Facebook Twitter
‘‘అజ్ఞాత కులశీలశ్య….” 14వ భాగం

‘‘అజ్ఞాత కులశీలశ్య….” 14వ భాగం

   పురుషోత్తమదేవునికి వరదలా వచ్చి పడ్డాయి సమస్యలు. వయసుకి మించిన బాధ్యతలు.
   కపిలేంద్ర దేవునికి అత్యంత ప్రియమైన భార్య కుమారుడతడు. దశరధుడు కైకేయికి వరమిచ్చినట్లు గానే కపిలేంద్రుడు కూడా తన తరువాత పురుషోత్తముడే రాజని ఆవిడకి మాట ఇచ్చాడు. కానీ అది బహిర్గతం చేయడానికది సమయం కాదు.
   ఆ సంగతినే ఆ భార్యకి చెప్పి కొన్ని రోజులు ఊరకుండుమన్నాడు.
   “పురుషోత్తముడు ఇంకా చిన్నవాడు. నాకున్న పద్ధెనిమిది మంది పుత్రులలోనూ నాకు ప్రీతి పాత్రుడే. కానీ, రాజ్యాన్ని సుస్థిర పరచుకోవాలి.. అదే ప్రధమ కర్తవ్యం.”
   జ్యేష్ఠ కుమారులలో బలమైన వాడు, ప్రముఖుడు హంవీరదేవుడు. తండ్రి రాజ్యానికి రక్షగా ఉన్నవాడు. నందాపురం రాజులనూ, ఒడ్డాది మత్స్యవంశపు రాజులనూ, యలమంచిలి చాళుక్యులనూ లొంగ దీసుకోవడంలో తన పరాక్రమాన్ని చూపించిన వాడు.
   సహజంగానే.. తండ్రికి ప్రీతి పాత్రుడని, అన్నదమ్ములందరికీ పురుషోత్తమ దేవుడనిన అసూయ, కోపం. అందరూ అతడిని వెలివేసినట్లుగా చూస్తుంటే బాల ప్రాయమునించీ ఒంటరి గా గడపడం అలవాటు చేసుకున్నాడు.
   ఒక రకంగా ఆ ఒంటరి తనం అతన్ని సాహిత్యానికి దగ్గర చేసింది.
   విద్యలన్నిటి యందూ అధిక సమయం వెచ్చించడానికి దోహద పరచింది. ఆటపాటల బాల్యాన్ని గురుకులంలో తోటి విద్యార్ధుల మధ్య గడిపాడు.
   మాధవుని సాంగత్యం ఎడారిలో ఒయాసిస్సులా ఊరట పరచింది పురుషోత్తముడిని. తెలివిలో, ఠీవిలో, అభిరుచులలో, ఆసక్తిలో అన్నిటా సమ ఉజ్జీ. దాయాదుల మత్సరంలేకుండా, స్వచ్ఛమైన స్నేహం లభించింది.
   
   మహానదీ తీరం నుండి కోటకి వచ్చిన వెంటనే, పురుషోత్తమ దేవునికి పిలుపు వచ్చింది, తండ్రిగారి నుండి.
   మాధవుడు గజ శాలలకి వెళ్లిపోయాడు. శాలలలో యుద్ధ శిక్షణ ఇస్తున్న గజాలని పర్యవేక్షించడానికి. వన్య మృగాలకి యుద్ధ శిక్షణ చాలా కఠినంగా ఉంటుంది.. సైనిక శిక్షణ లాగానే. అవి మగ ఏనుగులే అయుంటాయి.
   మొదట్లో వాటికి ఆహారం ఇవ్వకుండా.. మాడుస్తారు. నెమ్మదిగా, వాటిని మావటి వానిచే మచ్చిక చేయిస్తారు. వాని మీదికి, బాణాలు విసరడం, కత్తులు ఝుళిపించడం.. గాయాలు చెయ్యడం వంటివన్నీ చేస్తారు. యుద్ధభూమిని తయారుచేసి అందులో ఏ విధంగా రెచ్చిపోవాలో నేర్పిస్తారు.
   రణ రంగంలో ఉండేవి చాలా పెద్ద ఏనుగులు. ముందుగా వాటి ఆకారాలని చూసే భయపడి పోతారు, పదాతి దళం.. తొండంతో ఇరవై అడుగులు పైకి ఎగరేసి విసిరెయ్యడ, నేల మీదకి పడేసి తొక్కడం, దంతాలని మనుషుల్లోకి గుచ్చడం వంటి వన్నీ, బొమ్మలతో శిక్షణ ఇస్తారు.
   అంత భయంకరంగా పోరాడే జీవులూ, తమ యజమాని గానీ, మావటి గానీ దగ్గరగా వస్తే.. చెప్పినట్లు వింటాయి వెంటనే.
   ఆ శిక్షణలో తగలే దెబ్బలకి వైద్యం చెయ్యడానికీ, ఔషధాలు తయారు చెయ్యడానికీ ఒక విభాగం ఉంటుంది. యుద్ధ సమయంలో డేరాలలో, వైద్యులతో, పశు వైద్యులు కూడా ఉంటారు.
   మాధవుడు, ప్రతీ పనినీ స్వయంగా చూసుకుంటాడు. శిక్షణ కఠినంగా ఉందనిపించినా మాట్లాడడు. భీకర యుద్ధాలనెదురుకోవాలంటే ఆ విధంగా ఉండాలిసిందే!
   ఆ శిక్షణలో ఒక్కొక్క సారి అతడికి కూడా దెబ్బలు తగులుతుంటాయి. ఆ సమయంలో గౌతమి పదే పదే చెప్తుంటుంది.. కోటలోకి వెళ్ల వద్దని. మాధవుడు ఊరడిస్తే ఊరుకుంటుంది.

              ఉ.    పోరు నెదుర్కునే బలిమి పూటుగ రావలె నన్నచో సదా
                     భారము కల్గియే మెలగి బాగుగ శిక్షణ చేయగా వలే
                     నోరిమి యెంతయో కలిగి నొట్టిగ భీతిని చెందియుండకే
                     ఘోరముగా నదే రణము గొప్పగ సల్పను శక్తి కల్గుగా!
   
   ఆ రోజుకి తన పని ముగించుకుని ఇంటికి వెళ్లిన మాధవునికి దుఃఖముతో ఎదురొచ్చారు గౌతమీ, నందులు.
   “ఏమయిందమ్మా?”
   “అమ్మ మనల్ని వదిలి వెళ్లిపోయింది మాధవా!” నందుడు వెక్కుతూ అన్నాడు.
   మాధవుని నోటి వెంట మాట రాలేదు. అరుగు మీద కూర్చుండి పోయాడు.
   “ఆఖరు చూపు దక్కలేదు. మొన్నటి రేయి, నిద్దురలోనే విడిచిందట ఆఖరు శ్వాశ. రేపు ప్రాతఃకాలమందే బయలు దేరి వెళ్తున్నాము ఇద్దరమూ.. కర్మ కాండలు నిర్వర్తించవలెను కదా! నువ్వు రాకుమారుని అనుమతి తీసుకుని మా వెనుకే బయలుదేరి వచ్చెయ్యి.”
   “ఇప్పుడే వెళ్లి అడుగుతాను. అందరం కలిసే వెళ్దాము.” మాధవుడు కళ్యాణి పైకి ఎక్కి కళ్లెం లాగాడు.
                                            ………………

   గౌతమి మేనాలో, నందుడు, మాధవుడు చెరొక అశ్వం మీద బయలు దేరారు. త్వరిత గతిన వెళ్లడానికి కుదురుతుందని.
   మరునాడు సాయంత్రానికి కానీ వెళ్ల లేకపోయారు.. అతి తక్కువ విశ్రాంతి సమయాలు తీసుకుంటూ. దారంతా, మాధవునికి బాలవ్వ జ్ఞాపకాలే. ఆరోజు సైనికుల నుంచి తనని కాపాడక పోయి ఉంటే..
   ఆవిడ చూపించిన ప్రేమ, తన పుత్రునికే అప్పజెప్పడం.. ఏ నాటి అనుబంధమో. ఈనాటి తన స్థితికి ఆవిడే మూలం. కళ్ల చెమరుస్తూనే ఉన్నాయి. తన తల్లిని విపత్కర పరిస్థితులలో అడవిలో వదిలేసి వచ్చిన దృశ్యం కనిపించింది.
   ఆవిడ భద్రకాళి అవతారం ఎత్తి శతృవులని ఎదుర్కొన్న వైనం..
   అడవి నుండి నిస్సహాయ స్థితిలో, భయ భ్రాంతులతో వచ్చిన తనని ఆదుకున్న బాలవ్వ..
   ఈ స్త్రీ మూర్తుల ఋణం తీర్చుకోగలగడం ఎవరికైనా తరమా!
   మాధవుడు బృందం వెళ్లేసరికే దహన సంస్కారాలైపోయాయి.
   “ఐపోయింది అన్నగారూ! ఇంక ఆపద్దని సెలవిచ్చారు పెద్దలు. మీరు ఎప్పటికి రాగలరో తెలియదు కదా..” జగన్నాధుడు అన్నగారిని పట్టుకుని రోదించాడు.
  “ఆవిడ ఓర్పు, ప్రేమ.. అమ్మని ఆదర్శంగా తీసుకోవాలి మనం. చాలా నేర్చుకోవాలి ఆవిడ జీవన శైలి నుండి.. జాతస్య మరణం ధృవమ్. ఆ సమయం వస్తే ఎంతటి వారైనా వెళ్లి పోవలసిందే కదా!” నందుడు ఓదార్చాడు తమ్ముడిని.
   పన్నెండు రోజులు ఉండి, శాస్త్రోక్తంగా కర్మ కాండలు ముగించుకుని, కటకం వచ్చేశారు ముగ్గురూ.
   ఆ పన్నెండు రోజులూ పూటకూళ్ల ఇల్లు మూసి వేశారు.
   
   మాధవుడు తిరిగి వచ్చే సరికి అనేక మార్పులు వచ్చాయి కోటలో.
   కపిలేంద్రుడు వంగదేశ దండయాత్రకి వెళ్లాడు. అతడితో కొందరు కుమారులు వెళ్లారు. అదే అదనుగా, చారుల సమాచారంతో.. దక్షిణం నుంచి రెడ్డిరాజులు దండెత్తారు.
   కోటకీ, రాజ్యానికీ రక్షగా ఉంచిన హంవీరదేవుడు వారికి గుణపాఠం చెప్పటానికి బయల్దేర వలసి వచ్చింది.. సగం గజబలం, అశ్వబలం ఉంచే వెళ్లాడు రాజు.
   తప్పని పరిస్థితులలో, చిన్నవాడైనా, పురుషోత్తమ దేవుడిమీద రాజ్య భారం పడింది. విశ్వాస పాత్రులయిన దండనాయకులు ఇద్దరున్నారు.
   మాధవుని చూడగానే పురుషోత్తమునికి కొండంత బలం వచ్చినట్లయింది. అక్కడ వదిలి వెళ్లిన గజబలం అంతా మాధవుడు తరలించినదే. అతడి చే సైగకి పరుగులు పెడతాయి ఆ గజాలు.
   రోజూ గజ, అశ్వ దళాల చేత కవాతులు చేయించడం, శిక్షణ పర్యవేక్షించడం.. అంతే కాదు, వంటశాలలో కూడా అజమాయిషీ, మాధవునికి బాధ్యతలు చాలా అప్పగించాడు రాకుమారుడు.
   “అందుకే పెద్ద వారితో స్నేహం వద్దన్నాను కన్నయ్యా! పట్టుమని పదహారేళ్లు నిండాయో లేదో.. ఇప్పటినుంచీ కోటలో పనులా?”గౌతమి నిష్ఠూరంగా అంది.
   “అమ్మా! నీ భయం నాకర్ధమయింది. కానీ.. యువకులకి తప్పని పనులమ్మా ఇవి. నా వయసు వాళ్లు యుద్ధానికే వెళ్లారు. నేనింకా రాకుమారుని స్నేహితుడుని కనుక, అతని భారాన్ని పంచుకుంటూ ఉండగలుగు తున్నాను. రోజూ ఇంటికి వచ్చి మిమ్మల్ని చూడ గలుగుతున్నాను.” ఓదార్చాడు తల్లిని.
   “కోటని ఎవరైనా ముట్టడిస్తే..”
   “ఏమవుతుందమ్మా? రాకుమారునితో యుద్దంలో పాల్గొంటాను. అభి మన్యుడు, బాల చంద్రుడు నా వయసులోనే యుద్ధం చేశారు.”
   చటుక్కున వచ్చి మాధవుని నోటి మీద చేతులుంచింది గౌతమి.
   “అశుభం పలుకకు నాయనా!”
   “అటులనే అమ్మా! అయినా నన్ను రెండు కారణాల వలన రణానికి పంపరు. మీకు చింత వలదు. ఒకటి.. బ్రాహ్మణ బాలురు పిరికి వారని కోటలో వారి అభి ప్రాయం. మరొకటి.. మన వృత్తి. పదుగురికీ ఆహారం సమ కూర్చుతాము కదా! అది లేకున్న జీవనమే ఉండదు.. ముందు భుక్తి.. పిదపనే రాజ్యం.” నవ్వుతూ అన్నాడు మాధవుడు.
   “చిన్న వాడవైనా ఎంత అవగాహనరా నీకు..” సీతమ్మ మెచ్చుకుంది.
   “అమ్మమ్మా! ఆకలి.. ముందుగా నా బొజ్జని మెచ్చుకో.. ఆ తరువాత నన్ను మెచ్చుదువు..” మాధవుడు గోముగా అడిగాడు.
   “రా నాయనా! ఎప్పుడు తిన్నావో ఏమో. నీ కిష్టమైన శాకమే ఇవేళ.. వంకాయ అల్లం వేసి చేశాను.” సీతమ్మ వెనుకింటికి దారి తీసింది.
                                       ………………

   ఎవరి కెన్ని సమస్యలున్నా, సంతోషంతో తేలి పోతున్నా, దుఃఖ భారంతో కుంగి పోతున్నా.. కాలం సాగి పోతూనే ఉంటుంది.
   నాలుగు సంవత్సరాలు.. పొరుగు దేశాలతో పోరులు, తన సామంతరాజుల సర్దుబాట్ల మధ్య కపిలేంద్ర దేవుడు ప్రజానుకూలంగానే పరిపాలిస్తున్నాడు. ముఖ్యంగా పాడి పంటల అభివృద్ధిలో ప్రజల మన్ననలందుకుంటున్నాడు. రాజ్యం సుభిక్షంగా ఉంది.

   క్రీ.శ. 1443- ఉత్తరాన గంగా తీరం నుండి, దక్షిణాన విశాఖ పట్టణం.. కోరుకొండ వరకూ రాజ్య విస్తరణ సాగింది.
   గురుకులం లో విద్య పూర్తి అయిందని గురువుగారు చెప్పారు.
   మాధవునికి కోటలో కొలువు ఖాయమయింది.
   రాకుమారునికి ఇష్ట సఖుడతడు..  ఇరువురూ కలిసి చేసే సాహిత్య చర్చ ఎంతో ప్రియమైనది మాధవునికి.
   ఒక సాయంకాలం.. మిత్రులిరువురూ, మహానది ఒడ్డున, వనంలో మర్రిచెట్టు కింద ఊడల ఆసనాలపై కూర్చున్నారు.
   ఇరువురూ సంధ్యా సమయంలో ఏ రాజకీయాల గురించీ ఆలోచించకుండా సాహిత్యం గురించే మాట్లాడుకుంటారు.
   “మిత్రమా ఎంత ఆహ్లాదంగా ఉందీ ప్రకృతి? ఏ ఆందోళనలూ లేకుండా హాయిగా..
ఎటువంటి ఒత్తిడులూ లేకుండా, ఉండిపోతే.. అంత కంటే జీవితానికింకేం కావాలి?

          సీ.    నిశ్చలమౌ నదీ నీరములన్నియు
                        నిటలాక్షుడే యోగ నిద్రను యుండ
                 పక్షికూనల కూహు పాటలాగినవిగా
                        చెట్టుమీదను తల్లి చేర రాగ
                 ఊడలన్నియు వంగి నీడ నందుకొనగా
                        మర్రి మురిసెగ తాను మాకు నవగ
                 దూరమున నిలిచి తొణకక నగమదె
                        దృష్టి సారించెనే దీక్ష గాను

          ఆ.వె.  ఈ ప్రశాంత సంధ్య నీ తటి నిర్మల
                   మానసమున ధ్యాన మాచరించ
                   నేమి పుణ్యమోను, నీ జన్మ మంతయు
                   ధన్య మయ్యె గాద తధ్యముగను.
    
   కాసేపు, చింత నంతా వదిలి ధ్యానం చేసుకోవాలనిపిస్తోంది, గుండె నిండుగా ఊపిరి పీల్చి.” రాకుమారుడు అర్ధ నిమీలత నేత్రాలతో అన్నాడు.
     
   రాకుమారునిలో ఒక దివ్య తేజస్సు ప్రవేశించినట్లు అనిపించింది మాధవునికి.

                    

  

         

   

“అవశ్యం రాకుమారా! మీరు ధ్యానం చేసుకోండి. నేను కావ్య పఠనం చేసుకుంటాను.” మాధవుడు కొద్ది దూరంలో కూర్చుని, తాళ పత్రాలు విప్పాడు. రాకుమారుని మీద దృష్టి నిలుపుతూ. పురుషోత్తమ దేవుని రక్షణ అతడికి అప్పగించాడు మహారాజు, నిరంతరం కలిసే ఉంటారు కనుక. అందులో మాధవుని ప్రతిభ అవగతమే కపిలేంద్రునికి.
   శ్రీనాధుని కావ్యాలంటే మక్కువ మాధవునికి. ఆ మహాకవి ఇప్పుడెక్కడున్నారో, రాకుమారుని అడగాలి. జీవితంలో ఒక్క సారైనా వారిని కలవాలి అనుకుంటూ హరవిలాసం తీశాడు. పాల్కురికి సోమనాధుని పండితారాధ్య చరిత్రను పోలి ఉంటుంది.
   హరవిలాసం అంతా శివ భక్తుల కథలు.
   శృంగారనైషధం అనువాద కావ్యమంటారు, కానీ.. హర విలాసం, అందులోని కథలు శ్రీనాధుల వారి సృజననే అంటారు. అద్భుతమైన వర్ణనలుంటాయి, శ్రీనాధుని కావ్యాలలో.
   పఠనంలో మునిగి పోయి ఒక ఘడియ మాత్రం రాకుమారుని గమనించ మరచి నట్లునట్లున్నాడు.. తల ఎత్తి చూసే సరికి కనిపించిన దృశ్యం ఒక్క సారి మాధవుడిని అప్రమత్తుడిని చేసింది.
   ఒక్క ఉదుట్న లేచాడు.
   ఇంత మంది జనం.. రాకుమారుని చుట్టూ.. వారినే చూస్తూ..
   ఏమయింది? తాము భయపడుతున్నట్లే, సవతి సోదరులు కుట్ర పన్నారా? మహారాజుగారికి పురుషోత్తమదేవుడంటే అవ్యాజమైన ప్రేమ, వాత్సల్యమూ అని అందరికీ తెలిసిన విషయమే. అందువలన ఇతడి మీద వారికి మత్సరం అని విన్నాడు. కానీ.. అక్కడున్న జనం హాని కనిగించే వారి లాగా, సైనికుల లాగా లేరు.  అడవుల్లో, పొలాల్లో పనులు చేసుకుని ఇళ్లకి తిరిగి వెళ్లే పల్లె జనం. తలపాగాలు చుట్టుకుని అమాయకంగా ఉన్నారు.
   తమతమ చేతుల్లో ఉన్న పనిముట్లన్నీ నేల మీద పెట్టి, రాకుమారుని చుట్టుముట్టి, నేల మీద కూర్చున్నారు.
   మాధవునికి ఏం చెయ్యాలో అర్ధం కాలేదు.
   చటుక్కున వెళ్లి రాకుమారుడి పక్కన నిలుచున్నాడు. అది అతని బాధ్యత. ఒరలో కత్తిని సవరించుకుని కళ్లని చురుకుగా తిప్పుతూ అక్కడున్న ప్రతీ ఒక్కరినీ పరిశీలిస్తున్నాడు.
   అంతా నిశ్సబ్దంగా కూర్చున్నారు. అలసిన వారి మొహాల్లో కూడా ప్రశాంతత..
   రాకుమారుడు కదలకుండా మెదలకుండా ధ్యానం చేస్తున్నాడు. ఒక ఘడియ గడిచిందేమో.. నెమ్మదిగా కన్నులు తెరిచాడు. ఒక్క నిమేషం.. కళ్లలో ఆశ్చర్యం కదలాడింది. చిరునవ్వు నవ్వాడు.. గుండ్రంగా తల తిప్పి అందరినీ పరికించాడు. అతడి మోము ఆ సంధ్య వెలుగులో వింత కాంతిని వెదజల్లుతోంది.
   ఆ కన్నులలో ప్రశాంతత, మోములోని పవిత్రత ఎవరినైనా కట్టి పడేస్తాయి.
   ప్రజలలో కొద్ది కలకలం.. ఒక పెద్దాయన లేచి, తలపాగా తీసి చేతిలో పట్టుకున్నాడు.. “సామీ.. మీరు రాకుమారులే కదా?” తల పంకించాడు పురుషోత్తముడు.
   వెంటనే అందరూ లేచారు.. మాధవుడు కత్తి పిడి మీద చెయ్యి వేశాడు..
                                     ………………..

 

 

  

......మంథా భానుమతి