Facebook Twitter
డు.ము.వు.లు.

 డు.ము.వు.లు.

- మల్లాది రామకృష్ణశాస్త్రి.

                

మల్లాది రామకృష్ణశాస్త్రికి సనీకవిగా ఎంత పేరుందో, కథా రచయిగా అంతకు మించిన పేరుంది. పాటల్లో ఏ విధంగా లయ బద్ధమైన పదాల్ని పొదిగారో... కథల్లోనూ అలాంటి అందమైన వచనాన్నే రాశారు. తెలుగు సంప్రదాయాలు, జాతీయాలతో వేసవి కాలంలోని మామిడి కాయంత తీయగా ఉంటాయి మల్లాది కథలు.  వీరి కథలు ప్రారంభం, ముగింపు, సంభాషణలు సంక్రమమైన పద్ధతిలో అమరి ఉత్కంఠను కలిగిస్తూ సాగుతాయి . ఇందుకు ఓ మంచి ఉదాహరణ డు.ము.వు.లు. కథ.
          ఈ కథ తెలుగులో మహాభారత రచనాకాలం నాటిది. అంతేకాదు దీనిలోని విషయం కూడా మహాభారతంలోని 15 పర్వాల్ని తెనిగించిన తిక్కన, వారి తండ్రి కొమ్మనది. కథలోకి ప్రవేశిస్తే- కొమ్మన స్వయంగా మేనమామ కూతుర్ని వివాహం చేసుకుంటాడు. కానీ పెళ్లిలోనే లాంచనాల దగ్గర వీరి తల్లిదండ్రులకు, అత్తమామలకు చెడుతుంది. రాకపోకలే కాదు, మళ్లు తోరణం నుండి మాటలు కూడా ఉండవు. అయితే కొమ్మన మమగారు గర్భాధానానికి ముహూర్తం నిర్ణయించి కొమ్మన తండ్రిగారికి లేఖద్వారా కబురు పంపుతాడు. కొమ్మన తండ్రి ఈ విషయాన్ని ఊళ్లో అందరికి చెప్పి కొడుకు కొమ్మనకు చెప్పడు. కానీ కొమ్మన తన తాత గురునాథం ద్వారా తనమామగారు పంపిన కబురు గురించి తెలుసుకుంటాడు. హిందూ స్త్రీల గొప్పతనం తెలుసుకుంటాడు. తన తండ్రి చేసిన తప్పునూ తెలుసుకుంటాడు.  కట్టుబట్టలతో మామగారింటికి బయలుదేరుతాడు. దారిలో తండ్రి కనిపించినా, అతని మాట లెక్కచేయకుండా తన భార్య దగ్గరకు వెళ్లడానికే సిద్ధమవుతాడు.      
          కానీ దారిలో పెద్ద వెల్లువ అడ్డువస్తుంది. కొమ్మన ఆ వెల్లువలోకి దూకి ఈదుతాడు. మధ్యలో మట్టి బాన దొరకడంతో, దాని సాయంతో ఓ గట్టుకు చేరుకుంటాడు. అక్కడ తడిబట్టలతో ఒక కన్నెపిల్ల కనిపిస్తుంది. మాటమాట కలుస్తుంది. మనసు మనసు దగ్గరవుతాయి. దాంతో ఆ రాత్రి వారిద్దరూ ఒకటవుతారు. తెల్లవారాక ఆ పిల్లని తనతో రమ్మని కొమ్మన పిలిస్తే ఆమె రానంటుంది. కొమ్మన గుర్తుగా ఉంగరం తీసుకొని, కొడుకు పుడితే గురునాథా అని పేరుపెట్టి, నీ దగ్గరకు పంపుతాను అని చెప్పి, ఏటిలో దూకి వెళ్లిపోతుంది.
    తర్వాత కొమ్మన మామగారింటికి వెళ్తాడు. అక్కడే కొడుకు తిక్కన పుడతాడు. మనవడు పుట్టడంతో కొమ్మన తండ్రి చూడ్డానికి వెళ్తాడు. దాంతో అందరూ కలిసిపోతారు. తిక్కన పెరిగి పెద్దవాడై మహాభారత రచనకు పూనుకుంటాడు.
    ఒకరోజు కొమ్మన సభలో కొలువుతీరి ఉండగా ఒక వ్యక్తి వచ్చి నమస్కరించి, ఉంగారాన్ని చూపుతాడు. కొమ్మనకు గతం గుర్తుకు వస్తుంది. కొడుకని తెలుసుకొని 'గురునాథా' అని పిలిచి, కౌగిలించుకుంటాడు. అంతలో తిక్కన వస్తాడు. గురునాథుడి బాష చూసి "ఏమిటీ పాడు భాష?" అని కోపగించకుంటాడు. అప్పుడు గురునాథుడు తండ్రికి నమస్కరించి-
       "యీ బాస,తవురి బాస నేనూ సదివినా- పొలంలో వోళ్లు పుట్రలో వోళ్లు- యీడికి యెర్రెక్కిందన్నారు. కూడదనుకుని యిడిసినా- ఆడూ యీడూ పలికే పలుకే పలుకునే - పాట కట్టినా- పదం కట్టినా- పదం పాటా- చేలో ఆవులన్నీ ఆలకిస్తయి- గొర్రెపిల్లలు కోలెస్తాయి- లేగలన్నీ సిందేస్తాయ్-... ....
     ఒక్కరి కూటికీ గుడ్డకూ అక్కరకొచ్చేది మీ బాస- మందిలో పడేది మా బాస-" అని చెప్పి వెళ్లిపోతాడు.
   తిక్కన కొమ్మన ద్వారా, అతను తన అన్న అని తెలుసుకుంటాడు. తన గర్వాన్ని తెలుసుకుంటాడు. తండ్రితో-
 "నాన్నగారూ, భారత రచనకు ఫలం ఏమిటో నాకిప్పుడు అవగతమైంది. నేను వ్యాసభగవానుడికి వంకలు దిద్ది, మెరుగులు పెట్టగల మేధావిని కాదు. నా అహంకారం నశించడానికి- దైవం యీ రూపున వచ్చాడను కుంటాను.... ....  అన్నా కవే- నేనూ కవినేనా...?" అని ఆత్మ పరిశీలన చేసుకుంటాడు... మహాభారత సంహిత పూర్తయ్యాక గంటం ముట్టనని శబథం చేస్తాడు. ఇలా కథ ముగుస్తుంది.
             మాట్లాడేభాష గొప్పతాన్ని చెప్పిన ఈ కథ, మనిషి నిగర్విగా ఉండాలన్న సందేశాన్ని కూడా ఇస్తుంది. చిన్నచిన్న మలుపులతో చదివే వాళ్లలో నూతన ఆలోచనల్ని రేకెత్తిస్తుంది.
          కన్నెపిల్లకు, కొమ్మనకు మధ్య జరిగే సంభాషణలో-
   "కొట్టుకొచ్చారా అయ్యా" అని కన్నెపిల్ల అడిగితే-
   "లేదు- బాన పట్టుక వచ్చాను.. "అంటాడు కొమ్మన.
  ఇలాంటి గమ్మతైన చమత్కారాలు కథలో మనల్ని ఆకర్షిస్తాయి. తాత గురునాథుడికి, మనుమడు కొమ్మనకు మధ్య జరిగే చర్చలో భార్యాభర్తల సంబంధాన్ని, కుటుంబ బాంధవ్యాల్ని గొప్పగా వివరిస్తుంది ఈ కథ. తెలుగు విభక్తులనే శీర్షికగా పెట్టిన మల్లాది రామకృష్ణశాస్త్రి "కంపా గట్రా, ఎగసన ద్రోయడం, ముణగానాం- తేలానాంగా ఉంది, నరంలేని మడిసి... ... " లాంటి ఎన్నో నుడికారాలను బంగారంలో వజ్రాల్లా పొదిగారు. అందుకే ఈ కథ ప్రతి ఒక్కరూ చదవాల్సిందే... ఆవు పాలలాంటి మల్లాది స్వచ్ఛమైన శైలికి అనుభూతి చెందాల్సిందే...
                                              

      - డా. ఎ. రవీంద్రబాబు.