Facebook Twitter
జారిన మల్లెలు

 జారిన మల్లెలు

- శారదా అశోకవర్ధన్

"అమ్మా, అన్నం పెట్టు. మళ్ళీ వెంటనే ఆఫీసుకి వెళ్ళిపోవాలి." హడావుడిగా లోపలికొస్తూ  అన్నాడు హరీష్.

    "ఏమిట్రా ఆ తొందర? తిండి కూడా కడుపునిండా  తినడానికి  నీకు టైము లేదంటావు. ఏం పిల్లాడివో ఏమిటో. ఎన్ని పన్లున్నా తిండి దగ్గర తొందరైతే ఎలా? ఆ తినే నాలుగు మెతుకులూ  నెమ్మదిగా తినవాయె." అనుకుంటూ వొచ్చి కంచం, గ్లాసూ పెట్టి, వడ్డన మొదలెట్టింది రామాయమ్మ.

    "ఏది శ్రేష్ఠ, కనబడదేం? అడిగాడు హరీష్.

    "ఇప్పటివరకు ఇక్కడే వుందే! నీతో కలిసి తిందామని ఇప్పటివరకూ భోం చెయ్యకుండా కూర్చుంది. పాపం, చూసి చూసి నువ్వెంతకీ రాకపోయేసరికి ఇందాకే తింది. అమ్మాయ్ శ్రేష్ఠా....శ్రేష్ఠా...." పెద్దగా పిలిచింది రామాయమ్మ.

    "ఆఁ....ఆఁ....చాలు..." అంటూ బెడ్ రూంకేసి చూస్తూ "నా కంచంలో వడ్డిస్తున్నావ్, ఎంత వేసేసేవో చూడు....అబ్బ ఇదంతా ఎలా తినాలి?" అన్నాడు పళ్ళెం కేసి చూస్తూ హరీష్.

    "ఒరేయ్!  అదేం కూరో చూసే అంటున్నావా ఆ మాట? నీకు ఎంతో ఇష్టమయిన గుత్తోంకాయ్ కూర...."

    "ఓ....మరింకేం? అంతా లాగించేస్తా! నీ కోడలు చేసిందా, నువ్వు చేశావా?" అన్నంలో కూర కలుపుకుంటూ అడిగేడు.

    "ఎవరు చేస్తే ఏమిరా ....తిని బాగుందా లేదా చెప్పు." నవ్వుతూ అంది ఆమె.

    "అహఁ....నువ్వు చేస్తే అసలు బాగుండదన్న  ప్రశ్నే లేదుగా...." ముద్ద నోట్లో  పెట్టుకుంటూ  అన్నాడు. 

    "అంతా నీ ఊహ!....మొన్న నువ్వూరెళ్ళినప్పుడు కోడలు వంట చేసింది. ఎంత బాగా చేసిందనుకున్నావ్. మీ నాన్న భోంచేస్తూ నాకసలు వంటే రాదు పొమ్మన్నారు" అంది కొడుకు కంచంలో మరింత కూర వడ్డిస్తూ,

    "ఏమో! నేను ఎక్కడ తిన్నా నీ వంట రుచిరాదు. ఆఁ  పెరుగేసెయ్యి" అన్నాడు హడావుడిగా గడియారం చూసుకుంటూ.

    వీరి సంభాషణంతా వింటూన్న శ్రేష్ఠ ముఖం  ఎఱ్ఱ మందారంలా వుంది. ఒంటి వేడి సెగలు కక్కుతూన్నట్టుగా అనిపించింది. గబగబా వెళ్ళి మంచంమీద పడుకుని కళ్ళు మూసుకుంది. భోజనం పూర్తిచేసి గదిలో కొచ్చి, భార్య పడుకుందనుకుని చప్పుడు చెయ్యకుండా వెళ్ళి "అమ్మా.... వెళ్ళొస్తాను. సాయంత్రం ఆరూ ఆరున్నరకల్లా  వొస్తాను" అంటూ  వెళ్ళిపోయాడు హరీష్.

    తలుపు గడియవేసి, కోడలు గదిలో కెళ్ళి ఆమె పడుకునుండడం చూసి, వెనక్కెళ్ళి  ఆ రోజు శనివారం కావడంవల్ల రాత్రి టిఫిన్ ఏర్పాటు చేస్తూవుండిపోయింది రామాయమ్మ, మినప రొట్టె కోసం పప్పు రుబ్భుతూ.

    రామాయమ్మగారిని చూడగానే ఎవరికైనా రెండు చేతులూ  ఎత్తి నమస్కరించాలనిపిస్తుంది. పచ్చటి శరీరచ్చాయ, కళ్ళ నిండుగా  కాటుక, పావలా కాసంత బొట్టూ చక్కటి తలకట్టూ, నిండైన చిరునవ్వు, స్త్రీత్వం వుట్టిపడేలా అనిపిస్తుంది. మంచి విగ్రహపుష్టే కాదు, మంచి గంధం లాంటి మనసు కూడా ఆమెకు భగవంతుడిచ్చిన వరం. అందుకే ఆమెను చూడగానే అందరికీ దండం పెట్టాలనిపిస్తుంది. ఆ చుట్టుప్రక్కల ఆ వాడలో వున్న పిన్నా పెద్ద అందరూ ఆమెకు ఆప్తులే. 'వొదినా' అని కొందరూ అక్కా అని కొందరూ పిన్నీ అని కొందరూ అలా వరసలు కలిపేసి క్షణంలో ఆమెకి చేరువవుతారు. చివరికి చిన్న పిల్లలు బొమ్మల పెళ్ళిళ్ళు చెయ్యాలంటే తాటాకు బొమ్మలు చెయ్యడానికి, తాటాకు బుట్టల దగ్గరి నుంచి, ముస్తాబు చేసేందుకు పాతగుడ్డతో బొట్టూ, కాటుకా మాత్రమే కాకుండా, పప్పుబెల్లాలు, పిండివంటలూ కూడా ఆమె తయారు చేసిచ్చేది. పిల్లలందరికీ ఆమె అమ్మామ్మో బామ్మో అవుతుంది. "నీ ఓపిక్కే మెచ్చుకోవాలి రామాయమ్మా!" అనేవారు తోడివారు. "ఊరి పిల్లలందరికీ ఇంత చేస్తావ్.... నీ సొంత మనవడో మనవరాలో ఒస్తే ఇంకా ఎంత చేస్తావో....అసలు కింద కాలు పెట్టి నడవనిస్తావా? ఇంతకీ ఆ వొచ్చే కోడలు అదృష్టవంతురాలు" అనేవారు. "తల్లిలాంటి అత్త దొరకడం అదృష్టంకదూ!"  అనేవారు చిన్నవారు. కోడలు నెలతప్పిందని  తెలుసుకుని మురిసిపోతూ' ఊళ్ళో వాళ్ళ మాటలు తలుచుకుని మురిసిపోతూ పప్పు రుబ్బడంలో నిమగ్నమయిపోయింది రామాయమ్మ.

    "మినపరొట్టంటే  హరీష్ కి ప్రాణం. దాన్లో నంచుకోవడానికి ఉల్లిపాయ పచ్చడి చేస్తే వాడికి పంచపరమాన్నాలు  తిన్నంత ప్రీతి.  ఆయనా అంతేగా! 'రామూ! మళ్ళీ ఎప్పుడు చేస్తావ్ మినపరొట్టె?' అనేవారు  చేతులు కడుక్కుంటూ, ఆ పూట తిన్నవెంటనే వెంకట్రావుగారు. ఆయనకి భార్య వంట ఎంత ఇష్టమో, భార్యంటే అంతకు రెట్టింపు ఇష్టం. ఆమె పంచే మమతానురాగాలు బొండుమల్లెలకన్నా ఇష్టం. కాపురాని కొచ్చినది మొదలు ఇంట్లో ప్రతీవారికీ తల్లో నాలుకలా మెలుగుతూ మంచిపేరు తెచ్చుకుంది. 'కోడలంటే నా కోడలే. మేలిమి బంగారం!' గొప్పగా చెప్పుకునేది ఆమె అత్తగారు సూరమ్మగారు. అయితే, వారి కొచ్చిన సమస్యల్లా పెళ్ళయి పదేళ్ళు కావొచ్చినా రామాయమ్మ కడుపు పండకపోవడం. సూరమ్మగారు చెయ్యని పూజలేదు, మొక్కని దేముడు లేడు.  

    ఏ నోటివరమో, ఏ పూజా ఫలితమో పద్నాలుగు సంవత్సరాల తరవాత వాళ్ళింట పాపాయి పలికింది. హరీష్ ని పువ్వుల్లో పెంచారు. సూరమ్మ కడుపు నిండిపోయింది. బంగారు మొలతాడు, మామిడిపిందెల గొలుసు, రెండు చేతులకీ మురుగులూ, కాళ్ళకి మువ్వలూ అచ్చు అంబాడే బాలకృష్ణుడిలా వుండేవాడు హరీష్. ఆమె హరీష్ కి మూడోనెలరాగానే ముద్దకుడుములు చేయించి ఊరంతా పంచింది. పాకుతూంటే పాయసం, అడుగులేస్తే అరిసెలు సంతర్పణ చేయించింది. పగలంతా హరీష్ సూరమ్మగారి ఒడిలో, రాత్రిళ్ళు రామాయమ్మ పక్కలో. అందరికీ ఆరోప్రాణం హరీష్, హరీష్ పలుక నేర్చాక, నడకనేర్చాక. చేతికర్ర విసిరి అవతల పారేసింది. గుడికి వెళ్ళేటప్పుడు వాడు ఆమెకి తోడు. బడికి వెళ్ళేటప్పుడు ఆమె వాడికి తోడు. ఊళ్ళో పిల్లలందరూ వొచ్చి వాళ్ళింటి ముందు ఆడాలి. హరీష్ ఆటకి వెళ్ళినా ఎప్పుడైనా ఆమె ప్రాణం కొట్టుకుపోయేది వాడాడింది ఆట, పాడింది పాట. వాడికేం కావాలన్నా సిఫారస్ చెయ్యడానికి బామ్మ ప్రత్యక్షం. బామ్మ మాటంటే జడ్జిమెంట్ మరి!

    "అత్తయ్య మరీ గారాబం చేసి వాణ్ణి  పాడు చేస్తున్నారు" అనేది రామాయమ్మ.

    "ముద్దుకైనా హద్దుండాలి" అనేవాడు వెంకట్రావుగారు.

    "హద్దులూ  ఎల్లలూ లేనిదేరా బామ్మా మనవళ్ళ ప్రేమ. అది బామ్మయి నువ్వు తాతయిననాడు తెలుస్తుంది ఈ తీపి. చెబితే అర్ధం కాదు" అంటూ  వెళ్ళి హరీష్ ని ఎత్తుకుని కూర్చునేది సూరమ్మ.

    పప్పు రుబ్బుతున్నంతసేపూ, గతం మనసులో  నలిగిపోయింది. ఊహలు తుమ్మెదల్లా  మనో పుష్పంమీద వాలిపోయాయి, ఆలోచనల పుప్పొడిని  ఆరగిస్తూ అనురాగపు తీయదనాన్ని గ్రోలుతూ.


        *    *    *


    ఆరు దాటుతున్నా  శ్రేష్ఠ లేవలేదు. "అమ్మాయ్! ఒంట్లో బాగులేదా? అబ్బాయొచ్చేవేళయింది. లే!" అంటూ  లేపింది రామాయమ్మ. సమాధానం చెప్పకుండా  లేచి బాతురూంలో కెళ్ళి మొహం కడుక్కొచ్చింది శ్రేష్ఠ.

    "ఒంట్లో నలతగా వుందేమో కనుక్కో. మందేమైనా  కావాలంటే చెప్పు, నే పట్టుకొస్తా. వాడొచ్చేసరికి లేటవొచ్చు" అన్నారు వెంకట్రావుగారు.

    "ఏమీ అఖ్కర్లేదు" ముక్తసరిగా జవాబు చెప్పింది శ్రేష్ఠ.

    మాటల్లోనే హరీష్ రావడంతో ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమయిపోయారు రామాయమ్మ, వెంకట్రావుగార్లు. హరీష్ ని చూడగానే మళ్ళీ మంచమెక్కింది శ్రేష్ఠ. " శ్రేష్ఠా....అమ్మాయ్...." పిలిచారు వెంకట్రావుగారు. "అబ్బబ్బబ్బబ్బబ్బ ..... చంపేస్తున్నారు. ఏమిటో ఆ గావు కేకలు!" విసుక్కుంటూ అటునుంచి ఇటు తిరిగి పడుకుంది శ్రేష్ఠ.

    "నాన్నగారు పిలుస్తుంటే వెళ్ళవేం?" అడిగాడు హరీష్. "పిలుస్తారు. పొద్దు గూకులూ, మీనాన్నా అమ్మలకి సమాధానం చెప్పడమే నా ఉద్యోగం." కసురుకుంది శ్రేష్ఠ.

    "ఓస్! అదీ కష్టమేనా?" నవ్వేడు హరీష్.

    మరొకప్పుడు అయితే ఆ నవ్వులో శృతి కలిపేది శ్రేష్ఠ. కానీ ఈ రోజు కాలిపోతూన్న  మనసుకి ఆజ్యం పోసినట్టుంది ఆ పిలుపు! అందుకే అది జ్వాలల్లా దహించేస్తున్నట్టుంది ఆ పిలుపు.

    "ఏమిటే! ఒకసారి  మీ అత్తయ్య పిలుపు. మరోసారి మీ మామయ్య పిలుపు. ఈ చాదస్తపు శాల్తీలతో ఎలా వేగుతున్నావో బాబూ! ఇరవైలోనే అరవైలా వున్నావ్" అంది లిప్ స్టిక్ ని చిన్న అద్దంలో చూసుకుని కర్చీపుతో సరి చేసుకుంటూ. తన ఫ్రెండు నిత్య.

    ఇప్పుడా మాటలు గబుక్కున జ్ఞాపకమొచ్చాయి. ఆమెలో దాగివున్న కోపం పడగ విప్పి బుసలు కొట్టింది.

    "అమ్మాయ్ శ్రేష్ఠా........"

    "నాన్నగారు పిలుస్తుంటే వెళ్ళవేం?" బట్టలు మార్చుకుంటూ అడిగేడు హరీష్ హెచ్చుస్వరంలో.

    "పిలవగానే పరుగెత్తడానికి నేనేం పనిమనిషినా? క్షణానికోసారి పిలుస్తారు పనున్నా లేకపోయినా..... మీరిప్పుడే ఇంటికొచ్చారుకదా! భార్యాభర్తలు ఏదో మాట్లాడుకుంటుంటారు, పిలవడమెందుకు అన్న జ్ఞానం వుండక్కర్లా.....! అయినా నేను పెళ్ళిచేసుకున్నది మిమ్మల్నా, వాళ్ళనా - పిలవగానే పరుగెత్తడానికి?"

    "శ్రేష్ఠా....! నువ్వేనా మాట్లాడుతూన్నది?" ఆమెకేసి ఆశ్చర్యంగా చూస్తూ అడిగేడు హరీష్.

    "అవును నేనే! మిమ్మల్ని చేసుకుని నేనేం సుఖపడ్డాను? సరదాగా ఒక సినిమాకెళ్ళడంలేదు. ఒక షికారుకెళ్ళడంలేదు. ఎంతసేపూ మీరు మీ అమ్మానాన్నల భజనచేస్తూ కూర్చుంటారు. మీవెనక తందానతానా అంటూ నేను. ఒక్కడేకొడుకు సుఖపడతావు అంటూ, వొచ్చిన సంబంధాలన్నీ వొదులుకుని మీకిచ్చి కట్టబెట్టారు. ఎమ్.ఏ. చదువుకుని అంట్లదానిలా ఇంట్లో కూర్చున్నాను. నా స్నేహితులందరూ  హాయిగా ఉద్యోగాలు చేసుకుంటూ, జల్సా చేసుకుంటూ హాయిగా వున్నారు." కళ్ళు తుడుచుకుంటూ ముక్కు చీదుకుంది శ్రేష్ఠ.

    ఆమె దగ్గరగా వెళ్ళి నవ్వుతూ "శ్రేష్ఠా.... హాయిగా వుండడం అంటే ఉద్యోగం చెయ్యడమేనా? మనకి ఆ అవసరం ఏముంది చెప్పు? అమ్మకీ నాన్నకీ నేనంటే ఎంత ఇష్టమో నువ్వన్నా అంతే ఇష్టం. వారికి ఆడపిల్ల లేని లోటు నీ ద్వారా తీర్చుకుంటున్నారు. ఎందరికి అత్తవారింట్లో  ఆ స్థానం దొరుకుతుంది చెప్పు?" అన్నాడు భుజాలమీద చేతులువేస్తూ. అతని చేతులు తోసిపారేసింది శ్రేష్ఠ.

    "నా మొహం. ఇదీ ఒక అదృష్టమేనా?  ఆ ముసిలాళ్లు జలగల్లా పట్టుకుని పీక్కుతింటున్నారు" అంది.

    అంతే హరీష్ అరచేతి అయిదువేళ్ళూ  ఆమె చెంపకతుక్కుపోయాయి.

    ఆమె కళ్ళంట జలపాతం ప్రవహించింది.

    అప్పుడే శ్రేష్ఠ ఎంతకీ రాకపోవడంతో కొన్ని మల్లెపూలు  దోసిట్లో పోసుకుని లోపలికొస్తూన్న వెంకట్రావుగారు, ఆ దృశ్యం చూసి చలనం లేని వారిలా దోసిలి ఒదిలేశారు. గాభరా పడ్డట్టుగా మల్లెలు గదంతా గంతులు వేశాయి.

    వెంకట్రావుగారి గుండె ఆగిపోయినట్టయింది.

    లోపల్నుంచి బయటికొచ్చి చూసిన రామాయమ్మగారికి ఆ దృశ్యం అర్ధం కాలేదు.

    "ఏమయిందండీ! ఈ పూలన్నీ ఇలా పడేశారేమిటి?" అంటూ దగ్గరగా వెళ్ళింది.

    "కోడలికీ నీకూ అని కొన్నాను. జారిపోయాయే" అన్నారు.

    "ఫరవాలేదు. నేనేరుతాలెండి" అంటూ  ఒక్కొక్క పువ్వే తీసి ఏరింది రామాయమ్మ.

    ఆమెకేసి తదేకంగా చూస్తున్న వెంకట్రావుగారు, "ఈ పువ్వుల్ని ఏరేవ్ గానీ జారిపోతూన్న నవ్వుల పువ్వుల్ని  ఎలా ఏరుతావ్?" అన్నాడు ఆమెకేసి చూస్తూ.

    ఆ మాటల్లోని అర్ధం కాక అతనికేసి అమాయకంగా చూసింది ఆమె.

    "అవును రామూ! మనం కొన్నాళ్లు ఎక్కడికైనా  పోవాలి. ఎప్పటినుంచో కాశీ, రామేశ్వరం, గయా తీర్ధయాత్రలకి వెళ్ళాలన్నావుగా. పద తీసికెళతాను. మంచి రోజు చూడు" అన్నారు తను విన్న మాటలనీ చూసిన దృశ్యాన్నీ మర్చిపోవడానికి ప్రయత్నిస్తూ.

    "చాల్లెండి. మనం తీర్ధయాత్రలు చెయ్యడానికి ఇదా సమయం? ఎవరైనా వింటే నవ్విపోతారు. కోడలు ఇప్పుడు వట్టి మనిషి కూడా కాదు. పాపం, ఏం పని చేసుకోగలుగుతుంది? దానికి ఏదైనా తినాలనుంటే చేసి పెట్టాలి. ఏడో నెలలో శ్రీమంతం చెయ్యాలి. అప్పటికి మల్లెపూల కాలం అయిపోతుంది.  అందుకని ఇప్పుడే పెద్ద పెద్ద పువ్వులు తెప్పించి మల్లెపూలతో వొంకి జెడ వెయ్యాలి." అంది చేతిలోని పూలని పళ్లెంలో పోస్తూ.

    వెంకట్రావుగారు ఆమెకేసి జాలిగా చూసి నిట్టూర్చారు.

    రామాయమ్మ ఆ నిట్టూర్పెందుకో అర్ధంకాక, అతని మొహంలోకి చూసింది.

    అంతలో శ్రేష్ఠ వెక్కి వెక్కి ఏడుపూ, గట్టిగా అరుస్తూన్న  హరీష్ గొంతు విని కంగారుగా అక్కడి కెళ్ళింది రామాయమ్మ. ఆమె రావడం చూసి దభాల్న తలుపేసేసింది శ్రేష్ఠ.రామాయమ్మకి భూమి బద్దలయిపోతూన్నట్టనిపించింది. కళ్ళు గిర్రున తిరిగాయి. అంతలో బయటి కొచ్చేడు హరీష్ తలుపు తెరుచుకుని, గడప దగ్గరనుంచున్న  రామాయమ్మని చూసి "అన్నం పెట్టమ్మా...." అన్నాడు. ఆ మాటలకి వెంకట్రావుగారు, రామాయమ్మని చూసి ఏదో సైగ చేశారు శ్రేష్ఠ గదివైపు చూపిస్తూ. అర్ధమయినట్టు తలూపింది రామాయమ్మ. "నాకు కాళ్ళు పీకుతున్నాయి. నీ పెళ్ళాన్ని వడ్డించమను. అయినా, పెళ్ళామొచ్చినా కూడా నన్ను వడ్డించమని అడుగుతావేమిట్రా చిన్న పిల్లాడిలా?" అంది పక్కనున్న కుర్చీలో కూర్చుంటూ. "అమ్మా.... నువ్వేనా ఇలా అంటూన్నది? శ్రేష్ఠ మాటలకి కోపం వొచ్చిందా? అమ్మా! ఈ ఇల్లు ఒక అనురాగ కోవెల అందరికీ. నాన్నా నువ్వూ అందరికీ దేవతలతో సమానం. అటువంటిది. కన్నబిడ్డని నాకు నీకన్నా ఎవరమ్మా ఎక్కువ? మీ ప్రేమని అర్ధం చేసుకోలేని మూర్ఖురాలు శ్రేష్ఠ. పల్లెటూళ్ళో ఎక్కడో పుట్టి, ఎలాగో ప్రైవేటుగా పరీక్షలు కట్టి ఎమ్.ఏ.ప్యాసయి, పది మంది పిల్లల్లో తాను ఒక్కరిగా మధ్యతరగతి కుటుంబంలో పెరిగి, మీరు పంచే ప్రేమని అందుకుని అరిగించుకోలేని తెలివి తక్కువ మనిషి. అసూయతో స్నేహితురాలు చెప్పే మాటల్ని అర్ధం చేసుకోలేక ఆచరించాలనుకుంటూన్న బుద్దిహీనురాలు. దాని మాటలకేం? నువ్వొచ్చి అన్నం పెట్టు" అంటూ కంచం దగ్గర కూర్చున్నాడు.

    శ్రేష్ఠనీ రమ్మని బతిమాలింది రామాయమ్మ. అయినా రాలేదు శ్రేష్ఠ. ఆమె మూర్ఖత్వానికి మండిపడుతూ భోజనం చెయ్యకుండానే  వెళ్ళిపోయాడు హరీష్. ఆ పూట అందరికీ పస్తే. ఎంతో సంతోషంగా చేసిన మినప రొట్టె తనుని చూసి నవ్వుతూన్నట్టనిపించింది రామాయమ్మకి. ఎలాగో అందర్నీ వొప్పించి కాస్త ఎంగిలి పడనిచ్చింది రామాయమ్మ, అలా పస్తుండడం ఇష్టం లేక.  యాత్రలకవి దూరంగా వెళ్ళడం ఇష్టం లేక, ఇక్కడే దూరదూరంగా వుంటున్నారు దంపతులిద్దరూ. కొడుకు ఆఫీసునుంచొచ్చే  సమయానికి వీళ్ళు గుడికెళ్ళిపోతారు. ఏ రాత్రికో వాళ్ళ భోజనాలయ్యాక  ఇల్లు చేరుకుంటారు. "ఎందుకమ్మా ఇంత ఆలస్యం" అని అడిగితే "పురాణ కాలక్షేపం జరుగుతోంది బాబూ, గుడి దగ్గర" అని చిన్న అబద్ధం చెప్పేరు. నిజానికి గుళ్ళో కూర్చున్నంత సేపూ వాళ్ళ ఆలోచనలు  హరీష్, శ్రేష్ఠా, పుట్టబోయే పాపాయి గురించే.


        *    *    *


    ఏడోనెల రాగానే పుట్టింటికి  బయలుదేరింది శ్రేష్ఠ. శ్రీమంతం వేడుక పూర్తిచేసి తల్లితో పంపించేసింది రామాయమ్మ. శ్రేష్ఠ వెళ్ళిపోతూవుంటే  రామాయమ్మ పడ్డబాధ మరో మనసున్న  మనిషికి తప్ప  మాటలలో  అర్ధంకాదు. బయలుదేరి వెళ్ళినప్పటినుంచి రోజులు లెఖ్కెట్టడం మొదలెట్టింది.

    ఆమె మదినిండా  కొత్త ఊహలు కొత్త ఊసులే. ఆ ఇంట్లో మళ్ళీ బుచ్చి హరీష్ వెలుస్తాడు. హరీష్ కి సూరమ్మగారు  చేయించిన మురుగులూ, బంగారు మొలతాడు, మామిడిపిందెల గొలుసు, కాళ్ళ గజ్జెలు, చేతి ఉంగరాలూ అన్నీ అలాగే వున్నాయి. అవన్నీ మళ్ళీ వాడికి పెట్టాలి. మూడో నెలలో ముద్ద కుడుములూ, పాకుతూంటే పాయసం, అడుగులేస్తే అరిసెలూ అన్నీ హరీష్ కి జరిగినట్టే జరగాలి. ఆ మాటే వెంకట్రావుగారితో  అంది. ఆయన నవ్వుతూ "మనవడూ మనవడూ అంటున్నావ్! ఇవన్నీ మనుమరాలైనా చేస్తావా లేక మనవడైతేనా?" అన్నారు. "మనుమరాలైతే ఇంకా ఎక్కువ చేస్తాను. నా మెళ్ళో వున్న గొలుసు కూడా దానికే వేసేస్తాను. మనవడైనా, మనవరాలైనా ముద్దు ముచ్చుట్లు ఒక్కటే కదండీ!" అంది ఆమె నవ్వుతూ. "ఎంత అచ్చరలచ్చలు విలువచేసే మాటన్నావే రామూ! నీ మనసు బంగారం" అన్నారు. ఆమె తల నిమురుతూ!  వాళ్ళిద్దరి  అరవై ఏళ్ల దాంపత్యంలోనూ, ఎన్నడూ దెబ్బలాడుకున్న రోజు కనీసం ఒక్కటైనా లేదంటే  నమ్మశక్యం కాదు. ఎవరైనా దెబ్బలాడుకుంటూంటే ఎందుకు దెబ్బలాడుకుంటున్నారో  కూడా వాళ్ళకి అర్ధంకాదు. జన్మజన్మల బంధం వారిది ప్రేమించడమే తెలుసు. ప్రేమను పొందడమే తెలుసు. నాగరికత ముదిరిన కల్మష వాతావరణం కృత్రిమత్వం వారికి అంటలేదు.

    కాలచక్రంలో  మరో మూడు మాసాలు గడిచిపోయాయి. ఒక శుభ ముహూర్తంలో  పండంటి పిల్లాణ్ణి ప్రసవించింది శ్రేష్ఠ. రామాయమ్మ గారికి పెద్ద నిధి దొరికినంత సంతోషం కలిగింది. పదకొండో రోజు నామకరణానికి వెళ్ళేటప్పుడు, పిల్లాడికి నలుగుపెట్టి స్నానం చేయించాలని సున్నిపిండి విసరించింది. మంచి ఆముదం, పుట్టతేనె, కస్తూరి మాత్రలు - అన్నీ  ఒక సూటుకేసు నిండా  నింపింది. కోడలికోసం జడ కుచ్చులు, నాగరం చేయించింది. వెంకట్రావుగారూ రామాయమ్మా పదోరోజునే శ్రేష్ఠ ఊరు చేరుకున్నారు.

    శ్రేష్ఠని  చూడగానే గతుక్కుమంది రామాయమ్మ. శ్రేష్ఠ జుట్టు మెడల వరకూ కత్తిరించేసుకుంది. ఆమె కిద్దామని తెచ్చిన జడకుచ్చులూ నాగరం తనని చూసి హేళనగా నవ్వుతూన్నట్టున్నాయి. కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. "చక్కటి నీలాలు పిరుదుల దాకా వేలాడేజడ." నిట్టూర్చింది. మర్నాడుదయమే పిల్లాడికి స్నానం చేయించడానికి ఆముదం, సున్నిపిండి, మీగడా, వెన్నపూసా అంతా తయారుచేసింది. బాతురూంలో రెండు పీటలు వేసి, వేడినీళ్ళు పెట్టుకుని కూర్చుంది, బాబు నెత్తుకుని. శ్రేష్ఠ గబుక్కున ఆమె చేతిలో నుంచి బాబుని లాక్కుంది "ఇవన్నీ ఏమిటండీ చాదస్తం. బేబీ సోప్ తో స్నానం చేయిస్తాను. ఈ గొడవంతా ఒద్దు. ఈ పిచ్చి పిచ్చివన్నీ  ఇప్పుడెవ్వరూ చెయ్యరు నాకిష్టం లేదు" అంది.

    రామాయమ్మా నోరు తెరిచి గుడ్లప్పగించి  చూస్తుండి పోయింది మతి పోయినదానిలా. ఆమె కళ్ళనిండా నీళ్ళు నిండుకున్నాయి. గుండె బరువెక్కింది. పీటమీంచి లేచి వెళ్ళిపోయింది శ్రేష్ఠకి దారినిస్తూ.

    'కిరీటి' అని పేరు పెట్టారు బాబుకి. "ఎన్నో కీర్తి కిరీటాలు  సంపాదించి  చిరంజీవిగా వర్ధిల్లు బాబూ!" అని ఆశీర్వదించి, ఆ భరణాలన్నీ  తొడిగింది బాబుకి రామాయమ్మ.

    "ఇవన్నీ  వెయ్యడమేమిటి పిల్లలకి  అసహ్యంగా!" అంటూ వెంటనే అవన్నీ  తీసేసింది. రామాయమ్మ గుండెల్లో మరో శూలం గుచ్చుకుంది. మరి కాస్సేపటికి, కంసాలిని పిలిపించి, పిల్లాడికి పెట్టిన నగలన్నీ కరిగించి, తను నెక్లెస్ చేయించుకోడానికి ఆర్డరిచ్చింది శ్రేష్ఠ. అది చూసిన రామాయమ్మకి గుండె ముక్కలు ముక్కలయిపోయింది. తన శరీరంలో  ఒక భాగాన్ని కోసేసినంత బాధనిపించింది. గుండె చెరువైపోయింది. కన్నీళ్ళు జలజలా కళ్ళంట రాలేయి. శరీరంలోని శక్తంతా  పోయినట్టు  కుప్పగా కూలిపోయింది. ప్రేమా,   అభిమానం, ఆప్యాయతా, మమకారం ఇవన్నీ మనసున్న మనిషికి భగవంతుడు పెట్టిన శాపాల్లా  అనిపించాయి. దీనంగా కూర్చున్న  రామాయమ్మ  భుజంమీద చెయ్యివేసి "రామూ! నువ్వలా కళ్ళనీళ్ళు పెట్టుకుని దిగులుగా కూర్చుంటే నే చూళ్ళేను. పశుపక్ష్యాదులు కూడా వాటిప్రేమని కొంతవరకే  చూపిస్తాయి. మరి మనుషులు కూడా వాటిలాగే మారిపోతే సుఖం వుందికదూ! మారే కాలంలో విలువలు కూడా మారిపోతున్నాయి. వాటిప్రకారం మనం మారకపోతే  ఆందోళనా, బాధాతప్ప ఏమీయగలదు?" ఓదార్చారు. ఆయన గుండెలమీద తల పెట్టి తనివి తీరా ఏడ్చింది రామాయమ్మ. ఆ కన్నీటి తడికి తడిసి గుండె చల్లబడిందేమో, లేచి మామూలుగా పన్లు చేసుకుంది.

    ఆ మర్నాడే తీర్ధ యాత్రలకని  బయల్దేరారు దంపతులిద్దరూ. ఇంటికెళ్ళడం ఇష్టంలేక. ఇంటి తాళాలు శ్రేష్ఠ చేతిలో పెట్టింది రామాయమ్మ. అమ్మా నాన్నా ఎందుకు వెళుతున్నారో తెలుసు. కానీ ఏమీ చెయ్యలేని పరిస్థితి. అటూ తనని కన్నవారూ, ఇటూ తను కన్నవారూ, కట్టుకున్నవారూ. మధ్యలో మనసు నలిగిపోయింది హరీష్ కి. బరువెక్కిన  గుండెతో కన్నీరు కనబడకుండా  ముఖానికి చేతులడ్డం పెట్టుకుని రైలు కనుమరుగయ్యే వరకు చెయ్యూపుతూ వీడ్కోలు చెప్పాడు హరీష్. "ఇదే జీవితం! తెలుసుకో ఈ సత్యం!" ఎవరో చెబుతూన్నట్టుగా ఎక్కడి నుంచో ఈ మాటలు వినిపించాయి, గుండె లోతుల్లోంచీ, నరనరాలన్నుంచీ!

    రైలు వెళ్ళి పోయింది! ఒక్కసారిగా జనం మటు మాయమైనట్టు  స్టేషను నిశ్శబ్దంతో నిండిపోయింది. అడుగులో అడుగు వేసుకుంటూ  హరీష్ తిరుగుముఖం  పట్టేడు, జీవన సత్యాన్ని  కనుగొన్న  యోగిలా! మరో పాతికేళ్ళ తర్వాత తన కొడుకు కిరీటి కూడా, తన లాగే తనని సాగనంపడానికి ఈ విధంగానే వచ్చే దృశ్యాన్ని ఊహించుకుంటూ!