TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
నాకున్నది ఒక చక్కని బొమ్మ
- వసుంధర
నా పేరు అమ్మలు. అంటే అంతా నన్నలా పిలుస్తారని అర్ధం. నా అసలు పేరు చాలా పెద్దది. అది పూర్తిగా చేపగలిగింది మా యింట్లో మామ్మ మాత్రమే! బడిలో కూడా నాపేర్లో చాలా పొడి అక్షరాలు వున్నాయి. చివర మాత్రం అన్నపూర్ణ అని వుంటుంది. అది కూడా ఏ. పూర్ణ అనొచ్చునని బడిలో మా మేష్టారు ఏడిపిస్తుంటారు.
బడిలో చదివేస్తున్నానని నేను చాలా పెద్దదాన్నని అనుకోకండి నాకింకా ఎనిమిదేళ్ళే.
అసలు నాకు పెద్దదాన్నని చెప్పుకోవడమే ఇష్టం. మా అమ్మ చాలా మందికి నా వయసు తగ్గించి చెబుతుంటుంది. అప్పుడు నాకెంత బాధ కలుగుతుందో! ఓసారి ఆ బాధ భరించలేక నిజం చెప్పేస్తే ఆరోజు ఇంట్లో పెద్ద గొడవయ్యింది కూడా.
ఇంతకూ ఏం జరిగిందంటే....
నా క్లాస్ మేటు కిష్టిగాడి అమ్మ మా ఇంటికి వచ్చింది. కిష్టిగాడికి అన్నిట్లోనూ నా కంటే తక్కువ మార్కులు వస్తున్నాయి. మాటల్లో వాడి అమ్మ అన్నది కదా__ "తొందరపడి వెధవని తక్కువ వయసులో బడిలో వేశాను. మీ అమ్మలుకి లాగే కరెక్టుగా జేర్పించాల్సింది" అని.
"మీ కిష్టిగాడికి ఎన్నేళ్ళు?" అనడిగింది అమ్మ.
"ఇంకా ఏడే కదా" అంది వాడి అమ్మ.
"అయితే మా అమ్మలు ఇంకా చిన్నది. దానికింకా ఆరే కదా" అంది అమ్మ.
నాకెంతో ఉక్రోషం వచ్చేసింది. బడిలో నేనూ, కిష్టిగాడూ నేను పెద్దంటే నేను పెద్ద అని దెబ్బలాడుకుంటుంటాం. దెబ్బలాట ఎందుకంటే పెద్ద వాళ్ళని చిన్నవాళ్ళు గౌరవించాలని మా మాష్టారు క్లాసులో చెప్పారు.
మా యింట్లో అందరిలోకీ నేనే చిన్నదాన్ని. నన్నెవరైనా గౌరవించాలని నాకుంటుంది. ఎవ్వరూ నన్ను గౌరవించరు. కిష్టిగాడిది మా వీథే. మేమిద్దరం కలిసే బడికి వెడుతూంటాం.
"ఇద్దరూ కలిసి బుద్దిగా వెళ్ళి రండమ్మా" అని రోజూ వాళ్ళమ్మా, మా అమ్మ కూడా చెబుతూంటారు.
"నేను చెప్పినట్లు నువ్వు వినాలి" అంటాడు కిష్టిగాడు.
"కాదు, నేను చెప్పినట్లే నువ్వు వినాలి" అంటాను నేను.
"నేను మగాణ్ని. మగాళ్ళ మాటలు ఆడపిల్లు వినాలి" అన్నాడు కిష్టిగాడు.
"నేను నీకంటే పెద్దదాన్ని. పెద్దాళ్ళ మాటలు చిన్నపిల్లలు వినాలి" అన్నాను నేను.
"ఇద్దరం ఒకే క్లాసు చదువుతున్నాం. నువ్వు నాకంటే పెద్ద ఎలాగయ్యావూ?" అన్నాడు కిష్టిగాడు.
"నేను నీకంటే ముందు పుట్టాను అందుకని!" అన్నాను.
వెంటనే కిష్టిగాడు "నీకు చైనా వాళ్లు మనమీద యుద్ధం చేయడం గురించి తెలుసా?" అనడిగాడు.
"తెలియదు" అన్నాను.
"నాకు తెలుసు! అందుకని నేనే నీకంటే పెద్ద!" అనేశాడు.
నాకు ఉక్రోషం వచ్చేసింది. నువ్వు గాంధీగారిని చూశావా?" అనడిగాను.
"చూశాను" అన్నాడు తడుముకోకుండా.
"అన్నీ అబద్ధాలు. పద మా మామ్మ నడుగుదాం" అన్నాను.
"మీ మామ్మకేం తెలియదు. ఈ ప్రపంచంలో అన్నీ తెలిసిన వాడు మా బాబాయి. ఆయన్ని అడుగుదాం" అన్నాడు కిష్టిగాడు.
కిష్టిగాడు మొండివాడు. అన్నింటికీ వాడి మాటే నెగ్గాలంటాడు. పోనీ నేను పెద్దదాన్నని రుజువయితే అప్పుడైనా నా మాట వింటాడు కదా అని వాడి బాబాయి దగ్గరకు వెళ్ళడానికి ఒప్పుకున్నాను.
కిష్టిగాడి బాబాయికి నేనంటే చాలా ఇష్టం. వాళ్ళింటికి ఎప్పుడు వెళ్ళినా నాకు చాక్లెట్లు ఇచ్చి ఏమేమో అడుగుతుంటాడు. అన్నీ విని 'నువ్వు చాలా తెలివయిన పిల్లివి' అని మెచ్చుకుంటుంటాడు. కిష్టిగాడి కంటే నేనంటేనే ఆయనకు ఎక్కువ ఇష్టమని నా అనుమానం.
కిష్టిగాడి బాబాయి మేము చెప్పిందంతా విని "చైనా యుద్ధం సమయానికి నేనింకా బళ్ళో చేరలేదు. దాని గురించి నీకెలా తెలుసురా" అన్నాడు.
"నువ్వే కదా చెప్పావు" అన్నాడు కిష్టిగాడు.
"నేను చెబితేగదా తెలిసింది. అలాంటప్పుడు అమ్మలుతో అబద్దమెందుకు చెప్పావు?" అన్నాడాయన.
"నేనేం అబద్ధం చెప్పలేదు. చైనా యుద్ధం గురించి నాకు తెలుసునని అన్నాను. అంతే!" అన్నాడు కిష్టిగాడు.
"మరి గాంధీగారిని చూశానన్నావు. నేను పుట్టినప్పటికే గాంధీగారు చచ్చిపోయి పదేళ్ళయింది. నువ్వెలా చూశావురా?" అన్నాడాయన.
"బాగుంది! సినిమాల్లో చూడలేదేంటీ?" అన్నాడు కిష్టిగాడు.
కిష్టిగాడి బాబాయి వెంటనే నవ్వడం మొదలు పెట్టాడు. కిష్టిగాడు నావంక గర్వంగా చూశాడు.
నాకు ఉక్రోషం వచ్చింది. అవతల పెద్ద సమస్యతో మేము సతమతమైపోతుంటే ఈయన నవ్వుతూ కూర్చుంటాడేమిటి? ఇదే మా ఇంట్లో మామ్మ అయితే తెగతిట్టేనేదాన్ని.
బాబాయి నవ్వు ఆపుకుని నావంక చూసి "అరే అమ్మాయీ ఏడుస్తున్నావా?" అన్నాడు.
నా కళ్ళలో నీళ్లు తిరిగినట్లున్నాయి. అవి ఆయన చూశాడు.
చటుక్కున గౌనుతో కన్నీళ్ళొత్తుకున్నాను.
"ఏయ్ చంటిపిల్ల....ఏడ్చేస్తోంది" అన్నాడు కిష్టిగాడు.
బాబాయి వాడిని కసిరాడు. మమ్మ ఇద్దర్నీ దగ్గరగా తీసుకున్నాడు. నెమ్మదిగా "మీ ఇద్దరిలో క్లాసులో ఎవరికి మంచి మార్కులు వస్తాయీ?" అని అడిగాడు.
"నాకే?" అన్నాను గర్వంగా.
"ఏరా నిజమేనా?" అన్నాడాయన. "నిజమేలే! ఆడపిల్లలకు పనేముంటుంది? ఎప్పుడూ చదువుకుంటూ కూర్చుంటారు. లేదా ఏడుస్తుంటారు. నాకైతే ఎన్ని పనులు?" అన్నాడు కిష్టిగాడు.
"ఏమైనా సరే. క్లాసులో మార్కు లెవరికెక్కువవస్తే వాళ్ళే పెద్దవాళ్ళు" అన్నాడు కిష్టిగాడి బాబాయి.
నాకెంతో సంతోషం కలిగింది. వెంటనే ఆయనకు దూరంగా జరిగి చప్పట్లు కొట్టేశాను.
కిష్టిగాడి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. చొక్కాతో తుడుచుకుంటూంటే నేను "ఏయ్ చంటిపిల్లాడు.... ఏడ్చేస్తున్నాడు....!" అన్నాను.
"నేనేం ఏడవడం లేదు. కంట్లో నలకపడింది. అంతే?" అన్నాడు కిష్టిగాడు.
అప్పట్నుంచీ వాడు నా మాట కాస్తవింటున్నాడు.
ఏదో పెద్దదాన్నని వాడు నా మాట వింటున్నాడు కానీ లేకపోతే ఈ మగపిల్లలు చాలా గడుగ్గాయలు. వాళ్ళని అదుపుచేయడం చాలా కష్టం.
ఇంత కష్టపడి వాడిని నేను అదుపులోకి తెచ్చుకున్నానా. అదంతా ఇప్పుడు అమ్మ పాడు చేసేస్తోంది. కిష్టిగాడికి ఏడేళ్ళేనని వాళ్ళమ్మే అంటోంది. అంటే వాడు నా కంటే చిన్నే కదా! అమ్మ ఊరుకోవచ్చు గదా!- తీరి కూర్చుని నాకు ఆరేళ్ళే అంటోంది. అది అబద్ధం కూడాను. వాళ్ళమ్మ వెళ్ళి కిష్టిగాడికి ఈ విషయం చెబితే ఇంకేమైనా వుందా?
అందుకే నేను ఊరుకోలేదు.
"అబద్ధం పిన్నీ ! నాకు ఆరేళ్ళు కాదు. ఎనిమిదేళ్ళు. నేను పుట్టిన ఏడాదికి ఎమర్జన్సీ వచ్చిందని ఇంట్లో అంతా చెప్పుకుంటారు కూడాను...." అనేశాను.
వెంటనే అమ్మ తెల్లముఖం వేసింది. పిన్ని మాత్రం నన్ను ఆప్యాయంగా దగ్గరగా తీసుకుని- "తప్పమ్మా- పెద్దవాళ్ళు మాట్లాడు కుంటున్నప్పుడు నువ్వు కలగజేసుకో కూడదు. వెళ్ళి ఆడుకోమ్మా" అంది.
ఏమనాలో నాకు తెలియలేదు. "నేను తనకంటే చిన్న అని కిష్టిగాడికి మాత్రం చెప్పకేం?" అని అక్కణ్ణించి తిన్నగా మామ్మ దగ్గరకు వెళ్ళిపోయి జరిగింది చెప్పి "చూడు మామ్మా అమ్మ అంత పెద్దదిగదా అలా అబద్ధం చెప్పొచ్చా?" అనడిగాను.
"మీ అమ్మ ఎప్పుడూ అబద్ధాలు చెబుతుంది. అందుకే నువ్వు పుట్టావు అని "పోనీలేవే మీ అమ్మ అబద్ధాలు చెప్పి మంచిపనే చేసింది. లేకపోతే నువ్వు నాకు దొరికే దానివి కాదు అంటూ నన్ను ముద్దులాడి, అయినా నీకు అయిదేళ్ళే అయితే ఆరేళ్ళే అని చెప్పడానికి దానికి నోరెలావచ్చిందే?" అంది.
నాకు మతిపోయి నట్లయింది. మామ్మ నన్ను ఇంకా చిన్నదాన్ని చేసేస్తోంది. ఈ మాటలు విన్నాడంటే కిష్టిగాడిని ఇంక పట్టలేము.
"మామ్మా! నువ్వు కూడా అబద్ధాలు చెబుతున్నావు. నేను పుట్టిన ఏడాదికి ఎమర్జన్సీ వచ్చిందని మీరంతా అనుకోరూ?" అన్నాను.
"అదా?" అని నవ్వేసి "నువ్వు పుట్టిన ఏడాదికి రెండోసారి ఎమర్జన్సీ వచ్చిందిలే!-" అంది మామ్మ.
ఇంక మామ్మతో మాట్లాడి లాభం లేదనిపించి ఊరుకున్నాను. నా బెంగ అంతా ఈ విషయం కిష్టిగాడికి తెలిసిపోతే ప్రమాదమని !
అంతకంటే ప్రమాదం ఇంట్లోనే కాచుకుని వుందని నాకు తెలియదు.
సాయంత్రం నాన్నగారు వచ్చేసరికి నేనింట్లో లేను. పక్కింట్లో ఆడుకుంటున్నాను. కనుచీకటిపడే సమయానికి ఇల్లు చేరుకున్నాను. నేను ఇంకా ఇంట్లో ఇలా అడుగుపెట్టానో లేదో "అమ్ములూ!" అన్న కేక వినిపించింది. ఆ గొంతు నాన్నగారిది. ఆ గొంతు వినగానే నాక్కాస్త భయం వేసింది. నన్ను తిట్టడానికే పిలుస్తున్నారని అర్ధమైపోయింది. పిల్లిలా అడుగులో అడుగు వేసుకుంటూ ఆయన దగ్గరకు వెళ్ళాను.
"శనివారం నీ బడికి సెలవు కాదు కానీ- నా ప్రాణాలు తీస్తున్నావమ్మా" అన్నారు నాన్నగారు.
"నేనేం చేశానండీ?" అన్నాను.
"కిష్టిగాడి అమ్మ మనింటికి వస్తే నువ్వేం చేశావు?" అని అడిగారు నాన్నగారు.
"అమ్మ అబద్ధం చెప్పింది. లేకపోతే నాకు ఆరేళ్ళా మరి?" అన్నాను.
"అబ్బా దాని సంగతి కాదమ్మా! ఆడవాళ్ళకు అలాంటి అబద్ధాలు మామూలే! దానికేమీ ఫరవాలేదు. కానీ నువ్వు ఆవిడని పిన్నీ అని పిలిచేవా లేదా?" అనడిగారు నాన్నగారు.
"మరేమని పిలవాలండీ?" అని అడిగాను.
"దొడ్డా అని పిలవచ్చుగా" అన్నారు నాన్నగారు.
"దొడ్డా అనే ఎందుకు పిలవాలి? పిన్నీ అని ఎందుకు పిలవకూడదు?" అని అడిగాను.
"దొడ్డా అంటే ఆవిడ అమ్మకంటే పెద్దది. పిన్ని అంటే అమ్మ కంటే చిన్నది. నువ్వావిడిని పిన్నీ అని పిలిచావు. ఆవిడ అమ్మకంటే చిన్నదైపోయింది" అన్నారు నాన్నగారు.
"చూడ్డానికి కాస్త చిన్నదానిలా కనిపించేమాట నిజమే కానీ ఆవిడ నా కంటే పెద్దదేనండీ- మాటల సందర్భంలో రాజమండ్రిలో గోదావరికి వరదలు వచ్చినప్పుడు పుట్టానని ఆవిడ అంది. నేను ఆ తర్వాత వచ్చిన పుష్కరాలకు కాస్త ముందు కాబోలు పుట్టాను" అంది అమ్మ గదిలోపలకు వస్తూ.
నాకు నవ్వు వచ్చింది. "అరే నేను కిష్టిగాడూ కూడా అచ్చం ఇలాగే దెబ్బలాడుకున్నాం!" అన్నాను.
నాన్న అడగ్గా ఆ వివరాలు కూడా చెప్పాను.
"మీ ఇద్దరికీ చిన్న తేడా వుందమ్మా. నువ్వేమో నీ వయసు ఎక్కువ చెప్పి పెద్దదానివై పోవాలను కుంటున్నావు. మీ అమ్మేమో తన వయసు తగ్గించి చిన్నదైపోవాలను కుంటోంది అన్నారు నాన్నగారు.
"నేనేం వయసు తగ్గించు కోవడం లేదు. వున్న మాటే అంటున్నాను. ఈ రోజు ఆ కిష్టిగాడి అమ్మని పిన్నీ అని పిలిచింది. వెంటనే ఆమె నన్ను అక్కయ్యగారూ అనడం మొదలుపెట్టింది" అంది అమ్మ.
నేను అమ్మ దగ్గరగా వెళ్ళి- "పోనీ లేవేఅమ్మా! నువ్వు పెద్ద దానివైతే మంచిదే కదా! అంతా నిన్ను గౌరవిస్తారు. ఆవిడ నీ కాళ్ళకు దణ్ణం పెడుతుంది. ఎంచక్కా చేతులెత్తి నువ్వు ఆవిడను ఆశీర్వదించవచ్చు కూడా" అన్నాను.
"నీ ఓదార్పు లెవరికీ అక్కర్లేదు" అంది అమ్మ.
"చూడండి నాన్నా! అమ్మ నన్ను విసుక్కుంటోంది" అన్నాను.
అప్పుడు నాన్న నాకు ఒక సలహా ఇచ్చారు. నేనేమో కిష్టిగాడి వద్దకు వెళ్ళాలట. మా అమ్మా వాళ్ళమ్మా మాట్లాడుకుంటూండగా వాడిచేత మా అమ్మను పిన్నీ అని పిలవడానికి ఒప్పించాలిట.
"కిష్టిగాడు నా మాట వినాలంటే నేను వాడికంటే చిన్నదాన్నని ఒప్పుకోవాలి" అన్నాను.
"పోనీ ఒప్పేసుకో" అన్నారు నాన్నగారు.
"అమ్మో- నే వొప్పుకోను" అన్నాను.
"అయితే మీ బాబాయికి బొమ్మ తేవద్దని రాసేయనా?" అన్నారు నాన్నగారు.
(సశేషం)