ గోల్డ్ ఫ్రేం కళ్ళద్దాలూ నాన్నగారు కూడా అమ్మకి తగ్గట్టుగానే  వున్నారనిపించింది. బబ్లూ కూడా ఇద్దర్నీ కొత్తగా చూస్తున్నాడు. అందరూ వాళ్ళని చుట్టేశారు. నాగార్జునా, మురళీ సామాన్లు  లోపల పెడుతున్నారు.  కీర్తన సామాన్లనీ నిఖిలనీ మార్చి మార్చి చూస్తోంది. అందర్నీ దాటి నిఖిల రూబీ దగ్గరికొచ్చి కౌగలించుకుంది. బిందూ వాళ్ళందరికీ దారి నిస్తూ వెనక్కి జరిగింది. నిఖిల హ్యాండుబ్యాగ్ లో నుంచి కెంపుల నెక్లెసు, కెంపుల దుద్దులూ, కెంపుల గాజులు బైటికి తీసింది. ఒక్కొక్కటే వేసింది రూబీకి. అందరూ వాటికేసి చూసి పరీక్షించడం, చర్చించడం మొదలెట్టారు. పురోహితుడు అది గ్రహించి ఏవో రెండు మంత్రాలు చదివి అయిందనిపించాడు. వెంటనే అయినవాళ్ళు అందరూ కానుకలు సమర్పించడం మొదలెట్టారు- చీరలూ, నగలూ వాళ్ళవాళ్ళ హోదాను చాటుతూ! మెల్లగా వెళ్ళి బిందూ కాగితం చుట్టివున్న  ఒక పెయింటింగ్ ని అందించింది రూబీకి. రూబీ వెంటనే కాయితం విప్పి చూసింది. ఏ బహుమతినీ పట్టించుకోని రూబీ, దీన్ని అంత తొందరగా  విప్పి చూడడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. రూబీ ఆ బొమ్మని తనివితీరా చూస్తోంది. ఏమిటా అది అని అందరూ చూశారు. తల్లి పొత్తిళ్ళల్లో ఒద్దికగా కూర్చుని కబుర్లు చెబుతున్న పాప! తల్లీ బిడ్డా ఎంతో ముద్దుగా వున్నారు.

    "ఎంత బాగా వేశారో, ఎవరో ఆ చిత్రకారుడు?" అన్నారెవరో.

    "బిందూ ఆంటీయే!" గట్టిగా చెప్పింది రూబీ. అందరూ ఆమెకేసి చూడటంతో ఆనందంతో ఆమె మొహం ఎర్రబారింది.

    "అందరికీ నమస్కారాలు చెయ్యమ్మా! ముందుగా మీ అమ్మగారికీ, నాన్నగారికీ తరవాత బామ్మకీ, తాతగారికీ, మామయ్యలకీ..." అంటూండగానే రూబీ వెళ్ళి బిందూ ఆంటీకి పాదాభివందనం చేసింది. అందరికీ ఆశ్చర్యం, నిఖిలకీ, కామాక్షమ్మకీ కోపం ఒక్కసారే పెల్లుబికాయి.

    "ఏమిటే ఆ పని? కన్న తల్లికి నమస్కరించకుండా ఎవళ్ళకో ఏమిటా నమస్కారాలు?" గట్టిగానే అంది కామాక్షమ్మ.

    "ఎవళ్ళకో కాదు బామ్మా....నన్ను అర్ధం చేసుకుని ఆదరించిన అమ్మ ఆమె" అంది ఉక్రోషంతో రూబీ.

    "కన్నతల్లికంటే ఎక్కువా?" కామాక్షమ్మ అహం దెబ్బతింది. నలుగురిలో నిఖిలకి ఏం చెప్పాలో తెలీలేదు. "ఆ.....ఎక్కువే!....నా మనసు తెలిసి మమతలు పంచిన మల్లెల మనసు బిందూ ఆంటీది. 'అమ్మా' అని ఏడ్చిన రోజున 'ఊరుకోమ్మా' అని ఊరడించిన  అభిమానపు గుండె ఆమెది! నా మాటా,  నా ఆటా చూసి మురిసి నన్ను ప్రోత్సహించిన చల్లని మనసు ఆమెది! ఆమెకి కాక, కేవలం కన్నంత మాత్రాన ఆమేమిటో నాకు తెలీక, నేనేమిటో ఆమెకి తెలీక కేవలం నగలూ, నాణాలూ ఇవ్వడం తప్ప మనసివ్వని  ఆమెకి ముందు నమస్కరించడం న్యాయమా?" ఆవేశంతో, తను పెళ్ళికూతురనీ, అక్కడ అందరూ ఉన్నారనీ కూడా మర్చిపోయి  తన మనసులోని మాటల్ని చెప్పేసింది రూబీ.

    ఆమె మెడలోని కెంపులహారం బిందూ గీసిన తల్లీబిడ్డల చిత్రం ముందు వెలవెలబోయింది. మబ్బులు కమ్మిన చంద్రుడిలా! అందరూ కొయ్యబారినట్టయి పోయారు. రూబీ కళ్ళ నీళ్ళు చెంపలమీద చారలు కట్టాయి. వెంటనే ఇంద్రతేజ లేచొచ్చి జేబురుమాలుతో రూబీ కళ్ళు తుడిచి బిందూ ఆంటీకి పాదాభివందనం చేశాడు. ఈ సంఘటనతో అందరూ మూగవారిలా  రూబీని, ఇంద్రతేజని చూస్తుండిపోయారు. పురోహితుడి సైగతో అక్షింతల వర్షం కురిసింది దంపతులు ఇంద్రతేజ, రూబీలపైన!