TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
“అజ్ఞాత కుల శీలస్య..” 3వ భాగం
కళ్ళు తెరిచిన మాధవుడికి ఒక్క క్షణం తానెక్కడున్నాడో అర్ధం కాలేదు.
“అమ్మా.. అమ్మా!” అరిచాడు. అరిచాననుకున్నాడు.
అప్పుడు గుర్తుకొచ్చింది..
ఇంకెక్కడి అమ్మ… అమ్మ చెప్పిన పనులు చేస్తూ వాటిలో అమ్మని చూసుకోవలసిందే!
లేచి నిలబడడానికి ప్రయత్నించాడు. పక్కనే ముక్కాలి పీట మీదున్న మంచి నీటి చెంబు కింద పడి చప్పుడు చేసుకుంటూ దొర్లి పోయింది.
బాలవ్వ వడివడిగా వచ్చింది.
“ఏమాయె? లేవకు మాధవా! నీకు బాగా ఉష్ణం చేసింది. అడవిలో ఏదో పురుగు కుట్టినట్లుంది. వైద్యులు ఇచ్చిన ఔషధం మరి నాలుగు రోజులు తీసుకోవాలి. ఆ పైన మంచి ఆహారం తీసుకోవాలి. కనీసం ఒక మాసం పట్టచ్చు. అప్పుడే నిన్ను పంపుతా.” మాధవుడిని అవశిష్టాలు తీర్చుకోవడానికి అవతలికి తీసుకెళ్ళి, వేడి వేడి నీటితో మొహం కడిగి, తడి వస్త్రంతో శరీరం తుడిచి బట్టలు మార్చింది.
మాధవుడికి నోట మాట రావట్లేదు. నిశ్శబ్దంగా అవ్వ చెప్పినట్లు చేసి, పాలు త్రాగి, కళ్లు మూసుకుని మంచం మీద పడుకున్నాడు.
మరి అవ్వకివ్వడానికి సరి పోయే నాణాలున్నాయా? అమ్మ తన వీపుకి కట్టిన మూట తీసి చూడనే లేదు. ఆలోచనలకి శిరోభారం ఎక్కువయింది. తల అటూ ఇటూ విదిలిస్తూ భారం తగ్గించుకోవడానికి ప్రయత్నించ సాగాడు.
జాలితో... సేద తీర్చడానికి నిద్రాదేవి ఆ బాలుడిని తన ఒడిలోకి తీసుకుంది.
దూరం నుంచి చూస్తున్న బాలవ్వ గట్టిగా నిట్టూర్చింది.
ఏం చెయ్యాలి ఈ పసివాడిని?
తాను కాపాడగలదా? వయసు సహకరిస్తుందనేది సందేహమే! నిస్సహాయురాలు. బాగా కోలుకునే వరకూ ఉంచుకుని, బాలుడు కోరినట్లుగా కటకం చేరుస్తే.. ఆ పైన ఆ కాళీమాతే చూసుకుంటుంది.
అంతలో..
వాకిలి నుంచీ, పెరటినుంచీ.. ఇరువైపులా గుర్రం సకిలింపులు వినిపించాయి. బాలవ్వ ఉలిక్కిపడి లోపలికి వెళ్ళి, పనివాడికి చెప్పవలసింది చెప్పి, చేతులు తుడుచుకుంటూ వీధి గుమ్మం తీసి అరుగు మీద నిల్చుని కళ్ళ చికిలిస్తూ చూసింది. కళ్ళ మీద చేతులానించి చూస్తే… కనిపించాయి మూడు గుర్రాలు, వాటి మీద నున్న రౌతులు నిశితంగా చుట్టుప్రక్కల పరికిస్తున్నారు.
ఒకే ఒక క్షణం బాలవ్వ గుండె ఆగిపోయినట్ల నిపించింది.
వంగ సైనికులు.
మాధవుడిని వెతుక్కుంటూ వచ్చి ఉంటారు. అనుమానం లేదు.
అవ్వ ఆలోచనలో ఉండగానే దగ్గరగా వచ్చేశారు సైనికులు. ఇంక ఇంట్లోకి తిరిగి వెళ్ళడం అసంభవం.
“ఏమవ్వా? భోజనం ఉందా?” ముగ్గురిలో అధికారిలా ఉన్నవాడు అడిగాడు.
“అర ఘడియలో చేసేస్తా. ఆ పక్కనే చెరువుంది. ముఖము, కాళ్లు చేతులు ప్రక్షాళన చేసుకుని రండి. వడ్డిస్తా.” బాలవ్వ ఇంటికొచ్చిన వాళ్లకి అన్నం పెట్టితీరాలి. అది పూటకూళ్ళ సాంప్రదాయం.
లోపలికి వెళ్లి మాధవుడి మంచాన్ని సావిట్లోనే ఒక పక్కగా జరిపింది. గాఢంగా నిద్రపోతున్న మాధవుడి మీద కంబళీ కప్పింది. ఎసరుపెట్టి అది కాగేలోగా పెరటి అరటి కాయలు నాలుగు తరిగి, బూరెల మూకుట్లో వేసి, కొడుకుని పిలిచి కత్తెర చేతికిచ్చి మాధవుడిని చూపించింది.
“సరిగ్గా అర ఘడియలోగా పనైపోవాలి.”
బాలవ్వ వంట ముగించే లోగా సైనికులు వచ్చేశారు.
మాధవుడి మంచానికి కొద్ది దూరంలోనే అవ్వ ఆకులు వేసి వడ్డించింది.
“అవ్వా!” వేడి వేడి వరి అన్నంలో మిరపకాయ పచ్చడి కలిపి, పురుషిడు నెయ్యి వేసిన ముద్ద కలిపి నోట్లో పెట్టుకుంటూ పిలిచాడు అధికారి.
“ఏం బాబూ! భోజనం అయ్యాక కాస్త విశ్రాంతి తీసుకుని వెళ్తారా? అరుగు మీద ఏర్పాట్లు చేయించనా నా కొడుకు చేత?”
అవ్వ కొడుకు జగన్నాధ మహాపాత్రుడు నిర్ఘాంతపోయి చూస్తున్నాడు. పెద్దవయసు వచ్చింది… అమ్మకి మతి స్థిమితం పోలేదు కదా?
“లేదవ్వా. మేము అత్యవసరమైన పని మీద కటకం వెళ్తున్నాము. ఇచ్చటికి పంచకళ్యాణి గుర్రంమీద ఒక బాలుడు వచ్చాడా? లేదా, అతని జాడ ఏమైనా తెలుసా?”
“అమ్మా!” సరిగ్గా అప్పుడే మాధవుడు కదిలాడు.
“జగన్నాధా! ఒక పరి చిన్నవాడిని చూస్తావా? శిరోభారం ఎక్కువయిందో ఏమో!” కొడుకుని ఆదేశించింది, సంవత్సరాల తరబడి వివిధ పరిజనాలతో మెలగి సందర్భానుసార వర్తనము నేర్చుకున్న బాలవ్వ.
జగన్నాధుడు తల్లి ఆలోచన అర్ధంచేసుకున్నవాని వలె, మాధవుని మీది కంబళి తొలగించి నుదుటిమీద చెయ్యి వేసి చూశాడు.
సలసల మరిగిపోతోంది.
ఆ సావడిలోనే ఒకమూలగా, ఇసుకలో నిలబెట్టిన కుండలోని నీరు తీసి, ఒక అంగవస్త్రమును ఆ నీటితో తడిపి, పిల్లవాని నుదుటి మీద ఉంచాడు. కాస్త ఉపశమనం కలిగిందేమో… గట్టిగా మూలిగి, కళ్లు మూసుకున్నాడు బాలుడు.
“ఎవరవ్వా ఈ బాలుడు?” అడగనే అడిగాడు అధికారి.
ఆ ప్రశ్న ఎప్పుడడుగుతాడా అని ఎదురు చూస్తోంది బాలవ్వ.
“నా మనవడు బాబూ! నా పెద్ద కొడుకు కటకంలో ఉంటాడు. అక్కడ కోడలితో కలిసి పూటకూళ్ల ఇల్లు నడుపుతున్నాడు. వాడి కొడుకే ఈ చిన్నపాత్రుడు. చూసిపోదామని వచ్చారు. క్రిందటి సూర్యాదివాసరమునుండి ఒకటే పులకరం. ఆ వేడి మధ్యాహ్నానికి పెరుగుతోంది. అందుకే పూర్తిగా తగ్గాక పిల్లవాడిని పంపుతానని కొడుకునీ, కోడల్నీ వెళ్లిపోమన్నా.. ఇక్కడే కూర్చుంటే అక్కడ వ్యాపారం గంటకొడుతుంది. కాస్త కూర వెయ్యమంటారా బాబూ?”
“చాలవ్వా. ఇంక ఏమాత్రం తిన్నా ఇక్కడే తిష్టవేయాలి, భుక్తాయాసంతో.”
“దానికేముందయ్యా? నా కొడుకుల వంటి వారే మీరు. కావలసినన్ని దినములుండచ్చు.”
భోజనం చేసి, ఆకులు పెరట్లో తవ్విన గోతిలో పడేసి, నూతి దగ్గరకెళ్లి, నీళ్ళు చేదుకుని చేతులు కడుక్కున్నారు సైనికులు.
మహాపాత్రుడందించిన వస్త్రంతో చేతులు తుడుచుకుని, మాధవుని మంచం వద్దకు వచ్చారు ముగ్గురూ.
బాలవ్వ నేల శుభ్రం చేస్తూ పక్క చూపులు చూస్తోంది, గుండె గుబగుబ లాడుతుండగా.
మాధవుడి భుజాలు దిగిన ఉంగరాల జుట్టు కుప్పై గంతలో ఎండుటాకుల కింద కప్పబడి ఉంది. ఇప్పుడు అతనికున్నది అప్పడే మొలిచినట్టున్న వరిపైరు లాంటి జుట్టు. అతని విశాల నేత్రాలు జ్వరపు వేడికి ఎర్రబడి ఉబ్బిన మొహంలో కుంచించుకుపోయి గీతల్లా ఉన్నాయి. అందులో… చావడిలో అంతా మసక వెల్తురు. ఉన్న గవాక్షాలు కూడా మూసేసింది బాలవ్వ, చలిగాలి తగుల్తుందని.
పైగా, పెరటిలో కానీ, వీధిలో కానీ ఎక్కడా గుర్రపు జాడ లేదు.
సైనికులు రుచికరమైన భోజనంతో తృప్తిగా ఉన్నారు.
ఆ బాలుడే మాధవుడైతే, ముసలవ్వ తొణక్కుండా బెణక్కుండా... అంత బే ఫికర్ ఉండగలుగుతుందా! కనీసం ఆమె కొడుకైనా తడబడడా తేడా ఉంటే..
వీధివాకిలి వద్దనే నిలబడి మెడ సారించి, మూడుగుర్రాలూ కంటికి కనిపించడం మానేవరకూ చూసి, అరుగు మీదనే కూలబడి పోయింది బాలవ్వ, ఒంట్లో ఉన్న శక్తి అంతా హరించి పోగా.
………………..
మాధవుడు తన సంచీలో ఉన్న నాణాలను మంచం మీద పరచి లెక్కిస్తున్నాడు.
కొన్ని రాజా గణేశుని సువర్ణ గ్రామాలు. అవి ‘దనుజమర్దన’ అనే పేరిట ఉన్నాయి. అవి ఇరువదిరెండున్నాయి. గణేశుని రాజ్యంలో వాని విలువ అధికమే! కానీ ఉత్కళ, కళింగల్లో… అదీ వంగ దేశం జలాలుద్దీన్ ఏలికలో ఉన్నప్పుడు, ఏ మాత్రం విలువ ఉంటుందో అనుమానమే. దుర్గాదేవి నాణాలు సేకరించినపుడు అదే సందేహాన్ని వెలిబుచ్చింది.
వెండి నాణాలలో కొన్ని జలాలుద్దీన్ హిందువుగా ఉన్నప్పటివి. అవి ‘మహంద్రదేవ’ అనే పేరుతో మిక్కుటముగా ఉన్నాయి.ఈ నాణాల విలువ కూడా సందేహాస్పదమే.
మిగిలినవన్నీ ‘జలాలుద్దీన్’ పేరిటనున్నవే. ఆ సమయంలో వంగదేశంలో చెల్లుబడిలో ఉన్నందువల్ల వాటిని చాలా సేకరించింది దుర్గాదేవి. అందులో బంగారు, వెండి, రాగి నాణాలున్నాయి. అవే ఆదుకోవాలి తనని అనుకున్నాడు మాధవుడు.
వానిలో కొన్ని బాలవ్వకివ్వాలి. తను మాసంరోజులు పైగా ఉండిపోయాడు. ఎన్ని నాణాలు తీసుకుంటుందో…. ఏదైనా ఉపాధి కలిగేవరకూ సరిపోతాయో లేదో!
పరిపరి విధాలుగా సాగాయి అ చిన్ని మనసులో ఊహలు.
కానీ తను వంగదేశంలో లేనని మరచాడు. వాటి విలువ కళింగంలో ఎంత ఉండునో..
ముందుగా ఒక షరాయి, కమీజు కుట్టించుకోవాలి. ఉత్కళదేశంలో మగపిల్లల ధాటికి తట్టుకోగలిగిన వస్త్రాలు నేస్తారని విన్నాడు. తమ వంగ దేశంలో అధికంగా సున్నితమైనవే లభిస్తాయి. రాజాంతఃపురంలో జీవనం కనుక సరిపోయింది. ఇప్పటి నుండీ… ఏ విధంగా సాగబోతోందో ఆ కాళీ మాతకే ఎరుక.
“మాధవా! ఏం చేస్తున్నావు? నీ కోసం క్షీరాన్నం చేశాను. వచ్చి తాగిపో. ఇంకా బలం రావాలి.” బాలవ్వ పిలుపు విని, నాణాలని దాచి, లోపలికి వెళ్లాడు.
ఉన్నట్లుండి ఏడుపు వచ్చింది… బాలవ్వ పిలుపు అచ్చు అమ్మ పిలిచినట్లే ఉంది.
కానీ.. ధీరోదాత్త క్షత్రియ బాలుడు కన్నీరు కార్చకూడదు. కళ్ళు చికిలిస్తూ ఏడుపు ఆపుకున్నాడు.
“ఏం చేస్తున్నావు మాధవా?”
“వస్తున్నానవ్వా! సామాను సరుదుకుంటున్నా. ఈ భానువారం కటకం వెళ్దామని యోచిస్తున్నా.”
“ఇంకా నీకు పూర్త స్వస్థత చేకూరలేదు. ఇంకొక మాసం ఉండి వెళ్ల వచ్చును కదా?” బాలవ్వకి మాధవుడ్ని వదలాలని లేదు. ఇంట్లో ఒక బాలుడు తిరుగాడుతుంటే ఆ అందమే వేరు.
కానీ పరాయి పిల్లవాడు… ఏమని ఆపగలదూ? పైగా అతని పూర్తి వివరాలు తెలియవు. ఆవిడకి కూడా ‘అజ్ఞాత కుల శీలస్య..’ అనే నానుడి గుర్తుకొచ్చింది.చూడబోతే సంపన్న కుటుంబంనుండే వచ్చినట్లున్నాడు. కత్తి యుద్ధం విలువిద్యలలో నేర్పరి. గత రెండు వారముల నుంచీ అభ్యాసం చేస్తుంటే చూసింది.
ఆ ఠీవీ, దర్పం సామాన్యులకుండవు.
అదృష్టం.. వంగ సైనికులు మాధవుని గురించి వెతకడం మాని వేసినట్లుంది. పసివాడిని అడవిలో ఏ జంతువో తిని వేసుండ వచ్చనుకున్నారేమో!
“మీకు భారముగా ఎన్ని దినములు ఉండగలనవ్వా? మా అమ్మ సూచించిన చోటికి ఎన్నటికైననూ చేరవలెను కదా. ఏదైన పని వెత్కుకోవాలి కూడా భుక్తికి.” స్థిరమైన కంఠంతో అన్నాడు. పిల్లవాడు పేలవంగా కనిపిస్తున్నా నిశ్చయం ధృడంగా ఉంది.
“ఒక వారం ఆగు మాధవా! కటకం నుండి పెద్దబ్బాయి, నంద మహాపాత్రుడు వస్తున్నాడు. అతని వెంట వెళ్ల వచ్చును. సైనికుల బెడద కూడా ఉండదు. నీకు ఏదైనా పని కూడా ఇప్పిస్తాడు.”
“అలాగే అవ్వా! నీకు ఎన్ని రూకలు ఇవ్వాలో చెప్తే నా వద్ద నున్నవి కొన్ని సరిపోతాయేమో చూస్తాను.” పెద్ద మనిషిలా మాట్లాడుతున్న మాధవుని చూస్తుంటే బాధతో పాటుగా ముచ్చట కూడా వేసింది బాలవ్వకి.
కాసేపు తటపటాయించింది. ముక్కుపచ్చలారని ఈ పసివాడి దగ్గర ధనం తీసుకోవడమా!
కానీ వైద్యానికీ, సంబారాలకీ చాలా వెచ్చించవలసి వచ్చింది. పూటకూళ్ల రాబడి అంతంత మాత్రమే. తమ తిండి వెళ్లిపోతుందంతే ఖర్చులు పోగా.
“నీదగ్గరెన్నున్నాయో చెప్పు. అందులోనుంచి నేనేరుకుంటా.”
మాధవుడు ఆనందంగా అన్ని నాణాలూ కింద పోశాడు.
బాలవ్వ కళ్లు పెద్దవి చేసి చూసింది. ఎవరి కంటా పడకుండా ఎలా దాచాడో ఇన్ని రోజులు.. ఆశ్చర్యమే! అటూ ఇటూ ఖంగారుగా చూసి, ద్వారం మూసేసి వచ్చింది.
రాచబిడ్డడే అయుండాలీ బాలుడు. ఈ ధనం ఇతడికి పదహారేళ్లు నిండే వరకూ సరి పోతుంది. నిరంతరం వెంటాడే శత్రువుల నుంచి తప్పించుకోవడమే ఇతనికి ఉన్న సమస్య. అప్పటికప్పుడు బాలవ్వ మనసులో ఉభయ తారకంగా ఉండే ఒక పధకం రూపు దిద్దుకుంది.
“చూడు బాబూ నువ్వు ఎవరివో నాకు తెలియదు. కానీ, ఈ వయసులో నీవు ఒంటరిగా బతకాలంటే కష్టమే. నీకు చూస్తే గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం తప్ప ఏ పనులూ వచ్చినట్టే లేదు. కటకంలో బంధువులెవరైనా ఉన్నారా? ఎక్కడి కెళ్తావు? ఎవరి దగ్గరుంటావు? మీ అమ్మగారు ఎవరిదైనా చిరునామా ఇచ్చారా?” మాధవుడిని పక్కన కూర్చోపెట్టుకుని అడిగింది లాలనగా.
తల అడ్డంగా ఊపాడు మాధవుడు. గద్గద స్వరంతో అన్నాడు..
ఆ.వె. “అమ్మ ఎరుక లేదు మమ్మ నన్ను మురిపె
ముంగ పెంచె ముద్దు ముద్దుగ, నను
కన్నతల్లి ఎంతొ కలతతో వీడెను
కృపతొ నాదు కొనిరి కీడు లేక.”
బాలవ్వ హఠాత్తుగా వెళ్లి బాలుడ్ని హత్తుకుంది హృదయం ద్రవించగా.
“నీ గురించి ఏమైనా చెప్తావా మాధవా?”
మాధవుడు ఏం మాట్లాడలేదు. బాలవ్వ నడుం గట్టిగా పట్టుకుని వెక్క సాగాడు.
“వద్దులే కన్నా! అప్పుడు సైనికులతో అన్న మాటనే నిజం చేస్తాను. మా నందుడి కొడుకు గానే కటకం పంపుతా నిన్ను. వాళ్లకి ఎలాగూ పిల్లలు లేరు. కోడలు కూడా సంతోషిస్తుంది. ఐతే.. మా పిల్ల వానిలా మనాలంటే అక్కడికి వెళ్లే లోగా కొన్ని పనులు నేర్చుకోవాలి మరి. సరేనా!”
మాధవుడు నడుం పట్టు మరింత బిగించాడు.. అనుకోకుండా దొరికిన ఆలంబన వదులుకోనన్నట్లుగా.
“మేము కూడా బ్రాహ్మలమే నవ్వా. రాజుగారి కొలువులో మా నాయన పని చేసే వారు. యువరాజు గారి తో కలిసి చదువుకుంటున్నా.. అంతలో కోటలో ఎన్నెన్నో మార్పులొచ్చి.. పెద్ద రాజునీ, మా తండ్రిగారినీ.. అందరినీ చంపేశారు. అమ్మా నేనూ పారిపోయి వస్తుండగా, దారిలో అమ్మని కూడా….” భోరుమన్నాడు మాధవుడు.
బాలవ్వ బాలుడి తల నిమురుతూ ఉండిపోయింది. మాట ఇచ్చేసింది కానీ, కొడుకు కోడలు ఏమనెదరో!
……………
......మంథా భానుమతి