TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
‘‘అజ్ఞాత కులశీలశ్య….” 30వ భాగం
మాధవుడు పట్టు వస్త్రములు ధరించి, జరీ తలపాగా పెట్టుకుని, మెడలో ముత్యాల హారం అలంకరించుకుని.. నుదుట సింధూర తిలకం దిద్దుకుని, అమ్మమ్మకీ, అమ్మకి, తండ్రిగారికీ నమస్కరించి.. పద్మావతిని ఎదురు రమ్మని బయలు దేరాడు.
తొలి సారిగా.. మహరాజుగారు కబురు పంపారు. ఉన్నంతలో తనని తాను ఆకర్షణీయంగా అలంకరించుకుని బయలు దేరాడు.. లోలోపల కొంత ఆందోళనగా ఉన్ననూ.. ఎందుకు రమ్మన్నారో..
ఒక రాజభటుడు కళ్యాణికి జీను అదీ తగిలించి, మాధవుని చూసి అలా నిలబడి పోయాడు.
సాగనంపడానికి వాకిలి వద్దకు వచ్చిన నందుడు, భటుని ఆరాధనా పూర్వక దృష్టిని కని, తాను కూడా ఒక సారి చూశాడు, కుమారుని వంక.
పుంసా మోహన రూపాయ.. అని శ్రీరాముడిని వర్ణించినట్లుగా అనిపించాడు నందుడికి.
సీ. మోము మెరయనెంతొ ముచ్చట గొలుపుచూ
తీరైన నాసిక తెలివి చూప
ధీర గంభీరమౌ దృక్కుల కన్నులు
పదునైన తలపుల బాగ తెలుప
నిలువెల్ల నలరారు నేరిమి శౌర్యము
శత్రుగుండెల నింపు శంక వెఱపు
ఆజాను బాహువై నాదాటు నిలిచిన
ఆరీతి దోచదా అతివ మనసు
ఆ.వె. నలువ నెమ్మి నెంతొ నాణ్యము నెలగొల్పె
చెలువ మందు మరియు శీల మందు
అతడి నడవడి యదె యందరి మోదమౌ
మాధవు డను నామ మంత పలుక.
ఏ రాచమందిరంలోనో తిరుగాడ వలసిన వాడు.. తన ఇంట. అచ్చు ఆ చిన్ని మాధవుని వలెనే.
ఆ ఆలోచన రాగానే నందునికి ఒక్క సారిగా దిగులు కమ్ముకుంది. అంటే ఆ కృష్ణయ్యలాగా, త్వరలో తన ఇంటి నుండి వెళ్లి పోయి.. కంటికి కనిపించడా! అదే జరుగుతే గౌతమి తట్టుకోగలదా? ఆ యశోదమ్మలా జీవన మంతా వేదనేనా?
మొహమంతా దిగులు కమ్ముకుంది.
వీడ్కోలు చెప్పుదామని వెను తిరిగిన మాధవుడు తండ్రి ఆవేదనని గ్రహించాడు.
“మహరాజుని కలుసుకోవడానికే వెళ్తున్నాను తండ్రీ. మరల తిరిగి వస్తా కదా! ఎందుకంత ఆందోళన?”
“తొలిసారి నిన్ను ప్రత్యేకంగా మహారాజుగారి పిలువనంపారు కదా.. ఏమి వార్త వినాలా అని కించిత్ సందేహం మాధవా! మరల ఏదైనా యుద్ధ ప్రతిపాదన వచ్చి మాకు దూరమవుతావేమోనని..” అంతలో గౌతమి కూడా వచ్చి పక్కన నిలిచింది కళ్లనిండా నీళ్లతో.
పద్మావతీ దేవి సంభ్రమంగా చూస్తోంది. ఇంతటి ఆప్యాయతలు తమ రాజమందిరాలలో కానరావేమి? రాజుగారిని కలవడానికి వెళ్తుంటే.. దేశాంతరం వెళ్తున్నట్లు వీడ్కోలు చెప్తున్నారెందుకో!
“నేను ఎక్కడికైనా వెళ్లవలసి వస్తే మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను.సరేనా? నిన్ను కూడా అమ్మమ్మా.” దూరంగా నిల్చుని చూస్తున్న సీతమ్మ దగ్గరగా వెళ్లి, భుజాలు పట్టుకుని చెప్పాడు.
“మామూలుగా కోటకి వెళ్తుంటే అంతటి కన్నీరెందుకమ్మా?”
“యుద్ధ వార్తలు విన వస్తున్నాయమ్మా! కాంచీపుర దండయాత్ర అయి ఇంకా ఆరేడు మాసములు గడవలేదు. రాజుగారు పిలువనంపారంటే బలమైన కారణం ఉంటుంది కదా! మా కున్నది ఒక్కగా నొక్కడు. ఇతడు మా వ్యాపారం మీద అంత ఆసక్తి కన పరచకుండా, గురుకులంలో చేరి, రాకుమారినితో సమముగా అన్ని విద్యల్లోనూ ఆరి తేరాడు. అదే మా వ్యాకులతకి కారణం.” పద్మావతి సందేహానికి సమాధానం చెప్పాడు నందుడు.
“ఇదేమీ దినచర్య కాదు. ఇదే మొదటి సారి ఇటువంటి పిలుపునందుకోవడం.” సీతమ్మ వివరించింది.
“ప్రతీ దినమూ కోటకి వెళ్లినా అది రాకుమారుని కలవడానికే తప్ప మహారాజు..” గౌతమి మాట్లాడలేక పోయింది.. గొంతులో ఏదో అడ్డు పడ్డట్లయి.
“ఏమీ అనుకోనిది జరగదమ్మా! సోదరుడు శుభవార్తతో వచ్చెదరు. చూస్తూ ఉండండి.” పద్మావతి ధైర్యం చెప్పింది.
“నీ నోటి ఫలం.. అంతకన్ననూ కావలసినదేమున్నది తల్లీ!” గౌతముడు కాస్త నెమ్మదించాడు.
కళ్యాణి నెమ్మదిగా నడుస్తోంది.. యజమాని అంతరంగం ఎప్పటికప్పుడు గ్రహిస్తూనే ఉంటుంది. మాధవుడు పైకి బింకంగా ఉన్నాడు కానీ.. లోలోపల బెదురుగానే ఉంది. ముందురోజు రాకుమారి ప్రాణాలు కాపాడేటప్పుడు.. అత్యవసర పరిస్థితులలో నోటిలో నోరు పెట్టి.. తప్పలేదు. ఆ సంగతి తెలిసి, శిక్షించడానికి పిలిచారా? తనకి శిరచ్చేదన తప్పదా?
మరణం అంటే ఏ మాత్రం భయం లేదు. తెలిసీ తెలియని వయసులోనే అతి దగ్గరగా, తడబడుతున్న అడుగులతో, తెర మరుగున దాగి, వణకుతున్న చేతులని కళ్లకి అడ్దు పెట్టుకుని, దడదడ మని కొట్టుకుంటున్న గుండెలతో.. అంతఃపుర స్త్రీలని, పసి వారిని, ముసలి వారిని.. అందరినీ నరికెయ్యడం చూశాడు. ప్రాణాలు కాపాడుకోవడానికి తల్లి వీపుకు ఆనుకుని, నిద్దర కాచుకుని పారిపోతున్నప్పుడే మరణం అనివార్యమని తెలుసుకున్నాడు.
కానీ తన మీదే ఆశలు, ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతున్న పెంపుడు తల్లిదండ్రుల శోకం తలచుకుంటేనే మనసు వికలమవుతోంది.
అయితే.. రాసి పెట్టినదేదో జరగక తప్పదు.
గుండె దిటవు చేసుకుని కళ్యాణి కళ్లెం లాగాడు. అశ్వం వేగం పెంచింది.
మహరాజు కొలువు తీరి ఉన్నారు. మంత్రి సామంతాదులందరూ తమతమ స్థానాలలో కూర్చుని ఉన్నారు.
లోలోపల బెదురుగా ఉన్నా, మాధవుడు బింకంగానే అడుగు పెట్టాడు సభలోకి.
ఠీవిగా.. తల కొద్దిగా వాల్చి మహారాజుకి అభివాదం చేశాడు.
ఇరువురు భటులు వచ్చి రాజుగారి వద్దకు తోడ్కొని వెళ్లారు.
మాధవుడు ఓరకంట పురుషోత్తమ దేవుని కోసం వెదికాడు. రాకుమారులందరూ, రాజుగారి సింహాసనం పక్కన వరుసగా ఆసీనులై ఉన్నారు. హంవీరకుమారుడు, అతని ఏక గర్భ సహోదరుడు తప్ప మిగిలిన పదహారు మందీ, ఆసీనులై ఉన్నారు.
ఇటువంటి సభలోనికి అడుగు పెట్టడం ఇదే ప్రధమం మాధవునికి. చిత్రంగా, లోలోన ఉన్న భయం అంతా మాయం ఐపోయింది. తాను ఎప్పటి నుంచో ఇక్కడికి వస్తున్నట్లుగా అనిపించింది. రాచకొలువు కొత్తగా లేదు. తన రక్తంలో జీర్ణించుకుని పోయినట్లుంది.
కపిలేంద్ర వర్మ, తన వద్దకు రమ్మని మాధవునికి సైగ చేశాడు. రాజ సింహాసనం వద్దకు వెళ్లగానే, లేచి ఆలింగనం చేసుకుని సభకి పరిచయం చేశాడు.
“ఈ రోజు మేమందరం ఈ విధంగా ఆనందంగా ఉన్నామంటే, ఈ యువకుడు ప్రాణాలకు తెగించి మా రాకుమారిని కాపాడిన వైనమే. మా ఒక్కగానొక్క కుమార్తెని కాపాడి, మమ్ములను ఋణగ్రస్తులను చేశాడు. అందుకే ఇతడికి మంత్రి పదవి ఇస్తున్నాను. అంతే కాదు.. మాకు ముఖ్య సలహా దారుగా కూడ ప్రత్యేక బాధ్యత అప్పగిస్తున్నాను.” సభ చప్పట్లతో మారు మోగి పోయింది.
మాధవునికి తాను వింటున్నదేమో ఒక క్షణం అర్ధం అవలేదు. ఇదంతా కలా.. నిజమా!
రాకుమారిని తాకినందుకు శిక్షిస్తారేమో అనుకుంటే.. ఈ విధంగా సత్కరిస్తున్నారా! తాను అదృష్ట వంతుండే. పురుషోత్తమ దేవుని వంక తిరిగాడు.
చిరునవ్వుతో తన మిత్రుడు చెయ్యెత్తి కనుసన్నలతోనే పలుకరించాడు.
అధికారిక దుస్తులు తలపాగా అందిస్తూ.. అంగుళీయకం తొడిగాడు కపిలేంద్ర వర్మ.
“మాధవ మంత్రీ! ఈ అంగుళీయకం సహాయంతో మీరు నిరభ్యంతరంగా, కోట లోపలికి, కొలువునకు, మా రాజ మందిరానికీ వస్తూ వెళ్తుండ వచ్చు. ఈ రోజు సాయం కాలం, మా మందిరంలో నున్న తోట వద్దకు ఒకసారి రండి. మీతో ఆంతరంగికంగా మాట్లాడాలి.” మాధవునికి మాత్రమే వినిపించేట్లుగా అన్నాడు.
సభలోని వారందరినీ మాధవునికి పరిచయం చేశారు, ప్రధాన మంత్రి గోపీనాధ పాత్రుడు.
కొద్దిగా తలవంచి, వినయం ప్రదర్శిస్తూనే, తన అభిమానం నిలుపుకుంటూ ప్రతీ ఒక్కరినీ పలుకరించాడు మాధవుడు.
ప్రధమ పరిచయంలోనే ప్రముఖులందరికీ మాధవుని పట్ల సుహృద్భావం ఏర్పడింది.
చివరగా రాకుమారుల వద్దకు వచ్చారు.
“తన సోదరులని మీ మిత్రుడే పరిచయం చేస్తారు మాధవ మంత్రీ!” గోపీనాధ పాత్రుడు నవ్వుతూ పురుషోత్తమ దేవునికి అప్పగించారు.
పురుషోత్తముడు లేచి మిత్రుని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నాడు.
“గౌతమీ! మన ఇంటికి బండేదో వస్తోంది, మాధవుని గుర్రం వెనుకగా!” సీతమ్మ సంభ్రమంగా అరిచింది.
హడావుడిగా లోపలినుంచి వచ్చారు నంద, గౌతమిలు.
మాధవుడు, ఇంటిముందు ఆగి, గుర్రం కట్టేసి వచ్చాడు. ఆ లోగా బండి మీద సంభారాలన్నీ కిందికి దింపారు భటులు.
ఇంట్లోని వారందరికీ పట్టు వస్త్రములు, ఆభరణాలు.. తినుబండారాలు. అన్నింటినీ లోపలికి చేరవేసి, వంగి వంగి నమస్కరిస్తూ వెళ్లిపోయారు, బోయీలు, భటులూ.
“ఇదంతా ఏమిటి నాయనా?” గౌతముడు అడిగాడు, ఆనందంతో.
“అనుకోకుండా చేసిన సహాయానికి ప్రతిఫలం తండ్రీ..” కిందటి రోజున వనంలో జరిగిన సంఘటన వివరించాడు మాధవుడు.
“రాకుమారిని తాకి, ఊపిరందించినందులకు శిక్షిస్తారేమోనని భయపడ్డానమ్మా! కానీ రాజుగారు దయార్ద్ర హృదయులు. మంత్రి పదవి ఇచ్చి గౌరవించారు. రోజూ కోటకి వెళ్లాలి. నాకు అప్పగించిన బాధ్యతలని నిర్వర్తించాలి.”
“చాలా సంతోషం కుమారా! మన బంధువైన గోపీనాధ పాత్రుల తరువాత మరల నీవకు అంతటి గౌరవం దక్కింది.” నందుడు ఆనందంగా వచ్చి కుమారుడిని కౌగలించుకున్నాడు.
“ఆగాగు.. లోపలికి రాకు. దిష్టి తియ్యాలి.” సీతమ్మ పరుగున ఇంట్లోకి వెళ్లింది.
కొద్దిగా నడుం వంచి వెళ్తున్న సీతమ్మని ఆందోళనగా చూశాడు మాధవుడు.
“వయసు ప్రభావం కుమారా! ఆవిడ ఆరోగ్యానికేమీ ఫరవాలేదు.” గౌతమి హామీ ఇచ్చింది.
సంధ్యా సమయానికి ఒక ఘడియ ముందుగానే తన అశ్వాన్నెక్కి బయలు దేరాడు మాధవుడు. ఈ సారి కళ్యాణి ఉత్సాహంగా కదం తొక్కుతోంది.
మంత్రి హోదాలో మాధవుడు కోటకి వెళ్తున్నాడు. మహారాజుగారు అందించిన అంగుళీయకాన్ని ధరించి.. అధికారిక దుస్తులతో.. ఠీవిగా!
ఆ.వె. దర్పమున హయమును ధాటిగా నదిలించి
ఆధి పత్యమంత యరయ జూప
కనుల నిండుగ కని కదలెను నందుడు
కూర్మి కుమరు ప్రతిభ గుండె నిండ.
కోటలోనికి వెళ్తుంటే కూడా, అక్కడ నిలచి ఉన్న భటులందరి అభివాదములు గమనించి.. కొద్దిగా బిడియ పడ్డాడు మాధవుడు.
రోజూ వచ్చే కోటే.. కానీ ఏదో కనిపించని భేదం.. ఒడలంతా తెలియని ఉత్సాహం. పరిసరాలన్నీ కొత్తగా కనిపిస్తున్నాయి.
తనని మహారాజుగారెందుకు రమ్మన్నారో.. ఏ కార్యము నప్పగించెదరో!
ఒకటే ఆలోచన.. ఒకటే ధ్యేయం.
రాజుగారు అప్పగించబోయే బాధ్యతని సక్రమంగా నిర్వర్తించాలి. మంత్రిగా మొట్ట మొదటి కార్యం.
ఏమయి ఉంటుంది?
తనను కూడా యుద్ధంలోనికి రమ్మనెదరా? కాంచీపుర దండయాత్రలో తన నైపుణ్యమును వినియే యుందురు కదా!
పరిపరి విధముల చింతించుచూ రాజ మందిరం వద్దకు చేరాడు మాధవుడు. అక్కడే నిలబడి యున్న భటుడు గుర్రాన్ని తీసుకుని వెళ్లి పోయాడు.
మాధవునికి ఏ ఆటంకమూ లేదు. రాచ ముద్రికను కూడా ఎవరూ అడగ లేదు. వార్తలు అనతి కాలం లోనే కోటలో వ్యాపించేస్తాయి.
నెమ్మదిగానే ఐనా, హుందాగా సోపానాలు అధిరోహించాడు మాధవుడు.
మహారాజు కపిలేంద్ర వర్మ ప్రధాన మంత్రితో ఏదో చర్చలో ఉన్నారు. మాధవుడు దూరంగా నిలబడి అభివాదం చేశాడు.
కూర్చోమన్నట్లు తల పంకించి, తన మాటలు కొనసాగించారు మహారాజు.
కొద్ది సేపయ్యాక, ప్రధాన మంత్రికి సెలవిచ్చి మాధవుడిని పిలిచారు కపిలేంద్ర వర్మ.
అంతా రాజుగారే మాట్లాడారు.. మధ్య మధ్య మాధవుని సందేహాలను తీరుస్తూ!
“మేము దక్షిణదిశగా, రాజమహేంద్రవరం, కొండవీడు రాజ్యాలను స్వాధీనం చేసుకోవడాని వెళ్తున్నాం. మీరు, రాకుమారుడు పురుషోత్తమ దేవుడు ఇంతకు మునుపు చేసినట్లే రాజ్య రక్షణ గావించాలి.”
“అలాగే ప్రభూ మీ ఆనతి.”
“అంతే కాదు.. మీ మీద మరొక గురుతరమైన బాధ్యత పెడుతున్నాను..”
మాధవుని మరింత దగ్గరగా రమ్మని, తన ఆదేశాన్ని నెమ్మదైన స్వరంతో అందజేశారు మహరాజు.. నమ్మలేనట్లు చూస్తున్న మాధవునికి, ఏం ఫరవాలేదన్నట్లుగా ధైర్యాన్ని తన చూపులతోనే ఇస్తూ.
సమావేశం అయ్యాక, నెమ్మదిగా మందిరం బయటికి వచ్చాడు మాధవుడు, ఆలోచనలతో నిండిన మదితో!
......మంథా భానుమతి