Facebook Twitter
నండూరి ఎంకి

  నండూరి ఎంకి

- డా. ఎ. రవీంద్రబాబు

తెలుగువారి ఆడపడుచు ఎంకి, స్వచ్ఛమైన జానపద పిల్ల ఎంకి, కల్లాకపటం తెలియని పల్లెటూరి అమ్మాయి ఎంకి. కావ్యనాయికల మధ్య పుష్పించిన అడవి మల్లె ఎంకి. చిలిపితనంతో అందరి మనసులు దోచుకున్న జవ్వని ఎంకి. అందుకే తెలుగు సాహిత్యంలోనే ఎంకి వంటి పిల్ల లేదు. ఇక ఉండబోదు. అసలు ఈ ఎంకిని సృష్టించి, తెలుగు వారి గుండెలపై చిత్రించింది నండూరి సుబ్బారావు.
        నండూరి సుబ్బారావు 1985లో పశ్చిమ గోదావరి జిల్లాలోని వసంతవాడలో జన్మించారు. ప్రముఖ బావకవి బసవరాజు అప్పారావుకు దగ్గర బంధువు. నండూరి సుబ్బారావు ఏలూరులో మాధ్యమిక విద్యను చదువుకున్నారు. కాకినాడ కళాశాలలో చేరి మధ్యలోనే కళాశాల విద్యకు స్వస్తి పలికారు. ఆ తర్వాత మద్రాసు (చెన్నై) వెళ్లి క్రిస్టియన్ కాలేజ్ లో ఎఫ్.ఎ. చదివారు. ఆ పై బి.ఎ., బి.ఎల్. పూర్తిచేసి న్యాయవాదిగా స్థిరపడ్డారు. కానీ చివరి రోజు వరకు కవిత్వాన్ని మాత్రం వదల్లేదు.
        సుబ్బారావు మద్రాసు క్రిస్టియన్ కళాశాలలో చదువుకునే రోజుల్లో ఒకసారి ట్రాంబండిలో ఇంటికి వెళ్తుంటే "గుండె గొంతుకలోన కొట్లాడుతాది" అనే పల్లవి మనసులో రూపుదిద్దుకొన్నదట. ఆ ఆలోచనతోనే ఇంటికి వచ్చేసరికి పాట పూర్తి అయ్యిందట. ఎంకిపాటల్ని ఎక్కువభాగం సుబ్బారావు చదువుకునే రోజుల్లోనే రాశారు. (1917-18) కొంత మంది మిత్రులు ప్రోత్సహిస్తే, మరికొంత మంది ఇది వాడుక భాష కాదు, దీనిలో రచన కొనసాగించడం కష్టం అన్నారట. అయినా నండూరి సుబ్బారావు ఆ భాషలోనే పాటలు రాసి తన సాహిత్య ప్రతిభను నిరూపించుకున్నారు. ఈ పాటల్లో గోదావరి, విశాఖ జిల్లాలలోని గ్రామీణభాష సుందరంగా కనిపిస్తుంది.
     1925లో "ఎంకిపాటలు" మొదటి సంపుటి విడుదలైంది. అంతే తెలుగు నేలపై ఎంకి దుమారం రేగింది. ఆ కాలంలో ప్రముఖులైన కవులు, రచయితలు, విమర్శకులు, ఎంకిపాటలను పాడుకున్నవారే. కొంతమంది పొగిడారు. మరికొంత మంది తెగిడారు. శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి, చలం లాంటి వారు ఈ పాటలను భుజానికెత్తుకున్నారు. ఇక ఆకాశవాణి అయితే వీటికి బహుళ ప్రచారం కల్పించింది. ఆ రోజుల్లో ప్రతి సాహితీ సభలోనూ ఎంకిపాట ప్రవాహమై పారింది. బసవరాజు అప్పారావు స్వయంగా ఎంకిపాటలకు బొమ్మలు గీశాడు. తర్వాత కళాభాస్కర్ కూడా... మొది సారిగా పారుపల్లి రామకృష్ణ ఈ పాటలకు బాణీలు కట్టారు. నేడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ పాడిన ఎంకిపాటలు లభ్యమవుతున్నాయి.
       సుమారు 27 సంవత్సరాల తర్వాత నండూరి సుబ్బారావు పాతపాటలకు మరికొన్ని కొత్తపాటలు చేర్చి రెండో సంపుటిని తీసుకొచ్చారు. మొత్తం ఎంకిపాటలు 31. వీటిలో ఎంకి, నాయుడుబావలు ముఖ్య పాత్రలు. వారి మధ్య ఉన్న ప్రేమ, ఆకర్షణ, అనుభవాలు, అనుభూతులు, ఊహలు, విరహాలు, వినోదాలు, వారి వలపు, తలపు, దాంపత్య జీవితపు మధురిమలు, వేదనలు, వారుచేసే తీర్థయాత్రలు... ... ఇలా ఎన్నో ఆ పాటల్లో దొర్లిపోతుంటాయి. ప్రణయభావాలకు, పదాల పొందికకు కొత్త చిగుళ్ళు తొడిగాయి ఈ పాటలు.
      ఎంకి పల్లెపడుచు. జానపద సౌందర్యం ఆమెది. అందుకే నండూరి సుబ్బారావు ఎంకిని ఇలా సృష్టిించారు.-
   "యెంకి వంటిపిల్లలేదోయి లేదోయి
   మెళ్లో పూసల పేరు
   తల్లో పూవుల పేరు
   కళ్లెత్తితే సాలు
   కనకాభిసేకాలు
   రాసోరింటికైనా
  రంగుతెచ్చే పిల్ల
  పదమూ పాడిందంటె
   కతలు సెప్పిందంటె
   కలకాలముండాలి
  అంసల్లె, బొమ్మల్లె
 అందాల బరిణల్లె
 సుక్కల్లె నాయెంకి"
         అందుకే తెలుగుపస, తెలుగునుడి, తెలుగునాదం, తెలుగురుచి... తెలుసుకునేలా ఎంకిపాటలు సాగుతాయి.
    ఎంకి అమాయకపు పిల్ల, అల్లరిపిల్ల, నటన చేతకాని నవ జవ్వని, అందుకే నాయుడుబావ ఇలా అంటాడు.
     "నాకాసి సూస్తాది నవ్వు నవ్విస్తాది
      యెల్లి మాటాడిస్తే యిసిరి కొడతాది"
   కానీ ఎంకికి నాయుడుబావంటే వల్లమాలిని ప్రేమ. అతడ్ని విడిచి ఒక్కనిముషం కూడా ఉండలేదు. విరహాన్ని భరించలేదు. అతడిని వెతుక్కుంటూ వెళ్తుంది.
   "జాము రాతిరి యేళ జడుపూ గిడుపూ మాని
    సెట్టు పుట్టా దాటి సేనులో నేనుంటే
    మెల్లగా వస్తాది నా యెంకి
    సల్లంగా వస్తాది నాయెంకి"- అంటాడు నాయుడుబావ.
        వాళ్లిద్దరికీ ప్రకృతే నేస్తం. పల్లె ప్రణయ స్థలం. తిరుపతి, భద్రాద్రి వెళ్తారు. పుణ్యస్నానాలు చేస్తారు. వారి సంగమం అంతః నేత్రానికి అందే మనోచర్య. వాళ్ల ప్రేమకు నమ్మకం మాత్రమే పునాది. అందుకే నాయుడుబావ "యెఱ్ఱి నాయెంకి", "సత్తెకాలపు యెంకి" అంటాడు. ఎంకి నాయుడుబావతో ఎకసెక్కాలాడుతుంది. ఆటపట్టిస్తుంది.
    "యెంకి రాలేదని యెటో సూత్తావుంటే
    యెనకాలుగా వచ్చి యెవరునోరంటాది.
    యెన్నాని సెప్పేది యెంకి ముచ్చట్లు
    యేటి సెప్పేది నా యెంకి ముచ్చట్లు"- అంటాడు నాయుడుబావ
       ఎంకిని కూడా ఆటపట్టించడమంటే నాయుడుబావకూ సరదానే. అప్పుడు కోపంతో వుడుక్కునే ఎంకిని చూస్తూ తెగ ఆనందపడిపోతాడు.
     "గోడ సాటున యెంకి గుటక వేసే యేళ
     సూడాలి నా యెంకి సూపులా యేళ
     సూడాలి నా యెంకి సోద్దెమా యేళ" - అంటాడు.
    అందుకే తెలుగువారి ఎంకి స్నిగ్ధ. స్వచ్ఛమైన ప్రణయిని. అంతేకాదు
    "రాసోరింటికైన
   రంగుతెచ్చేపిల్ల
   నా సొమ్ము- నా గుండె
   నమిలి మింగిన పిల్ల"- అని తనలో ఒక భాగమై పోయిన ఎంకి గురించి చెప్తాడు నాయుడుబావ.
     ఊహ, వాస్తవం, అందం, ఆనందం, కళ, కల... అన్ని కలబోసిన అడవి మల్లె ఎంకి. శబ్దం, నాదం కలిసిన పాట ఎంకి.
     నండూరి సుబ్బారావు ఊహాజనితమైన ప్రేమభావనలో మునిగి, ఆమె చూపు, మాట, పాట, కట్టు-బొట్టు, సాన్నిధ్యం, ఎడబాటు... అన్నింటిని ఆకల్పనలోనే అనుభవించాడు. వాటికి భాష కూర్చాడు. వాటిలో మనందరిని ముంచెత్తేడు.
     "యెనక జన్మములోన యెవరిమోనంటి
     సిగ్గొచ్చి నవ్వింది సిలక నా యెంకి
    ముందు మనకే జల్మముందోలె యంటి
    తెలతెల్ల బోయింది పిల్ల నా యెంకి
    యెన్నాళ్లొ మనకోలె యీ సుకములంటి
   కంటనీరెట్టింది జంట నా యెంకి." -  అని వారి జన్మజన్మల సంబంధాన్ని పాటలో మనకందించాడు నండూరి. అందుకే పంచాగ్నుల ఆదినారాయణ ఎంకి, నాయుడుబావలను రతీమన్మథులతో పోల్చాడు. పురాణం సూరిశాస్త్రి జీవాత్మ-పరమాత్మలతో పోల్చాడు.

     నండూరి సుబ్బారావు ఎంకి పాటలు సృష్టించి 85 ఏళ్లు దాటిపోయాయి. అయినా ఇప్పటికీ ఎంకి వయసు ఇరవై ఏళ్లే. ఎన్నెల్లాంటి ఎంకి ఎప్పటికీ నిండు పున్నమే.
   "యెలుతురంతా మేసి యేరు నెమరేసింది"
   "యెన్నెలల సొగసంత యేటి పాలెనటర"- లాంటి సౌందర్యాభివ్యక్తులు మన మనసుల్ని అద్భుతంగా ఆకర్షిస్తాయి. ఎంకిని అక్కున చేర్చుకోమంటాయి.