Facebook Twitter
‘‘అజ్ఞాత కులశీలశ్య….” 35వ భాగం

‘‘అజ్ఞాత కులశీలశ్య….” 35వ భాగం

 

  కళింగ సైన్యాలు వెను తిరిగాయి.

  “మన పయనం వేగంగా సాగాలి. సుల్తాన్ సైన్యం వంగ సరిహద్దులు దాటి ఈవలకు రాకుండా మనం అచ్చటికి చేరుకోవాలి.” కపిలేంద్రదేవుడు ఆదేశాలనిచ్చాడు.

  “ఒక చిన్న మనవి ప్రభూ!”

  “ఏమది మాధవా?”

  “మార్గ మధ్యంలో అరసవిల్లి అని సూర్యదేవుని క్షేత్రముంది. కొచెం దారి పక్కకి తిప్పుతే మనం ఆ ప్రత్యక్షనారాయణుని సేవ చేసుకొన వచ్చును. అందునా, మనం వెళ్తున్నది రణానికి. ఇటు దక్షిణాన యుద్ధం మాని మరీ వెళ్తున్నాము. ఆలనాడు రామ రావణ యుద్ధంలో రామునికి రణ మధ్యంలో చింత కలుగుతే అగస్త్య మహామునియే అతనిచే ఆదిత్యునికి సేవ చేయించారు.

 

                         కం.  కలతను రణమున రాముడు

                                యలసి సొలసినంతనె ముని, యర్కుని భక్తిన్

                                కొలువమనగ యినకులజుడు

                                గెలువము కోరగ నొసగెను క్షేమము జయమున్.

 

   మాధవుడు ఆపేశాడు.. మహారాజు ఏమంటారో అని సందేహ పడుతూ.

  “అవును. మనం కళింగులం కూడా ఆదిత్యుని భక్తులమే కదా! మేము కూడా రఘురాముని వలెనే సూర్య వంశీయులమే. అవశ్యం వెళ్లెదము. సూర్య దేవుని అర్చించి, యుద్ధానికి వలసిన ధైర్య స్థైర్యాలని సమ కూర్చుకునివెళ్లెదము.” కపిలేంద్ర దేవుడు, సేనాధిపతికి ఆదేశ మిచ్చాడు.

  అరసవిల్లి.. ఏడవ శతాబ్దంలో ప్రభాకరునికి ఆలయ నిర్మాణం జరిగింది. ఆలయంలో సూర్యుని పాదాల మీదికి, సంవత్సరానికి రెండు సార్లు ఉదయ సూర్యకిరణాలు పడి, గర్భాలయం అంతా రంగురంగుల కాంతులతో నిండి పోతుందని చెప్తారు.

  మాధవునికి మహదానందంగా ఉంది.

  

                                   

                                      

  ఈ మారు మహారాజు కపిలేంద్ర దేవులు విచ్చేస్తున్నారని వర్తమానం పంపించారు వార్తా హరులచే.

  కోరుకొండ వద్ద ప్రతీక్షగా నున్న సామంతుడు ఎదురేగి, సకల మర్యాదలూ చేశాడు. సరిగ్గా సూర్యోదయ సమయానికి, నాగావళీ నదిలో స్నానం, అర్ఘ్య సమర్పణ ముగించి, అరసవిల్లి చేరారు, కపిలేంద్రుడు, మాధవుడు, ప్రధాన సేనాని.

  శాస్త్రోక్తంగా పూజలు చేసుకుని, భోజనాదులయ్యాక, సైన్యాన్ని ముందుకురికించారు కపిలేంద్ర, మాధవులు.

 

  తినడానికి, విశ్రమించడానికీ తప్ప ఇంక దేనికీ ఆగకుండా కళింగ, వంగ సరిహద్దులని చేరారు.

  మాధవునికి బాలవ్వ గుర్తుకొచ్చింది.

  “ప్రభూ! ఇచ్చటనే మా పినతండ్రిగారి వసతి గృహముంది. ఈ రోజునకు అచ్చట ఆగుదామా? సరిగ్గా మన బాటకి ఆనుకునే ఉంది.”

  “అంత కన్న ఇంకేమి కావాలి మాధవా? ఎక్కడైనా ఆగ వలసినదేగా. మీ గృహానికే వెళ్లెదము.”

  మాధవుడు మహదానందంతో సైన్యాలని మరలించాడు తనని ఆదుకుని, జీవిత మిచ్చిన పూటకూళ్ల ఇంటికి.

  దూరం నుంచే సైన్యాన్ని చూసిన జగన్నాధ మహాపాత్రుడు వంటలు చేసే వారికి ఆదేశ మిచ్చాడు. సాధారణంగా సైనికులు వారి సంభారాలని వారే తెచ్చుకుంటారు. పూటకూళ్ల ఇంటివారి పని వండి వడ్డించడమే.

  “చిన్నాన్నా!” వంటకాలు ఏమిచెయ్యాలో ఆదేశ మిస్తున్న జగన్నాధుడు, మాధవుని పిలుపు విని వెనక్కి తిరిగాడు. ఆప్యాయంగా హత్తుకుని కుశలమడిగాడు.

  “సైన్యంలో నువ్వున్నావని ఊహించనేలేదు సుమా! చాలా ఆనందంగా ఉంది మాధవా! నిన్ను దండయాత్రలో పాల్గొనమన్నారా రాజుగారు..” ఆశ్చర్యంగా అడిగాడు.

  “రాకుమారులంతా తలొక దిక్కుకూ యుద్ధానికి వెళ్లారు. నేనే మిగిలాను. రాకుమారుడు పురుషోత్తమ దేవుని కోటలో ఉంచి.. నన్ను రమ్మని ఆదేశించారు. చిన్నమ్మా! కుశలమా? తమ్ముడు గురుకులంలో ఉన్నాడా? విద్యలుబాగా నేరుస్తున్నాడా?” జగన్నాధునికి ఒక కుమారుడు. పది సంవత్సరాలు నిండాయి. గురుకులానికి పంపారు.

  “అంతా క్షేమమే కుమారా! మీ వారినందరినీ చెరువు వద్దకు తీసుకెళ్లి రండి. ఈలోగా భోజనాలు తయారవుతాయి.”

  మాధవుడు మహరాజుని అర్ఘ్య సమర్పణకి చెరువు వద్దకి తీసుకుని వెళ్లాడు. తనకి ఉత్కళ దేశంలో ఆశ్రయమిచ్చి ఆదరించిన ఊరు. ఆప్యాయంగా బంధువులని పలుకరించాడు. మర్రిచెట్టు వద్ద ఆగి ఊడలన్నింటినీ తడిమి పలుకరించాడు.

  అంతటి మహరాజు, మాధవుని బాల్య చేష్టలని చూసి తను కూడా చిన్న పిల్లడైపోయాడు.

  రాబోయే సంగ్రామం సృహే లేదెవరికీ.

  మనసుకీ, శరీరానికీ ఆ మాత్రం ఆటవిడుపు కావాలి.

  చెరువులో అలసి పోయే వరకూ ఈత కొట్టారు. కపిలేంద్రదేవులు తాను ఎవరో చెప్పవద్దన్నారు.

  ఒక్కొక్క స్థలమహిమ.. ఒక్కొక్క కాల మహత్యం.

 

ఉ.    మానవుడెంత యెత్తు ఘనమై నెదిగేనుగ యప్పుడప్పుడున్

       చీనపు బాల్యమే తలచు చేష్టల చేయుచు పాపడౌనుగా

       మానము చేయునా ప్రభువు మానసమున్ చెలగేటి కోర్కెలన్

       స్యోనముగాను మాధవుని చూసియు నాడుకొనంగ వేడుకన్.

 

(చీనపు= బంగారపు, మానము= మన్నించు, స్యోనముగా= సుఖముగా)

 

  మరునాడు, ప్రాతఃకాలముననే స్నాన అర్ఘ్య పానాదులు ముగించుకుని, బాలేశ్వర్ నుంచి బయలుదేరారు, కపిలేంద్ర దేవుడు, మాధవుడు..తమ సైన్యాన్నంతా సమాయత్తం చేసుకుని.

  సరిహద్దు దాటాక, వంగ దేశం లోనికి ప్రవేశించగానే ఒక్క సారిగా ఉద్వేగానికి లోనయ్యాడు మాధవుడు.

  మధ్యాహ్నానికి, దుర్గాదేవితో కలిసి తాను ఆగిన చోటికి చేరుకున్నారు.

  మరి కొన్ని వృక్షములు పెరిగాయి కానీ పెద్ద మార్పులేమీ లేవు.

  తాము తెచ్చుకున్న స్వల్ప ఫలహారాలను, సైనికులు అడవిలో సేకరించిన ఫలాలతో కలిపి ఆరగించి ఒకింత విశ్రాంతికి ఉపక్రమించారు, మహరాజు, అతడి సైన్యం.

  మాధవుడు మాత్రం.. తన హయం మీద ఆ ప్రాంతమంతా ఒక సారి కలియదిరిగాడు.. తన తల్లి ఆనమాళ్లు ఏమైనా అగుపించునేమోనని.

  మానవ హృదయపు బలహీనత..

  ఒకటిన్నర దశాబ్దపు నాటి గుర్తులు కనిపిస్తాయా? వెర్రితనం కాకపోతే..

  ఏది ఏమైనా కన్న తల్లిని తలచుకొని, మనసులో దుఃఖాన్ని అక్కడే అణచి వేస్తూ తిరుగుతుంటే, కనిపించింది..

  అదీ.. కళ్యాణి ఒక వటవృక్షం దగ్గర ఆగి పోయి, కదలనని మొరాయిస్తుంటే!

  మాధవుడు గుర్రం దిగి వటవృక్షం చుట్టూ.. జాగ్రత్తగా అడుగులు వేస్తూ తిరిగాడు.

  దొరికింది.. చెట్టు మొదట్లో, ఇంచు మించుగా.. అది కూడా ఒక వేరేమో అనిపిస్తూ.. ఒక కత్తి పిడి. వంగి, చూస్తూ.. తన దుస్తుల్లో ఉన్న చిన్న బల్లెం వంటిదాన్ని తీసి, మట్టిని తవ్వ సాగాడు.

  కొద్ది సేపట్లోనే బైట పడింది..

  కొద్దిగా మొన వద్ద బండగా అయిన కత్తి. తుప్పు పట్టినా.. పదును అలాగే ఉంది. దాని మీద దుర్గాదేవి పేరు చెక్కి ఉంది. ఆ కత్తిని చూడగానే జలజలా రాలాయి మాధవుని కనుల వెంట నీళ్లు.

  అక్కడే నేల మీద కూలబడి, కత్తిని ఒడిలోనికి తీసుకుని, వెక్కి వెక్కి ఏడవసాగాడు.

  మహరాజు, పరివారం శబ్దానికి అందనంత దూరంలో ఉన్నారు.

 

          సీ.     కాలమెంతెంతైన కాలుని మహిమనే

                        కన్నతల్లిని తనే కానడాయె

                   ఆ తల్లి కైపట్టి అరుల దునిమినట్టి

                       కరవాలమును చూడ కనులు వెఱవ

                   చిన్ననాటి స్మృతులె చిత్తమునమెదల

                        చేష్టలుడిగె నంత చితికె హృదియె

                   మింటినే కాంచగ మెదలె మాతృ కరము

                        చాచిదీవెన లంత చల్లగ నిడ

 

      ఆ.వె.     మాధవు మదియంత మైమరచి మురిసె

                   అమ్మ తనని బిగిని హత్తు కొనెనొ

                   ఆకశమున నిలిచి ఆదరముగనెంతొ

                   కత్తినిచ్చి నట్టు కలను కనగ.

                 

  చేతిలో నున్న కత్తిని ఆప్యాయంగా తడిమాడు. అమ్మ స్పర్శ జ్ఞప్తికొచ్చింది.

  తన పై వస్త్రంతో శుభ్రంగా తుడిచాడు.

  తనకి కత్తిని ఎలా తిప్పాలో నేర్పించిన కత్తి. అమ్మ చేతిలో అత్యంత వేగంగా మెరుపులా తిరిగిన కత్తి. తనను రక్షించడానికి శతృవులకొందరిని దునిమిన కత్తి.

  ఇదే కత్తితో తమ గతి మార్చిన వారిని శిక్షిస్తాడు. మంచికో చెడుకో తన దేశం మీదికే దండెత్తే అవకాశం వచ్చింది. సర్వ శక్తులూ ఒడ్డి ముష్కురులను దండించడానికి తోడ్పడతాడు. ఎక్కడి నుంచో తమ దేశానికి వచ్చి తమ దేశస్థులని చంపుతూ.. తమ దేవుళ్లని బద్దలు కొడ్తూ, తమ సంపదలని కొల్ల గొడ్తూ..

  ఎవరిచ్చారు వారికి అధికారం?

 

  సైనికుల కలకలం వినిపించి.. తన ఆలోచనల నుంచి బైటికొచ్చాడు మాధవుడు. అమ్మ కత్తిని అంగవస్త్రంలో దాచి, కళ్యాణి జీను కింద దాచాడు. అది శరీరానికి తాకగానే కళ్యాణిలో కూడా కొత్త ఉత్సాహం వచ్చింది.

  గట్టిగా సకిలించి.. మాధవుడు ఎక్కగానే ముందుకురికింది.

  “ఎచ్చటికెళ్లారు మాధవ మంత్రీ? మేము కించిత్ ఆందోళనకు గురయ్యాము.” కపిలేంద్రుడు అడిగాడు.

  సైన్యం అంతా తయారుగా ఉన్నారు. మాధవుని కొరకే వేచి ఉన్నట్లు అనిపించింది.

  “క్షమించాలి మహారాజా! చుట్టు ప్రక్కల ఏమైనా ఫలములు దొరకునేమో అనీ..” మాధవుడు తనకు సంబంధించిన వస్తువులను గుర్రానికి కట్టి, తను కూడా ఎక్కి, రాజు పక్కకి వెళ్లాడు.

  మనసులో ఏమనుకున్నా మోములో కనిపించ నీయకుండా కపిలేంద్రుడు గుర్రాన్ని అదిలించాడు.

  బాలేశ్వర్ వద్దనుంచి అక్కడ తాము నిర్వహిస్తున్న గజశాల నున్న ఏనుగులు కూడా కలిశాయి. సైన్యంలో రధాలు కూడా ఉన్నాయి. మహారాజు, ఎప్పుడేది కావలిస్తే అది అధిరోహించ వచ్చు.

  అక్కడికి దగ్గరలోనే నసీరుద్దీన్ షా సైన్యాలు ఎదురు రాబోతాయని చారులు సూచనలిచ్చారు.

  కపిలేంద్రుడు గజం అధిరోహించి ముందుకు కదిలాడు. మాధవుడు అవసరాన్ని బట్టి మారడానికి అనుకూలంగా అమర్చుకున్నాడు.

  

మధ్యాక్కర.    కదలె గజపతుల సేన కదముతొక్కుతు వేగముగనె

                    అదరెగ నవనియె నంత హయముల సవ్వడి వలనె

                    బెదరగ నడవిని యన్ని పికములు మెకముల్ పురుగులు

                    ఛదము చాటున దాగి యుండ సడి లేక చలనము లేక.

(ఛదము= కప్పు, ఆకు)

        

  చారుల సమాచారమును బట్టి, ఏ క్షణంలోనైనా, ఎక్కడైనా నసీరుద్దీన్ షా సైన్యాలు.. లేదా వారు గుడారాలు ఎదురు పడే అవకాశం ఉంది.

  అందుకే.. కళింగ సైన్యం అప్రమత్తతతో సాగుతోంది. విశ్రాంతికై ఎక్కడ ఆగిన గానీ.. పరిసరాలన్నీ ముందుగా పరికించి మరీ విడిది చేస్తున్నారు.

  జానూపూర్ దగ్గర పడుతుండగానే.. వంగ సైన్యాలు ఎదురు పడ్డాయి.

  అప్పటికే ఢిల్లీ పాదుషా దండయాత్రల నెదుర్కొని అలసి ఉన్న వంగ సైనికులు కళింగుల ధాటి ఎదుర్కొనలేక పోయారు.

  మాధవుడు, అరివీర భయంకరుడై.. కనిపించిన వంగ సైనికులను.. ముఖ్యంగా ముసల్మానులను ఊచకోత కోస్తున్నాడు.

      

                    

 

  చివరికి వంగ సైనికులకు లొంగిపోక తప్పలేదు.

  పాండువా కోటలోకి విజయోత్సాహంతో అడుగు పెట్టారు కళింగులు.

  మాధవుడు కోటంతా తిరిగి తల్లి దండ్రులని స్మరించుకున్నాడు.

  కోటలోపలి సైనికులంతా కూడా లొంగి పోయారు. ఆడవారిని, పిల్లల్నీ ఏమీ చెయ్యద్దని అందరికీ ఆదేశాలు వెళ్లిపోయాయి.

  వంగరాజ్యం కళింగుల వశమయింది. కళింగ సైనికులు విజయోత్సాహంతో పండుగ చేసుకున్నారు.

  కపిలేంద్రదేవుడు కళింగ, వంగ రాజ్యాలకి చక్రవర్తి అయ్యాడు.

                                      ………………..

......మంథా భానుమతి