Facebook Twitter
విలక్షణ కథారచయిత త్రిపుర

విలక్షణ కథారచయిత త్రిపుర

  - డా. ఎ. రవీంద్రబాబు.

 


    త్రిపుర కథలు చదవాలంటే దమ్ము, ధైర్యం ఉండాలి. ఎందుకంటే... అవి మనకు తెలియని మనలోని చీకటి కోణాల్ని ఆవిష్కరిస్తాయి. జీవితాన్ని వ్యాఖ్యానిస్తాయి, నిర్వచిస్తాయి. మన మనసును పొరలు పొరలుగా విప్పి చూపిస్తాయి. అద్దం ముందు నిలబడి మనల్ని మనం చూసుకున్నట్లు ఉంటాయి.

    త్రిపుర అసలు పేరు రాయసం వెంకటత్రిపురాంతకేశ్వరరావు. ఒకప్పటి గంజాం జిల్లాలోని పురుషోత్తమపురంలో 1928, అక్టోబరు 2 న జన్మించారు. ఎం.ఎ. ఇంగ్లీషు చదివారు. వివిధ రాష్ట్రాలలో టీచర్ గా, ప్రొఫెసర్ గా పనిచేశారు. కొంతకాలం జిడ్డు కృష్ణమూర్తిగారి శిష్యరికం చేశారు. పాశ్చాత్య సాహిత్యాలను, తత్త్వ శాస్త్రాలను అవపోసన పట్టారు.
    1963 ఆధ్రప్రభలో వీరి తొలికథ ప్రచురితమైంది. 1963-73 మధ్య కాలంలో 13 కథలు, 1990-91 మధ్య 2 కథలు రాశారు. అంటే త్రిపుర రాసింది కేవలం 15 కథలే అన్నమాట. అయితేనేం... తనకంటూ తెలుగు సాహిత్య చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. చెప్పలేనంతమంది సాహిత్య అభిమానుల్ని సంపాదించుకున్నారు. 1980-88 మధ్య త్రిపుర 'కాఫ్కా కవితలు', 1990లో 'బాధలు - సందర్భాలు' వీరి రచనలుగా వెలుగులోకి వచ్చాయి. 'సెగ్మెంట్స్' పేరుతో వీరు రాసిన ఆంగ్ల కవితలను ప్రముఖ కవి వేగుంట మోహనప్రసాద్ తెలుగులోకి అనువాదం చేశారు.
     రాశిలో తక్కువైనా వాసిలో త్రిపుర రచనలు అసమాన్యమైనవి. అనితర సాధ్యమైన మనిషి ఆంతరంగిక లోతుల్ని చూపుతాయి. అవి మనల్ని ట్రాన్స్పరెంట్ చీకటిలా, సర్రియలిస్ట్ చిత్రాల్లా వెంటాడుతాయి, వేటాడుతాయి.
      'పాము' కథలో శేషాచలపతి తనకు తానే రోజుకో పేరుపెట్టుకొని బతికేస్తుంటాడు. అందుకు కారణాల్ని చెప్తూ... 'బాల్యం నన్ను విరామం లేకుండా మెత్తగా వెంటాడుతుంది. క్షణానికీ క్షణానికీ క్రియకీ క్రియకి సంబంధం లేకుండా బ్రతకడం' అంటాడు త్రిపుర. ఆ పాత్ర స్వభావాన్ని కచ్చితంగా నిర్దేశించిన బాల్యానికి ఇవి మూలాలుగా పాఠకుడు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా 'భగవంతం రాడు' కథలో ప్రధాన పాత్ర ఎదురు చూసే భగవంతం రాకుండానే కథ పూర్తవుతుంది. కానీ త్రిపుర వర్ణనలు, ప్రతీకలు, లోతైన భావాలను మనకు అందిస్తాయి.  'బలిసిన ఊరకుక్కలాంటి బస్సు, రూపం పొందిన న్యూమోనియా లాంటి యిల్లు, గోడల మీద సర్రియలిస్ట్ మచ్చలు... గాజు పెంకులు రుద్దిన మొహం...' లాంటివి ఎన్నో మన ఆలోచనలకు పదును పెడతాయి. మరో కథలో 'నారాయణరావు' జీవితాన్ని తర్కించుకుని, అనుబంధాలు, ఆప్యాయతలు అందక చివరికి 'ఎగిరి, నవ్వి, వెనక్కుతిరిగి కెరటాల హోరులో కలిసిపోతాడు'.
      వీరి కథల్లో సన్నివేశాలు, మాటలు,... దారానికున్న పూసల్లా కాకుండా, విసిరేసిన నక్షత్రాల్లా ఉంటాయి. ప్రపంచ తాత్విక రచనల్ని, సర్రియలిజాన్ని, జేమ్స్ జాయిస్, బెకెట్, కాఫ్కా, జెన్ బుద్ధిజాన్ని మనకు పరిచయం చేస్తాయి. 
      ఎంతో జ్ఞానాన్ని తనలో ఇముడ్చుకున్న తిర్పుర 'నేను రైటర్ని అవాలని ఎప్పుడూ అనుకోలేదు. .... కథ మొదలు పెట్టిన దగ్గర నుంచీ అంతమయ్యే దాకా చచ్చాను. ఆ కథనీ చంపాను. ఆ చచ్చిన కథతో నేను చాలాకాలం జీవించాను. అవి అలాగే ఉన్నాయి. నేను ఇలాగే ఉన్నాను.' అంటారు. పాలగుమ్మ పద్మరాజు లాంటి కథా రచయిత త్రిపుర కథలకు ముందు మాట రాస్తూ... 'ఈ కథలు చదువుతుంటే, నేను ఇలాంటివి రాయగలనా అనిపించింది. అంతకన్నా మెచ్చుకోలు ఏముంటుంది. ఒక కథకుడు మరో కథకుణ్ణి గురించి చెప్పేటప్పుడు అంటారు.'
    అస్పష్టమైన తపనని, అలజడిని, బాధల్ని, విషాధాన్ని భుజాన వేసుకున్నారు త్రిపుర. మీ కథలు ఎందుకు సంపూర్ణంగా ఉండవు అంటే... 'అవును ఇన్ కంప్లీట్ అంటే నా కిష్టం. జీవితంలోనూ, కవిత్వం లోనూ కొంత అర్థంగాని తత్త్వం ఉంది' అంటారు.
      ఇలా సున్నితమైన మనసు చైతన్యాన్ని, డిజార్డర్ జీవితాల అలజడిని, అంతంకాని కాంక్షల్ని, చీకటి ఛాయా చిత్రాల్లా అక్షరాల్లో మనకిచ్చిన త్రిపుర 2013, మే 24న మృతి చెందారు. ఆయన రచనల్లోని రహస్యాల్ని విప్పే పనిని మనమీద ఉంచారు.