Facebook Twitter
‘‘అజ్ఞాత కులశీలశ్య….” 20వ భాగం

  ‘‘అజ్ఞాత కులశీలశ్య….” 20వ భాగం   

  “మిత్రమా! అదిగో కాంచీ పురం. చాలా పురాతనమైన పట్టణం. మహా భారత కాలం నుంచీ ఉందని చెప్తారు. ఇక్కడ ఉన్న ఆలయాలు బహు ప్రసిద్ధాలు. మన విడిది ఏర్పాటు అయిందా? ఇంతకీ.. ఇంత దూరం ఎందుకొచ్చామో?” మాధవుడు, కళ్యాణిని రాకుమారుని అశ్వం పక్కగా నడిపిస్తూ అడిగాడు.

                               

                        

 

  “అవును మిత్రమా! ‘పుష్పేషు జాతి పురుషేషు విష్ణు, నారీషు రంభ, నగరేషు కంచి’ అని పేరుపొందింది ఈ పట్టణం. మోక్ష విద్యకు మూల పీఠం. అద్వైతమునకు ఆధారం. ఆదిశంకరులు స్థాపించిన కామకోటి పీఠ స్థానం. వరదరాజస్వామిని ఎప్పుడెప్పుడు సేవిస్తానా అని ఉర్రూతలూగుతోంది నా మనసు.”

  మాధవుడు మాత్రం అన్యమనస్కంగానే ఉన్నాడు.

  “కంచికెందుకు…”

  ఇంక మాధవుని సందేహానికి సమాధానం చెప్ప వలసిందే అనుకున్నాడు పురుషోత్తమ దేవుడు.

  పకపకా నవ్వాడు.

  “విజయనగర రాజు, దేవరాయల సామంతుడైన కాంచీపుర రాజునకు చక్కని చుక్క అయిన కుమార్తె ఉంది మిత్రమా! పేరు పద్మావతి. రుక్మిణీ దేవి, శ్రీకృష్ణుని గురించి విని, ఆయన చిత్ర పటాన్ని చూసి వరించి నట్లు గానే పద్మావతి కూడా..” చిరునవ్వుతో.. చెప్పబోయాడు.

  “రాకుమారి రాయబారం పంపిందా మిత్రమా?” మాధవుడు ఆత్రంగా అడిగాడు.

  “ఇంకా లేదు. కానీ చారుల వార్త అందుకుని తండ్రిగారు చూసి రమ్మన్నారు. ఈ వివాహం జరుగుతే, రాజకీయంగా కూడా ఉపయోగం ఉంటుందనేది వారి అభిప్రాయం.”

  “రాకుమారికి ఏవిధంగా వార్త పంపుతారు?”

  మాధవుడి అయోమయంచూస్తుంటే మరింత ముచ్చట కలిగింది రాకుమారుడికి.

  “మరీ ఇంత అమాయకుడవేమయ్యా మిత్రమా? ఏ చారుల ద్వారా వార్త తెలిసిందో.. వారి సహకారం తోనే.”

  నవ్వుతూ సిగ్గు పడ్డాడు మాధవుడు.

  “రాకుమారి, రేపు ఉద్యానవనానికి వస్తుంది. అందుకే ఆ దిశలో ఉన్న గృహంలో వసతి ఏర్పాటవుతుంది.. నా సంగతి సరే.. మరి నీ ప్రణయ విశేషాలు చెప్పవా?”

  “నాకేమి ప్రణయం మిత్రమా? కోటలో వలె మాకు ప్రణయ సందేశాలుండవు. మా ఇళ్లల్లో సాధారణంగా పెద్దలే చూసి పరిణయం నిశ్చయం చేస్తారు. మాకు ఇష్టమయిన తరువాతనే అనుకోండి.”

  “అప్పటి వరకూ వలపు కలుగ కుండా ఆగుతుందా మిత్రమా?” పురుషోత్తముడు మిత్రుని మనసెరిగినట్లు అన్నాడు..

 

   కం.      “చూసిన వేళనట నదియె

               వేసిన నొకవలపు నమ్ము పేర్మిని బాగా

               నా సిన దాని మరులుగొని

               భాసిలు కన్నులును మోము బాగుగను సఖా!

 

  ఎర్రబడిన నీ బుగ్గలే చెపుతున్నాయి.. వలపుల చెలి దాగుందని. ఎవరో చెప్పు మిత్రమా! హంస రాయబారం నడుపుతాను.”

  “అబ్బెబ్బే.. ఎవరూ లేరు మిత్రమా! నిజంగానే..” మాధవుని గొంతులో వచ్చిన వణుకు అతడు నిజం చెప్పట్లేదన్న సంగతి చెప్పింది. అయినా రెట్టించలేదు పురుషోత్తముడు. ముందుగా తను వచ్చిన పని పూర్తయితే, పిదప మిత్రుని సంగతి చూడవచ్చు.

  కాదంబరీ దేవిని చూసినప్పుడు మాధవుని మోములో కానిపించిన వెలుగు మర్చిపోలేదతడు. కానీ కులం? తండ్రిగారూ, సోదరీ ఏమనెదరో..

  రాజకీయ ప్రయోజనం కలిగించే వరుడెవరూ సోదరికి సరైనవాడు.. కనిపించుట లేదు. క్షత్రియుడు కాదనే కానీ.. మాధవుడు అన్ని విధాలా సరైన జోడు. ఏదో ఒక రాజ్యానికి పరీక్ష గా నియమిస్తే సరి పోతుంది.

  తన ఆలోచనలకి తనకే నవ్వు వచ్చింది పురుషోత్తమ దేవునికి. ఇవన్నీ పెద్దలు చూసుకోవలసిన విషయములు. ముందుగా తన వివాహం సానుకూలమైతే.. అప్పుడు చూసుకోవచ్చు.

  “ప్రభూ!” సేనాని పిలిచాడు.

  ఆలోచనల్లోంచి బైటపడ్డాడు రాకుమారుడు.

  “తమకు రాజోద్యానవనానికి ఆనుకుని ఉన్న వసతి గృహంలో ఏర్పాటు చేశాము ప్రభూ. అక్కడికి వరదరాజ స్వామి ఆలయం చాలా దగ్గర. అర్ఘ్య సమర్పణకి నది కూడా దగ్గర లోనే ఉంది.”

  పురుషోత్తముడు, మాధవుని చూసి చిరునవ్వు నవ్వాడు.

  అందరూ వసతిగృహానికి బయలు దేరారు.

  సేనాని వర్ణించినట్లుగానే ఉంది.. ఒక చిన్న రాజ ప్రాసాదం లాగా ఉంది.

  “విజయనగర రాజులు వచ్చినప్పుడు వారితో వచ్చిన మంత్రి సామంతులు ఇచ్చటనే విడిది చేస్తారు ప్రభూ. అన్ని సదుపాయాలూ ఉన్నాయి. ఇచ్చ వచ్చిన రోజులుండ వచ్చునిచట. భోజనం కూడా చాలా రుచిగా ఉంటుంది.”

  గుర్రాలకి కూడా మంచి శాల ఉంది.

  “ఈ రోజుకి విశ్రాంతి తీసుకుందాము మాధవా! రేపు ప్రాతఃకాలమున లేచి కర్తవ్యం ఆలోచిద్దాము.”

  “అశ్వాలని అప్పజెప్పి వస్తాను రాకుమారా! సాయం సంధ్యవార్చుటకు ఆలయ కోనేటికి వెళ్దాము. చాలా ప్రశాంతంగా ఉంటుదని చెప్తున్నారు సేనాని.” మాధవుడు గృహము యజమానితో మాట్లాడి, గుర్రాలని తీసుకుని వెళ్లాడు.

                                  …………………..

                        

        

                      

 

  వరదరాజస్వామి ఆలయం.. చోళ రాజులు 11వ శతాబ్దంలో కట్టించిన గుడి, 108 వైష్ణవ ఆలయాలలో ఒకటి. విస్తారమైన 23 ఎకరాల ఆవరణలో అనేక ఆలయాల సముదాయం కట్టించారు చోళ చక్రవర్తులు.. వైష్ణవ గురువు రామానుజాచార్యులు ఈ గుడిలో నివసించారుట.

  కోనేటిలో మునుగుతూ అన్నాడు మాధవుడు.. “దీనిని ఆనంద సరోవరం అంటారుట. ఈ కోనేటి అంతర్భాగాన అత్తి కర్రతో చేసిన విగ్రహాలుంటాయి. నలభై సంవత్సరాల కొకసారి ఆ దేవతా మూర్తులను వెలికి తీసి భక్తుల దర్శనానికి అనుమతిస్తారుట.”

  “చాలా హాయిగా ఉంది మిత్రమా! నువ్వు చెప్పింది నిజమే. ఇంత విశాలమైన ఆవరణ ఉన్న ఆలయాన్ని చూడడం ఇదే ప్రధమం. ఈ ప్రశాంతత మనసులో చాలా కాలం అలా నిలిచి పోతుంది.”

  వరదరాజస్వామి దర్శనం అయిన పిదప ఆవరణంతా తిరిగి తమ వసతికి చేరుకున్నారు.

  తమిళ వంటకాలతో భోజనం.. సాంబారు, తైరు సాదం, కొబ్బరన్నం, మిరియాల రసం.. పూర్తిగా వేరు రుచులతో! కమ్మగా ఉన్నాయి. కడుపు నిండుగా తిని విశ్రమించారు. వారం రోజుల నుంచీ ప్రయాణంలోనే ఉన్నారేమో.. కంటి నిండుగా నిదుర పోయారు.

 

  “మిత్రమా! ఈ ఉదయం వేగవతి నది వద్దకు వెళ్దామా, ప్రాతః సంధ్య వార్చుటకు? ఎక్కడైనా నదీతీరాన్ని మించిన సలిల సేవనం ఉండదు కదా! అశ్వముల నధిరోహించి వెళ్తే పట్టణం నలుమూలల చూసి రావచ్చును. ఆ తరువాత ఉద్యాన వనమునకు మీరు వెళ్ల వచ్చును. నేను వీధులన్నీ పర్యటించి వచ్చెదను.” మాధవుడు పురుషోత్తమ దేవుని వద్దకు వచ్చి అన్నాడు.

  మిత్రులిరువురూ సూర్యోదయాత్పూర్వమే నదికి బయలు దేరారు. పక్షుల కిలకిలారావాలు తప్ప మనుషుల అలికిడి లేదెక్కడా.

 

  అశ్వాలని చెట్లకి కట్టేసి, మార్చుకోబోయే దుస్తులను ఏటిగట్టున పెట్టి.. నీళ్లలో దిగబోతూ అన్నాడు మాధవుడు. రాకుమారుడు కూడా వెళ్లబోయాడు.

  “ఆగండి రాకుమారా! నదిలోనికి దిగవద్దు.” ఆందోళనగా ఒక కంఠం కొద్ది దూరం నుంచి వినిపించింది.

  ఉలిక్కిపడి ధ్వని వినవచ్చిన దిక్కుకు చూశారు.

  పురుషోత్తమదేవుడు ఆందోళనగా ఆలకించాడు.

  ఈ దేశంలో తనని రాకుమారునిగా గుర్తించి, సంబోధించడమా? ఇంక తన రాకలోని రహస్యం? మాధవుడు జాగ్లత్తగా వెనుతిరిగి, రాకుమారునికి రక్షగా నిలుచున్నాడు. రెండంగల్లో, దుస్తులలో దాగిన కరవాలాన్ని తియ్యగలిగే విధంగా.

  “మిత్రులమే రాకుమారా! సంశయం వద్దు..” వృక్షం చాటునుండి వినవచ్చిందొక స్త్రీ స్వరం. వెంటనే, ముగ్గురు స్త్రీలు గుర్రాల మీద వచ్చి ఎదురుగా నిలబెట్టారు అశ్వాలని.

  మధ్యలో మెరుపుతీగవలె నున్న యువతి రాజకుమార్తె వలె ఉంది. ఆ ఠీవీ, ఆహార్యం, మోములోని ప్రసన్నత, కళ.. చెప్పక చెపుతున్నాయి.

  మిగిలిన ఇద్దరూ చెలికత్తెలని తెలిసి పోతోంది.

  “మేము దేశాటన చేయు బాటసారులం. నదిలో స్నాన మాచరించి అర్ఘ్య సమర్పణ చేయుదమని..” మాధవుని మాట పూర్తి కాకుండానే సమాధానం వచ్చింది.

  “తమరు పురుషోత్తమదేవులనీ, గజపతుల రాకుమారులని, కాబోయే సార్వభౌములనీ మాకు తెలుసు రాకుమారా! మీరు రానున్నారని వార్త కూడా మా వేగులు తెచ్చారు. మిమ్ములను వెతుక్కుంటూనే వచ్చాము. ఈ నదిలో మొసళ్లు చాలా ఉన్నాయి. అందుకనే మిమ్మల్ని దిగవద్దన్నాము. పట్టణంలో కోనేరులు, సెలయేరులు చాలా ఉన్నాయి. ఏకాంబరేశ్వరుని ఆలయ తటాకం చాలా పెద్దది. అందులోనికి, వేగవతీ నది నుంచే నీరు ప్రవహిస్తుంది.” ఒక చెలికత్తె వివరించింది.

  “మీకు ధన్యవాదాలమ్మా! ఇంతకీ మీ పరిచయం..” మాధవుడే సంభాషణ జరుపుతున్నాడు.

  “మీరెవరో చెప్పనేలేదు స్వామీ?” ఇంకొక పరిచారిక అడిగింది.

  “నేనెవరో తెలుసునన్నారు కదా! ఇతడు మా మంత్రి, మాధవ మహాపాత్రులు.” పురుషోత్తమ దేవుడు జవాబిచ్చాడు.

  మాధవుడు ఉలిక్కి పడ్డాడు.. మంత్రి.. తనా!

  మిత్రుని వంక చూశాడు. పురుషోత్తముడు అవునన్నట్లుగా తల ఊపాడు, చిరునవ్వుతో.

  తన మీద ఇంతటి బాధ్యత.. నిర్వహించగలడా? దీని కొరకేనా తను కళింగకోటలో ప్రవేశించింది?

  అయోమయంగా చాశాడు.

  “మా వివరాలు సేకరించినపుడు, మీరెవరో కూడా చెప్తే..” తెలుస్తూనే ఉంది, చిత్రపటం చూడకపోయినా.. అయినా నిర్ధారణ అవకుండా నిర్ణయానికి రాలేరు కదా!

  “మీరు గ్రహించినట్లుగానే.. వీరు కాంచీపుర రాకుమారి పద్మావతీ దేవి. అంద చందాలలో, విద్యలలో తనకి తనే సాటి.” కించిత్ గర్వంగా చెప్పింది చెలికత్తె.

                                     …………………..

 

......మంథా భానుమతి