TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
‘‘అజ్ఞాత కులశీలశ్య….” 18వ భాగం
“ఇంతకీ మిత్రమా! మనం కంచి ప్రయాణం ఎందుకో..” ఆపేశాడు మాధవుడు. గుంటూరు దాటి పలనాడు ప్రవేశిస్తున్నారు పురుషోత్తముని బృందం. వీరి దృష్టికి ఆనేట్లుగానే ముందూ వెనుకలుగా పయనిస్తున్నారు అనుచరులు.
అనుకున్న సమయానికే, ప్రాతఃకాలమందే స్నాన పానాదులన్నీ ముగించుకుని బయలుదేరారు.
కొండపల్లి పూటకూళ్ల ఇంటివారు ప్రయాణీకులకి ఆరోజుకి సరిపోయే ఆహారం అరిటాకుల్లో కట్టి ఇచ్చారు, అర్ధం గ్రహించి. మినప రొట్టి, నంజుకోను కొరివికారం. పులిహోర, బొబ్బట్లు. ఇంకా చాలా ఇస్తామన్నారు కానీ.. పురుషోత్తముడు వద్దని వారించాడు.
“ఎప్పటి కప్పుడు నెచ్చట నైనను
అప్పము లచ్చటి వైని వలదనను
కప్పడి వలెనుం గన్పడ వలయును
ఒప్పుగ సాగుదు మూర్మి కలియజను.”
అశ్వాన్ని అధిరోహించిన పురుషోత్తముడు కాలితో సున్నితంగా హయం మీద లయ వేస్తూ పాడాడు.
“మిత్రమా! మా గురువుగారి ప్రభావం మీమీద కూడా పడినట్లుందే!” మాధవుడు పకాలున నవ్వుతూ అన్నాడు.
“ఆరునెలలు చాలు గదా వారు వీరవడానికి.. మరి ఇన్ని వత్సరముల సాంగత్యం. ఇంతకీ నేను పాడింది రగడేనా?”
“సందేహమెందుకు దేవా? ఉత్కళిక మధురగతి రగడ. చక్కని లయ. ప్రయత్నిస్తే మంచి కవి కాగలరు మీరు.”
“చూచెదము. ఈ రాచకార్యాలలో ఏ కాస్తయినా సమయం చిక్కవలె కదా!” పురుషోత్తమ దేవుడు నిట్టూర్చాడు.
“కృష్ణా తీరానికీ గుంటూరు సీమకీ గల వ్యత్యాసాన్ని గమనించారా మిత్రమా?”
చూశానన్నట్లు తల పంకించాడు పురుషోత్తముడు.
“అక్కడ, ఎక్కడ చూసినా పచ్చదనం. ఇక్కడ తుప్పలు, బీళ్లు. అక్కడక్కడ మిరప, పత్తి పంటలు తప్ప తక్కినవేమీ కానరావు.” మాధవుడు చేయి చాచి చుట్టూ చూపించాడు.
“ఇంకా, ఇంకా పలనాటి సీమలోనికి వెళ్తుంటే జొన్న చేలు తప్ప ఏమీ ఉండవుట కదా?”
“అవును దేవా! అన్నీ మెట్ట భూములు. వర్షాలు తక్కువ. బావుల్లో నీళ్లు పాతాళంలో ఉంటాయి. శ్రీనాధుల వారు కొన్నేళ్ల క్రితం ఈ సీమకి వచ్చి చాలా కష్ట పడినట్టు చెప్తారు. విద్వన్మణులు కదా.. బాధనీ, కష్టాన్నీ, సుఖాన్నీ, శృంగారాన్నీ కూడా తమ చాటువులలో సెలవిస్తారు.” మాధవునికి మిత్రుడిని దేవా అని సంబధించడం ఇష్టం. పేరులోనే ఉందికదా అంటాడు పురుషోత్తమ దేవుడు అభ్యంతర పెట్ట బోతే.
“ఇంకేం మిత్రమా! వదలు కొన్ని శ్రీనాధుల వారి చాటువులను. మనకి ప్రయాణపు బడలిక తెలియకుండా ఉంటుంది. అసలే వేడి గాలులు మొదలయ్యాయి.”
“జొన్నకలి జొన్న యంబలి
జొన్నన్నము జొన్న పిసరు జొన్నలు తప్పన్
సన్నన్నము సున్న సుమీ
పన్నుగ బలినాటి సీమ ప్రజలందరకున్"
కొంచె విషాదంగా పాడాడు మాధవుడు.
“పలనాటి సీమని బలినాటి సీమ అన్నారు కవి.. ఆకలిలో కూడా చమత్కారమే మహానుభావునికి.” రాకుమారుడు చిరునవ్వు నవ్వాడు.
“అంతే కాదు.. దీనికి తోడు, చింతకూరా, బచ్చలి కూరా కలిపిన పులుసు నంజుకి. ఆ చేదు భరించలేక నీళ్లు తాగుదామంటే మంచి నీటికి కూడా కరవే. అందుకే పరమశివుడిని నిందా స్తుతి చేశాడు.”
“నిందించాడా” ఆశ్ర్యపోయాడు పురుషోత్తముడు.
“సిరిగల వానికి చెల్లును
తరుణులు పదియారువేల దగ పెండ్లాడన్
తిరిపెమున కిద్దరాండ్రా
పరమేశా గంగ విడుము పార్వతి చాలున్.”
ఈ సారి నవ్వాపుకోలేక పోయారు ఇద్దరూ.
“సందర్భోచితంగా భలే అల్లుతారు పద్యాలు మీ గురువుగారు. అంతే కాదు.. రసికుడనే వారెవరూ పలనాడు వెళ్లరనీ, వెళ్లినా అక్కడ ఉండలేరనీ చెప్పి, గోదావరీ తీరానికి వెళ్లి పోయారుట.” పురుషోత్తముడు నవ్వాపుకున్నాక అన్నాడు.
“అవును.. అసలే శృంగారానికి పేరొందిన వారు కద!”
అలసట తెలియ కుండా కబుర్లు చెప్పుకుంటూ పలనాటి సీమ దాటేశారు.
పాకనాడు ప్రవేశించే సరికి అపరాహ్ణం దాటింది. గుర్రాలు కూడా వేగం తగ్గించి ఈడుస్తూ వెళ్తున్నాయి.
ఒక గ్రామ పరిసరం కనిపించింది. అక్కడున్న సత్రం దగ్గరాగి, గుర్రాలను శాలలో కట్టేశారు. అంతలో సైనికులందరూ కూడా వచ్చి, రాకుమారునిదీ, మాధవునిదీ కూడా గుర్రాల పనిని వారు చూశారు. కాస్త ఒడలు చల్ల బడుతుందని మిత్రులిరువురూ, పక్కనే ఉన్న సెలయేరులో ఈతకి దిగారు. ఒక అరగంట నీటిలో సేద తీర్చుకుని, ఒడ్డుకి వచ్చి పొడి దుస్తులు ధరించి.. సత్రం అరుగు మీద, తాము తెచ్చుకున్న భోజనం తిని.. విశ్రమించారు.
“మిత్రమా..”
“తెలియును.. అర ఘడియ మాత్రమే కదూ?” నవ్వుకుంటూ కనులు మూసుకున్నారు.
………………
“మనం నెల్లూరు మండలం దాటి వెళ్తాము కదూ సేనానీ?” సైన్యాధికారిని అడిగాడు పురుషోత్తముడు.
“అవును దేవా! ఈ రాత్రికి అచ్చటనే విశ్రాంతి.”
“కందుకూరు, పైడిపాడు.. దారిలో ఏమైనా కనిపించునా?”
“కొంచెం దారి మళ్లాలి. అవసరమా ప్రభూ? అటులయిన మనం వేగం కొంచెం పెంచాలి. హయములు హుషారుగానే ఉన్నాయి.”
“అచట మంచి వసతి గృహం ఉందని విన్నాను. వీలైతే రేపు ఆగుదామక్కడ.” పురుషోత్తమ దేవుడు గుర్రాన్ని అదిలించాడు.
“మిత్రమా! కందుకూరు వద్ద మండలాలన్నీ విజయనగరం రాయల ఏలుబడిలో ఉన్నవి కదా? అక్కడ ఏమి కార్యమో అడగ వచ్చా?” మాధవుడు గుర్రాల వేగం కొద్దిగా తగ్గాక పక్కకి వచ్చి అడిగాడు.
“పలనాటి సీమ దాటాం కదా! నెల్లూరు సీమలో.. అందులో కందుకూరు సన్న బియ్యానికి ప్రసిద్ధి. పైడిపాడు నేలే ప్రభువు మైలార రెడ్డి మంచి ఆతిధ్యానికి పేరు పొందిన వాడు. ఎంత వేగిరం వెళ్తే అంత మంచి భోజనం దొరుకుతుంది. అందుకనే..” పురుషోత్తముడు గుంభనగా అన్నాడు, నవ్వు ఆపుకుంటూ.
మాధవుడు వింతగా చూశాడు మిత్రుడిని. తనకి తెలిసీ, ఆహారం పట్టింపులేం లేవు రాకుమారుడికి.
మైలార రెడ్డి, విజయనగరం రాజు సామంతుడు. దేవరాయలకు అనేక యుద్ధాలలో సహాయం చేసి, చాలా మందికి భూదానాలిప్పించాడు.
రాజకీయాలకు అతీతంగా దానధర్మాలకు ప్రసిద్ధి చెందిన వాడు. చేయి చాచినవాడిని కాదనడని ప్రతీతి. రాజ్యాలందరూ పాలిస్తారు కానీ, తమ కీర్తిని తమకు తెలియకుండానే దూరతీరాలకు వ్యాపింప చేసుకునే వాళ్లు అరుదు. మైలారరెడ్డి గురించి గజపతుల రాజ్యం వరకూ వెళ్లిందంటే ఆశ్చర్యమే మరి.
“ప్రభూ! పైడిపాడు చేరాము.” సేనాని కనిపిస్తున్న పట్టణాన్ని చూపించి అన్నాడు.
“సంధ్యా సమయం ఆసన్న మౌతోంది. ఏదైనా వసతి గృహం వద్దకు చేరితే సంధ్యా వందనం చేసుకుని విశ్రమిద్దాము. చెరువో, కాలువో ఉంటే మరీ మంచిది.” పురుషోత్తముడు ఆదేశ మిచ్చాడు.
“ఇచ్చట ప్రభువు, బాటసారులకి చక్కని ఏర్పాట్లు చేశారు దేవా. మనం నేరుగా అక్కడికే వెళ్లిపోవచ్చు. ఆనుకునే చక్కని కొలను కూడా ఉంది. పక్కనే రామాలయం.”
“ఇంకేం మరి.. ఆలోచనెందుకు?”
విన్నదానికంటే ఆహ్లాదంగా ఉందక్కడి వాతావరణం. పరిసరాలు ప్రశాంతంగా ఉన్నాయి.
సాయం సంధ్య కార్యక్రమం చేసుకుని, ఆలయం లోనికి వెళ్లి రాకుమారుడు పూజలు చేసుకుని వచ్చాడు, మిత్రుడు వెంట రాగా!
“ఇంకా అర ఘడియలో వడ్డన చేస్తామని చెప్పమన్నారు సామీ!” రాజుగారి వసతి గృహం నుంచి వార్తాహరుడు వచ్చి చెప్పాడు.
పట్టణంలో ప్రవేశించగానే సైనికులు అశ్వాలని శాలకి తీసుకు వెళ్లారు.. వాటి సదుపాయం చూడడానికి.
“ఈ సీమలో బాటసారుల బాగోగులు చక్కగా చూస్తున్నారు మాధవా! మన పర్యటనలో గమనించ వలసిన ముఖ్య విషయం.. మనం ఆచరించ వలసినది కూడా.”
“కళింగ దేశంలో కూడా, చక్కగా ఉన్నాయి మిత్రమా! చెప్పాలంటే, ఇచ్చటి వాటి కంటెనూ బాగుగా. మనకి కాశీ యాత్రికులు అధికంగా వస్తుంటారు.. దీర్ఘ ప్రయాణాలు చేస్తూ.. మీకు అచ్చట పూటకూళ్ల గృహానికి రావలసిన అవసరం లేదు కనుక తెలియక పోవచ్చు..” మాధవుడు వివరించాడు.
“అవునవును.. నేను మాటలాడుతున్నది వసతి గృహం యజమానితో.. ఆ మాటే మరచాను సుమీ!” నవ్వుతూ అన్నాడు పురుషోత్తముడు.
మాధవునికి ఒక్కొక్క సారి ఆశ్చర్యం కలుగుతుంటుంది.. తన జీవితం ఏ విధంగా సాగుతోందో చూస్తుంటే. విధి వ్రాసిన రాతలు ఎంత వింతగా ఉంటాయో..
చిన్ననాటనే తల్లిదండ్రులను దూరంచేసి నందుకు నిలదియ్యాలా? కర్కశకుల కంట పడకుండా తప్పించి, ప్రేమ ఆప్యాయతలు పంచే కుటుంబాన్నందించి నందుకు మొక్కాలా? ఇప్పుడు రాకుమారునితో ఈ స్నేహం, యీ చనువు ఎందుకు ఏర్పడ్డాయో, ఎంత ముందుకు తీసుకొని వెళ్తాయో? ఆ విధి విలాసం ఏమిటో.. వేచి చూడ వలసిందే అనుకున్నాడు మాధవుడు.
రాజులతో అతి చనువు పనికి రాదని కన్న తల్లి చెప్పిన పాఠం గుర్తుకొచ్చింది. అనుక్షణం రాజుని వెన్నంటి ఉన్న కన్న తండ్రి, రాజుతోనే అసువులు కోల్పోయాడు.
అయినా ఏదీ తప్పించలేరు మానవ మాత్రులెవరూ! రాచ కుటుంబంతో సన్నిహితత్వం తాను కావాలనుకుంటే వస్తుందా, వద్దనుకుంటే పోతుందా?
“మిత్రమా! మనం రేపు ఇక్కడ విశ్రాంతి తీసుకుంటున్నాము. నాకు ఈ పరిసరాలు బాగా నచ్చాయి. రేపంతా కోనేటి స్నానం, రాముల వారి ధ్యానం. ఎల్లుండి ప్రాతః కాలమందే పయనం సాగిద్దాము. పద.. పద. క్షుద్బాధ అధికమవుతోంది. శాంతింప జేయాలి దేహాన్ని ముందు.”
భోజనం అయాక ఆరుబయట అరుగు మీద కూర్చున్నారు, పురుషోత్తముడు, మాధవుడు, ఆ వసతి గృహం యజమానీ! తాంబూల సేవనం అవుతోంది. చల్లనిగాలి సేద తీరుస్తుంటే, పున్నమి సమీపిస్తోందేమో.. పలుచని వెన్నెల పరచుకుంటోంది ప్రాంగణ మంతా.
“సామీ! ఎందాకా పయనం?” యజమాని అడిగాడు.
“కాంచీ పురం వరకూ. ఇక్కడే.. ఆరుబయట నిదురిస్తే ఎంత హాయి..”
“అట్లానే సామీ! ఇక్కడ దొంగల భయాలేంలేవు. హాయిగా పండచ్చు. ఈ గృహంలోని వారు చాలా మంది పండుకుంటారు.” గృహ యజమాని చెప్తుండగానే, మాధవుడు లేచి లోపలికి వెళ్లాడు, రాకుమారునికి పానుపు గురించి అనుచరులకి చెప్పాలని. తరువాతి ప్రయాణానికి కూడా కాస్త సరుదుకోవాలి..
“కొంచెం ప్రధాన రహదారికి పక్కకి ఉంది కదా.. మీ పట్టణానికి కూడా బాటసారులు వస్తుంటారా తరచుగా?”
“వస్తారు స్వామీ! మా రాములోరు ఈ పరగణాలో ప్రసిద్ధి చెందినోరు. గుడికి వస్తుంటారు, చుట్టు పక్కల గ్రామాల వారు. శ్రీరామనవమి తొమ్మిది దినాలూ ఉత్సవాలు చేస్తాము. అప్పుడు పందిట్లో హడావుడే హడావుడి. యక్షగానాలు, హరి కథలు.. ఒకటేమిటి. అందరికీ భోయనాలు రాజుగారే!” వసతి గృహయజమాని గర్వంగా చెప్పాడు.
“అంత ఐశ్వర్య వంతమా ఈ ప్రాంతం?”
“అవును సామీ. మూడు రకాల పంటలు పండుతాయి ఏటికేడూ. ఇంక పాడి చెప్పనక్కర్లేదు. అదంతా శ్రీరాముల వారి వంటి మా రాజు మహత్యం. వారు బ్రాహ్మణులను, పేదవారినీ ఆదరిస్తున్న ఫలం. రాయల వారితో చెప్పి వారి రాజ్యం లోనే కాక బైట కూడా అగ్రహారాలిప్పించారు. నిత్యం ఇంత మంది ప్రజల ఆశీస్సులనందుకుంటుంటే, మరి ఆ దేవుడు కూడా మంచి చూపు చూస్తాడు కదా!”
“నిజమే. రాజు యోగ్యుడైతే రాజ్యం సుభిక్షంగా ఉంటుంది.” పురుషోత్తముడు సాలోచనగా అన్నాడు. దేశాటన వల్ల ఎన్ని అనుభవాలు.. ఎన్నెన్ని కొత్త విషయాలు గ్రహించ వచ్చు.. ప్రజలలో ఉండే మంచి పేరే శ్రీరామరక్ష ప్రభువుకి.
“అంతే కాదు సామీ.. మా రాజు గారు ఎందరికో దిన వెచ్చాలు ఏర్పాటు చేశారు. చేస్తున్నారు.”
“దిన వెచ్చాలా? దేనికి?”
“బ్రతికి చెడిన వారికి. పండితులు, కవులు.. ఇదివరకు ఒక వెలుగు వెలిగి, పతనమైన రాజాశ్రయాలలో వైభోగం అనుభవించిన వారు, సలహా దారులు.. ఎవరైనా ఆశ్రయిస్తే చాలు, వారి ఆకలి పోగొడతారు. వారు ఏ పనీ చెయ్యలేరు కదా! మా వసతి గృహంలోనే ఒక మహానుభావులున్నారు. ఎన్నో కావ్యాలు గ్రంధాలు రాశారు. మహాకవిట. కొండవీటి రెడ్డిగారి దగ్గర విద్యాధికారిట. వారికి దిన వెచ్చాలిస్తున్నారు మా రాజుగారు. వారి అనుచరుడు వండి పెడుతుంటాడు. త్వరలో శ్రీశైలం వెళ్తారుట. వారు ఎక్కడా ఎక్కువ రోజులుండలేరని అందరూ చెప్పుకుంటారు. కాశీఖండం అనే కావ్యం రచించి విశ్రాంతి కోసం ఇక్కడ ఉందామని వచ్చారుట.” యజమాని ఇంక లేవడానికి ఉద్యుక్తుడై అన్నాడు.
“కాశీ ఖండమా?” పురుషోత్తముడొక్క సారి ఉలిక్కి పడి లేచాడు.
“అవును సామీ! ఇక్కడ అందరికీ అప్పుడప్పుడు తన కావ్యాలు వినిపిస్తుంటారు కూడా.” అంత ఆశ్చర్య పోవలసిన సంగతేమిటో అర్ధం కాలేదు యజమానికి.
“వారిని మేము కలుసుకోవచ్చా?”
“మహ చక్కగా కలవచ్చు. ప్రాతఃకాల విధులు నిర్వర్తించుకుని, వారు ఆలయంలో రావి చెట్టుకింద అరుగు మీద కూర్చుని కొలువు తీరుతారు. అప్పుడు వారి వంటివారే అందరూ వచ్చి చర్చలు చేస్తుంటారు. ఆ చర్చల ద్వారానే తెలిసింది, వారు శ్రీశైలం వెళ్ల బోతున్నారని.”
పురుషోత్తమునికి లిప్త మాత్రం పట్టింది కర్తవ్యం నిర్ణయించడానికి.
“మా మిత్రునికీ విషయం చెప్పవద్దు. రేపు కవిగారిని కలిసి మేం ప్రయాణమౌతాము. రెండు రోజులకీ మీరు మాకు వసతి సదుపాయాలు చూసి రొక్కం చెప్తే మాధవుడిచ్చేస్తాడు.”
“అట్లాగే సామీ! ఆ సామికి చెప్తా లేవగానే మీ సంగతి.”
“ఎవరు మిత్రమా ఆ సామి?” అప్పుడే ఏర్పాట్లు ముగించుకుని అక్కడికి వచ్చిన మాధవుడు అడిగాడు.
“ఎవరో.. రాజుగారికి ఆప్తుడట. దేశాటనలు బాగా చేస్తారని చెప్తున్నారు. మనకి దిశా నిర్దేశం చేస్తారని, రేపు కలుద్దామనుకుంటున్నా.”
……………….
......మంథా భానుమతి