Facebook Twitter
ప్రేమికుల ఓట్లు

ప్రేమి"కుల "ఓట్లు

కండ్లకుంట శరత్ చంద్ర

" భావిభారత ప్రేమికులారా! నమస్కారం!!" చిరునవ్వుతో అన్నాడు ' ప్రేమికుల దేశం' పార్టీ అధ్యక్షుడు
ప్రేమారావు.

చైతన్య', 'క్రాంతి','కిరణ్', 'క్రాంతి',... ఇత్యాది పేర్లను ఎలాగైతే స్త్రీలకూ కూడా పెట్టవచ్చునో. ' ప్రేమ' అనే పేరును కూడా స్త్రీ , పురుషులిద్దరికీ వాడచ్చని తీర్మానించుకుని,ప్రేమరావు తండ్రి,అతనకి   ఆ పేరు పెట్టాడు.తప్పదు కాబట్టి ,ప్రేమారావు అందరిలాగే పెరిగి పెద్దవాడయ్యాడు .వయసులో మాత్రమే కాకుండా ,జనాలలోనూ సెలబ్రిటీనో,లెజెండో అయిపోయి 'పెద్దవాడు ' అనే పేరు తెచ్చుకోవాలనే సంకల్పంతో సినిమాలలో ప్రయత్నించాడు.అయితే పౌరాణిక సినిమాలలో  కౌరవులలో అరవైనాలుగోవాడి పాత్ర, మొహానికి మాస్క్ వేసుకుని నటించిన జఠాయువుపాత్ర, లవకుశులు పాట పాడుతుంటే విని ఆనందించే వందమంది మునిబాలుళ్ళలో ఒకడి పాత్ర లాంటిది రావడంతో సినిమాలు మానుకుని , భూమిని నమ్ముకుని, లాక్కుని,అమ్ముకుని ఓ భారీసైజు ధనవంతుడు అయ్యాడు.

  అయితే ఎన్నికోట్లు సంపాదించినా ,తనను ఎవరు గుర్తించడంలేదనే   తపనతో రాజకీయాలలోకి అడుగుపెట్టాడు. ఉచిత కరెంటిస్తాం , ఉచిత సెల్ ఫోన్ ఇస్తాం, ఉచిత కార్లు ఇస్తాం,ఉచిత వరకట్నాలు ఇస్తాం, ఉచితంగా తద్దినం పెట్టిస్తాం,గాడిద గుడ్డు ఇస్తాం,పంది పిల్లలు పావలకొకటి ఇస్తాం.. లాంటి  వాగ్దానాలతోదేశస్థాయిలో దోచుకునే పార్టీలు,రాష్ట్రస్థాయిలో దోచుకునే పార్టీలు, ప్రాంతీయ స్థాయిలో దోచేయజూసే పార్టీలు తీవ్రస్థాయిలో చర్చించి విశ్లేషించి, తర్కించి మీమాంస చెంది చిట్టచివరికి " ప్రేమికులను  బుట్టలో వేసే " సంకల్పంతో ప్రజా ప్రతినిధి అయిపోవాలని  సభలో ప్రేమికుల ముందు ప్రసంగించసాగాడు.


  
"ప్రభుత్వాలు మహిళా పథకాలు పెడుతున్నాయి, ఆరోగ్యపథకాలు అంటున్నాయి,గృహ పథకాలు వంట గ్యాస్ పథకాలు,నిరుద్యోగ నిర్మూలనా పథకాలు,బాలింతల పథకాలు,ఉచిత బడి పథకాలు,   ఇలా అన్ని వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ భావిభారతదేశానికి పట్టుగోమ్మలైన ప్రేమికులను మాత్రం మర్చిపోతున్నాయి. అసలు ప్రేమికులంటే ఎవరు ? " మైకులో గర్జించాడు. ఆ గర్జనకు  చుట్టుపక్కల ఉన్న చెట్లపైనున్న పక్షులు తలోదిక్కూ పారిపోయాయి.

"ఊ ! చెప్పండి. అసలు ప్రేమికులంటే ఎవరు? " మళ్ళీ గర్జించాడు
జనాలు రకరకాలుగా చూసారు. ప్రేమారావు కార్యదర్శి బుల్ బుల్ రెడ్డి, ఆయన దగ్గరకొచ్చి" సార్. ఇది తరగతి గదో, సమావేశమో కాదు . భారీ సభ ఎవరూ సమాధానం చెప్పరు. మీరే చెప్పాలి" అన్నాడు చెవిలో.
' నాకు తెలుసులేవయ్యా' అని ప్రేమరావ్ అతడిని తిట్టి ,జనాలవైపు  తిరిగాడు.
" అసలు ప్రేమికులంటే భావి భారత పౌరులు . భావిభారత పోరలు,పోరీలు , ప్రేమికులను రాజకీయ పార్టీలు   చిన్న చూపు చూస్తున్నాయి.ప్రేమికుల కోసం ఏ పథకాలు లేవు. ప్రేమికుల గురించి, ఆలోచించే నాధుడే లేడు. అరె! ప్రేమికులు మనుషులు కారా ? వాళ్ళకు మాత్రం   ఓట్లుండవా ? అని నాలుక కరుచుకుని ' వారికీ మాత్రం సమస్యలుండవా? సరిగ్గా ప్రేమించుకుందామంటే  ఒక పార్కు ఉండదు .పార్క్ లలో సరైన పొదలుండవు మద్య మద్యలో పల్లీలు అమ్మేవాళ్ళ డిస్టర్బెన్స్.ఛీ ఛీ !

ఈ దేశంలో సరిగ్గా ప్రేమించుకోవడానికి  కనీస వసతులు లేవు.పాపం రాత్రనకా పగలనకా పార్కులలో ప్రేమించుకుందామని వస్తే ,అతి అమానుషంగా,రాక్షసంగా, దారుణంగా వాచ్ మెన్ లు పార్క్ టైమ్ అయిపోయిందని ప్రేమికులను వెళ్లగొట్టి గేటు ముసేస్తుంటే ఆ ప్రేమికులు పడే బాధ, మూగరోదన  వర్ణనాతీతం. వా..! వా...!! ప్రేమరావు ఏడ్చాడు. అదిచూసి సభకు  వచ్చిన వారిలో ప్రేమికులంతా గుక్కపెట్టి ఏడవసాగారు.

 "నీయవ్వ! నా మీద ముక్కు  చీదుతవేంది బే"
సభలో ఒకడు తన ప్రక్కనున్న వాడిని అన్నాడు.
"ఏడ్చి ఏడ్చి చిదాను క్షమించు" అన్నాడు ఆ చీదినవాడు.
"ప్రేమనగర్ "సినిమా ఎందుకు హిట్టైయ్యింది? స్వయంవరం సినిమా ఎందుకు ఆడింది ? దసరాబుల్లోడు,ప్రేమాభిషేకం,మజ్నూ, ప్రేమ ఇవన్ని ఎందుకు హిట్లూ,బ్లాక్ బస్టర్లూ అయ్యాయి! ప్రేమరావు  ప్రేమరావు ప్రశ్నించాడు, ప్రేమికులు బుర్రలు గోక్కుని ఎందుకబ్బా అనుకున్నారు.
వాటిలో ప్రేమ అనే అంశం వుంది కాబట్టి. ఆ  సినిమాలను  మీ మీ తల్లిదండ్రులు ఎగేసుకు వెళ్లిచూసారు కాబట్టి.నేను ఈ పాత సినిమాలను  ప్రస్తావించడానికి కారణం.మీ తల్లిదండ్రుల అభిరుచి గురించి చెప్పడానికే! ప్రేమ సినిమాలను ఆదరిస్తారు కానీ, ప్రేమికులను మాత్రం ఆదరించరు. ప్రేమికులంటే అంత చిన్న చూపు ! పాపం, ప్రేమికులు ఎంతో కష్టపడి సెల్ ఫోన్ లలో ప్రేమ మెసేజ్ లు కొట్టుకుంటుంటే ఈ తల్లిదండ్రులు అతికిరాతకంగా, అతిహేయంగా, అతినీచంగా, అతిచెండాలంగా,ప్రేమికుల సెల్ ఫోన్లు లాక్కుంటున్నారు. మీ తల్లిదండ్రులే మీపాలిట రావణ కుంభకర్ణ మారీచసుబాహులై,ఖరదూషణులై వేదిస్తున్నారు."ఆవేశంగా అన్నాడు ప్రేమారావు.
ప్రేమికులందరూ ఏడుపు మానేసి ఆవేశంతో అవును నిజమే అనుకున్నారు. ఒక ఆధునికప్రేయసి,తన ప్రియుడితో  " డియర్! రావ, నకుంబ, కర్ణమా, రీచసు, బాహులిక, రదూషణులైవేదిస్తున్నారు.ఈ పాదాలకు అర్ధమేమిటి " ? అంది.వాడు నెత్తినోరూ కొట్టుకుని "నీకు తెలుగు నేర్పిన వెధవ ఎవరు ?" అడిగాడు.
"మా డాడి !మా డాడీ నే వెధవ అంటావా.ఛీఛీ నీకు గుడ్ బై " అనేసి జనాలలో పడి వెళ్లిపోసాగింది.వాడు 'సారీ 'అంటూ ఆమె వెంపడ్డాడు."ప్రేమికులారా ఇకపోతే, ప్రేమికుల దినం ఆ రోజున మీకు రైళ్ళలో, బసుల్లో ఏమైనా రాయితీలు ఇస్తున్నారా ? లేదు. కనీసం " గ్రీటింగ్ కార్డులపై రాయితీలు ఏ ప్రభుత్వమైనా ఇచ్చిందా? లేదు.ప్రేమికులు ఈ ప్రభుత్వాల కళ్ళకు వెధవలుగా,గూట్లేలుగా, దొంగానయాళ్ళలా,భ్రష్టుల్లా,నీచుల్లా కనిపిస్తున్నారు" అన్నాడు ప్రేమారావు.
ప్రేమికులందరూ మళ్ళీ క్యారుక్యారుమని, బ్యారుబ్యారుమని ఏడుస్తూ గ్యాలన్ల కొద్ది కన్నీళ్లు  కార్చారు.

  " ప్రేయసులారా,ప్రేమికులారా , బాధాసర్ప దృష్టులారా,ఏడవకండేడవకండి! పి.టి.వో అనగా పేజి తిప్పు చూడుము" అని నాలుక కరుచుకోకుండానే, ఉపన్యాసపు  పేజిని తిప్పి అన్నాడు " మరో ప్రపంచం ప్రేమ ప్రపంచం,ప్రేమప్రపంచం పిలిచింది,పదండి ముందుకు పదండి, ప్రేయసిని లేపుకు పోదాం పోదాం  "ముంబైకి "! అని అందరి మొహాలు చూసాడు. ఎవ్వరూ ప్రతిస్పందించలేదు , కోపంతో బుల్ బుల్ రెడ్డి వంక చూసాడు.బుల్ బుల్ రెడ్డి సైగ చేసాడు.ఆ సైగను చూసి, జనాలలో అక్కడక్కడా నిల్చున్న అద్దె చప్పట్ల వాళ్ళు చప్పట్లు కొట్టారు. చప్పట్లు 'అంటువ్యాధి ఫార్ములా' మిగతావారందరూ చప్పట్లు కొట్టేలా  పురికొల్పింది. ప్రేమారావు కొనసాగించాడు.'నేను సైతం ప్రేమకోసం పిచ్చికుక్కనైపోతాను,నేనుసైతం ప్రేమికుల రొమాన్స్ కు పిచ్చి పొదలను నాటించాను,నేనుసైతం మీరు లేచిపోయేటందుకు  బ్రేకుల్లేని డొక్కు కారునైపోతాను . నేను సైతం  మీ పెద్దలపై రంకెవేసే గజ్జి ఎద్దునౌతాను.

  అందరు పటపటా చేతులు విరిగేలా చప్పట్లుకొట్టారు. వారు చప్పట్లుకొట్టింది, నేనుసైతం అనే శ్రీ శ్రీ గారి జయభేరి కవితలోని ఆ రెండు పదాలలో శక్తికి మాత్రమేనని , ప్రేమారావుకు  తెలియదు. అతడు మరింత విజృంబించాడు.
  " పాత సెల్లు, సెల్లులో సొల్లు పార్కులో ముల్లూ, పిచ్చిగా  చూడకు దేన్నీ , ప్రేమమయమేనోయే అన్నీ! పిచ్చిముక్క,పల్లీల తొక్క, పెద్దల తిక్క ప్రేమను పోషిస్తాయ్, లేచిపోమ్మంటాయ్. ప్రేయసి  ముద్దు, పెద్దల గుద్దు ,ప్రేమను వదలొద్దు కావేవీ ప్రేమకు అనర్హం. ప్రేమికులదేశం  పార్టీయే ఘనం !
" చప్పట్లు సీమ టపాకాయల్లా పేలాయి. బుల్ బుల్ రెడ్డి వచ్చి
" సార్  ఇక మీ వాగ్ధానాలు చదవండి " చెవిలో ఊదాడు.
"ఏయ్ ఎందుకలా చెవిలో ఉమ్మేసావ్?" సీరియస్ గా అడిగాడు ప్రేమరావు.
" నేను  ఊమ్మెయ్యలేదు సార్. చచ్చిపోయిన మీ మొదటి భార్య మీదొట్టు.చెవిలో చెప్పను అంతే."
"సరే దూరంగా వెళ్లి తగలడు ",అన్నాడు తన చెవిని తుడుచుకుంటూ బుల్  బుల్ రెడ్డి దూరంగా వెళ్ళిపోయాడు." ఇకపోతే, ఇప్పటివరకు రాజకీయ నాయకులలో, పార్టీలలో ప్రేమికులపట్ల ఉన్న చిన్న చూపును ఎండగట్టిన నేను, ఇప్పుడు  నా వాగ్దానాలను చెప్తాను". మీరేగనక మీ పవిత్రమైన ఓటు నాకు వేస్తె ప్రేమికుల పంట పండినట్లే అన్నాడు. సభలో ఒకడు"మనం సాఫ్ట్ వేర్ ఇంజనియర్లం కదా! పంట ఎట్లా పండిస్తాం" ?  తన ప్రేయసి చెవి కొరికాడు.
" ఏమో? వినువిను, ఆయనేదో  చెప్తున్నాడు "అంది.
 ప్రేమరావు గొంతు సవరించుకున్నాడు.ఆ శబ్ధానికి  కిలో మీటర్ దూరంలో ప్రసవవేదన పడుతున్న ఓ గాడిద, సుఖం గా  ప్రసవించింది. " ప్రేమికులకోసం హైదరాబాద్ లో వంద పార్కులు కట్టిస్తాను ,
ఆ పార్కులను ఇరవైనాలుగు గంటలు తెరచి ఉంచుతాం.పార్కులలో ఏకాంతంగా ప్రేమించుకోవడానికి చక్కటి పొదలను.. వీలైతే గుడిసెలను ఏర్పాటు చేస్తాం". ప్రేమికులు ఆనందంగా చప్పట్లు కొట్టారు. " బడుగు బలహీన ప్రేమికులకు"  సెల్ ఫోన్లు ఉచితంగా ఇచ్చి , బిల్స్  కూడా మేమే
కడతాం ప్రేమికులు గనక  విద్యార్ధినీ విద్యార్దులైతే వారికి బస్సు పాస్ లు ఉచితం. మళ్ళీ చప్పట్ల వర్షం కురిసింది."ప్రేమికులు అవగానే వారికి గుర్తింపు కార్డు ఇస్తాం. ఆ కార్డు చూపించి  సినిమా థియేటర్లలో పదిశాతం డిస్కోథెక్ లలో ఇరవై శాతం రాయితీ పొందవచ్చు." ప్రేమికులకోసం ప్రతీజిల్లాలోను ప్రభుత్వ డిస్కోథెక్లూ, ప్రభుత్వ పబ్బులూ నడుపుతాం". చపట్లు కొట్టీకొట్టీ  కొందరి చేతులు విరిగిపోయాయి. "అంతేకాదు, యురోపియాన్ దేశాలలోలగా ప్రేమికులకి ఎప్పుడు ఎక్కడ మూడ్ వస్తే, అప్పుడే  అక్కడే ముద్దులు పెట్టేసుకోనేలా చట్టాన్ని సవరిస్తాం. లేచిపోయే పవిత్రమైన ప్రేమికులకోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటుచేస్తాం. ఆనెంబర్ కు ఫోన్ చేస్తే మీరు  లేచిపోయెందుకు, ప్రభుత్వమే సహకరిస్తుంది".
ఆహా, ఓహో,ఓహోహో  అన్నారు ప్రేమికులు.
"ప్రేమను  ముఖ్యమైన అంశంగా స్వీకరించి, సినిమాలు తీసేవారికీ రాయితీలు ఇస్తాం". ప్రేమగీకుడు,ప్రేమ పుల్లయ్య ప్రేమవీర, ప్రేమశంకరరెడ్డి, ప్రేమ గురువిందలు... ఇలా ఏ అంశానికి చెందిన సినిమాల్లో అయినా సరే, సినిమా పేరులో ప్రేమ వుంటే వినోదపన్నులో రాయితీ ఇప్పిస్తాం.ప్రకటించాడు ప్రేమరావు. ఈ కార్యక్రమాన్ని లైవ్ లో టివిల్లో చూస్తున్న ఓ నిర్మాత
తాను తీయ్యబోయ్యే కమ్యూనిజపు చిత్రం " రెక్కాడితే డొక్కాడదు" పేరును " ప్రేమ రెక్కాడితే కానీ - డొక్కాడదు", అని మార్చాలని తీర్మానించుకున్నాడు."ట్యాంక్ బండ్,నెక్లెస్ రోడ్ ప్రాంతాలలో ప్రేమికులు సుబ్బరంగా ప్రేమించుకోవడం కోసం పోలీసులను ఆ ప్రాంతాలకు రానివ్వం అమ్ముకునే వాళ్ళను అడుగుపెట్టనివ్వం.

",ప్రేమికులుఉబ్బితబ్బిబ్బయ్యారు."భగ్నప్రేమికుల కోసం అన్ని బార్లలోనూ, మద్యం దుకాణలలోనూ భగ్నప్రేమికుడు అనే ప్రభుత్వ గుర్తింపు కార్డు చూపితే.. ఫ్రీగా మందుపోయ్యిస్తాం".భగ్నప్రేమికులకోసం ఉచిత శాలువాలు, కుక్క పిల్లలూ ఇచ్చే ' శాలువా- కుక్కపిల్ల' పథకాన్ని తీసుకొస్తాం.ప్రేమికులు ఆనందంతో గెంతారు ."రౌడి ప్రేమికుల కోసం రూపాయికే లీటర్ యాసిడ్ ను అందించే  పథకాన్ని ప్రారంభిస్తాం. మీరు ప్రేమించిన అమ్మాయిపై యాసిడ్ దాడి చేసేందుకు, ప్రభుత్వ రేషన్ షాపులలో రూపాయి చెల్లించి, యాసిడ్ కొనుక్కుని వెళ్ళొచ్చు. యాసిడ్  దాడి టెక్నిక్ లను, ప్రేమ మంత్రిత్వ శాఖ నేర్పిస్తుంది.ఆర్ధిక,విద్యా, వైద్య శాఖ మంత్రులతో పాటు  ప్రేమకు సంబందించిన  ప్రభుత్వ పథకాల అమలుకు ప్రేమమంత్రిని నియమిస్తాం.

  విద్యావ్యవస్థలోనూ  విప్లవాత్మక  మార్పులను తీసుకొస్తాం. అన్ని సబ్జెక్టులతో పాటు "ప్రేమశాస్త్రం " అనే  సబ్జెక్టు ను  పాఠశాలల నుండే  ప్రవేశ పెట్టి భావి భారత ప్రేమికులను తయారు  చేస్తాం. పాఠాలలో ఎలా ప్రేమించాలి, ఎందుకు ప్రేమించాలి, ఎవరిని ప్రేమించాలి, ప్రేమంటే ఏమిటి, ముద్దులు ఎలా పెట్టుకోవాలి. ఎలా కౌగిలించుకోవాలి, ఒకేసారి ఇద్దరిని ఎలా ప్రేమించాలి. ప్రేమలోకి ఎలా దింపాలి, లేచిపోయేటప్పుడు  తీసుకోవలసిన జాగ్రత్తలు , ప్రేమకథలలో ఔనత్యం మొదలైనవి బోధించేలా శ్రద్ద వహిస్తాం. పాఠశాలల్లో  ప్రార్ధన అయిపోయాక,

ప్రేమ గీతం పాడిస్తాం.
మనం ప్రేమికులం నీయబ్బ...
మనది ప్రేమకులం  నీ తల్లి...
ప్రేమంటే  మనదేరా కుయ్య... ప్రేమిస్తావా చస్తావా  నీ అయ్య..
ఈ  సాహితీ విలువలు కలిగిన సినీ గీతాన్ని ప్రతిరోజూ పిల్లలతో  పాడిస్తాం. ఈ నూతన ఆలోచనా విధానాన్ని విని , ప్రేమికులు ఆశ్యర్యపోయారు. " కనీసం  ఎనిమిది సంవత్సరాలు  ప్రేమ అనుభవం ఉన్న నిరుద్యోగులను, ప్రేమశాస్త్రం భోదించే ఉపాధ్యాయులుగా  తీసుకుంటాం. ప్రేమికుల కోసం ఉచితగ్రీటింగ్ కార్డులు ఇస్తాం. ఆరూ అంతకన్నా ఎక్కువ ఏళ్ళ అనుభవం ఉన్న వారికి పెట్రోల్ లో  పదిరూపాయలు లీటర్ కు చొప్పున రాయితీ. ఈ రాయితీలు పొందాలంటే, మీరు, ప్రేమలో పడగానే, జంటగా వచ్చి, రిజిస్టర్  చేయించుకుని, గుర్తింపు కార్డు తీసుకోవాలి. బండికి  లైసెన్స్ లాగా , ప్రేమకు  లైసెన్స్  అన్నమాట, దీనికోసం ' ప్రేమ కార్యాలయాలు' గ్రామస్థాయిలో స్థాపించేస్తాం.
ప్రేమ కోసం కృషి చేసిన వారికి ,ప్రతి సంవత్సరం, జిల్లాస్థాయి, రాష్ట్ర స్థాయి..' ఉత్తమప్రేమికులు' అవార్డులు ఇస్తాం. ఫిబ్రవరి పద్నాలుగో తేదిని  'రాష్ట్రీయ  ప్రేమదినం' గా   ప్రకటించి ఆ రోజు అన్ని కార్యాలయాల్లోనూ హృదయాకారపు గుర్తు జెండాలను ఎగురవేయించి, సెలవు ఇచ్చేస్తాం.
  ఇవన్నీ జరగాలంటే మీ ఓటు మనకే. మన ప్రేమికుల దేశం పార్టీకే!
మన గుర్తు అంతర్జాతీయ ప్రేమికుల గుర్తు అదే హృదయకారపు!!
మీ ఓట్లు మాకే మాకే' హృదయం గుర్తుకు మీ ఓటు...! గుద్దండీ గుద్దండీ .,
 హృదయం మీదే గుద్దండీ". వేదిక మీదున్న పార్టీ కార్యకర్తలు అరవసాగారు.
ఆ తర్వాత ఓ ప్రేమ గీతం పాడి,సభను ముగించారు. మీడియాలో 'ప్రేమికుల దేశం పార్టీ ఆవిర్భావ సభకు సంబందించిన వార్తలు,దద్దరిల్లిపోయాయి.

  ప్రేమారావు తన కారులో ఇంటి ముందు దిగాడు.తనకు ఇంటి ముందు మంగళ హారతులతో ఘనమైన స్వాగతం ఉంటుందనుకున్నాడు. కానీ ఇంటిముందు నిశ్శబ్దం అతన్ని పలకరించింది. అతడు లోపలికి వెళ్లేసరికి, జుట్టురేగిపోయి,చీర నలిగిపోయి, బొట్టు చెదిరిపోయి, ఏడుస్తూ అతని భార్య ఎదురొచ్చింది.
  " ఆ  ... ఎవరు ? ఎవరు  నిన్ను మానభంగం చేసిన నీచుడు ? నీ మానాన్ని దోచుకుని, నీ శీలాన్ని చెరిపేసి, నిన్ను  అపవిత్రం చేసిన "ఆ ధూర్తుడు ఎవరు " ? కోపంగా అరిచాడు."మీ మొహం! మీ బొంద, నాపిండాకూడు, నన్నెవడూ మానభంగం చేయలేదు. నేను కిందపడి దొర్లుతూ ఏడ్చాను. అందుకే  ఇలా అయ్యాను", అంది. ఓ ఉత్తరం చేతిలో పెడుతూ. ప్రేమారావు, ఆ ఉత్తరం అందుకుని చదివాడు."నాన్న! నేను మన Electrician  ను ప్రేమించాను. తెలిస్తే నువ్వు ఒప్పుకోవని నాకు తెలుసు అందుకే, అతనితో కలసి ఎగిరిపోతున్నాను. మాకోసం వెతకొద్దు మీకే పెట్రోల్ దండగ. ఇట్లు మీ కూతురు.... ప్రత్యుష, టెన్త్ క్లాస్"
ఇప్పుడు, ప్రేమారావు కిందపడి దొర్లుతూ ఏడుపు ప్రారంభించాడు.