Facebook Twitter
అమ్మ పిలుపు

అమ్మ పిలుపు

- వసుంధర

ఎపిసోడ్- 5

       

        అది కాగితం కానీండి, ఇస్త్రీ పెట్టి కానీండి, ట్రక్కు కానీండి__ సరే అణువుల నుంచే తయారయ్యాయి. భూమిలో సహజంగా తొంభైరెండు రకాల అణువులున్నాయి. వాటిని మూలకాలంటారు. వీటిలో ప్రాణవాయువు బాగా ఎక్కువగా వుంది. అంటే సుమారు సగానికి సగం శాతం. మిగతావాటిలో సిలికాన్ ఇరవైయారు, అల్యూమినియం ఏడున్నర, ఇనుము నాలుగు, కాల్షియం మూడుంపావు ,సోడియం రెండున్నర, పొటాషియం రెండున్నర, మెగ్నీషియం రెండున్నర, ఉదజని ఒకటి శాతం వుంటాయి సుమారు. మిగతా ఎనభైమూడు సహజమూలకాలూ కలిపి ఒకటి ముప్పావు శాతం వుంటాయి. ఈ మూలకాల నుంచే ఎన్నో రకాల విభిన్న పదార్ధాలు వుద్భవించాయి.

    మూలకాల అణువులకు ఆ లక్షణాలు రావడానికి కారణం వాటిలో వుండే ప్రొటాన్సు. ఒక అణువులో ఒక ప్రొటాన్ వుంటే అది ఉదజని అవుతుంది. ఎనిమిది వుంటే అది ప్రాణవాయువు అవుతుంది. ఇరవైయారుంటే అది ఇనుమవుతుంది. నలభైఏడుంటే వెండి, డెబ్భై తొమ్మిదుంటే బంగారం అవుతాయి.

    అణువుల్లో ప్రొటాన్లు అమితశక్తితో బంధింపబడి వుంటాయి. అందుకే అణువుల్లోని ప్రొటాన్ల సంఖ్యను మార్చడం చాలా కష్టమైన పని. జడ్యా గ్రహవాసులకదెంతో సులభం. ఉదాహరణకు గంధకం అణువుల్లో పదహారు ప్రోటాన్లుంటాయి. భాస్వరం అణువులో పదిహేను ప్రోటాన్లుంటాయి. అంటే గంధకం అణువులోంచి ఓ ప్రోటాను తీసేస్తే భాస్వరం అణువు వస్తుంది. భాస్వరం అణువుకు ఓ ప్రోటాన్ కలిపితే గంధకం అణువు వస్తుంది. నాలుగు గంధకం అణువుల్నీ, ఒక భాస్వరం అణువునీ కలిపి అన్ని ప్రోటాన్సునీ ఒకచోట కలిపి బంధించగలిగితే బంగారం అణువు తయారవుతుంది. లేదా ఏడు బొగ్గు అణువులను కలిపి వాటిలోంచి అయిదు ప్రోటాన్లను తీసేయగలిగితే బంగారం తయారవుతుంది.

    ఇప్పటికి మనిషికిందా అణువుల్ని బద్దలు కొట్టడం తెలిసింది. అందువల్ల ప్రోటాన్లను బంధించి వున్న అమితశక్తి బైటకు వెలువడి దేశాలకు దేశాల్నే నాశనం చేయగలవు. అటుపైన మనిషి తనకు తెలిసిన పెద్ద అణువులకు ఒకటిరెండు ప్రోటాన్లు కలిపి భూమ్మీద లేని కొత్త మూలకాలను కూడా సృష్టించగలిగాడు. ఆ విధంగా ఇప్పుడు తొంభై రెండు మూలకాల సంఖ్య__ నూటపదికి మించింది.

    కానీ జడ్యా గ్రహంలో అలా కాదు. వారు క్షణాల మీద ఏ అణువునైనా మరో అణువుగానూ తయారు చేయగలరు. మెదడుకున్న శక్తినుపయోగించి వారు చెట్లకు ఫలాలనీ, యంత్రాలకులా వస్తువుల్నీ సృష్టించగలరు.

    అందుకని యోగి ఏం చేశాడంటే తన శక్తితో భూమ్మీద మనుషులను ప్రభావితం చేసి తనవైపు ఆకర్షించుకోసాగాడు. అది యించుమించుగా భూమ్యాకర్షణ శక్తి వంటిది. ఎటొచ్చీ యోగి సొరంగం లోపల మామూలు ప్రపంచానికి దూరంగా వుండిపోయాడు కదా- అందువల్ల అవతల మనిషిక్కూడా ధనం గురించి అత్యాశ వుంటే తప్ప అతడి ఆకర్షణ పనిచేయదు. ఆ విధంగా యోగి ముందుగా ఓ మనిషి నాకర్షించి రప్పించుకున్నాడు. యోగిలోని జీవశక్తి ఆ మనిషిలోకీ, ఆ మనిషిలోని జీవశక్తి యోగిలోకీ మార్పు చెందేలా చేసి ఆ మనిషి రూపంలో యోగి బయటకు వెళ్ళిపోయాడు. అతడు మళ్ళీ సొరంగ మార్గంలోకి రాలేదు. మనిషి శరీరాన్నంటి పెట్టుకుని వున్న కారణంగా యోగి జీవశక్తి కూడా కొంత కాలానికి భూమ్మీదే ఆ శరీరంతో పాటు నాశనమయింది.

    యోగి శరీరాన్నంటి పెట్టుకున్న కొత్త మనిషి క్రమంగా అక్కడి పుస్తకాలూ అవీ చదివి తన విజ్ఞానాన్ని పెంపొందించుకున్నాడు. అక్కడే వుండి ప్రపంచంలో జరిగే వింతలన్నీ చూడగల్గుతున్నా, కావలసినవన్నీ పొందగల్గుతున్నా, రోగాల బాధ_మృత్యుభయం లేకపోయినా అతడికి మనుషుల మధ్యకు పోవాలన్న కోరిక కలిగింది. తిరిగి ఓ మనిషిని ఆకర్షించి అతడి రూపంలో తనూ బైటకు వెళ్ళిపోయాడు.


       

*    *    *