TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
అమ్మ పిలుపు
- ఎపిసోడ్ -7
- వసుంధర
పోటీలో ఓడిపోయినా నాకు బాధగా లేదు. సమర్డుల చేతిలో ఓడిపోవడు నాకు సంతోషమే!" అన్నాడు అప్పారావు.
ఆ తర్వాత అప్పారావు వెయ్యి రూపాయలూ ఇవ్వగా గోపీ ఆ డబ్బు కనకరాజు కిప్పించేశాడు.
9
ఆ రాత్రి గోపీ ఒక్కడు తన గదిలో నిద్రపోబోతూండగా "తాతయ్యా! నువ్వు చేసినవన్నీ చూశాను. చాలా తమాషాగా వుంది. నాకెంతో సంతోషంగా కూడా వుంది" అన్న మాటలు గోపీకి వినిపించాయి.
"నాకూ సంతోషంగా వుందిరా! ఎలాగైనా మనుషుల మధ్య జీవితం చాలా బాగుంటుంది. ఇన్నాళ్ళు దూరాన్నుంచి చూశాను. ఇప్పుడు దగ్గర్నుంచి అనుభవిస్తూంటే ఎంతో బాగుంది. ఇక్కడే యిలా వుండిపోతే ఎంత బాగుంటుంది?" అన్నాడు గోపీ.
"తాతయ్య! అంత మాటనకు! పదిరోజులూ ఎప్పుడైపోతాయా అని నేనెదురు చూస్తున్నాను. నువ్వు అన్న మాట తప్పకుండా వెనక్కు వచ్చేయాలి" అన్న మాటలు మళ్ళీ గోపీకి వినిపించాయి.
"నువ్వేమీ కంగారు పడకు. నా వంశాంకురానికి నేనన్యాయం చేయను అన్నాడు గోపీ.
తర్వాత గోపీ నిద్రపోయాడు. మర్నాడు ఉదయం నిద్రలేచాక గోపీ యింట్లో అంతా డబ్బు గురించే మాట్లాడు కుంటున్నట్లర్ధం చేసుకున్నాడు. అసలు స్కూల్లో ఏం జరుగుతోందో అన్నదెవరూ పట్టించుకోవడం లేదు. గోపీ తన తెలివి తేటలతో వాళ్ళ సమస్యను వెంటనే అర్ధం చేసుకున్నాడు.
ఇంట్లో అంత బంగారం దొరికినా వాళ్ళు అందరికీ చెప్పుకోలేదు. ఎందుకు భూమిలో దొరికిన నిధి నిక్షేపాలు ప్రభుత్వానికి చెందుతాయి. కాబట్టి ఆ విషయం రహస్యంగా వుంచాలను కుంటున్నారు. అయితే ఆ బంగారాన్ని డబ్బుగా మార్చడం ఎలాగని వాళ్ళాలోచిస్తున్నారు.
అప్పుడు గోపీ బుర్ర చురుగ్గా పనిచేసింది.అతడొక్కడూ ఎవరికీ చెప్పకుండా ఓ మూలగదిలోకి వెళ్ళి పద్మాసనం వేసుకుని నిష్ఠగా కూర్చున్నాడు. అలా ఓ గంట సేపున్నాడేమో- అంతే! అతని చేతిలోకి ఏవో కొన్ని పుస్తకాలు వచ్చాయి. అప్పుడు గోపీ ధ్యానం వదిలి లేచి తండ్రి వద్దకు వెళ్ళి-"నాన్నా! కొట్టు గదిలో ఈ పుస్తకాలేమిటో ఉన్నాయి చూడు!" అన్నాడు.
రఘురామయ్య ఆశ్చర్యంగా వాటిని చూసి "అరే! ఇవి బ్యాంకు పాసు బుక్కులు, చెక్కుబుక్కులు. స్టేట్ బ్యాంకు లో మనకెవ్వరికీ అకౌంటు లేవే... ఇవి మొత్తం మూడున్నాయి. ఒకటి నాపేరున, మరొకటి నాన్న పేరున, ఇంకొకటి సీత పేరున..." అంటూ అవి తెరచి చూసి ఒక్కొక్కళ్ళ అకౌంట్లో రెండేసి లక్షలున్నాయి. అదీ ఒక్కరోజులో వచ్చినవి కాదు. మనమందరం ఈ అకౌంట్స్ ఎన్నో ఏళ్ళనుంచి నడుపుతున్నట్లు రికార్డుంది" అన్నాడు.
ఏడిసినట్లుంది మనకేమిటి-లక్షల్లో ఎకౌంట్సుండడమేమిటి? ఇందులో ఎవరో సరదాకి ఏవో పిచ్చంకెలు వేసి వుంటారు" అన్నాడు జానకిరామయ్య.
గోపీ వెంటనే-" రాత్రి నాకు కలలో యోగి కనిపించాడు. బంగారముందని చెప్పాడు. ఆ యోగి- నాకు కనపడ్డాడు. ఆయన చెప్పాడూ 'బంగారం మార్చుకునేందుకు మీ వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. ఒకో బిందెలో పాతిక లక్షల విలువ చేసే బంగారముంది. అదంతా డబ్బుగా మార్చుకోవాలంటే వాళ్ళకు కష్టంగా వుంది. అందుకని అందులోని కొంత బంగారం నేనే డబ్బుగా మార్చి బ్యాంకులో వేస్తాను. నా కంప్యూటర్ బుర్రలో బ్యాంకులో ఎన్నో ఏళ్ళనుంచి అకౌంట్స్ నడుస్తున్నట్లు ఏర్పాటు చేస్తున్నాను. కొంత డబ్బు చేరితే మిగతా బంగారం మార్చుకుందుకు వాళ్ళకేం కష్టముండదు. నువ్వు పొద్దున్నేలేవగానే మీ కొట్టు గదిలో వెతికితే బ్యాంకు పాసుబుక్సు కనబడతాయి. అవి తీసుకుని మీ నాన్నకియ్యి" అని అన్నాడు.
రఘురామయ్య ఆశ్చర్యంగా "ఎవడ్రా ఆ యోగి? వెతికి వెతికి మనకు సాయపడుతున్నాడు?" అన్నాడు.
"ఏమో-నాకేం తెలుసు?" అన్నాడు గోపీ.
లక్ష్మీదేవమ్మ మాత్రం "సందేహం లేదు. ఆయన గోపాల్రావు గారే అయుంటారు. ఆయనకు గోపీ అంటే మోజుంది కాబట్టే కలలో కనబడి మరీ అడిగి తన పేరు పెట్టించుకున్నాడు. ముందోసారి బ్యాంకుకు వెళ్ళిరండి" అంది.
"బ్యాంకుకు వెళ్ళేక తీరా డబ్బు లేదంటే మనల్ని నేరస్థుల్లా చూస్తారు. నా పేరున బ్యాంకులో ఇంత డబ్బుందంటే నాకు నమ్మకం లేదు" అన్నాడు రఘురామయ్య అపనమ్మకంగా.
దానిమీద కాసేపు తర్జన భర్జనలు జరిగేక ఆఖరికి అకౌంట్ నంబర్సు చెప్పి స్టేట్ బ్యాంకులో వాటి విశేషాలు తెలుసుకోవాలని జానకిరామయ్య అన్నాడు. బ్యాంకుకు జానకిరామయ్య, రఘురామయ్య, సీతాదేవి- ముగ్గురూ వెళ్ళారు. అకౌంట్ నంబర్సు జానకిరామయ్యే కౌంటర్లోని వ్యక్తికి చెప్పి వాటిలో ఎంత డబ్బుందో చెప్పమన్నాడు. కౌంటర్లోని వ్యక్తి యథాలాపంగా ఆ అకౌంట్సు తిరగేసి వాటిలోని మొత్తాలు చూసి ఆశ్చర్యంగా జానకిరామయ్య వంకచూసి-"మిమ్మల్నెప్పుడూ నేను చూడనేలేదే" అన్నాడు. అతడు చెప్పిన మొత్తాలు వాళ్ళ దగ్గరున్న పాస్ బుక్స్ తో సరిపోయాయి. అప్పుడు జానకిరామయ్య, రఘురామయ్య, సీతాదేవి ముగ్గురూ ఒక్కొక్కరు వెయ్యేసి రూపాయిలకు చెక్కులు రాసిచ్చారు.
ముగ్గురూ కొత్తగా వుండడం వలన వాళ్ళ సంతకాలను కూడా వెరిఫై చేయడం జరిగింది. ఆశ్చర్యమేమిటంటే బ్యాంకులో వాళ్ళు ముగ్గురి స్పెసిమెన్ సంతకాలూ ఉన్నాయి. వాటితో వాళ్ళ సంతకాలూ సరిపోయాయి.
"అంతా మాయగా వుంది. కాలో నిజమో తెలియడంలేదు-" అనుకుంటూ ముగ్గురూ యిల్లుచేరారు.
"యోగి చెప్పింది నిజంగానే వుందిరా రఘూ! ఓ బిందిలో బంగారం కొంత తగ్గింది" అంది లక్ష్మీదేవమ్మ వాళ్ళు ముగ్గురూ యింటికిరాగానే.
"ఒక్కసారిగా మనమే దేవతలో కరుణించారే అమ్మా! ఇంట్లో బంగారముంది, బ్యాంకులో లక్షలున్నాయి" అన్నాడు రఘురామయ్య సంతోషంగా.
ఇది విని గోపీ సంతోషంగా నిట్టూర్చాడు. ఆ రోజు వంట్లో బాగాలేదని అతడు బడి ఎగేశాడు. అందరూ సంతోషంలో వున్న మూలాన వాడి బడి గురించి ఎవరూ పట్టించుకోలేదు.
గోపీ సంతోషంగా తన గదిలోకి వెళ్ళి ఈ విషయం కుబేరుడి కొలను వద్దనున్న యోగికి తెలియజేశాడు. యోగి శరీరంలోనున్న గోపీ-" పెద్ద తాతయ్యా! ఇదంతా నీకెలా సాధ్యపడింది?" అన్నాడు.
"మనిషి మెదడుకు అసాధ్యమైనది లేదు. మీవాళ్ళ అకౌంట్సు మూలంగా ఎందరు కాతాదార్లకో అకౌంట్ నంబర్లు మారిపోతాయి. కానీ బ్యాంకులో ఎక్కడా పద్దుల్లో తేడా వుండదు. మీ యింట్లోని బంగారాన్నే ఒక వడ్డీ వ్యాపారింట్లోకి మార్చి అక్కణ్ణించి నోట్లు తీసి వాటిని బ్యాంకులోకి మార్చాను. ఇదంతా నా ఆలోచనలవల్లే జరిగింది. కానీ నేనో పొరపాటు చేశాను. మనవాళ్ళకు సాయపడాలనే ఆత్రుతలో నీ మెదడు పరిమితులు మరచిపోయాను. ఇప్పుడు నీ మెదడు వేడెక్కుతోంది. ఏం చేయాలో తెలియడం లేదు. నేను అసహాయుణ్ణి. కాసేపట్లో నేను స్పృహతప్పి పడిపోవచ్చు-" అన్నాడు గోపి.
"అప్పుడేం జరుగుతుంది?" అన్న మాటలు గోపీకి వినిపించాయి.
"వేడికి మెదడు పగిలిపోవచ్చు. లేదా నీ మెదడు నన్ను లొంగదీసుకుని సామాన్యుణ్ణి చేయవచ్చు. రెండు విధాలా కూడా నేను నీ దగ్గరకు రాలేను-" అంటూ గోపి పెద్దగా కేకపెట్టాడు.
ఆ కేక విని ఇంటిల్లపాదీ కంగారుగా అక్కడకు పగురున వెళ్ళారు. వాళ్ళు వెళ్ళి చూసేసరికి గోపీ అక్కడ స్పృహ తప్పి పడి వున్నాడు.
లక్ష్మీదేవమ్మ కంగారుగా అతనిని సమీపించి- "ఏమైందిరా గోపీ!" అంటూ వాడివళ్ళు ముట్టుకుని కంగారుగా "వీడి వళ్ళు కాలిపోతోంది" అంటూ అరిచింది.
అందరూ కంగారుపడ్డారు.
"వీడి నే దెయ్యమో పట్టి పీడిస్తోంది. ఇంట్లోకి బంగారం, బ్యాంకులోకి లక్షలు తెచ్చినట్లేతెచ్చి ఆ దెయ్యం వీడి నెత్తుకుపోయే లాగుంది" అంటూ లక్ష్మీదేవమ్మ శోకాలు పెట్టసాగింది.
ఈ లోగా రఘురామయ్య ఒక డాక్టర్ని పిల్చుకుని వచ్చాడు. డాక్టరు వచ్చి గోపీని పరీక్షించి చూసి "పరిస్థితి చాలా ప్రమాదకరంగా వుంది" అన్నాడు.
10
కుబేరుడి కొలను వద్దనున్న యోగి శరీరంలోకి గోపీకి వున్నట్లుండి మతిపోయినట్లయింది. అతడికి అక్కణ్ణించి ఎలా బయటపడాలో తెలియదు. అవతల గోపీ శరీరం ప్రమాదావస్థలో వుంది. ఆ శరీరాన్నే అంటిపెట్టుకుని వుండడం వల్ల కాబోలు గోపాల్రావు తాతయ్య జీవశక్తి కూడా అసహాయమ్గా వుండిపోయింది.
కాసేపాగి గోపీ నెమ్మదిగా ఆలోచించసాగాడు. అక్కడ ఎన్నో పుస్తకాలున్నాయి. తనకేదైనా ఉపాయం దొరుకుతుందేమోనని గోపీ అవన్నీ ఒకటొక్కటిగా తిరగేయసాగాడు. అవి చాలా వరకూ వాడికి అర్ధం కావడంలేదు.
అక్కడ రకరకాల యంత్రాలున్నాయి. ఏ వంటలు కావాలంటే అవి చేసిపెట్టేవి, ఏ పాటలు కావాలంటే అవి వినిపించేవి, ఏ దృశ్యాలు కావాలంటే అవి చూపించేవి - ఎన్నో ఉన్నాయి. కానీ గోపీకి ఆ సొరంగం లోంచి బయటపడే మార్గం కావాలి. అదొక్కటీ చెప్పడానికి అక్కడే యంత్రమూలేదు.
గోపీ దిగులుగా తనింట్లోని దృశ్యాన్నే చూస్తున్నాడు. తన శరీరం స్పృహలేకుండా మంచంమీద పడుంది. ఆ శరీరం వద్ద కూర్చుని ఏడుస్తోంది తల్లి సీతాదేవి.
తల్లిని చూడగానే గోపీ అప్రయత్నంగా -"అమ్మా!" అని గట్టిగా అరిచాడు వాడి ఆ పిలుపు సీతాదేవి చెవుల్లో వినిపించింది. అది గోపీగొంతు లాగే వుంది. ఆమె అప్రయత్నంగా-"బాబూ- గోపీ-పిలిచావా?" అంది.
గోపీకి ఆ మాటలు వినిపించాయి.
కానీ ఈ లోగా లక్ష్మీదేవమ్మ-"వాడేం పిలుస్తాడే-వళ్ళెరక్కుండా పడున్నాడు" అంది.
గోపీకి ఏడ్పువచ్చింది-"లేదమ్మా! నిజంగానే పిలిచాను. నాకు నీ దగ్గరగా రావాలనునుందమ్మా- కానీ రాలేను" అన్నాడు గోపీ. ఆశ్చర్యమేమిటంటే ఏ ఆవేదన కారణంగానో వాడి గొంతు తల్లి గురించిన వ్యధ పడుతుంటే గోపీకిలాగే ధ్వనిస్తోంది.
"బాబూ-గోపీ! ఎక్కణ్ణించిరా పిలుస్తున్నావు! అంది సీతాదేవి.
మిగతా మాటలకూ ఈ మాటలకూ తేడా కనిపించింది గోపీకి. ఆ మాటలు సొరంగపు గోడల్ని చీల్చుకుని వస్తున్నట్లున్నాయి.
తల్లి ఆలోచనల నిండా తనే వున్నాడు. తన ఆలోచనలనిండా తల్లి వుంది. అందుకే తామొకరితో ఒకరు మాట్లాడుకో గల్గుతున్నారు. అప్పుడే గోపీ బుర్రలో ఓ ఆశా కిరణం ఉదయించింది. "అమ్మా! నువ్వు నన్నలా ఆగకుండా పిలుస్తూండమ్మా! ఆ పిలుపును వెన్నంటే నేను నిన్ను చేరుకుంటాను..." అంటూ అరిచాడు.
(సశేషం)