Facebook Twitter
నేను టామీని కాను

నేను టామీని కాను

- శ్రీమతి శారదఅశోకవర్ధన్

"ఛీ! పో! అస్తమానం నా వెనకాలే ఒస్తావేంటీ? వెళ్ళు!" కసురుకున్నాడు ఇందర్. అది మెరిసేకళ్ళతో అతనికేసి చూస్తూనే ఉంది. ఆ చూపుల్లో ఏదో ఆశ! ఏదో భావన!

    "పో! ఊ...." దాదాపు రెట్టింపు స్వరంతో అరిచాడు ఇందర్ కొట్టినట్లుగా.

    అది బెదిరిపోయిందేమో, వెనక్కి వెళ్ళిపోయింది.

    ఇందర్ బూట్లు వేసుకోవడం పూర్తిచేసి టై కట్టుకుంటున్నాడు.

    దూరం నుంచి ఇదంతా  చూస్తున్న  కోటేశ్వరరావుగారు "ఒరేయ్ ఇందర్! ఎందుకురా దాన్నలా కసురుకుంటావ్? నోరులేని మూగజీవిరా అది పాపం!" అన్నారు, వెళ్ళిపోతున్న  టామీని వెనక్కి పిలిచి కిటికీలో వున్న ప్యాకెట్ లోంచి బిస్కట్లు తీసివేస్తూ.

    బిస్కట్లు వాసనకి  వెళ్ళిపోతున్న  టామీ  తోకాడించుకుంటూ  వెనకొచ్చింది. సంబరంతో ఎగిరిగంతేసి అతని మీదికి దూకుతూ  అతని చేతిలోని బిస్కట్టుని అందుకుంది.

    "మూగజీవి లేదు, గీగజీవి లేదు. దానికంతా  తెలుసు. కసురుకున్నా దగ్గరకు తీస్తారని తెలుసు. అందుకే  అది తరిమికొడుతున్నా వెంట వెంట తిరుగుతుంది. ఛీ!ఛీ!" అంటూ టై కట్టుకోవడం పూర్తిచేసి, మరోసారి  అద్దంలో చూసుకుని క్రాపు సవరించుకుంటూ  వెళ్ళిపోయాడు ఇందర్ కారు డ్రైవ్ చేసుకుంటూ. రాత్రికోసం  చపాతీల పిండి  కలుపుతున్న  శకుంతలమ్మకి  ఎందుకనో సడన్ గా, తనూ  ఆ టామీలాగే అనిపించింది. రొట్టెల పిండి ముద్దలా  ఆలోచనలన్నీ  పోగయి ఉండ కట్టుకోసాగాయి.


        *    *    *


    పసుపు పారాణితో, నుదుట  కళ్యాణ తిలకంతో పందిట్లో  కూర్చున్న శకుంతలకి  ఉన్నట్టుండి  తన వాళ్ళెవరూ  కనిపించకపోవడం  ఆశ్చర్యాన్ని  కలిగించింది. పందిరంతా కలియజూసింది. స్నేహితురాలితో  చెవిలో  మెల్లగా చెప్పింది. "మా వాళ్ళంతా  ఎక్కడున్నారో చూడు. ఒక్కరైనా  దగ్గరలేరేం?" అని. 'నీకు తెలీదా? మీ వాళ్ళెవరూ  భోం చేయకుండా  వెళ్ళిపోయారు. మీ మామగారు మీ నాన్నగారిని  ఏదో అన్నారు, పెళ్ళఏర్పాట్లు  సరిగ్గా  చేయలేదని!" చెప్పింది చంద్రమతి.

    పిడుగుపడ్డట్లయింది శకుంతలకి. కళ్ళకాటుక  వెచ్చటి  తడికి కరిగిపోయింది. రక్తనాళాలు చిట్టినట్లయి  కళ్ళలో  ఎర్ర జీరలు  పొంగుకొచ్చాయి. నోట మాట రాలేదు. అవమానంతో  కృంగిపోతున్న తండ్రి, కన్నీళ్ళతో  తడిసిపోతున్న  తల్లీ, అయోమయంగా చూస్తున్న ఇద్దరు తమ్ముళ్ళు....ఇద్దరు చెల్లెళ్ళూ....కళ్ళముందు కదిలారు. గుండె బరువెక్కిపోయింది. ఆవేశంతో  ఒళ్ళు వెచ్చబడి జ్వరం వచ్చినట్లనిపించింది. నీరసంతో శరీరం తూలిపోతూన్నట్లనిపించింది.

    "కంగ్రాట్స్!" అంటూ ఎవరెవరో వస్తున్నారు, పోతున్నారు, బహుమతుల నందజేస్తున్నారు. అవన్నీ చంద్రకిచ్చి బిత్తర చూపులు చూస్తుంది  శకుంతల.

    "అమ్మాయ్! వీళ్ళంతా  నా కొలీగ్స్." పరిచయం చేశారు రామశర్మగారు.

    "కంగ్రాట్యులేషన్స్" అన్నారు వాళ్ళంతా.

    "థాంక్స్" చెప్పింది శకుంతల.

    "మీ వియ్యంకులేరీ?" అడిగారు వారు.

    "రండి, భోం చేద్దురుగాని. ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది" అంటూ  మాట దాటేసి వాళ్ళని భోజనానికి తీసుకుపోయాడు రామశర్మగారు.

    శకుంతల కళ్ళు నీటి కుండలయ్యాయి.  

    "ఆర్ధిక అసమానతలే కదా  ఈ పరిస్థితికి కారణం? అయినా నాన్న డబ్బుకి పేదవాడే కానీ, గుణానికీ మర్యాదకీ కాదే? బతికి చెడ్డ ఆయనకీ ఇప్పుడున్న  ఆస్తి సంతానమే! అందరూ  కష్టపడి  చదువుకొని పైకి వస్తున్నారు. మరి తనూ  అంతేగా. తన చదువూ, అందం అవీ చూసేగా తనని కోడలుగా చేసుకుంటానన్నది? మెడలో  మూడుముళ్ళు పడగానే, తను ఆ పేద తండ్రి కూతురిగా కాక  ఈ  శ్రీమంతుని  కోడలుగా మారిపోయిందా?" శకుంతలకి దుఃఖం ముంచుకొస్తోంది. రామశర్మగారి మీద  కోపం ముంచుకొస్తోంది. "ఇలా రామ్మా! ఈమె నా మేనత్త కూతురు. చిన్నప్పుడు మేమంతా ఆడుకునేవాళ్ళం. ఇప్పుడు ఆమెగారు ఆంధ్రదేశం, పల్లెటూళ్ళు అన్నీ మరిచిపోయి, అమెరికాలో  సెటిలయిపోయింది." ఏదేదో చెబుతూ  పరిచయం  చేస్తున్నారు దుఃఖాన్ని  దిగమింగుకుని, కోపాన్ని అణుచుకుంటూ  ఆమెతో మాట్లాడింది శకుంతల. సమయం చూసి తన బాధని  మెల్లగా  భర్తతో చెప్పింది.

    "ఓ....ఫర్ గెటిట్! నాన్న ఊరికే  ఏమీ అనరుగా? ఏర్పాట్లు తన స్టేటస్ కి తగినట్లు లేవని బాధతో ఏమైనా  అనుంటారు. అంతమాత్రానికి  మీ నాన్న అలా వెళ్ళిపోవాలా?" అన్నాడు కోటేశ్వరరావు. మామగారి ప్రవర్తన కన్నా భర్త మాటలు శకుంతలకి శూలాల్లా తగిలాయి. కాళ్ళకింద  భూమి  బద్ధలవుతున్నట్లు  అనిపించింది. అక్కడి నుంచి  పారిపోవాలనిపించింది. గుండెమీద ధగధగా  మెరుస్తున్న మంగళ సూత్రాలు  కదలకుండా  బంధించినట్లయింది. నిస్సహాయంగా, బేలగా, కీలుబొమ్మలా ఉండిపోయింది.

    "ఐస్ క్రీం తింటావా?" అడిగాడు కోటేశ్వరరావు.

    "వద్దు"

    ఆమె మాట పూర్తవకుండానే  ఎవర్నో పిలిచి రెండు ఐస్ క్రీం ప్లేట్లు తెప్పించారు.

    గుండెల్లో మంటలు!!

    నోట్లో చల్లగా ఐస్ క్రీం!

    ఆడదానిగా పుట్టినందుకు మొదటిసారిగా  తననితాను తిట్టుకుంది శకుంతల.

    "ఛీ! పో! అని చీదరించుకుంటే  తోక  ముడుచుకుని పారిపోయే కుక్కలా  నోరుమూసుకుని ఊరుకోవడం, 'రా! ర'మ్మని పిలిచేసరికి  నోరు తెరుచుకుని  ఆశగా  పరుగెత్తే శునకంలా  వెర్రి ఆనందంతో  చేరువవ్వడం! ఏమిటో ఈ బతుకు?" నిట్టూర్చింది శకుంతల. పరిస్థితులు  మారినా, ఇద్దరు పిల్లల తల్లైనా, ఇప్పటికీ  ఆ చేదు జ్ఞాపకం  ఆమె మనసు నుంచి  చెదిరిపోలేదు.

    పక్కింటి  మానస గుర్తుకొచ్చింది. ప్రభుత్వ కార్యాలయంలో  ఏదో ఉద్యోగం  చేస్తున్నాడు భర్త కిషోర్ కుమార్.  అస్తమానం టీలు, జర్దా పాన్లూ అతని దవడ ఆడిస్తూ  ఉంటాయి. సగం జీతం వాటికిపోను మిగిలినది ఇంట్లో ఇస్తాడు పాపం - మానస కూరల్లోనూ, వెచ్చాల్లోనూ  ఏదో మిగిల్చి డబ్బుతో నగా నట్రా చేసుకోవడమేకాక, అతగాడికి అవసరమైతే, ఎవర్నో అడిగి తెచ్చానని  అప్పుగా ఇచ్చి మళ్ళీ వసూలు చేసేది. పిల్లలకి మంచి బట్టలు  వేసేది. ట్యూషనూ, చదువులూ, అంతా ఆవిడ బాధలే. అతడు ఉదయం పదింటికి ఇల్లు వదిలి వెళితే, రాత్రి పదింటికే మళ్ళీ వచ్చేది. శెలవొస్తే పేకాట, సినిమాలు! ఇదేమిటని  మానస అడిగితే "నీకేం తెల్సు నీ బొంద! కష్టపడి సంపాదిస్తున్న  వాణ్ణి నాకు తెలుసు ఆ బాధేమిటో. ఒక్క రోజు పేకాడినా, సినిమా కెళ్ళినా అలా ఏడుస్తావేం? నీకేం? హాయిగా  తెచ్చి పెడుతుంటే  తేరగా  తిని  కూర్చోవడమేగా?" అతగాడి అరుపులు. శకుంతలకి  వద్దన్నా వాళ్ళ సంభాషణంతా అర్ధమయిపోయింది.

    శకుంతల కళ్ళల్లో  నీళ్ళు తిరిగాయి. అతడు ఆఫీసులో కొన్ని గంటలు పనిచేసి, నెల జీతంలో అతనికి కావలసినది అతడుంచుకుని మిగిలినది ఆమె మొహానపడేసి, అదే గొప్పగా అనుకుంటున్నాడు. కానీ దాన్లో  ఎంత ప్లానుతో అందరి అవసరాలు తీరుస్తూ ఎంత తెలివిగా చాకచక్యంగా ఆమె ఆ సంసారాన్ని, పిల్లల్ని  నడుపుతుందో అర్ధం చేసుకోవడంలేదు.

    కసురుకుంటూ  వెళ్ళిపోతున్న  కిషోర్ గారి కంఠం.

    వెక్కి వెక్కి  ఏడుస్తున్న మానస స్వరం.

    శకుంతలని కలిచివేశాయి.

    ఆ సాయంత్రం "ఏమేవ్ మానసా! నీ కోసం  ఏం తెచ్చానో చూడు." కిషోర్ గొంతు.

    'ఆ! మల్లెపూలా? ఎంత బాగున్నాయ్!" మానస గొంతు.

    మరోసారి శకుంతలకి శునక సూత్రమే గుర్తుకొచ్చింది.
   
    అబలగా పుట్టినందుకు మరోసారి కంట తడిపెట్టింది.

    "అనూషా!" అన్న పిలుపు  విని బయటికొచ్చింది శకుంతల.

    "అనూష ఇంకా రాలేదమ్మా కాలేజీనుంచి, రా  కూర్చో! అలా వున్నావేం? ఏం జరిగింది?" అడిగింది.

    "ఏం లేదాంటీ!" అంది అస్మిత, కళ్ళనీళ్ళు  కనబడకుండా  దాచడానికి మొహం పక్కకు  తిప్పుకుంటూ.

    "ఏం లేదేమిటీ? నీ కళ్ళే చెప్తున్నాయి ఏం జరిగిందో చెప్పు." లాలనగా అడిగింది శకుంతల.

    అస్మితకి వాళ్ళింట్లో  కంటే  వీళ్ళింట్లోనే  చనువు ఎక్కువ. అనూష  లేకపోయినా అన్ని విషయాలు  శకుంతలతో చెప్తుంది.

    అనూషా, అస్మితా స్కూల్ మేట్స్ అనూష మెడిసిన్ లో చేరింది. పరిస్థితులవల్ల  అస్మిత ఉద్యోగం చేస్తుంది. టైపూ, షార్టుహ్యాండూ నేర్చుకుని చక్కగా తయారవుతుంది అస్మిత.  వాయిదా పద్దతుల్లో తనకి నచ్చిన లేటెస్ట్ చీరలు  కొనుక్కుంటుంది. గల గలా నవ్వుతూ చలాకీగా ఉంటుంది. ఆ రోజు ఆఫీసులో ఏవో కాగితాలు టైపు చేసినవ్వలేదని  కోప్పడుతూ  ఆఫీసరు అసహ్యంగా మాట్లాడాడట. రోజుకో కొత్త చీర ఎక్కణ్నుంచొస్తుందో అంటూ వ్యంగ్యంగా అన్నాడుట. తను పట్టించుకోకుండా  బయటికొచ్చేశాక అక్కడున్న ఒకరిద్దరి మాటలు తనకి వినిపించాయట - "ఆ అమ్మాయికి బోలెడంత మంది ఫ్రెండ్స్ సార్! ఎవడో ఒకడు చీర కొనిస్తూనే ఉంటాడు" అని. చెప్తూ చెప్తూ అస్మిత ఏడవడం మొదలుపెట్టింది. "ఛ! ఊరుకో. నాలుగు చెడామడా దులిపెయ్యక పోయావా?" అంది శకుంతల.

    "ఎలా, ఆంటీ? రేపు మరిన్ని కల్పించి మాట్లాడతారు.  మా కాన్ఫిడెన్సియల్ రిపోర్టు పాడుచేసి  పైకి  రానీయకుండా  చేస్తారు. అందుకే నోరు మూసుకుని ఊరుకున్నాను. అంతలోనే  అతడికి నేను విన్నానని అనుమానం వొచ్చినట్టుంది. వెంటనే లోపలికి పిలిచి, మామూలుగా మాట్లాడి కాఫీ  తెప్పించాడు. బాగుండదని కాఫీ తాగేసి, ఆ కాగితాలేవో టైపుచేసి ఇచ్చేసి వొచ్చాను. మనసు బాగులేక అనూషని చూసి పోదామని వచ్చాను" అంది.

    మళ్ళీ శకుంతల గుండెలో  ఏదో అలజడి! ఆడది ఈ మూగ బాధ అనుభవించవలసిందేనా? ఆమె నయనాలు  అశ్రుపూరితాలయ్యాయి.

    "వదినా! వదినా!" ఉరుములా  అరుచుకుంటూ వచ్చింది మౌనిక.

    ఏదో కొంప మునిగే వుంటుందనుకుని ఏమిటమ్మా! ఏం జరిగింది?" అడిగింది శకుంతల.

    "వెధవ ఉద్యోగం! వెధవ ఆఫీసు!" అంది, ఉస్సూరని కుర్చీలో  కూర్చుంటూ.

    "అంత పెద్ద ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నావ్ నీకేం బాధ ఆఫీసులో?" అంది కాఫీ అందిస్తూ  శకుంతల.

    "అసలీ మొగాళ్ళ సంగతి  నాకంతుపట్టదు. ఆడ ఆఫీసర్ని  తనతో సమానంగా చూడరే! ఎంత సమర్ధవంతంగా  పనిచేస్తున్నా  ఎక్కడో అక్కడ  అడ్డొచ్చి అదేదో వాళ్ళు గొప్పవాళ్ళలా  ఇంకా పైవాళ్ళ దగ్గర చెప్పుకోవడానికి  ప్రయత్నిస్తారు. ఎవరైనా  ఆమెని పొగుడుతూ వుంటే అంతవరకూ మాట్లాడుతున్న వాళ్ళల్లా  మూగిగా  వుండిపోతారు. లేదా తప్పనిసరైతే  పొడిపొడిగా మెచ్చుకుంటారు. మీటింగుల్లో కూడా ఆఫీసర్లు చెప్పే సలహాని చులకనగా చూస్తారు. పనుండి, కింద ఆఫీసర్లని పిలుస్తే నామోషీగా భావిస్తారు రావడానికి. ఇదేం ఫీలింగో నాకర్ధం కావడం లేదు. ఛీ! ఛీ!" విసుక్కుంటూ కాఫీ తాగడం పూర్తిచేసింది మోనిక.

    "అదేంటీ, నువ్వు పెద్ద ఆఫీసరువే కదా! అలాంటి వాళ్ళని నాలుగు దులపొచ్చుగా?"  

    "అదేకదా! ఆడ ఆఫీసరు మెల్లగా  మందలించినా, భరించలేరు. అందుకే నేనే సర్దుకుపోతాను. ఒకటిలే! అయిష్టంగానో, కష్టంగానో పనిచేసుకుపోతున్నారు కదా! పదిమందిలో అలా ప్రవర్తించినా ఒక్కదాన్నే ఉన్నప్పుడొచ్చి క్షమాపణ చెప్పుకుంటారు. ఇవ్వాళ అలాగే జరిగింది. మూడాఫ్! సరే వస్తా. పనుంది. మళ్ళీ కలుస్తా!" వెళ్ళిపోయింది మౌనిక.

    అందరిలో అవమానపరిచినా, ఒంటరిగా క్షమాపణ చెప్పుకుంటే  మరచిపోయిన స్వభావం అబలత్వమా? లేక ఆమె ఔదార్యమా? నోరుండి, మాట్లాడలేని అశక్తురాలు. శక్తుండి నివురుకప్పిన  నిప్పులా  పడున్న అబల!

    ఆడజాతికిది శాపమా? వరమా?

    ఆమె ఓర్పు, నేర్పు, దయాగుణం, క్షమాగుణం ఆమెకూ, ఆమె చుట్టూ వున్న  కుటుంబసభ్యులకు  ఆలంబనం. అలా కాకపోతే, ఈ బంధాలూ, బాధ్యతలూ ఏవీ ఉండేవి కావేమో, కానీ, మరీ అలా.... టామీలా - ఛీ! ఛీ! అంటే పోవడం, రా అంటే తోకాడిస్తూ రావడం, అవసరమైనచోట కూడా నోరువిప్పకుండా  మూగగా  పడుండటం  మంచిది కాదేమో! ఆలోచిస్తూ  పిండికలపటం పూర్తి చేసి, ఎండిపోయిన చేతులకేసి చూసుకుంది శకుంతల. సర్దుబాటుతనం ఎంత వరకో అంతవరకే! ఆమె వ్యక్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని నిలుపుకోవలసినచోట తిరుగుబాటు కావాలి, సర్దుబాటు కాదు.

    "అమ్మా! అమ్మా!" హడావుడిగా అడుగులేసుకుంటూ  లోపలికొచ్చాడు ఇందర్.

    "ఏమిట్రా? ఏం జరిగింది?" అడిగింది శకుంతల.

    "చూశావా నీ కోడలు? ఇంకా ఏదో చదువుతుందిట. సంవత్సరం కంప్యూటర్ కోర్సు. అంతవరకూ తను ఇక్కడికి రాదుట" "వాళ్ళింటికెళితే నా మొహాన కొట్టునట్లు చెప్పింది ఈ మాటలు."

    పళ్ళు కొరుక్కున్నాడు ఇందర్ కోపంగా.

    శకుంతల మొహంలో  సంతోషరేఖ తొంగిచూసింది.

    "ఆ మాటే ఇప్పుడు నాతోవచ్చి నీతో చెప్పమన్నాను. ఏమందో తెలుసా?"

    "ఏమందీ?"

    "తానిప్పుడు రాలేదుట! రేపో ఎల్లుండో వచ్చి మీతో చెప్తుందట! నాన్నా, కూడానువ్వూ రమ్మన్నారని చెపితే కూడా నే చెప్తాలే వాళ్ళతో అంది! పైగా నన్ను చదవమంటోంది. ఏమిటీ ఈ గొడవ!" చిందులు తొక్కాడు ఇందర్.

    శకుంతల మనసూ,  చెవులూ  ఇందర్ మాటలు వినడం లేదు. ఆమె మనసు దూదిపింజలా గాలిలో తేలిపోతుంది. ఎన్నో ఏళ్ళ అనుభవాలకీ, ఘర్షణలకీ  ఈ రోజు సమాధానం దొరికినట్లయింది.

    'థాంక్స్ పూజా! ఆడవాళ్లు టామీలు కారు. మూగజీవులు కారు. అవసరమైతే అపర కాళులూ, సరస్వతీ పుత్రికలు, లక్ష్మీ ప్రసన్నులు, అన్నివిధాల పురుషులతో సమానంగా ఉండగల ధీమంతులు! ఆడది అబల కాదు సబల. అందుకే నేమో. బిడ్డని గర్భంలో  తొమ్మిది నెలలూ భరించే శక్తి స్త్రీకే దక్కింది. ఎంతటి వీరుడైనా, ధీరుడైనా, ప్రభువు అయినా, ప్రయోక్త అయినా ఒక తల్లి గర్భంలో నుంచి వచ్చినవాడే కదా? అందుకే ముందుగా మాతృదేవోభవ! అన్నారు.' శకుంతల గుండె నిండా సంతోషం. మనసునిండా అనురాగం. ప్రేమగా ఇందర్ తల నిమురుతూ__

    "పూజ చెప్పింది కరెక్టే బాబూ! నువ్వూ చదువు. ఆడదాని మాటలు వినాలా అన్న అహం, నువ్వు చెప్పిందే వేదం అన్న గర్వం నీలోనుంచి దూరం చెయ్యి బాబూ!" 

    ఇందర్ తల్లికేసి ఆశ్చర్యంగా చూశాడు.

    టామీ దగ్గరకొచ్చి నిల్చుంది "ఛీ! పో!" అన్నాడు ఇందర్ విసుగ్గా.

    టామీ కదల్లేదు. శకుంతలకేసి  తోకాడిస్తూ చూసింది. అలా నిలుచునే వుంది నిశ్చలంగా.

    శకుంతల అధరాలపై చిరునవ్వు పూసింది. తనూ, మానస, అస్మిత, మౌనిక అందరూ టామీలాగే ప్రవర్తించినా, నేను టామీని కాను అని నిరూపించిన పూజ మహిళలకే తలమానికంగా అనిపించింది. స్పూర్తిలోనే మరోసారి రెట్టించి చెప్పింది ఇందర్ కి - పూజ చెప్పింది అక్షరాల నిజం అని!